
నకిలీ సర్టిఫికెట్లకు ఆన్‌లైన్ చెక్!
♦ వెబ్‌సైట్‌లో గత ఐదేళ్లలో ఉన్నత విద్యనభ్యసించిన విద్యార్థుల వివరాలు
♦ అందుబాటులోకి తెచ్చిన ఉన్నత విద్యా మండలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థల్లో చదివినట్లు సృష్టిస్తున్న నకిలీ సర్టిఫికెట్లకు చెక్ పెట్టేందుకు ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది. గత ఐదేళ్లలో (2012 నుంచి ఇప్పటి వరకు) రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల పరిధిలోని కాలేజీల్లో ఉన్నత విద్య కోర్సులను అభ్యసించిన విద్యార్థుల సమాచారాన్ని తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు.
కొత్తగా ఏర్పడిన తెలంగాణ నుంచి నకిలీ సర్టిఫికెట్లతో అభ్యర్థులు ఉద్యోగాలకు వస్తున్నారని, మార్కులను కూడా మారుస్తున్నారని, సీఎం కేసీఆర్‌కు నాస్కామ్ ప్రతినిధులు గతంలోనే ఫిర్యాదు చేశారు. దీనిపై కేసీఆర్ కూడా పలుమార్లు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అందులో భాగంగా ఉన్నత విద్యా మండలి అన్ని వర్సిటీ వీసీలతో సమావేశాలు నిర్వహించి, వివరాలు తెప్పించింది.
2012 నుంచి ఇప్పటివరకు ఆయా యూనివర్సిటీల పరిధిలో చదువుకున్న విద్యార్థుల సమాచారన్ని తమ వెబ్‌సైట్‌లో ((tsche.ac.in)) అందుబాటులో ఉంచింది. నేరుగా tsstudentverification. org వెబ్‌సైట్‌లోకి వెళ్లి కూడా వివరాలు పొందవచ్చు. దీంతో విదేశాల్లోనూ ఉద్యోగాలకు వెళ్లే అభ్యర్థుల వెరిఫికేషన్ మరింత సులభం కానుంది.
ఉచితంగా సమాచారం...
ఇప్పటివరకు జేఎన్‌టీయూహెచ్ వంటి కొన్ని యూనివర్సిటీలు జెన్యూనిటీ సమాచారం ఇచ్చేందుకు చర్యలు చేపట్టినా, ఆయా కంపెనీలు ముందుగా రిజిస్టర్ చేసుకొని, నిర్ణీత ఫీజు చెల్లిస్తేనే వర్సిటీలు ఆ వివరాలు అందజేస్తున్నాయి. దీంతో ఈ ప్రక్రియ అంతా చేయలేక కంపెనీలు కొన్నిసార్లు అనుమానం వచ్చిన విద్యార్థులను రిజెక్ట్ చేస్తున్నాయి. ఫలితంగా తప్పుచేయని విద్యార్థులు కూడా ఉద్యోగ అవకాశాలను కోల్పోవాల్సి వస్తోంది. మరికొందరు అభ్యర్థులు కంపెనీలు కోరే కనీస మార్కుల శాతానికి అనుగుణంగా మార్కుల లిస్టు మార్చేస్తున్నారు.
కొంతమంది ఉద్యోగులు కూడా పదోన్నతుల కోసం నకిలీ సర్టిఫికెట్లు పెడుతుండటమే కాకుండా మార్కులను మార్చుతున్నట్లు ఫిర్యాదులున్నాయి. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి దేశంలోనే మొదటిసారిగా ఆన్‌లైన్ విద్యార్థుల సమాచారాన్ని ఉచితంగా పొందే అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఒకవేళ ఎవరైనా విద్యార్థి తప్పుడు సమాచారం ఇస్తే, అదే వెబ్‌సైట్‌లో పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. త్వరలోనే ఈ లింకును కూడా అందుబాటులోకి తెస్తారు. భవిష్యత్తులో విద్యార్థి డిగ్రీ రికార్డులు, హాజరు వెరిఫికేషన్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టింది.
వెబ్‌సైట్‌ను పరిశీలించిన సీపీ...
మంగళవారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఈ వెబ్‌సైట్‌ను నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి పరిశీలించారు. విద్యార్థి వివరాల్లో ఆధార్ నంబరును అనుసం« ధానం చేయాలని, ఫొటో కూడా ఉండేలా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. భవిష్యత్తులో 2007 నుంచి 2011 వరకు కూడా విద్యార్థుల వివరాలను అందుబాటులోకి తెస్తామని పాపిరెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం ఎనిమిది విశ్వవిద్యాలయాలకు చెందిన వివరాలను అందుబాటులో ఉంచారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా దీన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు.