private engineering colleges
-
అ‘ధన’పు సీట్లు అంటూ..
సాక్షి, హైదరాబాద్: సీట్లు పెరుగుతాయి..మేనేజ్మెంట్ కోటాలో బీటెక్ అడ్మిషన్ గ్యారంటీ అని కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు చెప్పడంతో కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు డబ్బులు పేమెంట్ చేసి జాయినింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల పెంపు, కుదింపు, బ్రాంచ్‌ల మార్పునకు హైకోర్టు అంగీకరించలేదు. యాజమాన్యాల పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని వెల్లడించింది. దీంతో ఇప్పటికే డబ్బులు కట్టిన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ముందస్తుగా డబ్బు చెల్లించినవారు 1500 మంది వరకూ ఉన్నారు. వారంతా కాలేజీల చుట్టూ తిరుగుతూ డబ్బులు తీసుకున్నారు... ఇప్పుడు సీట్లెలా ఇస్తారు?’ అంటూ యాజమాన్యాలను నిలదీస్తున్నారు. ‘కోర్టులో అనుకూలంగా తీర్పు వస్తుందని భావించాం..ఇప్పుడు మేం ఏం చేయగలం?’ అంటూ కాలేజీ యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి. డబ్బు వాపస్ ఇస్తారా? లేదా? అనేది అనుమానంగానే ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. ఇక ఆ సీట్లు రానట్టే!రాష్ట్రవ్యాప్తంగా 28 ఇంజనీరింగ్ కాలేజీలు బ్రాంచ్‌ల మార్పిడి, సీట్ల పెంపునకు దరఖాస్తు చేసుకున్నాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచ్‌లలో దాదాపు 10 వేల సీట్లు రద్దు చేసుకున్నాయి. వీటిస్థానంలో సీఎస్ఈ, ఇతర కంప్యూటర్ కోర్సుల్లో సీట్లు పెంచాలని అడిగాయి. అయితే, సివిల్, మెకానికల్, ఈఈఈ బ్రాంచ్‌లలో సీట్ల కుదింపునకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి అనుమతించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ససేమిరా అంది. ఇలా కుదిస్తే ఈ బ్రాంచ్‌లు తెరమరుగయ్యే ప్రమాదముందని అడ్డు చెప్పింది. ఇదే క్రమంలో కొత్తగా సీఎస్ఈ, డేటాసైన్స్, ఏఐ ఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లలో సీట్లు పెంచాలని పలు కాలేజీలు కోరాయి. కంప్యూటర్ సైన్స్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్ వంటి వాటిల్లో సీట్ల తగ్గింపునకు కూడా దరఖాస్తు చేసుకున్నాయి. ఇప్పటికే ఆయా కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్, అనుబంధ బ్రాంచ్‌లలో సీట్లు ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వం భావించింది. ఇలా దాదాపు 5 వేల సీట్లకు అనుమతి లభించలేదు. కోర్టు అనుమతిస్తే మూడో విడత కౌన్సెలింగ్‌లో వీటిని చేర్చాలని భావించారు. ముందే ఖరారుకోర్టు అనుమతిస్తే సీఎస్ఈ, కంప్యూటర్ సైన్స్ అనుబంధ బ్రాంచ్‌లలో 5 వేల సీట్లు పెరిగేవి. 30 శాతం యాజమాన్య కోటా కింద దాదాపు 1500 సీట్లు అందుబాటులో ఉండేవి. దీనిని దృష్టిలో ఉంచుకొని కొన్ని ప్రైవేట్ కాలేజీల యాజ మాన్యాలు ముందే సీట్లు అమ్ముకున్నాయి. కోర్టు తీర్పు అనుకూలంగా వస్తుందని ఆశించాయి. ఒక్కో సీటును రూ. 8 నుంచి రూ. 18 లక్షలకు అమ్ముకున్నట్టు తెలుస్తోంది. కోర్టుకెళ్లిన వారిలో పెద్ద కాలేజీలే ఉండటంతో మేనేజ్మెంట్ సీట్లకూ గిరాకీ బాగానే పలికింది. ఇలా సీట్లు కొనుగోలు చేసిన వారిలో రాష్ట్ర ఈఏపీసెట్‌లో అతి తక్కువ స్కోర్ వచ్చినవారు, అసలు సెట్ పాసవ్వని వారూ ఉన్నారు. ఇప్పుడు వీరికి ఆఖరిదశ కౌన్సెలింగ్‌లో సీట్లు వచ్చే అవకాశం కూడా లేదు. చెల్లించిన సొమ్ముకు ఎలాంటి రసీదు ఇవ్వలేదు. ఇప్పుడు ఈ సొమ్మును రాబట్టడానికి గట్టిగా అడిగే పరిస్థితి కూడా లేదు. దీంతో కాలేజీల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోందని ఓ విద్యార్థి తండ్రి తెలిపారు. అప్పీల్‌కు వెళ్లేలోగా.. కౌన్సెలింగ్ ఖతంహైకోర్టులో చుక్కెదురు కావడంతో కొన్ని ప్రైవేట్ కాలేజీలు అప్పీల్‌కు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌ను త్వరగా ముగించాలని ప్రభుత్వం నుంచి అధికారులకు ఆదేశాలొచ్చాయి. ఇప్పటికే రెండు దశల కౌన్సెలింగ్ పూర్తయింది. మూడో దశ కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు ఈ నెల 13న చేపడతారు.వెనువెంటనే స్పాట్ అడ్మిషన్లు చేపట్టే వీలుందని అధికారులు అంటున్నారు. ప్రైవేట్ కాలేజీలు అప్పీల్‌కు వెళ్లి, కేసు తేలేలోగా ఇంజనీరింగ్ క్లాసులు కూడా మొదలవుతాయి. ఇది ప్రైవేట్ కాలేజీలకు ఇబ్బంది కలిగించే పరిణామమని అధికారులు అంటున్నారు. -
ఫీజులు.. గుండెలు గుభిల్లు
విద్యార్థులు, తల్లిదండ్రుల డ్రీమ్ కోర్సు అయిన ఇంజనీరింగ్‌కు సంబంధించి దేశంలోనే ప్రఖ్యాత విద్యా సంస్థ ఐఐటీ బాంబేలో నాలుగేళ్ల బీటెక్‌కు 2008లో మొత్తం ట్యూషన్ ఫీజు రూ.1,08,000 ఉండగా ఇది 2024–25 నాటికి ఏకంగా రూ.8,00,000కు చేరింది. అలాగే మరో ప్రముఖ విద్యా సంస్థ ఎన్ఐటీ తిరుచిరాపల్లిలో 2011–12లో బీటెక్‌కు రూ.1,42,000 ఫీజు ఉండగా 2023–24 నాటికి ఇది 5,02,800కు పెరిగింది. మొత్తం మీద ఐఐటీల్లో 15 ఏళ్లలో ఏడు రెట్లు, ఎన్ఐటీల్లో 12 ఏళ్లలో మూడున్నర రెట్లు ఫీజులు పెంచారు. అలాగే ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల్లలో 15 ఏళ్లలో 8 రెట్లు ఫీజులు పెరిగాయి. భారతదేశంలో పెరిగిపోతున్న విద్యా వ్యయంపై కెరీర్స్360 ఫౌండర్ చైర్మన్ మహేశ్వర్ పెరి అందిస్తున్న ప్రత్యేక వ్యాసం⇒ మన దేశంలో చదువు రోజురోజుకీ భారంగా మారుతోంది. ప్రాథమిక విద్య నుంచి మేనేజ్ మెంట్ చదువుల వరకు ప్రతి దశలోనూ విద్య సామాన్యుడికే కాదు, మధ్య తరగతికీ తలకు మించిన భారంగా పరిణమించింది. విద్యలో ప్రభుత్వ పాత్ర క్రమేణా తగ్గడం.. ప్రైవేటు విద్యా సంస్థలు పుట్టుకొచ్చి ఫీజులు పెంచుకుంటూ పోవడమే అందుకు ప్రధాన కారణం.⇒ గత 13 ఏళ్లలో ప్రభుత్వ బడుల సంఖ్యలో పెరుగుదల కేవలం 9 శాతం. అదే సమయంలో ప్రైవేటు స్కూళ్లు ఏకంగా 35% పెరిగిపోయాయి. ప్రస్తుతం దేశంలోని మొత్తం కాలేజీల్లో 79 % ప్రైవేటువే. 14 ఏళ్ల కిందట దేశంలోని ప్రతి రెండు ప్రభుత్వ యూనివర్సిటీలకు ఒక ప్రైవేటు యూనివర్సిటీ ఉంటే నేడు ప్రైవేటు వర్సిటీల సంఖ్య ప్రభుత్వ వర్సిటీల సంఖ్యను అధిగమించేసింది. వీటన్నింటి ఫలితంగా చదువులపై పెట్టాల్సిన ఖర్చు గణనీయంగా పెరిగిపోయింది. ఇవన్నీ ఆందోళనకరమైన పరిణామాలు. ⇒ మన చిన్న చిన్న విషయాలపై దృష్టి పెట్టి, పెద్ద పెద్ద విషయాలను పక్కనపెట్టేశామేమో అనిపిస్తోంది. ఈ సందర్భంగా మనమంతా కొన్ని అంశాలు ఆలోచించాలి. మన ప్రజల సుసంపన్నమైన అభివృద్ధికి ఇప్పటికీ కట్టుబడే ఉన్నామా? నిపుణులైన మానవ వనరులను తయారుచేసుకోవడంలో మనం వెనకబడుతున్నామా? గత 15–20 ఏళ్లలో దేశంలో విద్యా రంగంలో చోటుచేసుకున్న పరిణామాలను గమనిస్తే అవుననే అనిపిస్తుంది. ఐఐటీలను మించి స్కూల్ ఫీజులు.. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఫీజులు స్కూల్‌ను బట్టి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉన్నాయి. హైదరాబాద్ లోని పటాన్చెరులో ఉన్న ఒక ఇంటర్నేషనల్ స్కూల్ 2024–25 విద్యా సంవత్సరానికి రూ.12 లక్షల ఫీజు వసూలు చేస్తోంది. ఇది కాకుండా అడ్మిషన్ ఫీజు కింద మరో రూ.1.7 లక్షలు చెల్లించాల్సిందే. అలాగే శంషాబాద్‌లో ఉన్న మరో అకాడమీ ఏడాదికి రూ.9.5 లక్షల ఫీజు వసూలు చేస్తోంది. అలాగే మోకిలాలో ఉన్న ఇంకో ఇంటర్నేషనల్ స్కూల్లో ఏడాదికి రూ.8.2 లక్షల ఫీజు ఉంది. వీటికి అదనంగా అడ్మిషన్ ఫీజు కింద మరింత ముట్టజెప్పాల్సిందే. భారీ ఫీజులతో తల్లిదండ్రుల్లో ఆందోళన ఆ కోర్సు, ఈ కోర్సు అనే తేడా లేకుండా ప్రతి కోర్సుకు ఫీజుల మోత మోగిపోతోంది. మనదేశంలో విద్యా వ్యయం ఏయేడాదికాయేడాది అంతకంతకూ పెరిగిపోతోంది. తల్లిదండ్రులు తమ పిల్లలను అత్యున్నత విద్యా సంస్థల్లో చదివించాలని కలలు కంటారు. తమ కంటే తమ పిల్లల భవిష్యత్ బాగుండాలని ఆశిస్తారు.మంచి విద్యా సంస్థలో తమ పిల్లలు సీటు సాధించాలని.. ఆ తర్వాత కోర్సు పూర్తయ్యాక మంచి పే ప్యాకేజీతో ఉద్యోగం సాధించాలని ఆకాంక్షిస్తారు. అత్యుత్తమ విద్య, ఆ తర్వాత మంచి ఉద్యోగం సాధించాలంటే మేటి విద్యా సంస్థల్లో చదవకతప్పదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఈ పోటీ ప్రపంచంలో అందరికంటే ముందుండాలన్నా, మంచి అవకాశాలు దక్కించుకోవాలన్నా నాణ్యమైన చదువులతోనే సాధ్యమని నమ్ముతున్నారు. అయితే పెరుగుతున్న ఫీజులు తల్లిదండ్రుల్లో ఆందోళన రేపుతున్నాయి. క్యాష్ చేసుకుంటున్న విద్యా సంస్థలు.. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆకాంక్షలను విద్యా సంస్థలు ‘క్యాష్’ చేసుకుంటున్నాయి. ఫీజులను అమాంతం పెంచేస్తున్నాయి. నర్సరీ నుంచి మొదలుపెడితే పీజీలు, పీహెచ్‌డీల వరకు ఈ విద్యా వ్యయం ఏటా అంతకంతకూ గణనీయంగా పెరుగుతోంది. ధనవంతులకు ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకపోయినా మధ్యతరగతి వర్గాలు, పేదలు అంతకంతకూ పెరిగిపోతున్న విద్యా వ్యయంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏటా భారీగా పెరిగిపోతున్న ఫీజులను కట్టలేక నాణ్యమైన చదువులకు విద్యార్థులు దూరమవుతున్నారు. ఇలా అర్థంతరంగా చదువులు మానేసేవారి శాతం అంతకంతకూ పెరిగిపోతోంది. కొంతవరకు బ్యాంకులు విద్యా రుణాలు అందిస్తున్నా అవి అందరికీ దక్కడంలేదు. దీంతో డ్రాపవుట్లు పెరుగుతున్నాయి. ప్రభుత్వరంగంలో తగ్గిపోయిన విద్యాసంస్థలుప్రపంచంలోనే అత్యధిక యువజనాభా భారతదేశంలోనే ఉంది. అయితే దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ రంగంలో విద్యా సంస్థలు ఏర్పాటు కావడం లేదు. ప్రైవేటు రంగంలోనే ఎక్కువ విద్యా సంస్థలు ఏర్పాటవుతున్నాయి. దీంతో ప్రైవేటు విద్యా సంస్థలు భారీగా ఫీజులు వసూలు చేస్తూ నడ్డి విరుస్తున్నాయి.ప్రభుత్వ రంగంలో ఎక్కువ విద్యా సంస్థలు ఏర్పాటయితే ప్రైవేటు సంస్థలతో పోలిస్తే ఫీజుల భారం తక్కువగా ఉంటుంది. అయితే అలా జరగకపోవడంతో పేదలు, మధ్యతరగతి వర్గాలు భారీ ఫీజులను చెల్లించలేక చదువులకు స్వస్తి చెబుతున్నాయి. దేశంలో ప్రైవేటు విద్యా సంస్థల్లో గత 15 ఏళ్లలో వివిధ కోర్సుల ఫీజులు 300 శాతం పెరిగాయి. దేశంలో గత 20 ఏళ్ల కేంద్ర ప్రభుత్వ గణాంకాలను పరిశీలిస్తే దిమ్మతిరిగే విషయాలు వెల్లడయ్యాయి. భారీగా ఫీజుల భారం.. దేశంలో ప్రైవేటు స్కూళ్లు, కళాశాలలు, యూనివర్సిటీలు పెరిగిపోవడం.. ప్రభుత్వ రంగంలో విద్యా సంస్థలు తగ్గిపోవడంతో విద్యార్థులపై భారీ ఎత్తున ఫీజుల భారం పడుతోంది. దీంతో విద్యకు సంబంధించిన ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరిగిపోతోంది. తాజా నేషనల్ శాంపుల్ సర్వే ప్రకారం.. 2014–2018 మధ్య ప్రాథమిక విద్యకు తల్లిదండ్రులు 30.7 శాతం వ్యయం చేశారు. అలాగే ప్రాథమికోన్నత తరగతులకు 27.5 శాతం ఖర్చు పెట్టారు. లోకల్ సర్కిల్స్ సర్వే ప్రకారం.. కోవిడ్ తర్వాత తమ పిల్లల స్కూల్ ఫీజులు 30 శాతం నుంచి 50 శాతం వరకు పెరిగాయని 42 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారు. తన కుమారుడి ఫీజు కింద నెలకు రూ.30,000 చెల్లిస్తున్నానంటూ హరియాణాలోని గురుగ్రామ్‌లో ఒక తండ్రి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. హైదరాబాద్‌లో ఒక స్కూల్ ఒకేసారి 50 శాతం ఫీజు పెంచింది. 44 శాతం మంది చదువులకు దూరం నేషనల్ శాంపుల్ సర్వే ప్రకారం.. 23 శాతం మంది ఆర్థిక ఇబ్బందులతోనే చదువులు మానేశారు. 21 శాతం మంది తమ కుటుంబ పోషణ కోసం పనులకు వెళ్లడం వల్ల చదువులు మానేశామని చెప్పారు. అంటే దేశ యువతలో 44 శాతం మంది పెరిగిన ఫీజులు, కుటుంబ ఆరి్థక పరిస్థితులతో ఉన్నత చదువులు చదవలేకపోయారు. ఈ నేపథ్యంలో విద్య నిరుపేద, మధ్యతరగతి వర్గాలకు భారం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.ఎంబీబీఎస్.. ఫీజుల మోత మోగాల్సిందే..⇒ ప్రైవేటు స్టేట్ యూనివర్సిటీల్లో రూ.80 లక్షల నుంచి రూ.1.25 కోట్ల వరకు ⇒ డీమ్డ్ యూనివర్సిటీల్లో రూ.1.25 కోట్ల నుంచి రూ. 2 కోట్ల వరకు ⇒ ఎన్నారైలకు రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు -
ఏఐకి రూ.19 లక్షలు సైబర్ సెక్యూరిటీకి రూ.18 లక్షలు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు యాజ మాన్య కోటా సీట్ల బేరసారాల జోరు పెంచాయి. వీలైనంత ఎక్కువ డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా కంప్యూటర్ బ్రాంచీల్లో సీట్లను పెద్ద మొత్తంలో అమ్ముకోవాలని చూస్తున్నాయి. డిమాండ్ ఉన్న టాప్ కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్లు సామాన్యులు ఆశించే స్థాయిలో లేవని తెలుస్తోంది.ఇంజనీరింగ్ సెట్ ఫలితాలు మరో పది రోజుల్లో రానుండటంతో యాజమాన్య సీట్ల వైపు ఎక్కువ మంది ఆశలు పెట్టుకుంటున్నారు. వాస్తవానికి ప్రభుత్వ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే యాజమాన్య కోటా సీట్లను భర్తీ చేయాల్సి ఉన్నప్పటికీ ఈ నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. అయితే, సీట్లు కొనుగోలు చేసేవాళ్లు, విక్రయించే కాలేజీలకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో తామేమీ చేయలేక పోతున్నామని అధికారులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. డబ్బు కడితేనే సీటు గ్యారంటీరాష్ట్రంలో ఈ ఏడాది 1.09 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉండే వీలుంది. ఇందులో 30% అంటే దాదాపు 31 వేల సీట్లు మేనేజ్మెంట్ కోటా కిందకొస్తాయి. ఇందులో టాప్ కాలే జీల్లో 19 వేల సీట్ల వరకూ ఉండగా, వీటిలో సగం సీట్లను ఎన్ ఆర్ఐ కోటా కింద భర్తీ చేయాలి. బీ కేటగిరీ సీట్లను జేఈఈ, ఈఏపీసెట్ ర్యాంకర్లు, ఇంటర్లో మార్కులు ఎక్కువ వచ్చిన వారికి క్రమానుగతంగా ఇవ్వాలి. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎన్ఆర్ఐ కోటా సీట్లకు ఏడాదికి 5 వేల డాలర్లు (దాదాపు రూ. 4 లక్షలు) వసూలు చేసుకునే వీలుంది. అయితే, బీ కేటగిరీ సీట్లకు దరఖాస్తు చేసే వాళ్ల వివ రాలు ప్రభుత్వ సంస్థల పరిధిలోకి రావడం లేదు. ఆన్లైన్ విధానంలోనూ ఉండటం లేదు. దీన్ని సాకుగా తీసుకుని యాజమాన్యాలు ముందే సీట్లను అమ్ముకుంటున్నాయి. ఈఏపీ సెట్లో మంచి ర్యాంకు రాదని తెలిసిన వాళ్లు సీట్ల కోసం ఎగబడుతున్నారు. సెట్ రిజల్ట్ వస్తే డిమాండ్ పెరుగు తుందని, సీట్లు కూడా అయిపోయే ప్రమాదం ఉందని యాజ మాన్యాలు డిమాండ్ సృష్టిస్తున్నాయి. ప్రతీ రోజు ప్రత్యేక విభాగాలు పెట్టి సీట్ల కోసం వచ్చే వారిని ఒప్పించి, మెప్పించి డబ్బు వసూలు చేస్తున్నాయి. సీటు ఇవ్వాలంటే ముందే డబ్బులు కట్టి రిజర్వు చేసుకోవాలని షరతు విధిస్తున్నాయి. నోటిఫికేషన్ వచ్చాకే అడ్మిషన్లు యాజమాన్య కోటా సీట్ల భర్తీకి ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ ఇస్తుంది. అప్పుడు మాత్రమే సీట్లు భర్తీ చేయాలి. ఇందుకు విరుద్ధంగా సీట్లు అమ్ముకునే సంస్థలపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్‌గా ఉంది. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్ర్యాంకర్లకూ గాలం» జేఈఈ ర్యాంకర్లతో కాలేజీ యాజ మాన్యాలు రాష్ట్ర ఇంజనీరింగ్ సీట్లకు కౌన్సెలింగ్‌లో దరఖాస్తు చేయించేందుకు వ్యూహరచన చేస్తున్నాయి. ఇలాంటి వాళ్లకు రాష్ట్ర సెట్లోనూ మంచి ర్యాంకు వస్తుంది. కంప్యూటర్ బ్రాంచీలో సీటుకు దరఖాస్తు చేస్తే తొలి కౌన్సెలింగ్‌లోనే సీటు వస్తోంది. జాయినింగ్ రిపోర్టు చేసి సీటు కన్ఫమ్ చేసుకుంటున్నారు. ఆఖరి దశ కౌన్సెలింగ్ తర్వాత, స్పాట్ అడ్మిషన్‌కు ముందు సీటు వదులుకుని, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరతారు. ఇలా ఖాళీ అయిన సీట్లనూ యాజమాన్యాలు భారీ మొత్తంలో అమ్ముకుంటాయి. కంప్యూటర్ బ్రాంచీలో సీటుకు రూ.18 లక్షల వరకూ వసూలు చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) వంటి కోర్సులకు ఏకంగా రూ. 19 లక్షల వరకూ డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో 58 శాతం సీట్లు కంప్యూటర్ కోర్సుల్లోనే భర్తీ అవుతున్నాయి. -
వేగంగా ముగిసిన ర్యాటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల ధ్రువీకరణ (ర్యాటిఫికేషన్) ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. కొన్నేళ్ళతో పోలిస్తే ఈ ప్రక్రియను ఇంత వేగంగా ముగించడం ఇదే తొలిసారి. వాస్తవానికి ర్యాటిఫికేషన్ కోసం ఉన్నత విద్యా మండలి అధికారులు ప్రతి ఏటా కుస్తీ పడుతుంటారు. ప్రతి ప్రైవేటు కాలేజీకి కేటాయించిన సీటును నిశితంగా పరిశీలించి, ఎలాంటి అభ్యంతరాలు లేవని మండలి సభ్యులు నిర్ణయించిన తర్వాతే ఆమోదం తెలుపుతారు. ఈ కారణంగా ర్యాటిఫికేషన్ ప్రక్రియ ప్రతి సంవత్సరం మార్చి వరకూ కొనసాగతుంది. మండలి కార్యాలయంలో దీనికి ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటు చేస్తారు. రోజుకు కొన్ని కాలేజీలు చొప్పున పెద్ద ఎత్తున ఫైళ్ళతో వస్తుంటాయి. ఈసారి మాత్రం ఈ హడావుడి ఏమీ కన్పించలేదు. రాష్ట్రంలోని 150కి పైగా ప్రైవేటు కాలేజీల్లో ఉండే 25 వేల మేనేజ్మెంట్ కోటా సీట్లకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన ఇంత వేగంగా ముగించడం, అన్నీ సక్రమమేనంటూ ధ్రువీకరించడంపై పలు విద్యార్థి సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఫిర్యాదులకు ఆధారాల్లేవా? ప్రతి ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీకి కొన్ని సీట్లు కేటాయిస్తారు. ఇందులో 70 శాతం కన్వినర్ కోటా కింద భర్తీ చేస్తారు. మిగిలిన 30 శాతం సీట్లలో 15 శాతం ప్రవాస భారతీయుల పిల్లలు, ఎన్ఆర్ఐలు సిఫారసు చేసిన వారికి కేటాయిస్తారు. మిగిలిన 15 శాతం సీట్లను యాజమాన్య కోటా (బి కేటగిరీ) కింద భర్తీ చేస్తారు. అయితే వీటి విషయంలో కొన్ని షరతులు పాటించాల్సి ఉంటుంది. జేఈఈ ర్యాంకర్లకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. వాళ్ళు లేకుంటే ఎంసెట్ ర్యాంకర్లకు, ఆ తర్వాత ఇంటర్లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వారికి ఇవ్వాలి. సర్టిఫికెట్లు అన్నీ సరిగ్గా ఉండాలి. బి కేటగిరీ కింద కేటాయించిన సీట్లకు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు మాత్రమే తీసుకోవాలి. అయితే కాలేజీలు ఈ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్టుగా ప్రతి ఏటా మండలికి ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ ఏడాది కూడా 34 కాలేజీలపై 42 ఫిర్యాదులు వచ్చి నట్టు మండలి వర్గాలే తెలిపాయి. అయితే వీటిని పరిశీలించేందుకు ఏర్పాటైన కమిటీని ఎలాంటి చర్యలు తీసుకున్నది అధికారులు వెల్లడించడం లేదు. అదే సమయంలో ఆధారాలుంటే తప్ప ఫిర్యాదుల విషయంలో తామేమీ చేయలేమని అంటున్నారు. ప్రైవేటు కాలేజీలు ఖుషీ ర్యాటిఫికేషన్ ప్రక్రియ ఈసారి సజావుగా సాగిపోవడంతో ప్రైవేటు కాలేజీల యా జమాన్యాలు సంతోషంగా ఉన్నాయి. మండలికి అందిన ఫిర్యాదులన్నీ అవాస్తవమని చెబుతున్నాయి. విద్యార్థి సంఘాల పేరుతో సీట్లు డిమాండ్ చేశారని, వాటిని తిరస్కరించడం వల్లే మండలికి ఫిర్యాదు చేశారని ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఇష్టానుసారం సీట్లు అమ్ముకున్నట్టుగా ఆరోపణలున్న కాలేజీల పట్ల అధికారులు సానుకూలంగా వ్యవహరించారంటూ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసేందుకు సంఘాలు సిద్ధమవుతున్నట్టు సమాచారం. -
కొత్త కోర్సులు సరే.. ఫ్యాకల్టీ ఎక్కడ?
రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ కోర్సులపై యూనివర్సిటీలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. కొత్తగా వచ్చిన కోర్సులకు సంబంధించిన అధ్యాపకుల వివరాలు తెలియజేయాలని కాలేజీలకు సూచిస్తున్నాయి. కొన్ని కాలేజీల్లో పెరిగిన సీట్లకు సరిపడా ఫ్యాకల్టీ లేదని, సంబంధిత సబ్జెక్టుల్లో నైపుణ్యం ఉన్న వారు అస్సలు లేరని పలు సంఘాల నుంచి ఫిర్యాదులొచ్చిన నేపథ్యంలో ఈ చర్యలకు ఉపక్రమించడం గమనార్హం. మరోవైపు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) సైతం కంప్యూటర్ కోర్సుల్లో నాణ్యత పెంచాలని సూచించింది. వివిధ రంగాల నుంచి నిపుణులను బోధకులుగా తీసుకోవాలని తెలిపింది. వాస్తవానికి అనుబంధ గుర్తింపు ఇచ్చే సమయంలో ఇలాంటి వాటిపై యూనివర్సిటీలు దృష్టి సారించాయి. అయితే, తమకు కొంత సమయం కావాలని, సీట్లు పెరిగిన తర్వాత అర్హత గల అధ్యాపకులను నియమించుకుంటామని కాలేజీలు తెలిపాయి. కానీ ఇది ఆచరణలో కనిపించడం లేదని యూనివర్సిటీ అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. –సాక్షి, హైదరాబాద్ భారీగా పెరిగిన సీట్లు ఈ విద్యా సంవత్సరంలో కంప్యూటర్ సైన్స్ కోర్సులు భారీగా పెరిగాయి. వందకుపైగా కాలేజీలు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో డిమాండ్ లేదని గుర్తింపు ఇచ్చే వర్సిటీలకు తెలిపాయి. వీటిని తగ్గించి, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్ వంటి బ్రాంచీల్లో సీట్లు పెంచుకున్నాయి. నిజానికి ఈ ఏడాది కొత్తగా కంప్యూటర్ సైన్స్ కోర్సులో 7,635 సీట్లు మంజూరయ్యాయి. డిమాండ్ లేని కోర్సులను రద్దు చేసుకోవడం వల్ల మరో 6,390 సీట్లు అదనంగా మార్పిడి రూపంలో పెరిగాయి. ఈ విధంగా 14,565 సీట్లు కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ విభాగాల్లో అదనంగా వచ్చి చేరాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి బ్రాంచీలను బోధించే వారు అవసరమైన మేర ఉన్నారు. కానీ కొత్తగా వచ్చిన కంప్యూటర్ కోర్సులను బోధించే అనుభవజు్ఞల కొరత రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీలను వేధిస్తోంది. సరైన ఫ్యాకల్టీ లేకపోవడంతో సీఎస్ఈ బ్రాంచీలో బోధించే వారినే కొత్త కోర్సులకు వాడుతున్నారు. వారికి అవసరమైన శిక్షణ కూడా ఇవ్వకపోవడంతో కొత్త కోర్సుల్లో బోధన నాణ్యత లోపిస్తోందని కాలేజీ అధ్యాపక సంఘా నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అనుభవంపై ఆరా కొత్త కోర్సుల్లో మాస్టర్ డిగ్రీ చేసిన వారితోనైనా బోధించేలా చూడాలని యూనివర్సిటీలు కోరుతున్నాయి. ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ విభాగాల్లో కంప్యూటర్ కోర్సులు చేసిన వాళ్లు అధ్యాపకులుగా పనిచేయడానికి ముందుకు రావడం లేదు. వారంతా సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడ్డారు. ఈ కారణంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ) బోధించే అధ్యాపకులున్న కాలేజీల్లో అదనపు కొత్త సబ్జెక్టులనైనా ప్రొఫెషనల్స్‌తో బోధించేందుకు ప్రయత్నించాలని వర్సిటీలు సూచిస్తున్నాయి. ఎంఎస్, ఇతర మాస్టర్ డిగ్రీలు చేసి, కనీసం అయిదేళ్లుగా సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న వారితో బోధన సమంజసమని యూనివర్సిటీలు భావిస్తున్నాయి. ఇలాంటి మార్పు ఎన్ని కాలేజీలకు అవసరమనేది క్షేత్రస్థాయి కాలేజీల వివరాలు పరిశీలించాక ఓ అవగాహనకు వచ్చే వీలుందని ఓ యూనివర్సిటీ వీసీ తెలిపారు. కొత్త కోర్సులను నిర్వహిస్తున్న కొన్ని కాలేజీలను దసరా తర్వాత ప్రత్యక్షంగా పరిశీలించి, నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. -
అమ్ముకున్న సీట్లకు అధికారిక ముద్ర!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో యాజమాన్య కోటా భర్తీకి ఉన్నత విద్యామండలి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నిబంధనల ప్రకారం సీట్లను భర్తీ చేసుకోవచ్చంటూ బుధవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. కన్వీనర్ కోటా సీట్ల తొలివిడత కేటాయింపు ఇటీవలే పూర్తవగా మరో రెండు దశల్లో ఎంసెట్ సీట్ల కేటాయింపు ఉండే వీలుంది. ఈలోగా యాజమాన్య కోటా సీట్ల భర్తీ చేపట్టేందుకు మండలి అవకాశం కల్పించడం గమనార్హం. అలాగే బీఫార్మసీ, ఫార్మా–డీ విభాగాల్లోనూ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి వెసులుబాటు కల్పించింది. అయితే ఈ విభాగాల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీ ఇప్పటివరకు చేపట్టలేదు. రాష్ట్రవ్యాప్తంగా 1.05 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. అందులో 30 శాతం సీట్లు యాజమాన్య కోటాగా ఉంటాయి. అంటే దాదాపు 30 వేల వరకు సీట్లు ఉంటాయి. ఇలా భర్తీ చేయాలి... అన్ని కాలేజీలూ గురువారం తమ పరిధిలో ఏయే బ్రాంచీల్లో ఎన్ని సీట్లున్నాయనే వివరాలతో పత్రికా ప్రకటన ఇవ్వాలి. ఆ వివరాలను ఈ నెల 31లోగా కాలేజీల వెబ్సైట్లలో పొందుపరచాలి. వచ్చే నెల 31న కాలేజీలలో జరిగే అడ్మిషన్ల వివరాలు వెల్లడించాలి. సెప్టెంబర్ 15 వరకూ విద్యార్థుల నుంచి యాజమాన్య కోటా కింద దరఖాస్తులు తీసుకోవాలి. మొత్తం యాజమాన్య సీట్లలో 15 శాతం ప్రవాస భారతీయుల పిల్లలు, వారు సిఫార్సు చేసే వారికి ఇవ్వాలి. మరో 15 శాతం సీట్లను ర్యాంకులవారీగా యాజమాన్యం భర్తీ చేయాలి. ఈ విభాగంలో ప్రవేశం పొందే విద్యార్థుల నుంచి రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ (టీఎస్‌ఎఫ్‌ఆర్‌సీ) నిర్ణయించిన ఫీజులను తీసుకోవాలి. ఎలాంటి ఫీజు రీఇంబర్స్మెంట్ ఈ విభాగానికి వర్తించదు. ఎన్ఆర్ఐ కోటా కింద తీసుకొనే సీట్లకు నిర్ణీత ఫీజు కాలేజీనిబట్టి డాలర్లలో ఉంటుంది. ‘బీ’ కేటగిరీ సీట్లను ముందుగా జేఈఈ ర్యాంకు ఆధారంగా భర్తీ చేయాలి. ఆ తర్వాత ఎంసెట్ ర్యాంకును, తర్వాత ఇంటర్ మార్కులను పరిగణనలోకి తీసుకోవాలని ఉన్నత విద్యామండలి మార్గదర్శకాల్లో పేర్కొంది. ముందుగానే బేరాలు... నిజానికి ఎంసెట్ ఫలితాలు రాగానే యాజమాన్య కోటా సీట్ల భర్తీ ప్రక్రియ మొదలైపోతోందనేది ఏటా వస్తున్న ఆరోపణే. కన్వీనర్ కోటాలో మంచి కాలేజీ, బ్రాంచి రాదని భావించే వారు యాజమాన్య కోటా కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని కాలేజీల యాజమాన్యాలు సీట్లను భారీ మొత్తానికి బేరం పెడుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో కంప్యూటర్ సైన్స్, ఇతర కంప్యూటర్ కోర్సులకు భారీ డిమాండ్ ఉండటంతో ముందే బేరం కుదుర్చుకుంటున్న కాలేజీలు... నోటిఫికేషన్ జారీ ప్రక్రియను సాధారణ విషయంగానే భావిస్తున్నాయి. ఈ సమయంలో ఎవరు దరఖాస్తు చేశారు? ర్యాంకులు ఏమిటి? అనే వివరాలపై అధికారులు ఆరా తీయడం సాధ్యం కావడం లేదు. ఆన్లైన్లో యాజమాన్య కోటా సీట్లను భర్తీ చేస్తే తప్ప దీన్ని నియంత్రించడం సాధ్యం కాదని అన్ని వర్గాలూ చెబుతున్నాయి. కానీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయట్లేదు. దీంతో ‘బీ’ కేటగిరీ సీట్ల భర్తీ నోటిఫికేషన్ కేవలం అప్పటికే అమ్ముకున్న సీట్లకు అధికారిక ముద్ర వేసే ప్రక్రియగానే మిగిలిపోతోంది. ర్యాంకుల ప్రకారమే సీట్లు ఇవ్వాలి యాజమాన్య కోటా సీట్ల భర్తీలోనూ కాలేజీలు నిబంధనలు పాటించాలి. ర్యాంకుల ప్రకారమే సీట్లు ఇవ్వాలి. ముందే అమ్ముకున్నారనే ఆరోపణలపై ఆధారాలుంటే ఎవరైనా మాకు ఫిర్యాదు చేయవచ్చు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. యాజమాన్య కోటాలో అర్హత ఉండి కూడా సీటు రాని వారు సైతం ఆ విషయాన్ని మా దృష్టికి తేవాలి. – ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
TS: ఇంజనీరింగ్ కాలేజీల సీట్ల దందాపై ఉన్నత విద్యామండలి దృష్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల సీట్ల దందాకు చెక్ పెట్టేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు మొదలుపెట్టింది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న టాపర్స్ జాబితాపై దృష్టి పెట్టనుంది. జేఈఈ ద్వారా జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు పొంది, జోసా కౌన్సెలింగ్ ద్వారా వాటిల్లో చేరిన వారి వివరాలు సేకరించాలని యోచిస్తోంది. ఇదే విద్యార్థులు రాష్ట్ర ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా సీట్లు పొంది, చివరలో రద్దు చేసుకోవడం వెనుక కథేంటో తేల్చాలని నిర్ణయించింది. ప్రైవేటు కాలేజీలతో కుమ్మక్కయినట్లు బయటపడితే కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. దీనిపై ఇప్పటికే ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన మండలి త్వరలో ఇందుకు సంబంధించిన విధివిధానాలకు రూపకల్పన చేయనుంది. ర్యాంకర్లకు కాలేజీల వల్ల జేఈఈ, ఎంసెట్‌లో టాప్ ర్యాంకులు సాధించిన రాష్ట్ర విద్యా ర్థులు అటు ఎన్ఐటీ, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజనీరింగ్ కాలేజీల్లో జరిగే కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్నారు. ముందుగా రాష్ట్ర ఎంసెట్ కౌన్సెలింగ్ మొదలవుతుంది. దీంతో డిమాండ్ ఎక్కువగా ఉన్న కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐఎంఎల్, డేటాసైన్స్ వంటి కోర్సుల్లో తొలి విడత కౌన్సెలింగ్‌లోనే సీట్లు పొందుతున్నారు. సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేస్తున్నారు. ఆ తర్వాత వీరికి జోసా కౌన్సెలింగ్‌లోనూ సీట్లు వస్తున్నాయి. వాటిల్లోనూ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తున్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా పొందిన సీటును రద్దు చేసుకోకుండా ఎంసెట్ కౌన్సెలింగ్ అన్ని దశలు అయిపోయే వరకు అలాగే ఉంచి చివర్లో రద్దు చేసుకుంటున్నారు. ఈ సీట్లను ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు స్పాట్ అడ్మిషన్ ద్వారా భర్తీ చేస్తున్నాయి. ఈ క్రమంలో ముందే ఎక్కువ డబ్బులకు మాట్లాడుకున్న వారికి కాలేజీలు సీట్లు కేటాయిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో టాప్ ర్యాంకర్లకు కూడా ముందే వల వేసి ఒప్పందం చేసుకుంటున్నారని, ఈ మేరకు కొంత మొత్తం ముట్టజెబు తున్నారని విద్యార్థి, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో రూ.కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయని, ఉన్నతాధికారులకు సైతం ఇందులో వాటాలు ఉంటున్నాయని ఆరోపిస్తున్నాయి. ప్రైవేటు కాలేజీల దందాపై ప్రతి ఏటా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఈ తంతుపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా నివేదికలు ఇస్తున్నాయి. దీంతో ఈ అడ్డగోలు వ్యాపారానికి చెక్ పెట్టాలనే నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం.. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఏం చేయబోతున్నారు..? తొలిదశలోనే సీటు సాధించి చివరి కౌన్సెలింగ్ వరకూ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరని వారి వివరాలు సేకరిస్తారు. జాతీయ సంస్థలతో సమన్వయం చేసుకుని, జోసా కౌన్సెలింగ్‌లో వారికి సీటు ఎప్పుడొచ్చింది? ఎప్పుడు రిపోర్టు చేశారు? అనే వివరాలు సేకరిస్తారు. ఇదంతా విద్యార్థుల ఆధార్ నంబర్ ఆధారంగా చేయాలని భావిస్తు న్నారు. విద్యార్థులకు ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల ద్వారా లబ్ధి చేకూరిందా అనేది నిగ్గు తేల్చేందుకు వారి బ్యాంకు ఖాతాలతో పాటు తల్లిదండ్రులు, బంధువుల బ్యాంకు ఖాతాలను కూడా చెక్ చేసే వీలుందని ఓ అధికారి తెలిపారు. ప్రాథమిక ఆధారాలు లభిస్తే తక్షణమే జాతీయ సంస్థలతో మాట్లాడి ఆ విద్యార్థి ఎక్కడ సీటు పొందినా బ్లాక్ చేయాలనే ఆలోచనలో అధికారులున్నారు. ఈ క్రమంలో కాలేజీలు, విద్యార్థులపై కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడ బోమని అధికారులు అంటున్నారు. కాలేజీల సీట్ల వ్యాపారంలో పావులు కావొద్దంటూ విద్యార్థులను హెచ్చరించేలా ప్రచారం సైతం చేసేందుకు మండలి సిద్ధమవుతోంది. -
‘నీట్’లా ఇంజనీరింగ్‌కూ ఒకే ఎంట్రన్స్!
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్‌లో ఇక రాష్ట్రాల పరిధిలో ఎంసెట్‌ల నిర్వహణ ఉండే అవకాశం కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి ‘నీట్’ను నిర్వహిస్తున్న మాదిరిగానే అన్ని రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి జాతీయ స్థాయిలో ఒకే ప్రవేశపరీక్ష నిర్వహించే దిశగా కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ముసాయిదా ప్రతిని కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాలకూ పంపింది. మెజారిటీ రాష్ట్రాలు ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు తెలిసింది. దీంతో ఈ అంశంపై అవగాహనకు కేంద్రం సెమినార్లు నిర్వహిస్తోంది. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఉన్న డిగ్రీ, పీజీ సీట్ల భర్తీకి కూడా కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) ప్రయోగం విజయవంతమైంది. దీంతో జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ ఉమ్మడి ప్రవేశపరీక్షపై కేంద్రం దృష్టి పెట్టింది. గత కొన్నేళ్లుగా దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలతోపాటు కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యాసంస్థల్లోని ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు కేంద్రం జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహిస్తోంది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు ఐఐటీల్లో ప్రవేశాల కోసం జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష చేపడుతోంది. ఇదే మాదిరిగా రాష్ట్రాల ఇంజనీరింగ్ కాలేజీలనూ కలుపుకొని ఉమ్మడి ప్రవేశ పరీక్ష, కౌన్సెలింగ్ చేపట్టాలని 2016లోనే ఆలోచన చేసింది. కానీ వివిధ కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. కొనసాగుతున్న చర్చలు గత నెల 18న భువనేశ్వర్‌లో అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ), యూజీసీ, ఐఐటీల డైరెక్టర్లు, గవర్నింగ్ బాడీ చైర్మన్లతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇంజనీరింగ్ ఉమ్మడి ప్రవేశపరీక్షపై చర్చించారు. అయితే ఇందుకు సంబంధించి అనుసరించాల్సిన విధివిధానాలు, పొందుపరచాల్సిన నిబంధనలపై వివిధ వాదనలు వినిపించాయి. దీంతో అన్ని కోణాల్లోనూ పరిశీలించి, మార్పుచేర్పులతో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఐఐటీ గవరి్నంగ్ బాడీ చైర్మన్లను కేంద్ర మంత్రి ఆదేశించారు. దీంతో వారు అన్ని రాష్ట్రాలతో భేటీ అవుతూ అభిప్రాయసేకరణ చేపడుతున్నారు. 2025–26 నాటికి ఈ ప్రయోగాన్ని అమల్లోకి తేవాలనే ఆలోచనలో ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. విధానపరమైన నిర్ణయం తీసుకున్నాక ప్రస్తుతం రాష్ట్రాల పరిధిలో ఉన్న కాలేజీలకు రెండేళ్ల సమయం ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. అయితే ఐఐటీల నాణ్యతను ఏమాత్రం తగ్గించకుండా చూడాలని సమావేశంలో పాల్గొన్న విద్యావేత్తలు సూచించారు. నీట్, జేఈఈ మెయిన్ పరీక్షలతోపాటు కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)లో విలీనం చేసే యోచన ఉందని యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ జగదీశ్‌కుమార్ కూడా గతంలో అనేక సందర్భాల్లో తెలిపారు. నిబంధనలు పాటిస్తేనే అనుబంధ గుర్తింపు.. ఇంజనీరింగ్ సీట్ల భర్తీ జాతీయ స్థాయిలోకి వెళ్తే పూర్తిగా వెబ్ ఆధారితంగానే ఉంటుందని అధికారులు అంటున్నారు. యాజమాన్య కోటా కూడా కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేస్తారు. అనుబంధ గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీలన్నీ ఏఐసీటీఈ నిబంధనలు విధిగా పాటించాల్సి ఉంటుంది. మౌలిక వసతులు, నాణ్యమైన ఫ్యాకల్టి, కంప్యూటర్ ఆధారిత కోర్సుల్లో బోధన ప్రణాళిక మొత్తం కేంద్ర పరిధిలోకి వెళ్తుంది. ఫలితంగా కొన్ని ప్రైవేటు కాలేజీలు అనేక మార్పులు చేసుకోక తప్పదని ఓ అధికారి పేర్కొన్నారు. ఇప్పటివరకు యూనివర్సిటీ అధికారులే తనిఖీలు చేసేవాళ్లు. ఇకపై జాతీయ స్థాయిలోనూ ప్రత్యేక బృందాలు తనిఖీలు చేసి అనుమతిస్తేనే ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు లభిస్తుందని తెలుస్తోంది. ఈ విధానంతో యాజమాన్య కోటా సీట్ల బేరసారాలకు బ్రేక్ పడుతుందని అధికార వర్గాలు అంటున్నాయి. -
అఫిలియేషన్ ప్రక్రియ మొదలు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ మొదలైంది. విశ్వవిద్యాలయాలు ఇప్పటికే కాలేజీల నుంచి సమాచారం సేకరించాయి. వాటిని సంబంధిత నిపుణులు పరిశీలిస్తున్నారు. అత్యధిక కాలేజీలు అనుబంధంగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూహెచ్) ఈ ప్రక్రియలో ముందుంది. కాలేజీల నుంచి సేకరించిన సమాచారాన్ని సిబ్బంది కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తున్నారు. దీని ఆధారంగా ప్రతీ కాలేజీకి ముగ్గురు చొప్పున ఫ్యాకల్టీ నిపుణులు వెళ్తారని జేఎన్టీయూహెచ్ అధికారులు తెలిపారు. మరోవైపు డిమాండ్ లేని కోర్సుల్లో సీట్లు తగ్గించుకుని, డిమాండ్ ఉన్న వాటిల్లో పెంచుకునేందుకు కాలేజీలు ప్రయ త్నిస్తున్నాయి. అయితే, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సుల్లో సీట్లు పూర్తిగా తగ్గించేందుకు అధికారులు ఒప్పుకోవడం లేదు. ఆయా కోర్సుల్లో 30 శాతం సీట్లు ఉండి తీరాలని చెబుతున్నారు. ఈ ఏడాది ఎంసెట్ కౌన్సెలింగ్ మొదలయ్యే నాటికే అఫిలియేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. 200కు పైగా కాలేజీల్లో తనిఖీలకు సిద్ధం జేఎన్టీయూహెచ్ పరిధిలో 145 వరకూ ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. మరో 70 వరకూ ఫార్మసీ కాలేజీలున్నాయి. వీటిల్లో ప్రధానంగా కంప్యూటర్ సైన్స్, దానికి అనుబంధంగా వచ్చి న కొత్త కోర్సుల విషయంలోనే అధికారులు దృష్టి పెట్టాలని నిర్ణయించారు. సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వంటి కోర్సుల్లో అవసరమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయా? ఫ్యాకల్టీ సరైనది ఉందా? మౌలిక సదుపాయాలు ఏమేర ఉన్నాయి? అనే అంశాలను తనిఖీ బృందాలు నిశితంగా పరిశీలించాలని ఇటీవల జరిగిన సమావేశంలో నిర్ణయించారు. బయోమెట్రిక్ హాజరు విధానాన్ని యూనివర్సిటీలు తప్పనిసరి చేసినా, పలు కాలేజీలు దీన్ని అనుసరించడం లేదు. ఈ ఏడాది నుంచి దీనిని కచ్చి తంగా అమలు చేయాలని నిర్ణయించినట్టు జేఎన్టీయూహెచ్ అధికారులు తెలిపారు. ఈ అంశాన్ని కూడా పరిశీలనలో భాగం చేయాలని నిర్ణయించారు. దీనివల్ల ఫ్యాకల్టీ ప్రతిభ, ప్రమాణాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే వీలుందని చెబుతున్నారు. మిగతా యూనివర్సిటీలు కూడా తనిఖీలకు రంగం సిద్ధం చేస్తున్నాయి. సదుపాయాలు లేకుండా గుర్తింపు కష్టం తనిఖీల విషయంలో యూనివర్సిటీలు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. తనిఖీ బృందాలు కాలేజీ యాజమాన్యాలతో మిలాఖత్ అవుతున్నాయని, మౌలిక సదుపాయాలు లేకున్నా అనుమతిస్తున్నారనే విమర్శలున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కాలేజీలో బోధించే సిబ్బంది వివరాలు ఆన్లైన్లో నమోదు చేయడమే కాకుండా, వారి వ్యక్తిగత పాన్ కార్డుల ఆధారంగా ఆదాయ పన్నుశాఖ ద్వారా తనిఖీలు చేయాలనే యోచనలో ఉన్నారు. ఫ్యాకల్టీ కాలేజీలో బోధిస్తున్నాడా? ఎక్కడైనా ఉద్యోగం చేసుకుని, కాలేజీలో ఫ్యాకల్టీగా నమోదు చేసుకున్నాడా అనే అంశాలను పరిశీలించాలని నిర్ణయించారు. ఏప్రిల్ నెలాఖరుకల్లా తనిఖీలు పూర్తి చేయాలని యూనివర్సిటీల అధికారులు భావిస్తున్నారు. మే రెండో వారంకల్లా పూర్తి చేస్తాం కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియను మే రెండో వారంకల్లా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నాం. కాలేజీల్లో ఫ్యాక ల్టి, వసతులపై డేటా తెప్పించాం. నిబంధనల ప్రకారం మౌలిక వసతులు లేని కాలేజీలు గుర్తింపు తేదీ నాటికి ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. ప్రతీ కాలేజీకి ముగ్గురు చొప్పున నిపుణులు వెళ్తారు. అన్నీ పరిశీలించి, నిబంధనల మేరకు సరిగా ఉంటేనే గుర్తింపు ఇస్తాం. – ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి (జేఎన్టీయూహెచ్ వీసీ) -
153 సెక్షన్లు మూత! అధికారులకు 58 ఇంజనీరింగ్ కాలేజీల వినతి
సాక్షి, హైదరాబాద్: తమ కాలేజీల్లో కొన్ని సెక్షన్లు రద్దు చేయాలంటూ కొన్ని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు అధికారులపై ఒత్తిడి తెస్తున్నాయి. ఇందులో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులకు సంబంధించిన సెక్షన్లున్నాయి. 58 కాలేజీలు ఈ విధంగా అభ్యర్థించడం గమనార్హం. ఈ తరహా కాలేజీలు గ్రామీణప్రాంతాల్లో ఎక్కువగా ఉంటే, హైదరాబాద్ నగరం చుట్టు పక్కల మరికొన్ని ఉన్నాయి. ఇప్పటికిప్పుడు తామేమీ చేయలే మని అధికారులు చెబుతుండగా.. 10మంది లోపు విద్యార్థులున్న 153 సెక్షన్లు నడపడం ఆర్థికంగా తమకు భారమని, వారి కోసం సెక్షన్లు కొనసాగించలేమని కాలేజీలు చెబుతున్నాయి. ఒక్కో సెక్షన్లో ఐదుగురేనా? దాదాపు వంద కాలేజీలు ఈ సంవత్సరం సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో సీట్లు తగ్గించుకునేందుకు దరఖాస్తు చేశా యి. వీటిల్లో 78 కాలేజీల్లోని 9 వేలకు పైగా సీట్లు తగ్గించుకునేందుకు అనుబంధ గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీలు ఒప్పుకున్నాయి. వాస్తవానికి ప్రతి సెక్షన్లో 60 మంది విద్యార్థులు చేరేందుకు అనుమతి ఉంటుంది. అయితే 58 కాలేజీల్లో కొన్ని సెక్షన్లలో పట్టుమని పది మంది కూడా చేరలేదు. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని ప్రైవేటు కాలేజీల్లో సివిల్, మెకానికల్‌లో ఒక్కో సెక్షన్లో ఐదుగురే చేరారు. నగర శివార్లలోని నాలుగు ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి. రాష్ట్రవ్యాప్తంగా కన్వీనర్ కోటా కింద భర్తీ చేసే సీట్లు 78 వేల వరకూ ఉన్నాయి. ఇందులో ఇప్పటివరకు కౌన్సెలింగ్ ద్వారా 64 వేల మంది చేరినా, 59 వేల మందే ఫీజులు చెల్లించారు. ఈ లెక్కన 19 వేల సీట్లు మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆఖరుకు ప్రభుత్వ కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి కన్పిస్తోంది. 16 ప్రభుత్వ కాలేజీల్లో 5 వేల వరకూ సీట్లు ఉంటే, 3,800 మందే చేరారు. కంప్యూటర్ కోర్సుల వల్లే: ఈ ఏడాది ఎక్కువమంది విద్యార్థులు కంప్యూటర్, ఐటీ, వాటి అనుబంధ కోర్సుల్లో చేరేందుకే సుముఖత చూపారు. ఈ మేరకు ఆయా విభాగాల్లో 9 వేలకుపైగా సీట్లు కూడా పెరిగాయి. 93% సీట్లు భర్తీ కూడా అయ్యాయి. ఇక మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ తదితర బ్రాంచీల్లో సీట్లు తగ్గాయి. సివిల్, మెకా నికల్ బ్రాంచీల్లో 10,286 సీట్లకుగాను 6,958, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో 18,825 సీట్లు ఉండగా 4,560 మిగిలాయి. 153 సెక్షన్లలో అయితే 10మందిలోపు మాత్రమే చేరారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక కౌన్సెలింగ్ చేపట్టే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు పదికి తక్కువగా చేరిన సెక్షన్లను రద్దు చేసి, ఆ విద్యార్థులను వేరే కాలేజీకి పంపే అంశాన్ని పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు. వారం రోజుల్లో దీనిపై స్పష్టత రావొచ్చని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
ఇంజనీరింగ్ ఫీజులు తగ్గుతాయ్!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ ఫీజుల వ్యవహారంపై త్వరలో స్పష్టత వచ్చే వీలుంది. ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) శనివారం భేటీ కానుంది. టీఏఎఫ్ఆర్సీ చైర్మన్ స్వరూప్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి కరుణ వాకాటి సహా కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇప్పటివరకు పునఃసమీక్షించిన ఆడిట్ నివేదికల ఆధారంగా 2023 నుంచి అమలు చేసే ఫీజులను నిర్ధారించనున్నారు. కమిటీ నిర్ణయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తారు. అనంతరం ప్రభుత్వం ఫీజులపై జీవో విడుదల చేయాల్సి ఉంటుంది. 2019లో పెంచిన ఫీజులు 2022 వరకూ అమలులో ఉన్నాయి. మూడేళ్ల తర్వాత మరోసారి ఇంజనీరింగ్ ఫీజుల పెంపు అంశంపై కొన్ని నెలలుగా జరుగుతున్న కసరత్తు జూలైలో పూర్తయింది. కాలేజీల నిర్వహణ ఖర్చు ఆధారంగా కొత్త ఫీజులను ఖరారు చేసినా రెండేళ్లుగా కోవిడ్ వల్ల విద్యాసంస్థలు మూతపడ్డ నేపథ్యంలో పాత ఫీజులనే అమలు చేయాలని ఎఫ్ఆర్సీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో 80 కాలేజీలు ఫీజుల పెంపును నిలిపివేయడంపై హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో గత మూడు రోజలుగా కాలేజీల ఆడిట్ నివేదికలను ఎఫ్ఆర్సీ పరీశీలించింది. పొరపాట్లు గుర్తించినందునే.. చాలా కాలేజీల్లో ఫీజులు తగ్గుతాయని ఆడిట్ నివేదికల పరిశీలన అనంతరం టీఏఎఫ్ఆర్సీ చైర్మన్ స్వరూప్‌రెడ్డి తెలిపారు. నివేదికల సమీక్షను సొంతంగా చేపట్టామని... న్యాయస్థానం లేదా ప్రభుత్వం తమను ఆదేశించలేదని ఆయన చెప్పారు. ఆయన శుక్రవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ తొలిసారి ఆడిట్లో కొన్ని పొరపాట్లు దొర్లినట్లు గుర్తించడం వల్లే మరోసారి నివేదికలను పరిశీలించాల్సి వచ్చిందన్నారు. లోతుగా పరిశీలించిన తర్వాత వాస్తవ ఫీజులను నిర్ధారిస్తున్నామన్నారు. ఈ లెక్కన జూలైలో నిర్ణయించిన వాటికన్నా చాలా కాలేజీల్లో ఇప్పుడు ఫీజులు తగ్గుతాయని చెప్పారు. ఇప్పుడున్న కనీస ఫీజు రూ. 35 నుంచి 45 వేలకు పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. పెద్ద కాలేజీల ఫీజులు కూడా భారీగానే తగ్గుతా యని చెప్పారు. తుది ఫీజులను నిర్ణయించే అధికారం ఎఫ్ఆర్సీకి ఉందని, కాలేజీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించినా అవసరమైన వివరణ ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నామని ఓ ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. సీబీఐటీ ఫీజు రూ.1.12 లక్షలు! గరిష్ట వార్షిక ఫీజు నిర్ధారణ అయిన సీబీఐటీ కాలేజీ ఫీజును ఆడిట్ నివేదికల పరిశీలన తర్వాత రూ. 1.12 లక్షలుగా టీఎఫ్ఆర్సీ నిర్ధారించినట్టు తెలిసింది. వాస్తవానికి ఈ కాలేజీ ఫీజును జూలైలో రూ. 1.73 లక్షలుగా నిర్ణయించారు. తాజా పరిశీలనలో కాలేజీ ఖాతాల్లో రూ. 14 కోట్ల నిల్వ ఉన్నట్టు గుర్తించారు. వాటికి సంబంధించి సమగ్ర వివరాలు అందించలేదని ఎఫ్ఆర్సీ భావించింది. ఆడిట్ నివేదికలు పూర్తయిన తర్వాత యాజమాన్యం నిల్వకు సంబంధించిన వివరాలు ఎఫ్ఆర్సీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేసినా, దానిని పరిగణనలోకి తీసుకోలేదని తెలిసింది. మరో ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీ అయిన ఎంజీఐటీ... ‘నాలా’చట్టం కింద మున్సిపల్ ట్యాక్స్ రూ. 3 కోట్ల వరకూ చెల్లిస్తున్నట్లు పేర్కొంది. దీన్ని ఖర్చు కింద పరిగణించడంతో ఈ కాలేజీ ఫీజును రూ. 1.60 లక్షలుగా నిర్ణయించినట్లు సమాచారం. ఆడిట్ నివేదికకు ముందు దాదాపు 25 కాలేజీల్లో రూ. లక్షకుపైగా వార్షిక ఫీజు ఉంటే... పరిశీలన తర్వాత కేవలం 12 కాలేజీల్లో రూ. లక్షకుపైగా వార్షిక ఫీజు ఉండే వీలుందని తెలియవచ్చింది. నాలుగైదు కాలేజీలు మినహా దాదాపు అన్ని కాలేజీల్లోనూ ఫీజులు తగ్గే వీలుందని తెలుస్తోంది. -
మా లెక్కే కరెక్ట్.. ఇక మీ ఇష్టం
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల ఆడిట్ రిపోర్టుల పరిశీలన కార్యక్రమం మంగళవారం కూడా కొన సాగింది. ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఎస్ఎఫ్ ఆర్సీ) కార్యాలయంలో దాదాపు 29 కాలేజీల ప్రతినిధులు హాజరయ్యారు. ఒక్కోకాలేజీ ప్రతినిధితో అధికారులు విడి విడిగా చర్చలు జరిపారు. జమాఖర్చుల వివరాలపై మరింత లోతుగా ప్రశ్నలు వేశారు. ఎఫ్ఆర్సీ వర్గాలు మాత్రం కాలేజీలు సమర్పించిన నివేదికల్లోని ప్రతీ అంశాన్ని నిశితంగా పరిశీలించాయి. యాజమాన్య ప్రతిని ధులు మాత్రం తమ ఖర్చులన్నీ న్యాయబద్ధమైనవేనని కమిటీ ఎదుట స్పష్టం చేసినట్టు తెలిసింది. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో కొత్త ఫీజుల ఖరారుపై కొంతకాలంగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. కోవిడ్ నేపథ్యంలో 2019లో ఖరారు చేసిన ఫీజులే కొనసాగించాలని ఎఫ్ఆర్సీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీంతో 80కిపైగా కాలేజీల యజమా న్యాలు ఎఫ్ఆర్సీ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేశాయి. ఈ నేపథ్యంలో కాలేజీలు ప్రతిపాదించిన ఫీజులనే కొనసాగించేందుకు కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తుదిఫీజు ఖరారు బాధ్యతను ఎఫ్ఆర్సీకి అప్పగించడంతో ఆడిట్ రిపోర్టుల పునఃపరిశీలన చేపట్టారు. అప్పుడు ఎందుకు ఆమోదించారు? కొన్నినెలల క్రితం ఇవే ఆడిట్ రిపోర్టులను ఎఫ్ఆర్సీ ఆమో దించిందని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి. కోర్టు వ్యాజ్యాలు, రవాణా చార్జీలు వంటివి తీసేసి, మిగతా ఖర్చులన్నీ న్యాయమైనవేనని ఎఫ్ఆర్సీ సమ్మతించినట్టు చెబుతున్నాయి. ఇప్పుడు అవే రిపోర్టులపై పరిశీలన చేపట్టడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నాయి. ఈసారి భిన్నమైన రీతిలో ప్రశ్నలు వేస్తున్నారని అంటున్నాయి. కాలేజీ ప్రాంగణంలో చేసిన రిపేర్లు, లేబొరేటరీల్లో అదనంగా ఏర్పాటు చేసిన వసతులపై కొన్ని కాలేజీలను గుచ్చిగుచ్చి ప్రశ్నించినట్టు తెలిసింది. మూడేళ్లలోనే రిపేర్లు ఎందుకు వచ్చాయి? ఈ వ్యయాన్ని ఆడిట్ రిపోర్టులో ఎందుకు చూపించారు? అని ఎఫ్ఆర్సీ నిలదీసినట్టు సమాచా రం. కాలేజీ ప్రాంగణంలో శుభ్రత కోసం చేపట్టిన ఖర్చును కూడా ప్రశ్నించినట్టు సమాచారం. ఆన్లైన్ విద్యాబోధనకు ఉపయోగించిన విధానాలు, అయిన ఖర్చులపై మరింత నిశితంగా పరిశీలించేందుకు ఎఫ్ఆర్సీ ఆసక్తి చూపినట్టు తెలిసింది. ఫీజు ఎంతో మేమే నిర్ణయిస్తాం.. ఆడిట్ రిపోర్టులు పరిశీలించిన తర్వాత కాలేజీ నిర్వాహకులతో అధికారులు ఏ విషయమూ చర్చించడం లేదు. గతంలో ఎంత ఫీజు ఇవ్వాలనుకునేది తమతో చర్చించి అంగీకారం కూడా తీసుకున్నాయని చెబుతు న్నాయి. మరోవైపు ఫీజు పెంచాలా? వద్దా? ఎంత పెంచాలి? అనే విషయాలను తర్వాత తెలియజేస్తామని అధికారులు అంటున్నారు. ఫీజు నిర్ణయంపై తమకు పూర్తి స్వేచ్ఛ ఉందని ఎఫ్ఆర్సీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీన్నిబట్టి ఎక్కడో ఒకచోట అవసరమైన మేర నిర్వహణ వ్యయంలో కోత పెట్టే అవకాశం కన్పిస్తోంది. మొత్తం మీద వీలైనంత మేర ఫీజులు తగ్గించాలనే యోచనలో ఉన్నట్టు ఎఫ్ఆర్సీ వర్గాలు తెలిపాయి. -
ఆరోపణలొస్తే ఎప్పుడైనా తనిఖీలు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో తనిఖీలు నిరంతర ప్రక్రియ అని హైదరాబాద్ జవహర్‌లాల్‌నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం స్పష్టం చేసింది. ఏదైనా కాలేజీపై నిర్ధిష్ట ఆరోపణలువస్తే ఎప్పుడైనా తనిఖీలు చేస్తామని పేర్కొంది. విద్యా సంవత్సరం ప్రారంభంలో కొత్త కోర్సులు ప్రవేశపెడితే, వాటికి సంబంధించిన ల్యాబ్‌లు, కోర్సులకు సరిపడా బోధన సిబ్బంది ఉన్నారా.. లేదా? అనేది పరిశీలించాకే అనుబంధ గుర్తింపు ఇస్తామని వెల్లడించింది. ఇంజనీరింగ్ కాలేజీల తనిఖీలపై ‘145 కాలేజీ లు.. మూడు రోజుల్లోనే తనిఖీలపై అనుమానా లు’శీర్షికతో మంగళవారం ‘సాక్షి’ప్రచురించిన కథనం లో వాస్తవం లేదని వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ స్పష్టంచేశారు. కాలేజీల్లో సిబ్బందికి వేతనాలు ఇస్తున్నారా? లేదా? అన్నది పరిశీలించామని తెలిపారు. కొన్నేళ్లుగా నడుస్తున్న పాత కాలేజీల్లో సివిల్, మెకానికల్ కోర్సులకు సంబంధించి ల్యాబొరేటరీలు, అధ్యాపకుల వ్యవస్థ ఉంటుందని, అలాంటప్పుడు వాటిని పరిశీలించాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. పెరిగిన కంప్యూటర్ కోర్సులకు ల్యాబ్స్, బోధించే సిబ్బంది సక్రమంగా ఉన్నారా? లేదా? అనే అంశంపైనే తాము దృష్టిపెట్టినట్టు వివరించారు. నిజనిర్ధారణ కమిటీలు సమర్పించిన డేటాతో సంతృప్తిచెంది, కాలేజీల్లో ఉన్న లోపాలను యాజమాన్యాలకు వివరించకుండా, వారికి సరిదిద్దుకునే అవకాశం ఇవ్వకుండా నిర్ణయాలు తీసుకున్నామని స్పష్టం చేశారు. దీంతో కాలేజీ యాజమాన్యాల నుంచి వ్యతిరేకత ఎదురవుతోందని, అనుబంధ గుర్తింపు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలనే ఉద్దేశంతో గతేడాది నుంచి నిజనిర్ధారణ కమిటీలు ఎత్తిచూపిన లోపాలను కాలేజీ మేనేజ్మెంట్లకు చూపి, వాటిని సరిచేసుకునేలా కాలేజీల ప్రిన్సిపాల్స్‌తో సమావేశాలు నిర్వహించినట్టు తెలిపారు. -
రాయితీ తాయిలాలు తల్లిదండ్రులతో బేరాలు!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు మేనేజ్మెంట్ కోటా సీట్ల బేరం జోరుగా సాగిస్తున్నాయి. తక్కువ ర్యాంకు ఉన్న వాళ్ళను గుర్తించి వారి నుంచి రూ.లక్షల్లో వసూలు చేస్తున్నాయి. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ కోర్సు పేరుతో అడ్డూ అదుపు లేకుండా పిండేస్తున్నాయి. కేవలం మేనేజ్మెంట్ కోటా సీట్ల అమ్మకం కోసం దాదాపు అన్ని కాలేజీలు ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేసుకున్నాయి. ఎంక్వైరీ కోసం వచ్చే వారికి, తల్లిదండ్రులకు ఫోన్లు చేసి.. సీట్లు అయిపోతున్నాయని చెబుతూ వల వేస్తున్నాయి. ముందే బుక్ చేసుకుంటే రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు రాయితీ ఇస్తామంటూ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. రాష్ట్రంలో 35 వేల మేనేజ్మెంట్ సీట్లు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో మేనేజ్మెంట్ సీట్లు 35 వేల వరకు ఉన్నాయి. ఈ ఏడాది వందకు పైగా కాలేజీలు మెకానికల్, సివిల్ విభాగాల్లో సీట్లు తగ్గించుకుని, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ కోర్సుల సీట్లు పెంచుకున్నాయి. ఆ సీట్లకున్న డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. తమ పిల్లలతో ఎలాగైనా కంప్యూటర్ సైన్స్ సంబంధిత కోర్సు చేయించాలని ఆశిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు, టాప్ కాలేజీల యాజమాన్యాల వద్ద సీట్ల కోసం క్యూ కడుతున్నారు. తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తూ.. ఎంసెట్ ఫలితాలు వెల్లడైన మరుక్షణం నుంచే కొన్ని కాలేజీలు ప్రత్యేకంగా ప్రజా సంబంధాల అధికారులను (పీఆర్వోలు), ఏజెంట్లను, కన్సల్టెన్సీలను ఏర్పాటు చేసుకున్నాయి. వాళ్ళు 40 వేల ర్యాంకు పైన వచ్చిన విద్యార్థుల ఫోన్ నంబర్లు సంపాదించి, సీటు కోసం ఎర వేస్తున్నారు. నగర శివార్లలోని ఓ కాలేజీ ఏకంగా ఆరుగురు పీఆర్వోలను ఇందుకోసం తాత్కాలికంగా నియమించుకుంది. ప్రతి సీటుకు రూ.75 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు కన్సల్టెన్సీలకు ఇచ్చేందుకు బేరం కుదుర్చుకుంది. దీంతో ఏజెంట్లు.. విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి, సీట్లు అయిపోతున్నాయంటూ, ఇప్పుడే బుక్ చేసుకోవాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. సీటు మాట్లాడేందుకు రమ్మని కాలేజీ యాజమాన్యం వద్దకు తీసుకెళ్ళి, రాయితీ ఇస్తున్నట్టుగా చూపించి అక్కడే అడ్వాన్సుగా రూ.25 వేలు కట్టిస్తున్నారు. రూ.లక్షల్లో బేరం వాస్తవానికి మేనేజ్మెంట్ కోటాలో 15% ఎన్ఆర్ఐ కోటా, 15% స్థానిక మేనేజ్మెంట్ కోటా కింద సీట్లు భర్తీ చేయాలి. దీనికి ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇవ్వాలి. దీనికి ఎలాంటి ఫీజు రీయింబర్స్మెంట్ ఉండదు కాబట్టి, ఎఫ్ఆర్సీ నిర్ధారించిన ఫీజు మాత్రమే వసూలు చేయాలి. ముందుగా జేఈఈ ర్యాంకు ఉన్నవారికి ఇవ్వాలి. ఇంకా మిగిలితే ఎంసెట్ ర్యాంకర్లకు, ఆ తర్వాత ఇంటర్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఇవ్వాలి. యాజమాన్యాలు మాత్రం ఇవేవీ పాటించడం లేదు. ముందే సీట్లు అమ్మేస్తున్నాయి. ప్రముఖ కాలేజీల్లో సీఎస్ఈ సీటు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు పలుకుతోంది. ఓ మోస్తరు కాలేజీల్లోనూ రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన వార్షిక ఫీజుకు ఈ డొనేషన్ అదనం అన్నమాట. ఈ మొత్తం నాలుగేళ్లకు రూ.14 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు అవుతుంది. ఇది ఒకేసారి కడితే రాయితీ ఇస్తామంటున్నారు. ఇక ఎన్ఆర్ఐ కోటా కింద అవసరమైన అన్ని పత్రాలు కాలేజీలే సమకూర్చే ఏర్పాట్లు చేస్తున్నాయి. నిబంధనల ప్రకారం ఏటా 5 వేల యూఎస్ డాలర్లు తీసుకోవాలి. అంటే రూ.4 లక్షలు... నాలుగేళ్ళకు రూ.16 లక్షలు ఉంటుంది. ఇది కాకుండా ఇంకో రూ.5 లక్షలు అదనంగా బాదుతున్నారు. విద్యార్థులే దరఖాస్తు చేశారంటూ.. ఇలాముందే మాట్లాడుకున్న విద్యార్థుల పేర్లను ఉన్నత విద్యామండలికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. మెరిట్ ప్రకారమే ఇచ్చామని, వాళ్ళే తమకు సీటుకోసం దరఖాస్తు చేశారని చెబుతున్నారు. ఆన్లైన్ విధానం లేకపోవడంతో ఎవరు దరఖాస్తు చేశారు? మెరిట్ పాటించారా? అనేది తెలియకుండా పోతోంది. దీంతో మేనేజ్మెంట్లు ఇష్టానుసారంగా దండుకుంటున్నాయి. మెరిట్ ఉన్నా మేనేజ్మెంట్ కోటా సీటు ఇవ్వలేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల కమిటీ చైర్మన్ స్వరూప్‌రెడ్డి గతంలో పేర్కొన్నారు. కాలేజీ యాజమాన్యాలు నేరుగా తమకు దరఖాస్తు చేసినా వాటిని కాలేజీలకు పంపుతామని చెప్పింది. గత ఏడాది ఇలాంటి ఫిర్యాదులు 50 వరకు వచ్చాయి. వాళ్ళు మళ్ళీ ఏం జరిగిందనేది చెప్పలేదని ఎఫ్ఆర్సీ వర్గాలు పేర్కొంటున్నాయి. కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేయాలి కన్వీనర్ కోటా మాదిరిగానే మేనేజ్మెంట్ కోటా సీట్లను కూడా వెబ్ కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేయాలి. ఈ మేరకు మేం అనేకసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ విధంగా యాజమాన్యాలు అడ్డగోలుగా దోచుకునేందుకు అధికారులే అవకాశం కల్పిస్తున్నారు. దీనివల్ల ప్రతిభ ఉన్న వారికి సీట్లు రావడం లేదు. – ప్రవీణ్‌రెడ్డి, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి నియంత్రించాల్సిందే మేనేజ్మెంట్ కోటా పేరిట దోపిడీ పేదవాడికి శాపంగా మారింది. అసలు కాలేజీల్లో తనిఖీలు చేయకుండా, కాలేజీల్లో మౌలిక వసతులు ఉన్నాయా? లేదా? చూడకుండా, బి కేటగిరీ సీట్లు అమ్ముకునే అధికారం ఎవరిచ్చారు? బహిరంగంగా సాగుతున్న ఈ అక్రమాలను నియంత్రించాల్సిన అవసరం ఉంది. – అయినేని సంతోష్‌కుమార్, ప్రైవేటు సాంకేతిక కాలేజీల సిబ్బంది సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
కనీస ఫీజు రూ.45 వేలు!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుల పెంపు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. కాలేజీల యాజమాన్యాలతో అధికారుల చర్చలు మరో రెండురోజుల్లో ముగియనున్నాయి. తర్వాత ఈ నెలాఖరున జరిపే భేటీలో ఫీజుల పెంపుపై తుది నిర్ణయానికి వస్తామని రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఎస్ ఎఫ్ఆర్సీ) వర్గాలు తెలిపాయి. ఈ మేరకు తమ నివేదికను ప్రభుత్వం ఆమోదించి, ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని ఎఫ్ఆర్సీ అధికారులు చెప్పారు. ఇంజనీరింగ్ ప్రవేశాల నాటికి ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడే వీలుందని తెలిపారు. కనీస ఫీజు రూ.45 వేలకు పెంచే అవకాశం ఉందని, గరిష్టంగా 30 శాతం వరకు ఫీజులు పెరగవచ్చని తెలుస్తోంది. కాలేజీల వారీగా పెంపు! ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులను చివరిసారిగా 2019లో ఖరారు చేశారు. ఇవి 2021–22 విద్యా సంవత్సరం వరకు అమల్లో ఉన్నాయి. కాగా 2022–23కు కొత్త ఫీజుల ఖరారుపై ఎఫ్ఆర్సీ గత రెండు నెలలుగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే కాలేజీల యాజమాన్యాలతో సంప్రదింపులు జరుపుతోంది. కాలేజీ వారీగా ఫీజుల పెంపుపై ముందుకెళ్ళే యోచనలో కమిటీ ఉంది. సంబంధిత యాజమాన్యాలు ఆదాయ, వ్యయాలపై సమర్పించిన ఆడిట్ నివేదికలను పరిగనలోనికి తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. సీబీఐటీ వంటి అగ్రశ్రేణి కాలేజీలు వార్షిక ట్యూషన్ ఫీజును రూ. 2.15 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశాయి. కానీ ఎఫ్ఆర్సీతో చర్చల అనంతరం రూ.1.71 లక్షలకు అంగీకరించినట్టు తెలిసింది. ఎంజీఐటీ కూడా రూ.1.90 లక్షలకు పెంచాలని కోరినప్పటికీ, ఎఫ్ఆర్సీ రూ.1.60 లక్షలకు ఒప్పుకున్నట్టు తెలిసింది. ఇవి కూడా ప్రభుత్వం అనుమతిస్తేనని కమిటీ స్పష్టం చేసినట్టు తెలిసింది. మిగతా కాలేజీల్లో కనీస ఫీజును రూ.35 వేల నుంచి రూ.45 వేలకు పెంచే అవకాశం ఉందని ఎఫ్ఆర్సీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద ఫీజులు గరిష్టంగా 30 శాతం వరకూ పెరిగే వీలుందని సమాచారం. గరిష్ట ఫీజు రూ.1.71 లక్షలు! రాష్ట్రంలో 158 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. వీటిల్లో ప్రస్తుతం 20 కాలేజీల్లో మాత్రమే ట్యూషన్ ఫీజు రూ.35 వేలుగా ఉంది. పెంపునకు ప్రభుత్వం అంగీకరిస్తే ఇప్పుడది రూ.45 వేలకు పెరిగే వీలుంది. ఇక 110 కాలేజీల్లో రూ.80 వేల వరకు ఉండగా రూ.లక్ష దాటే అవకాశం కన్పిస్తోంది. మిగతా కాలేజీల్లో రూ.1.40 లక్షల నుంచి రూ.1.71 లక్షల వరకు పెరిగే వీలుందని ఎఫ్ఆర్సీ వర్గాలు అంటున్నాయి. సంబంధం లేని ఖర్చులూ ప్రతిపాదనల్లో.. పలు కాలేజీలు నిబంధనల్లో లేని లెక్కలను ఆడిట్ రిపోర్టులో చూపినట్టు ఎఫ్ఆర్సీ వర్గాలు చెబుతున్నాయి. కాలేజీల తప్పిదాల వల్ల విద్యార్థులు కోర్టుకెళితే, దానికయ్యే లీగల్ ఖర్చులను కూడా ఫీజు పెంపు ప్రతిపాదనల్లో పెట్టినట్టు తెలిసింది. వీటిని కమిటీ అనుమతించలేదు. కొన్ని కాలేజీలు యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు రాకపోతే దానిపై కోర్టుకెళ్ళాయి. ఈ ఖర్చులనూ తమ ఆడిట్ రిపోర్టుల్లో పేర్కొన్నాయి. వీటిని కూడా ఎఫ్ఆర్సీ తిరస్కరించింది. రీయింబర్స్మెంట్ భారమెంత? రాష్ట్రంలో మూడు కాలేజీలు ఇప్పుడున్న కనీస ట్యూషన్ ఫీజును (రూ.35 వేలు) పెంచవద్దని ఎఫ్ఆర్సీని కోరాయి. ఫీజుల పెంపు నేపథ్యంలో ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చించాల్సి ఉంది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలవుతోంది. ఎంసెట్‌లో 10 వేల లోపు ర్యాంకు వచ్చిన బీసీలకూ పూర్తి రీయింబర్స్మెంట్ ఇస్తున్నారు. ఆ తర్వాత ర్యాంకు వచ్చిన వారికి కళాశాల ఫీజు ఎంతున్నా గరిష్టంగా రూ.35 వేలు మాత్రమే రీయింబర్స్మెంట్ వర్తిస్తుంది. కన్వీనర్ కోటా కింద ఏటా 48 వేల నుంచి 50 వేల మంది వరకు విద్యార్థులు చేరుతున్నారు. వారిలో సుమారు 70 శాతం వరకు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులవుతు న్నారు. ఈ నేపథ్యంలో ఫీజుల పెంపు అనివార్యమైతే ఏ మేరకు భారం పడుతుందనేది ఆర్థిక శాఖ పరిశీలించాల్సి ఉంది. -
ఇంజనీరింగ్ ఫీజు 25% పెంచాల్సిందే
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ఫీజులు కనీసం 25 శాతం పెంచాల్సిందేనని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు పట్టుబడుతున్నాయి. ఇందుకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఎస్‌ఎఫ్‌ఆర్‌సీ) ముందు తమ వాదనను విన్పిస్తున్నాయి. కొన్ని రోజులుగా కాలేజీలతో కమిటీ విడివిడిగా చర్చలు జరుపుతోంది. ఇందులో టాప్‌టెన్ కాలేజీ యాజమాన్యాలు ఫీజుల పెంపుపై భారీగా డిమాండ్ చేస్తున్నాయి. ప్రతీ మూడేళ్లకోసారి ఇంజనీరింగ్ ఫీజులను కమిటీ అధ్యయనం చేస్తోంది. మౌలిక వసతులు, లేబొరేటరీలు, ఫ్యాకల్టీకి అయ్యే ఖర్చును పరిగణనలోనికి తీసుకుని ఫీజులను నిర్ధారిస్తుంది. 2019లో పెంచిన ఫీజులు 2022 వరకూ అమలులో ఉన్నాయి. డిసెంబర్ నుంచి మొదలయ్యే 2022–23 విద్యా సంవత్సరంలో ఫీజుల పెంపుపై కమిటీ కొన్ని నెలలుగా కసరత్తు చేస్తోంది. ఏఐసీటీఈ ప్రకారం వెళ్లాలి అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ప్రతిపాదించిన ట్యూషన్ ఫీజులనే అమలు చేయాలని పలు ప్రైవేటు కాలేజీలు కోరుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 158 ప్రైవేటు కాలేజీలున్నాయి. వీటిలో 20 కాలేజీల్లో ట్యూషన్ ఫీజు రూ.35 వేలు, 110 కాలేజీల్లో రూ.80 వేల వరకూ, మిగతా కాలేజీల్లో రూ.1.40 లక్షల వరకూ ఉంది. ఏఐసీటీఈ ఈ ఏడాది ఫీజులను కనీసం రూ.79,600 నుంచి గరిష్టంగా 1,89,800 వరకు పెంచుకునేందుకు ప్రతిపాదనలు చేసింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించింది. అయితే, దీనిపై స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ఎఫ్ఆర్సీలు నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉంది. అంత పెంచితే ఎలా? కాలేజీల వాదనపై కమిటీ కొంత ఇబ్బంది పడుతోంది. ప్రతీ ఏటా 10–15 శాతం ఫీజులు పెంచుతున్నారు. ఇప్పుడు ఏకంగా 25 శాతం అంటే ప్రభుత్వం అంగీకరించే అవకాశం లేదని ఎఫ్ఆర్సీ వర్గాలు అంటున్నాయి. ఇదే విషయాన్ని కాలేజీల యాజమాన్యాలకు నచ్చజెప్పే యత్నం చేస్తున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలవుతోంది. ఎంసెట్‌లో 10 వేల లోపు ర్యాంకు వచ్చిన వారికీ రీయింబర్స్మెంట్ ఇవ్వాల్సిందే. ఆ తర్వాత ర్యాంకుంటే.. బీసీలు, ఓసీలు ఎవరికైనా కళాశాల ఫీజు ఎంతున్నా గరిష్టంగా 35 వేలు మాత్రమే రీయింబర్స్మెంట్ వర్తిస్తుంది. కాలేజీలు కోరినట్టు ఫీజులు పెంచితే ఏటా రూ. 21 కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుంది. ఇదే క్రమంలో రూ.35 వేలు మాత్రమే రీయింబర్స్మెంట్ వచ్చే విద్యార్థులపైనా అదనపు భారం పడుతుంది. ఈ కారణంగానే కమిటీ తర్జన భర్జనపడుతోంది. ఫ్యాకల్టీని పట్టించుకోరా? ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫ్యాకల్టీ ఎలా ఉందనే విషయాన్ని ముందు ఎఫ్ఆర్సీ పరిశీలించాలి. యాజమాన్యాలు ఇచ్చే ఆడిట్ నివేదికలను యథాతథంగా ఆమోదిస్తే పేదలపై భారం పడుతుంది. చాలా కాలేజీల్లో సరైన ఫ్యాకల్టీ లేదు. అధ్యాపకులకు వేతనాలు ఇవ్వడం లేదు. బ్యాంకు ఖాతాలను, ఫ్యాకల్టీ సమర్థతను పరిశీలించాల్సిన అవసరం కమిటీపై ఉంది. – సంతోష్ కుమార్, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు పెంపు అన్యాయం ఫీజుల పెంపు నిర్ణయాన్ని కమిటీ ఉపసంహరించుకోవాలి. కాలేజీల గొంతెమ్మ కోర్కెలు తీరిస్తే పేదలు ఉన్నత విద్యకు దూరమవుతారు. ఇప్పటికే నాణ్యతలేని కాలేజీల్లో భారీగా ఫీజులున్నాయి. అడ్డగోలుగా పెంచితే విద్యార్థుల నుంచి తిరుగుబాటు తప్పదు. –నాగరాజు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి -
కౌన్సెలింగ్‌కు ముందే కాలేజీల్లో తనిఖీలు
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్‌కు ముందే ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో తనిఖీలు చేపట్టాలని హైదరాబాద్ జేఎన్టీయూ యోచిస్తోంది. తనిఖీల కోసం ఈ ఏడాది కూడా అనుభవజ్ఞులతో కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు అవసరం. గుర్తింపు ఇవ్వాలంటే విశ్వవిద్యాలయం అధికారులు కాలేజీల్లోని వసతులను పరిశీలించాల్సి ఉంటుంది. గత రెండేళ్లుగా కరోనా నేపథ్యంలో ఈ ప్రక్రియ సజావుగా సాగలేదు., మౌలిక వసతులు లేని కాలేజీలను గుర్తించినా, ఆఖరి నిమిషంలో అనుబంధ గుర్తింపు ఇవ్వాల్సి వచ్చిందని అధికారులు అంటున్నారు. ఈసారి మాత్రం ఈ అవకాశం ఇవ్వబోమని జేఎన్టీయూహెచ్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కంప్యూటర్ సైన్స్‌పై గురి గత కొన్నాళ్లుగా కంప్యూటర్ సైన్స్ కోర్సులకు ప్రాధాన్యత పెరుగుతోంది. గతేడాది కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కొత్త కోర్సుల్లో దాదాపు 5 వేల సీట్లు పెరిగాయి. మెకానికల్, సివిల్‌లో సీట్లు తగ్గించుకుని కొత్త కోర్సులకు అనుమతులు పొందాయి. అయితే, చాలా కాలేజీల్లో కంప్యూటర్ కోర్సుల బోధన ఆశించినస్థాయిలో లేదని జేఎన్టీయూహెచ్ గుర్తించింది అత్యున్నత ప్రమాణాలున్న ఫ్యాకల్టీ లేదని, లోతుగా అధ్యయనం జరగడంలేదనే నిర్ణయానికి వచ్చింది. అధ్యాపకుల అటెండెన్స్ కోసం తీసుకొచ్చిన బయోమెట్రిక్ కూడా సరిగా అమలవ్వడంలేదనే ఆరోపణలున్నాయి. అధికారిక లెక్కల్లో ఫ్యాకల్టీ ఒకరు ఉంటే, వాస్తవంగా బోధించేది వేరొకరనే విమర్శలు వస్తున్నాయి. దీన్ని అరికట్టేందుకు అధ్యాపకుల పాన్ నంబర్ ఆధారంగానూ వాస్తవాలు తెలుసుకుంటామని జేఎన్టీయూహెచ్ తెలిపింది. కానీ ఇది ఆచరణ సాధ్యం కాలేదు. ఇలాంటి సమస్యలన్నీ ఈసారి పరిష్కరించే దిశగా కృషి చేయాలని భావిస్తున్నట్టు అధికారులు తెలిపారు. మౌలిక వసతులు, కంప్యూటర్ కోర్సుల్లో సరైన ఫ్యాకల్టీ లేని కాలేజీలకు ముందుగా నోటీసులు ఇవ్వాలనుకుంటున్నట్టు తెలిపారు. కౌన్సెలింగ్‌కు ముందే.. జేఈఈ మెయిన్స్, ఇంటర్ పరీక్షల తేదీల్లో మార్పు కారణంగా ఈసారి ఎంసెట్ పరీక్ష కూడా ఆలస్యమయ్యే అవకాశం కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ సెప్టెంబర్ వరకూ కొనసాగే వీలుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కాలేజీల తనిఖీలు కౌన్సెలింగ్‌కు ముందే చేపట్టి, వాస్తవ నివేదికను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. అనుబంధ గుర్తింపు లభించిన కాలేజీలనే కౌన్సెలింగ్‌కు అనుమతించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు మండలి ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
ఫీజు బాదుడుకు ‘ఆన్లైన్’ సాకు
సాక్షి, హైదరాబాద్: ఫీజుల పెంపుకోసం ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ఇప్పుడు సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నాయి. కరోనా సమయంలో ఆన్లైన్ బోధనకు సమకూర్చిన మౌలిక సదుపాయాల వ్యయాన్ని ముందుకు తెచ్చే యోచనలో ఉన్నాయి. దీనికోసం వేగంగా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాయి. అఖిల భారత సాంకేతిక విద్య మండలి మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ మండలి (టీఏఎఫ్ఆర్సీ) మూడేళ్లకోసారి రాష్ట్రంలోని వృత్తి విద్యా కోర్సుల ఫీజుల పెంపును పరిశీలిస్తుంది. 2019–20లో ఇంజనీరింగ్, ఫార్మసీ ఫీజులు పెంచారు. ఈ పెంపు ఈ ఏడాది (2021–22) వరకూ అమల్లో ఉంటుంది. తిరిగి వచ్చే మూడేళ్లకు ఫీజులు పెంచాల్సి ఉంది. దీనిపై ఇటీవల ఉన్నత విద్యా మండలి, టీఏఎఫ్ఆర్సీ సమాలోచనలు జరిపింది. ఎప్పటిలాగే ఫీజుల పెంపునకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అది చెప్పలేక...: నిబంధనల ప్రకారం ప్రైవేటు కాలేజీల గొంతెమ్మ కోర్కెలను నియంత్రణ మండలి అంగీకరించకూడదు. కాలేజీలో ఫీజుల ద్వారా ఇప్పుడొచ్చే ఆదాయం ఎంత? ఈ మూడేళ్లలో రాబడికి మించి ఏం ఖర్చు చేశారు? మౌలిక వసతులు పెంచారా? విద్యార్థుల నైపుణ్యం పెంచే విధంగా తీసుకున్న చర్యలేంటి? ఎంతమందికి ఉపాధి లభించింది? లాంటి సవాలక్ష ప్రశ్నలకు కాలేజీ యాజమాన్యాలు సమాధానం ఇవ్వాలి. దీనికోసం ప్రతీసారి కాలేజీలు ఆడిట్ రిపోర్టును ప్రముఖ ఆడిటర్ల సాయంతో పక్కాగా తయారు చేస్తాయి. వచ్చిన ప్రతీపైసా విద్యార్థుల కోసమే ఖర్చు పెట్టినట్టు అరచేతిలో వైకుంఠం చూపిస్తా యి. 2019లో ఇలా చేసే కొన్ని కాలేజీలు ఏడాది ఫీజును రూ.1.35 లక్షల వరకూ తీసుకెళ్లాయి. రూ.35 వేలకు పైబడ్డ ప్రతీ కాలేజీ వార్షిక ఫీజును 20% మేర పెరిగింది. కానీ ఈసారి ఆ అవకాశం కన్పించడం లేదు. 2020 నుంచి కోవిడ్ చుట్టుముట్టింది. విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. విద్యార్థులు ఆన్లైన్లోనే కాలం గడపాల్సి వస్తోంది. ఇలాంటప్పుడు మౌలిక వసతులు, విద్యార్థుల సంక్షేమం కోసం వెచ్చించామని చెప్పుకునే అవకాశమే లేదు. పైగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తరుణంలో ఫీజుల పెంపు వ్యతిరేకతకు దారి తీయొచ్చు. అధికారుల సలహాలు.. ‘లాక్డౌన్ ఉన్నా.. కాలేజీ తెరవకపోయినా మేం ఆన్లైన్’క్లాసులు పెట్టాం అని ప్రైవేటు కాలేజీలు సరికొత్త కథ విన్పించేందు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ దిశగా ముందుకెళ్తున్న ఆడిటర్లు ఇటీవల ఉన్నత విద్యామండలి అధికారులతో సం ప్రదింపులు జరిపారు. పెట్టేది ఏదైనా పక్కాగా ఉండేలా చూసుకోండని మండలి అధికారులే వారికి సలహా ఇవ్వడం గమనార్హం. కొంతమంది మండలి అధికారులైతే ఏకంగా రిపోర్టు తయారు చేసేప్పుడు తాము సహకరిస్తామని ప్రైవేటు కాలేజీలతో బేరాలు కుదర్చుకుంటున్నట్టు తెలిసింది. ఆన్లైన్ క్లాసుల నిర్వహణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కోసం భారీగా ఖర్చు పెట్టినట్టు ఆడిట్ రిపోర్టు తయారు చేసే ప్రయత్నంలో ఉన్నాయి. పెద్ద మొత్తం వెచ్చించి ‘హైక్లాస్’లెక్చరర్లతో క్లాసు లు చెప్పించామని, ఆధునిక టెక్నాలజీ వాడామని నమ్మబలికే ఎత్తుగడలు వేస్తున్నాయి. మొత్తం మీద ఆన్లైన్ ఆడిట్‌తో ఫీజులు పెంచుకోవాలని ప్రైవేటు కాలేజీలు కలలుగంటున్నాయి. ఈ నేపథ్యంలో వీటికి ఎఫ్ఆర్సీ ముద్ర వేస్తే భారీగానే ఫీజులు పెరిగే అవకాశముంది. -
ఇంజనీరింగ్ సీట్ల పంచాయితీ: ర్యాంకున్నా సీటివ్వరేం?
సాక్షి, హైదరాబాద్: అర్హతలున్నా ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ‘బీ’కేటగిరీలో సీట్లివ్వడానికి నిరాకరిస్తున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దర ఖాస్తులను తీసుకునేందుకూ ఇష్టపడటం లేదని, తిరస్కరణకు కారణాలూ చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ర్యాంకు తక్కువొచ్చిన వారికి సీటు ఖాయం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్ర వేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఎస్‌ఎఫ్‌ఆర్‌సీ)కి ఈ తరహా ఫిర్యాదులు గత వారం రో జులుగా 54 అందాయి. ఇందులో ఒకటికి మించి ఎక్కువ కాలేజీల్లో దరఖాస్తు చేసిన వారు కూడా ఉన్నారు. టీఎస్‌ఎఫ్‌ఆర్‌సీ ఒకే దరఖాస్తును పరిగ ణనలోకి తీసుకుంటే 28 ఫిర్యాదులు అందినట్లు గు ర్తించింది. ప్రైవేటు కాలేజీలు తిరస్కరించిన అభ్య ర్థులంతా నేరుగా టీఎస్ఎఫ్ఆర్సీకి తమ దరఖాస్తులను పంపారు. వాటిని ఆయా కాలేజీలకు టీఎస్‌ఎఫ్‌ఆర్‌సీ పంపింది. ర్యాంకు ప్రకారం సీటెందు కు ఇవ్వలేదని వివరణ కోరింది. టీఎస్‌ఎఫ్‌ఆర్‌సీ కార్యాలయాన్ని ఆశ్రయించిన వారిలో జేఈఈ మెయిన్స్ ర్యాంకు పొందిన వారూ ఉన్నారు. నిబంధనల ప్రకారం ‘బీ’కేటగిరీ ఇంజనీరింగ్ సీట్లను తొలుత జేఈఈ ర్యాంకులు పొందిన వారికి, ఆ త ర్వాత ఎంసెట్ ర్యాంకులు, ఇంకా మిగిలితే ఇంటర్ మార్కుల్లో మెరిట్ ఆధారంగా కేటాయించాలి. కానీ ప్రైవేటు కాలేజీలు ఇష్టానుసారం సీట్లను అమ్ముకుంటున్నాయనే ఆరోపణలున్నాయి. పారదర్శకత లేకనే...: తమకు అందిన దరఖాస్తుల్లో మెరిట్ ప్రకారం సీట్లిచ్చామని కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి. కానీ దరఖాస్తుల విషయంలో ఎలాంటి పారదర్శకత లేకపోవడంతో ర్యాంకు ఉన్న అభ్యర్థుల దరఖాస్తులు యాజమాన్యాలు లెక్కల్లో చూపించట్లేదు. లక్షల రూపాయల డొనేషన్ తీసుకున్న వారి జాబితానే ఉన్నత విద్యామండలికి పంపుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈసారి ఉపేక్షించేదే లేదు... ‘బి’కేటగిరీ సీట్ల విషయంలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలను కోరాం. మాకు అందిన ప్రతి దరఖాస్తును ఆయా కాలేజీలకు పంపాం. వారికి అర్హత ఉన్నప్పుడు సీటు ఇవ్వకపోతే ఉపేక్షించే ప్రశ్నే లేదు. యాజమాన్య కోటా సీట్ల భర్తీపై పూర్తి వివరాలను 15వ తేదీలోగా ఉన్నత విద్యామండలికి సమర్పించాలి. ఎవరికి అన్యాయం జరిగినా కఠిన చర్యలు తప్పవు. – పి. స్వరూప్‌రెడ్డి, టీఎస్‌ఎఫ్‌ఆర్‌సీ చైర్మన్ -
కొత్త కళాశాలలకు మరో రెండేళ్లపాటు నో
సాక్షి, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా ఇంజనీరింగ్ 40 శాతానికి పైగా సీట్లు భర్తీ కావడం లేదని, అందుకే వచ్చే రెండేళ్లు కొత్తగా ఇంజనీరింగ్ కాలేజీలకు ప్రైవేటు రంగంలో అనుమతి ఇచ్చేది లేదని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి స్పష్టం చేసింది. 2020–21 విద్యా సంవత్సరంతోపాటు 2021–22, 2022–23 విద్యా సంవత్సరం వరకు కొత్త కాలేజీల లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్వోఐ) కూడా ఇవ్వబోమని తెలిపింది. గతంలో ఎల్వోఐ ఇచ్చిన వారికి మాత్రం లెటర్ ఆఫ్ అప్రూవల్ (ఎల్వోఏ) ఇస్తామంది. మరోవైపు ప్రభుత్వ రంగంలో కొత్త కళాశాలల ఏర్పాటుకు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ప్రభుత్వంతోపాటు ప్రైవేటు రంగంలో నూ కొత్త కాలేజీల ఏర్పాటుకు ఎల్వోఐ ఇస్తామని, మిగతా వాటికి ఇవ్వబోమని తేల్చేసింది. 2020–21 విద్యా సంవత్సరం కోసం జారీ చేసిన సాంకేతిక విద్యా సంస్థల అప్రూవల్ హ్యాండ్‌బుక్‌లో మార్పులు చేర్పులపై ఇటీవల ఢిల్లీ, చెన్నైలో జరిగిన కన్సల్టేషన్ సమావేశాల్లో ఈ నిర్ణయాలు తీసుకుంది. కొత్త ఫార్మసీ కాలేజీలకు కూడా వచ్చే రెండేళ్లు అనుమతి ఇవ్వమని చెప్పిం ది. 2019–20 విద్యా ఏడాదిలో దేశంలోని విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్ సీట్లు 27 లక్షలు ఉంటే అందులో 14 సీట్లు మిగిలిపోయాయని, 13 లక్షల సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయని పేర్కొంది. రాష్ట్రంలోనూ 217 కాలేజీల్లో 1,12,090 సీట్లకు ఏఐసీటీఈ ఆమోదం తెలుపగా, రాష్ట్రంలోని వర్సిటీలు 187 కాలేజీల్లో 93,790 సీట్ల భర్తీకి అనుబంధ గుర్తింపు ఇచ్చాయి. అందులో 62,744 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే 55.97% సీట్లు భర్తీకాగా 44.03% సీట్లు ఖాళీగానే ఉండిపోయాయి. ఫార్మసీలోనూ ఇలాంటి పరిస్థి తే నెలకొంది. మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే స్థితి ఉండటంతో ఇంజనీరింగ్, ఫార్మసీలో వచ్చే రెండేళ్లపాటు కొత్తగా ప్రైవేటు కాలేజీలకు అనుమతించబోమని స్పష్టం చేసింది. డిమాండ్ ఉండే కోర్సులకు ఓకే... మార్కెట్లో డిమాండ్ ఉన్న కొత్త కోర్సులను మాత్రం ప్రస్తుతం ఉన్న కాలేజీల్లో ప్రారంభించేందుకు అనుమతి ఇస్తామని (అదనపు ఇంటేక్) వెల్లడించింది. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభించే, మార్కెట్లో డిమాండ్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా సైన్స్, మిషన్ లెర్నింగ్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, త్రీడీ ప్రింటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులను ప్రారంభించేందుకు అదనపు ఇంటేక్‌ను మంజూరు చేస్తామని చెప్పింది. -
రికార్డుల్లో మాత్రమే ప్రొఫెసర్లు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల పనితీరుపై సుప్రీం కోర్టు ధర్మాసనం ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(ఏఎఫ్ఆర్సీ) నిర్దేశించిన బోధన రుసుము కంటే వాసవీ, శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాలలు అధికంగా వసూలు చేస్తున్నాయంటూ తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్, తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారించింది. వాసవీ కళాశాల తరఫున సీనియర్ న్యాయవాది ఫాలీ నారీమన్ వాదనలు వినిపిస్తూ సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధంగా ఏఎఫ్ఆర్సీ ఫీజులు నిర్ధారించిందని, అందువల్ల కళాశాల హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింద ని నివేదించారు. ఏఎఫ్ఆర్సీ సదరు కళాశాల ఫీజును రూ.97 వేలుగా నిర్దేశిస్తే హైకోర్టు ఆ ఫీజును రూ.1.60 లక్షలకు పెంచిందని తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కె.రాధాకృష్ణన్ ధర్మాసనానికి నివేదించారు. దీంతో ఏఎఫ్ఆర్సీ నిర్ణయాన్ని కాదని హైకోర్టు ఎలా ఫీజులను పెంచుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టుకు ఆ అధికారం ఉందా అన్న అంశంపై లోతుగా విచారణ జరుపుతామని పేర్కొంది. జస్టిస్ అరుణ్ మిశ్రా ఈ సందర్భంగా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కొన్ని ప్రైవేటు కళాశాలల పనితీరు మాకు తెలుసు. 250కి పైగా కళాశాలలు తనిఖీ చేశా. నిర్వహణ ఎలా ఉంటుందో మాకు తెలుసు. రికార్డుల్లోనే ప్రొఫెసర్లు ఉంటారు. కళాశాలవారీగా ఎవరికి వారు ఫీజు నిర్దేశించుకుంటామంటే కుదరదు.. అని వ్యాఖ్యానించారు. ఏఎఫ్ఆర్సీ ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు నిర్దేశించిన ఫీజుల వివరాలు, వాటిపై హైకోర్టు పెంచిన ఫీజు వివరాలు, కళాశాలలు తమకు తామే నిర్దేశించిన ఫీజుల వివరాలను ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్ 9కి వాయిదా వేసింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది వెంకటరెడ్డి, పేరెంట్స్ అసోసియేషన్ తరఫున న్యాయవాది కె.శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. -
ఇక పాలి‘టెక్’లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు 198 ఉంటే ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు 14 మాత్రమే ఉన్నాయి. ప్రైవేటు కాలేజీల్లో లక్షకు పైగా సీట్లు ఉంటే ప్రభుత్వ కాలేజీల్లో 3 వేల సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగంలో ఇంజనీరింగ్ కాలేజీలు అవసరమని సాంకేతిక విద్యా శాఖ భావిస్తోంది. తగిన మౌలిక సదుపాయాలు, భవనాలు కలిగిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలను ఇంజనీరింగ్ కాలేజీలుగా అభివృద్ధి చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తోంది. ఆ దిశగా ప్రభుత్వంతో చర్చించి, తగిన చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ బుధవారం వెల్లడించారు. ప్రభుత్వ స్థాయిలో దీనిపై చర్చ జరిగాకే నిర్ణయాలు ఉంటాయని ‘సాక్షి’కి తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యం లోని ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపట్టడం ద్వారా మరింత మంది ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తేవచ్చని యోచిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు ఏయే పాలిటెక్నిక్ కాలేజీలు అనువుగా ఉంటాయన్న అంశంపై అధికారులతో చర్చించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వివరించారు. ఉపాధి అవకాశాలు పెంచేలా.. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు చదివే విద్యార్థులకు ఉపాధి అవకాశాలను మెరుగు పరచడంతోపాటు విద్యావకాశాలను పెంపొందించేందుకు సాంకేతిక విద్యా శాఖ చర్యలు చేపట్టింది. 2018–19లో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం నుంచే ఇంటర్న్‌షిప్‌ను అమలు చేసేందుకు నిర్ణయించింది. పరిశ్రమలతో అనుసంధానం చేయడం ద్వారా పారిశ్రామిక వర్గాల నుంచి విద్యార్థులకు ఆఫర్లు వచ్చేలా చేయడంతోపా టు ఇంటర్న్‌షిప్ ద్వారా పరిశ్రమల్లో ఎక్కువ కాలం పని చేస్తే విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచవచ్చన్న ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టింది. ఈ మేరకు పాలిటెక్నిక్ కోర్సుల్లో ఆరు నెలలకుపైగా ఇంటర్న్‌షిప్‌ను అమలు చేయనుంది. మొదటి సంవత్సరం అయ్యాక వేసవి సెలవుల్లో 6 నుంచి 8 వారాలు, ద్వితీయ సంవత్సరం పూర్తయ్యాక వేసవి సెలవుల్లో 6 నుంచి 8 వారాలు ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేసింది. ఫైనల్ ఇయర్ విద్యార్థులు చివరి సెమిస్టర్ మొత్తం (దాదాపు 110 రోజులు) ఇంటర్న్‌షిప్ చేసేలా చర్యలు చేపట్టింది. చివరి సెమిస్టర్ ఇంటర్న్‌షిప్‌ను ఆప్షనల్‌గా అమలు చేయాలని నిర్ణయించింది. పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్.. పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయ్యాక ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరాలనుకునే వారు (ఈసెట్ రాసి ల్యాటరల్ ఎంట్రీ ద్వారా) కాలేజీలో చదువుకుంటూనే ప్రాజెక్టు వర్క్ చేసేలా ఆప్షన్ ఇచ్చింది. పాలిటెక్నిక్ తర్వాత ఉపాధి అవకాశాలు వెతుక్కునే విద్యార్థులు చివరి సెమిస్టర్ మొత్తం పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. తద్వారా విద్యార్థులకు ఆయా కంపెనీల్లో ఉపాధి లభించే అవకాశం ఉంటుందని నవీన్ మిట్టల్ వెల్లడించారు. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం, తృతీయ సంవత్సరం చదివే విద్యార్థుల నుంచి ఇంటర్న్‌షిప్ చేసే అంశంపై ముందుగానే ఆప్షన్ తీసుకోవాలని కాలేజీలను ఆదేశించారు. మరోవైపు కొత్త సిలబస్ ప్రకారం ఇంజనీరింగ్‌లోనూ ఇంటర్న్‌షిప్‌ను అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. డిగ్రీలోనూ ఇంటర్న్‌షిప్.. డిగ్రీలోనూ ఇంటర్న్‌షిప్ తెచ్చినట్లు నవీన్ మిట్టల్ పేర్కొన్నారు. దీన్ని అన్ని కాలేజీలు అమలు చేయడం లేదని, విద్యార్థులకు ఆప్షన్‌గా ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎంపిక చేసిన కోర్సుల్లో ఇంట ర్న్షిప్ను తప్పనిసరి చేసే అవకాశం ఉందని చెప్పా రు. ప్రస్తుతం డిగ్రీ ప్రథమ, ద్వితీయ ఏడాదిలో 2 క్రెడిట్ల చొప్పున ఇంటర్న్‌షిప్ చేసే వారికి 4 క్రెడిట్లు ఇచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. -
ఆన్లైన్లో మేనేజ్మెంట్ కోటా భర్తీ!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లోని మేనేజ్మెంట్ కోటా సీట్లను కూడా కన్వీనర్ కోటా తరహాలో ఆన్లైన్ విధానంలో భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. అదీ పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే చేపట్టాలని భావిస్తోంది. దీనిపై ఉన్నత విద్యా శాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రైవేటు కాలేజీల్లోని 30% మేనేజ్మెంట్ కోటా (ఇందులో 15% ఎన్నారై/ఎన్నారై స్పాన్సర్డ్) సీట్లను యాజమాన్యాలే భర్తీ చేసుకుంటున్నాయి. మెరిట్ ప్రకారమే ఈ సీట్లను భర్తీ చేస్తున్నామని యాజమాన్యాలు చెబుతున్నా... డొనేషన్లు చెల్లించిన వారికే సీట్లు ఇస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. దీంతో మేనేజ్మెంట్ కోటా సీట్లను కూడా కాలేజీలు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించి, మెరిట్ ప్రకారం కేటాయించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే దరఖాస్తులను కాలేజీలు స్వీకరించినా ఆ లింకు ఉన్నత విద్యాశాఖకూ ఉంటుంది. కేటాయింపుల్ని కాలేజీలు కాకుం డా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) ఆధ్వర్యంలో చేపడతారు. త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుంది. మరోవైపు ప్రభుత్వం సీజీజీ నేతృత్వంలో మెరిట్ ప్రకారం సీట్లు కేటాయించినా... కోర్టు ఆదేశాల ప్రకారం ఆ కాలేజీకి నిర్ధారించిన ఫీజును చెల్లించే స్తోమత విద్యార్థికుందా లేదా అన్నది తెలుసుకునే అధికారం యాజమాన్యాలకు ఉంటుంది. దీన్ని సాకుగా చూపి డొనేషన్లు ఇవ్వని విద్యార్థులకు సీట్లు నిరాకరించే పరిస్థితి ఉంటుందని.. ఈ విషయంలో ఏం చేయాలనేదానిపై ఆలోచిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. 22 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభమయ్యేనా? కన్వీనర్ కోటాలోని 70% ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి ప్రవేశాల కౌన్సెలింగ్ ఈనెల 22 నుంచి ప్రారంభించడం అనుమానమేనని అధికారులు భావిస్తున్నారు. పెద్ద సంఖ్యలో అనుబంధ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్న జేఎన్టీయూహెచ్ నుంచి గుర్తింపు పొందిన కాలేజీల జాబితా ఉన్నత విద్యామండలికి అందాల్సి ఉంది. గుర్తింపు ఇచ్చేందుకు జేఎన్టీయూ ఆయా కాలేజీల్లో తనిఖీలు చేసింది. విజిలెన్స్ విభాగమూ కాలేజీల్లో తనిఖీలు చేస్తోంది. ఇవి ముగిసి నివేదికలు వస్తే.. వాటిని జేఎన్టీ యూ నివేదికలతో పోల్చి చూశాకే గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు మరింత సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. అంటే ఈ నెల 22 నుంచి ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రారంభం కావడం కష్టమేనని, జూలై తొలివారం నాటికి కౌన్సెలింగ్‌ను ప్రారంభిస్తామని చెబుతున్నారు. -
బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు లెక్చరర్లా!
ప్రైవేటు కాలేజీల తీరుపై హైకోర్టు విస్మయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో తాజాగా బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులే లెక్చరర్లుగా పాఠాలు బోధిస్తున్నట్లు తెలుసుకున్న హైకోర్టు తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది, ఇలా విద్యా ప్రమాణాల విషయంలో రాజీ పడితే విద్యార్థుల పరిస్థితి ఏమిటని కాలేజీలను ప్రశ్నించింది. తగిన బోధనా సిబ్బందిని, కనీస మౌలిక సదుపాయాలను కల్పించడం చేతకానప్పుడు కాలేజీలను ఎందుకు ఏర్పాటు చేశారంటూ నిలదీసింది. మౌలిక సదుపాయాలు కల్పించకపోతే కాలేజీల నిర్వహణకు అనుమతినిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. తగిన అర్హతలు కలిగిన బోధనా సిబ్బంది, ల్యాబ్‌లలో సౌకర్యాలు లేని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ల్యాబ్‌లలో సౌకర్యాలను ఆరు వారాల్లో సమకూర్చుకోవాలని, అర్హులైన బోధనా సిబ్బందిని మూడు నెలల్లో నియమించుకోవాలని ఆదేశించింది, ఈ విషయాలు తనిఖీ చేసేందుకు జేఎన్టీయూహెచ్ ఏర్పాటు చేసే కమిటీలో హైకోర్టు సహాయ రిజిస్ట్రార్ సభ్యునిగా ఉంటారని హైకోర్టు తెలిపింది. ఈ కమిటీ ఆయా కాలేజీల్లో తనిఖీలు చేసి నివేదిక సమర్పించాలంది. ఏఐసీటీఈ అనుమతి ఉండి, జేఎన్టీయూ అఫిలియేషన్ లేని కాలేజీలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయన్న ధర్మాసనం, ల్యాబ్‌లలో సౌకర్యాలు, బోధనా సిబ్బందిని ఏర్పాటు చేసుకుంటామని ఈ కాలేజీలు రాతపూర్వక హామీ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆరు నెలలకు వాయిదా వేసింది. ఏఐసీటీఈ అప్రూవల్ ఉండి, జేఎన్టీయూహెచ్ అఫిలియేషన్ లేని కాలేజీలకు తాత్కాలిక అఫిలియేషన్లు ఇవ్వాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ జేఎన్టీయూహెచ్, ధర్మాసనం ముందు అప్పీలు దాఖలు చేసింది. ఈ అప్పీలుపై ధర్మాసనం సుదీర్ఘ విచారణ నిర్వహించింది. -
ఫ్యాకల్టీ, సదుపాయాలు ఉంటేనే అడ్మిషన్లు: హైకోర్టు
తెలంగాణలో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల విషయమై హైకోర్టులో విచారణ ముగిసింది. ఫ్యాకల్టీతో పాటు ఇతర సదుపాయాలను ఆరు వారాల్లోగా సమకూర్చుకోవాలని కాలేజీల యాజమాన్యాలకు హైకోర్టు సూచించింది. అలా సమకూర్చుకున్న తర్వాత మాత్రమే అడ్మిషన్లకు అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది. హైకోర్టు ప్రతినిధితో పాటు ఐదుగురు సభ్యులతో ఓ కమిటీని నియమించి, సదుపాయాలు పరిశీలించాలని స్పష్టం చేసింది. ఆ పరిశీలనలో ప్రమాణాలు లేవని తేలితే అడ్మిషన్లు రద్దు చేయాలని కూడా హైకోర్టు తన ఆదేశాలలో తెలిపింది.