ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : ఉపాధ్యాయ వృత్తికి సంబంధించి బీఈడీ కోర్సుకు ఒకప్పుడు ఉన్న ప్రాధాన్యం అంతాఇంతా కాదు. డిగ్రీ పూర్తయ్యిందంటే అధికులు బీఈడీ చేసేందుకు ఆసక్తి చూపేవారు. ప్రభుత్వ కళాశాలల్లో సీటు లభించకుంటే ప్రైవేటుగానైనా కోర్సు పూర్తిచేసేవారు. కానీ.. ప్రస్తుతం గడ్డు పరిస్థితులను నెలకొన్నాయి. బీఈడీ చేసేందుకు విద్యార్థులు విముఖత చూపుతుండడంతో కోర్సుకు ఆదరణ తగ్గుతోంది. ఇందుకు రెగ్యులర్‌గా డీఎస్సీ నిర్వహించకపోవడం ఒక కారణమైతే.. స్కూల్‌అసిస్టెంట్ పోస్టులకు మాత్రమే అర్హత కల్పించడం మరో కారణం. ఎస్జీటీ పోస్టులకు డీఎడ్ విద్యార్థులకు అవకాశం కల్పిస్తుండడంతో విద్యార్థులు డైట్‌సెట్‌పైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. ఇక నేటి నుంచి ప్రారంభం కానున్న బీఈడీ కౌన్సెలింగ్‌కు ఎంత మంది హాజరవుతారో చూడాల్సి ఉంది.
సగానికి తగ్గిన అభ్యర్థులు
జిల్లాలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్‌లో ప్రైవేట్ బీఎడ్ కళాశాలలు ఉన్నాయి. ఉట్నూర్‌లో గిరిజన విద్యార్థుల కోసం గిరిజన బీఈడీ కళాశాల ఉంది. ఒక్కో కళాశాలలో 100 సీట్ల వరకు పరి మితి ఉంది. అదనంగా మేనేజ్‌మెంట్ కోటాలో 50 వరకు భర్తీ చే స్తారు. గతంలో బీఎడ్ ఎంట్రెన్స్‌కు 10 వేల మంది వరకు అభ్యర్థులు హాజరైతే ఈ విద్యా సంవత్సరంలో సంఖ్య ఐదు వేలకు పడిపోయింది. దీంతో బీఎడ్ వైపు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదనేది తెలుస్తోంది. మరోవైపు.. ప్రభుత్వ డీఎస్సీ ఎప్పుడు నిర్వహిస్తుందో తెలియని పరిస్థితి నెలకొనడంతో వారు ఆ దిశగా ఆలోచించడంలేదు.
నేటి నుంచి వెబ్‌కౌన్సెలింగ్..
2003-14 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈనెల 29 నుంచి అక్టోబర్ 7 వరకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పురుషుల కళాశాలలో వెబ్‌కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. కౌన్సెలింగ్‌కు విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అశోక్ తెలిపారు. ఎడ్‌సెట్ హాల్‌టికెట్, ర్యాంక్ కార్డు, డిగ్రీ ప్రొవిజనల్, మార్కుల జాబితా, పది, ఇంటర్మీడియేట్ మార్కుల మెమోలు, బోనోఫైడ్, టీసీ, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రం తీసుకురావాలన్నారు. కౌన్సెలింగ్ ప్రతి రోజూ ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు.
నేటి నుంచి బీఎడ్ వెబ్ కౌన్సెలింగ్
Published Sun, Sep 29 2013 4:00 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement