ఎన్నాళ్లో ఈ నిరీక్షణ! | government delayed in DSC announcement | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లో ఈ నిరీక్షణ!

Published Sat, Oct 18 2014 3:31 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 PM

ఎన్నాళ్లో ఈ నిరీక్షణ!

ఎన్నాళ్లో ఈ నిరీక్షణ!

* బీఎడ్, డీఎడ్ అభ్యర్థుల ఆరాటం
* డీఎస్సీ ప్రకటనలో సర్కారు జాప్యం
* జిల్లాలో శిక్షణ పొందుతున్న 48 వేలమంది నిరుద్యోగులు
* మంచి రాబడి కళ్లజూస్తున్న కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లు

 భానుగుడి (కాకినాడ) : జిల్లాలో ప్రస్తుతం డీఎడ్, బీఎడ్ ఉత్తీర్ణులు 54 వేలమందికి మించి ఉండొచ్చని అంచనా. వీరితో పాటు ఇతర జిల్లాల నుంచి సైతం అభ్యర్థులు జిల్లాలో ఉన్న పలు కోచింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. కాకినాడ, రాజమండ్రి, ఇతర ప్రాంతాలలోని పలు కేంద్రాల్లో ఇప్పటికే 48 వేలమందికి పైగా శిక్షణ పొందుతున్నారు. వీరంతా పలు వసతి గృహాలలో, ప్రైవేట్ రూమ్‌లలో నెలకు రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు చెల్లించి ఉంటున్నారు. 3 నెలలకు పైగా కోచింగ్‌కు ఒక్కో అభ్యర్థీ రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చుచేస్తున్నారు. ఇదే అదనుగా అటు కోచింగ్ కేంద్రాలు, ఇటు బాలుర వసతి గృహాలు మంచి రాబడిని కళ్లజూస్తున్నాయి.
 
జిల్లాలో ఖాళీలు ఇవీ..

జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ అన్ని విభాగాలకు సంబంధించి 331 ఖాళీలున్నాయి. ఇందులో ప్రతి పోస్టునూ దృష్టిలో ఉంచుకుంటే ఒక్కో ఉద్యోగానికి 150 మందికి పైగా అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. స్కూల్ అసిస్టెంట్ గణితం (25), బయొలాజికల్ సైన్సు(26), సోషల్ (79), ఇంగ్లీష్ (15), తెలుగు (27), హిందీ (14), ఉర్దూ(1), ఫిజికల్ డెరైక్టర్ (1), లాంగ్వేజ్ పండిట్ తెలుగు (83),  లాంగ్వేజ్ పండిట్ ఉర్దు (1), లాంగ్వేజ్ పండిట్ సంస్కృతం(5), లాంగ్వేజ్ పండిట్ హిందీ(29), పీఈటీ(19) ఖాళీలున్నాయి. ఇందులో సోషల్‌లో ఒక్కో పోస్టుకు 3 వందల మందికి పైగా పోటీపడుతున్నారు.

ఇదే తరహాలో మిగిలిన సబ్జెక్టులకు పోటీ ఉంది. ఇదిలా ఉండగా ఎస్జీటీ పోస్టులకు సంబంధించి 877 ఖాళీలున్నాయి. ప్రస్తుతం డీఎడ్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు సైతం డీఎస్సీకి అర్హత కల్పించనుండడంతో జిల్లాలో టెట్ క్వాలిఫై అయిన వారు 1600 మంది, డీఎడ్ పూర్తిచేసిన వారు 8 వందల మంది, ప్రస్తుతం డిఎడ్ పరీక్షలు పూర్తిచేసుకుంటున్న వారు 1800 మంది అభ్యర్థులు వెరసి 4200 మంది పోటీపడుతున్నారు. జిల్లాలో ఉన్న ఎస్జీటీ పోస్టుల సంఖ్యతో పోలిస్తే 1:4.8 గా ఈ నిష్పతి ఉండడం విశేషం.
 
స్కూల్ అసిస్టెంట్లకు మరింత పోటీ
స్కూల్ అసిస్టెంట్లకు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పోటీ మరింత పెరగనుంది. జిల్లాలో 2014 టెట్ పరీక్షకు 22,890 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగా 19,921 మంది హాజరయ్యారు. 16 వేలమందికి పైగా ఉత్తీర్ణత సాధించారు. గతంలో టెట్ ఉత్తీర్ణులైన వారు, కాని వారిని కలుపుకొంటే జిల్లాలో 50 వేల మందికి పైగా ఉన్నట్టు అంచనా. వీరిలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ పరీక్షకు పోటీపడే వారే 26 వేలకు మించి ఉండొచ్చని సమాచారం.
 
గందరగోళం..అయోమయం.
ప్రభుత్వం ప్రస్తుతం బీఎడ్ అభ్యర్థులకు సైతం ఎస్జీటీ అవకాశం  కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే గతంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు, ఇటీవల పశ్చిమ బెంగాల్ వినతిని కేంద్రం తిరస్కరించిన నేపథ్యంలో అటు బీఎడ్ అభ్యర్థులు అవకాశం కోసం ఆశగా చూస్తుండగా, డీఎడ్ అభ్యర్థులు బీఎడ్ వారికీ అనుమతిస్తే తమ అవకాశాలకు గండిపడుతుందని ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement