సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నకిలీ సర్టిఫికెట్ల సమస్యను నిరోధించేందుకు ఉన్నత విద్యలో డిగ్రీలు, పీజీలు, ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థుల సమగ్ర సమాచారం వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చేందుకు ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఉన్నత విద్యా మండలి నేతృత్వంలో ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తేబోతోంది. ఏయే సంవత్సరాల్లో ఎవరెవరు ఏయే కోర్సులను పూర్తి చేశారు.. వాటి హాల్‌టికెట్ నంబర్లు, తండ్రి వివరాలు... ఏ యూనివర్సిటీ, ఏ కాలేజీలో చదివారన్న సమగ్ర వివరాలను ఉన్నత విద్యా మండలి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది.
ఇందుకోసం యూనివర్సిటీల వారీగా ప్రత్యేక వెబ్‌సైట్‌లను ప్రారంభించి, వాటిని ఉన్నత విద్యా మండలి వెబ్‌సైట్‌కు అనుసంధానం చేయాలని నిర్ణయించింది. డిసెంబర్‌లోపు ఈ ప్రక్రియ ముగించాలని భావిస్తోంది. మంగళవారం హైదరాబాద్‌లోని ఉన్నత విద్యా మండలి సమావేశ మందిరంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి నేతృత్వంలో అన్ని యూనివర్సిటీల పరీక్షల నియంత్రణాధికారులతో సమావేశాన్ని నిర్వహించింది.
రాష్ట్రంలో నకిలీ సర్టిఫికెట్ల బెడద ఉండొద్దని, వాటిని అరికట్టేందుకు ఉన్నత విద్యాశాఖ, పోలీసు యంత్రాంగం సంయుక్తాధ్వర్యంలో చర్యలు చేపట్టాలని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టింది. నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగానికి వెళ్లిన వారిపై పోలీసు కేసులు నమోదు చేయాలని నిర్ణయించింది. గతంలో సాఫ్ట్‌వేర్ సంస్థలకు ఉద్యోగాలకు వస్తున్న వారిలో చాలా మంది నకిలీ సర్టిఫికెట్లు పెడుతున్నారని నాస్కామ్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ చర్యలు చేపడుతోంది.
ఈ విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణులైన విద్యార్థుల వివరాలను వెబ్‌సైట్‌లో పెడతామని, ఆ తరువాత టెన్త్, ఇంటర్మీడియెట్ మినహా మిగితా కోర్సులను రాష్ట్రంలో పూర్తి చేసిన వారి వివరాలను ఆ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి వివరించారు. సమావేశంలో ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ వెంకటాచలం, కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఆన్‌లైన్‌లో విద్యార్థుల సమగ్ర వివరాలు
Published Wed, Sep 16 2015 1:09 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM
Advertisement
Advertisement