సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ఫీజులు కనీసం 25 శాతం పెంచాల్సిందేనని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు పట్టుబడుతున్నాయి. ఇందుకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఎస్‌ఎఫ్‌ఆర్‌సీ) ముందు తమ వాదనను విన్పిస్తున్నాయి. కొన్ని రోజులుగా కాలేజీలతో కమిటీ విడివిడిగా చర్చలు జరుపుతోంది.
ఇందులో టాప్‌టెన్ కాలేజీ యాజమాన్యాలు ఫీజుల పెంపుపై భారీగా డిమాండ్ చేస్తున్నాయి. ప్రతీ మూడేళ్లకోసారి ఇంజనీరింగ్ ఫీజులను కమిటీ అధ్యయనం చేస్తోంది. మౌలిక వసతులు, లేబొరేటరీలు, ఫ్యాకల్టీకి అయ్యే ఖర్చును పరిగణనలోనికి తీసుకుని ఫీజులను నిర్ధారిస్తుంది. 2019లో పెంచిన ఫీజులు 2022 వరకూ అమలులో ఉన్నాయి. డిసెంబర్ నుంచి మొదలయ్యే 2022–23 విద్యా సంవత్సరంలో ఫీజుల పెంపుపై కమిటీ కొన్ని నెలలుగా కసరత్తు చేస్తోంది.
ఏఐసీటీఈ ప్రకారం వెళ్లాలి
అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ప్రతిపాదించిన ట్యూషన్ ఫీజులనే అమలు చేయాలని పలు ప్రైవేటు కాలేజీలు కోరుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 158 ప్రైవేటు కాలేజీలున్నాయి. వీటిలో 20 కాలేజీల్లో ట్యూషన్ ఫీజు రూ.35 వేలు, 110 కాలేజీల్లో రూ.80 వేల వరకూ, మిగతా కాలేజీల్లో రూ.1.40 లక్షల వరకూ ఉంది. ఏఐసీటీఈ ఈ ఏడాది ఫీజులను కనీసం రూ.79,600 నుంచి గరిష్టంగా 1,89,800 వరకు పెంచుకునేందుకు ప్రతిపాదనలు చేసింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించింది. అయితే, దీనిపై స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ఎఫ్‌ఆర్‌సీలు నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉంది.
అంత పెంచితే ఎలా?
కాలేజీల వాదనపై కమిటీ కొంత ఇబ్బంది పడుతోంది. ప్రతీ ఏటా 10–15 శాతం ఫీజులు పెంచుతున్నారు. ఇప్పుడు ఏకంగా 25 శాతం అంటే ప్రభుత్వం అంగీకరించే అవకాశం లేదని ఎఫ్‌ఆర్‌సీ వర్గాలు అంటున్నాయి. ఇదే విషయాన్ని కాలేజీల యాజమాన్యాలకు నచ్చజెప్పే యత్నం చేస్తున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలవుతోంది.
ఎంసెట్‌లో 10 వేల లోపు ర్యాంకు వచ్చిన వారికీ రీయింబర్స్‌మెంట్ ఇవ్వాల్సిందే. ఆ తర్వాత ర్యాంకుంటే.. బీసీలు, ఓసీలు ఎవరికైనా కళాశాల ఫీజు ఎంతున్నా గరిష్టంగా 35 వేలు మాత్రమే రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుంది. కాలేజీలు కోరినట్టు ఫీజులు పెంచితే ఏటా రూ. 21 కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుంది. ఇదే క్రమంలో రూ.35 వేలు మాత్రమే రీయింబర్స్‌మెంట్ వచ్చే విద్యార్థులపైనా అదనపు భారం పడుతుంది. ఈ కారణంగానే కమిటీ తర్జన భర్జనపడుతోంది.
ఫ్యాకల్టీని పట్టించుకోరా?
ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫ్యాకల్టీ ఎలా ఉందనే విషయాన్ని ముందు ఎఫ్‌ఆర్‌సీ పరిశీలించాలి. యాజమాన్యాలు ఇచ్చే ఆడిట్ నివేదికలను యథాతథంగా ఆమోదిస్తే పేదలపై భారం పడుతుంది. చాలా కాలేజీల్లో సరైన ఫ్యాకల్టీ లేదు. అధ్యాపకులకు వేతనాలు ఇవ్వడం లేదు. బ్యాంకు ఖాతాలను, ఫ్యాకల్టీ సమర్థతను పరిశీలించాల్సిన అవసరం కమిటీపై ఉంది.
– సంతోష్ కుమార్, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు
పెంపు అన్యాయం
ఫీజుల పెంపు నిర్ణయాన్ని కమిటీ ఉపసంహరించుకోవాలి. కాలేజీల గొంతెమ్మ కోర్కెలు తీరిస్తే పేదలు ఉన్నత విద్యకు దూరమవుతారు. ఇప్పటికే నాణ్యతలేని కాలేజీల్లో భారీగా ఫీజులున్నాయి. అడ్డగోలుగా పెంచితే విద్యార్థుల నుంచి తిరుగుబాటు తప్పదు.
–నాగరాజు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment