ఫీజుల పథకానికి తూట్లు | Ten engineering colleges want to close down in TS | Sakshi
Sakshi News home page

ఫీజుల పథకానికి తూట్లు

Published Wed, Mar 18 2015 1:56 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

ఫీజుల పథకానికి తూట్లు - Sakshi

ఫీజుల పథకానికి తూట్లు

ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపు రద్దుపై అసెంబ్లీలో విపక్షాల ధ్వజం
ప్రభుత్వంపై బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్‌ల ముప్పేట దాడి
సీఎం గతంలో చేసిన ‘పౌల్ట్రీ ఫారాల్లో కాలేజీల’ వ్యాఖ్యలపై మండిపాటు
ఆ కళాశాలల పేర్లు తెలపాలంటూ బీజేపీ పట్టు
ఫీజుల పథకంపై ప్రభుత్వ తీరుకు నిరసనగా కాంగ్రెస్, బీజేపీల వాకౌట్

 
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల గుర్తింపు రద్దు అంశం మంగళవారం శాసనసభను కుదిపేసింది. కాలేజీల రద్దు ద్వారా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి తూట్లు పొడుస్తోందంటూ విపక్షాలు చేసిన మూకుమ్మడి దాడితో సభ అట్టుడికింది. ఈ అంశంపై శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీఎల్పీ నేత కె.లక్ష్మణ్, ఎంఐఎంపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ సభ్యులు డి.కె.అరుణ తదితరులు లేవనెత్తిన ప్రశ్న సభలో దాదాపు 2 గంటలపాటు దుమారం రేపింది.

దీనిపై ఉపముఖ్యమంత్రి  కడియం శ్రీహరి ఇచ్చిన సమాధానంపై సంతృప్తి చెం దని విపక్షాలు ‘సరైన సమాధానం’ కోరుతూ పదేపదే పట్టుబట్టాయి. ఫీజుల పథకాన్ని ప్రభుత్వం నీరుగార్చుతోందని నిరసన తెలుపుతూ కాంగ్రెస్, బీజేపీ పక్షాలు చివరకు సభ నుంచి వాకౌట్ చేశాయి. ప్రైవేటు కళాశాలల అంశంపై ఇదే సెషన్‌లో మళ్లీ చర్చకు అవకాశమిస్తామని, ప్రశ్నలన్నింటికీ సమాధానమిస్తామని కడియం హామీ ఇవ్వడంతో సభలో చర్చకు తెరపడింది.  
 
ఆర్థికభారం తగ్గించుకోవడానికే: బీజేపీ
పౌల్ట్రీ ఫారాలు, డెయిరీ షెడ్లను ఇంజనీరింగ్ కళాశాలలుగా మార్చి నిర్వహిస్తున్నారంటూ   గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సమాధానమివ్వాలని కాంగ్రెస్, బీజేపీ సభ్యులు పట్టుబట్టి ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టారు. ఎన్ని కళాశాల లు పౌల్ట్రీ ఫారాలు, డెయిరీ షెడ్లలో నడుస్తున్నాయి? ఎన్ని కళాశాలల మీద పోలీసు కేసులు పెట్టారు? ఫీజుబకాయిల విడుదలలో అవి నీతికి పాల్పడినట్లు అప్పటి విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా? అని బీజేపీఎల్పీ నేత కె.లక్ష్మణ్ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో నిలదీశారు.

ఆర్థిక భారం తగ్గించుకోడానికే కళాశాలల గుర్తింపును రద్దు చేశారని మండిపడ్డారు. ఇంజనీరింగ్ సీట్ల కుదింపు, కళాశాలల మూసివేతకు దాదాపు 200 కళాశాలలు దరఖాస్తు చేసుకున్న విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. పౌల్ట్రీ ఫారాలలో నిర్వహిస్తున్న కళాశాలల పేర్లు తెలపాని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎంసెట్ నిర్వహణలో చేసిన జాప్యంతో వేల మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లిపోయారన్నారు. 16 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఈ అంశాన్ని ప్రభుత్వం తేలిగ్గా తీసుకుందని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ జరపకపోవడంతో ప్రైవేటు ఇంజనీరింగ్, ఇంటర్ కళాశాలల అధ్యాపకులు పస్తులుం టున్నారని జి.కిషన్‌రెడ్డి(బీజేపీ) ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.
 
పీజీ సీట్లే లేవు: అక్బరుద్దీన్     
ప్రభుత్వ విద్యా విధానం తప్పుగా ఉందని ఎంఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. గత ఐదేళ్లలో చెల్లించిన రూ. 30 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులతో జిల్లా, మండల కేంద్రాల్లో ప్రభుత్వ కళాశాలలు స్థాపించవచ్చన్నారు. అర్హులైన ప్రిన్స్‌పల్స్, సరిపడ బోధన సిబ్బంది, పరికరాలు, వసతులు లేకపోయినా ప్రభుత్వ కళాశాలలను కొనసాగిస్తున్నారన్నారు. ప్రైవేటు కళాశాలల గుర్తింపు రద్దు విషయంలో అవలంబించిన విధానాన్నే ప్రభుత్వ కళాశాలల విషయంలో ఎందుకు అమలు చేయరని ప్రభుత్వాన్ని నిలదీశారు.

యూజీతో పోల్చితే పీజీ కోర్సుల్లో కేవలం 10 శాతం కూడా సీట్లు లేకపోతే, అర్హులైన అధ్యాపకులు ఎక్కడ నుంచి వస్తారన్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే 50 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేసేందుకు అనుమతి కోరగా, మరో 40 కళాశాలలు సైతం మూసివేసేతకు సిద్ధమవుతున్నాయన్నారు. ఈ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు విషయంలో ఏం చర్యలు తీసుకుంటారని నిలదీశారు.

థర్డ్ పార్టీ నిపుణుల కమిటీ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో తనఖీలు జరిపి సమర్పించిన నివేదికను ప్రభుత్వం ఎందుకు గోప్యంగా ఉంచుతోందని ప్రశ్నించారు. సౌకర్యాలు మెరుగుపరచుకున్న కళాశాలల గుర్తింపును పునరుద్ధరించాలన్నారు. గుర్తింపు పునరుద్దరణ అంశంపై కళాశాలల యాజమాన్యాలతో సమావేశం ఏర్పా టు చేసి మైనారిటీ, మైనారిటీయేతర కళాశాలల ప్రతినిధులతో చర్చలు జరపాలన్నారు.
 
ఇంజనీరింగ్ బ్రాండ్ ఇమేజ్‌కు నష్టం: కాంగ్రెస్
సీఎం కేసీఆర్ వ్యాఖ్యలతో రాష్ట్రంలోని ఇంజనీరింగ్ విద్య బ్రాండ్ ఇమేజ్ పడిపోయిందని పువ్వాడ అజయ్‌కుమార్ (కాంగ్రెస్) విమర్శించారు. ఆత్మస్థైర్యం కోల్పోయిన ఇంజనీరింగ్ విద్యార్థులు హోంగార్డులు, ఉపాధి కూలీలుగా మారుతున్నారన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ముగింపునకు చేరుకున్నా ప్రభుత్వం ఇంకా ఫీజు రీయింబర్స్‌మెంట్ విధివిధానాలను ఖరారు చేయలేదని జీవన్‌రెడ్డి (కాంగ్రెస్) ధ్వజమెత్తారు. ఫీజులు చెల్లించలేదని 40 వేల మంది ఇంటర్ విద్యార్థులకు కళాశాలలు హాల్ టికెట్లు ఇవ్వలేదన్నారు.

ఒక్క విద్యార్థికి నష్టం జరిగినా మాదే బాధ్యత: కడియం
ఫీజుల భారం తగ్గించుకోడానికే ప్రభుత్వం ఇంజనీరింగ్ కళాశాలలపై చర్యలు తీసుకుందన్న విపక్షాల ఆరోపణలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తోసిపుచ్చారు. ఇంజనీరింగ్ విద్యలో ప్రమాణాలు పెంచడానికే కళాశాలలపై చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. ప్రస్తుత సంవత్సరంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథాతథంగా అమలు చేస్తామన్నారు. ఫీజుల చెల్లింపు కోసం 371డీ ఆర్టికల్ ఆధారంగా  విద్యార్థుల స్థానికతను నిర్ధారిస్తామన్నారు.

ఫీజు రీయిం బర్స్‌మెంట్ రాక ఏ ఒక్క విద్యార్థి నష్టపోయి నా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందన్నారు. అధికారంలోకి వచ్చాక రూ.1,587.78 కోట్ల పాత బకాయిలు కలిపి మొత్తం రూ.2,017.90 కోట్ల ఫీజులను చెల్లించామన్నారు. 2014 మేలో నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ కళాశాలల్లో తొలి విడత తనిఖీలు నిర్వహించిందని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 జూలైలో మళ్లీ రెండో విడత తనఖీలు నిర్వహించి ఏఐసీటీఈ నిబంధనలు పాటించని 163 కళాశాలల గుర్తింపు రద్దు చేశామన్నారు.

ప్రైవేటు కళాశాలలు సుప్రీంకోర్టుకు వెళ్లాయని, థర్డ్ పార్టీ నిపుణులతో తనిఖీలు జరిపించాలని, ఆలోగా ఈ కళాశాలలను కౌన్సిలింగ్‌కు అనుమతించాలని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఐఐటీహెచ్, నీట్స్, బిట్స్ పిలానీకి చెందిన నిపుణులతో ఏర్పాటు చేసిన థర్డ్ పార్టీ కమిటీ గత జనవరి 31న నివేదిక సమర్పించిందన్నారు. నిర్మిత స్థలం, బోధన సిబ్బంది, ప్రయోగశాల, కంప్యూటర్లు, గ్రంథాలయాల ఏర్పాటుకు సంబంధించి 163 కళాశాలలు ఏఐసీటీఈ నిబంధనలు పాటించట్లేదని తేలడంతో గుర్తింపు రద్దు కారణాలు తెలుపుతూ ఆ కళాశాలలకు లేఖలు పంపామన్నారు. రాష్ట్రంలో మొత్తం 1,76,770 ఇంజనీరింగ్ సీట్లు ఉంటే, అందులో 76,594 సీట్లు భర్తీ అయ్యాయని, లక్ష సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement