సాక్షి, హైదరాబాద్: బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ), డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (డీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న పీఈసెట్–2020 నోటిఫికేషన్‌ను ఈనెల 21న జారీ చేయాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన పీఈసెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఈనెల 21వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు స్వీకరించాలని నిర్ణయించింది. బీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం పరీక్ష రాసే అభ్యర్థికి 2020 జూలై 1వ తేదీ నాటికి 19 ఏళ్లు నిండి ఉండాలి. దాంతో పాటు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివే విద్యార్థులు, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులు. డీపీఈడీ కోర్సులకు ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్న వారు, ఇంటర్ పూర్తయిన వారు ప్రవేశ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2020 జూలై 1వ తేదీ నాటికి సదరు విద్యార్థికి 16 ఏళ్లు నిండి ఉండాలి. మే 13వ తేదీ నుంచి నిర్వహించే ఈ పరీక్షకు హాజరు కావాలనుకునే విద్యార్థులు రూ.800 పరీక్ష ఫీజును, ఎస్సీ, ఎస్టీలైతే రూ.400 పరీక్ష ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. పరీక్షకు సంబంధించిన మరిన్ని వివరాలను https:// pecet.tsche.ac.in వెబ్‌సైట్‌లో పొందవచ్చు.
మే 28 నుంచి పీజీఈసెట్
ఎంఈ/ఎంటెక్/ఎం.ఆర్క్/ఎం.ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న పీజీఈసెట్ నోటిఫికేషన్‌ను మార్చి 4వ తేదీన జారీ చేయాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. ఆన్‌లైన్ దరఖాస్తులను వచ్చే నెల 12వ తేదీ నుంచి 30వ తేదీ వరకు స్వీకరించనుంది. ఆలస్య రుసుముతో మే 26వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించింది. పరీక్షలను మే 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనుంది. ప్రతిరోజు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండు దఫాలుగా ఆన్‌లైన్‌లో పరీక్షలను నిర్వహించనుంది. హైదరాబాద్, వరంగల్‌లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తామని పేర్కొంది.
28న ఉదయం ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, టెక్స్‌టైల్ టెక్నాలజీ, మైనింగ్ ఇంజనీరింగ్‌లో ప్రవేశాలకు పీజీఈసెట్‌ను నిర్వహిస్తారు. అదేరోజు మధ్యాహ్నం ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్‌కు పరీక్ష ఉంటుంది. 29న ఉదయం జియో ఇంజనీరింగ్, జియో ఇన్ఫర్మాటిక్స్, ఫార్మసీకి పరీక్ష ఉంటుంది. అదేరోజు మధ్యాహ్నం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ప్రవేశాలకు పరీక్ష ఉంటుంది.
30న ఉదయం ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్‌కు, అదేరోజు మధ్యాహ్నం సివిల్, ఎలక్ట్రికల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీకి పరీక్ష నిర్వహిస్తారు. 31వ తేదీన ఉదయం ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్, మధ్యాహ్నం నానో టెక్నాలజీకి ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తారు. 120 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షల్లో ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు, మల్టిఫుల్ చాయిస్ జవాబులుంటాయి. ఆన్‌లైన్ దరఖాస్తులు, ఇతర వివరాలను https://www.pgecet.tsche.ac.in, http://www.tsche.ac.in వెబ్‌సైట్‌లో పొందవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1,000గా సెట్ కమిటీ నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులైతే రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment