ఎంపీ నామినేషన్లకు రెండ్రోజులే చాన్స్‌! | Nominations Countdown Just Two Days More In Adilabad | Sakshi
Sakshi News home page

ఎంపీ నామినేషన్లకు రెండ్రోజులే చాన్స్‌!

Published Thu, Mar 21 2019 7:37 PM | Last Updated on Fri, Mar 29 2019 5:57 PM

Nominations Countdown Just Two Days More In Adilabad - Sakshi

పెద్దపల్లిలో నామినేషన్‌ వేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి ఏ.చంద్రశేఖర్‌ 

నిర్మల్‌: ఎంపీ నామినేషన్ల దాఖలు గడువు ముంచుకొస్తోంది. కేవలం రెండే రెండు రోజుల సమయముంది. ఈనెల 18న ప్రారంభమైన నామినేషన్ల దాఖలు ప్రక్రియ 25న సాయంత్రం 3 గంటలకు ముగియనుంది. గురువారం హోలీ పండుగ, 23న నాలుగో శనివారం, 24న ఆదివారం సెలవు దినాలు కావడంతో ఆ రోజుల్లో నామినేషన్ల స్వీకరణ ఉండదు. ఇక నామినేషన్ల దాఖలుకు కేవలం 22, 25 తేదీలు మాత్రమే మిగిలాయి. ఇప్పటి వరకు ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానానికి కేవలం ఒకేఒక్క నామినేషన్‌ దాఖలైంది.

కాంగ్రెస్‌ అభ్యర్థి రాథోడ్‌ రమేశ్‌ మాత్రమే ఇక్కడ నామినేషన్‌ వేశారు. టీఆర్‌ఎస్, బీజేపీలతోపాటు స్వతంత్రులూ ఇప్పటి వరకూ స్పందించపోవడం గమనార్హం! పెద్దపల్లి లోక్‌సభ పరిధిలో కూడా  కాంగ్రెస్‌ నుంచి ఏ.చంద్రశేఖర్‌ నామినేషన్‌ వేయగా, చిన్న పార్టీలతోపాటు పలువురు స్వతంత్రులు నామినేషన్లు వేశారు.

రెండు చోట్లా..
పార్లమెంట్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. పని దినాల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు రిటర్నింగ్‌ అధికారులు అందుబాటులో ఉంటున్నారు. ఆది లాబాద్‌ లోక్‌సభ స్థానానికి సంబంధించి ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి సంబంధించి పెద్దపల్లి కలెక్టర్లు దివ్యదేవరాజన్, శ్రీదేవసేన రిటర్నింగ్‌ అధికారులుగా వ్యవహరిస్తున్నారు. అభ్యర్థులు నామినేషన్లను ఆయా జిల్లా కేం ద్రాల్లోనే వేయాల్సి ఉంటుంది. నామినేషన్ల దాఖలు సోమవారం ప్రారంభమైనప్పటికీ పెద్దగా స్పందన లేదు. ఆది లాబాద్‌ స్థానం నుంచి పోటీలో నిలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి రాథోడ్‌ రమేశ్‌ మాత్రమే నామినేషన్‌ వేశారు. పార్టీ తన పేరును ప్రకటించిన తెల్లారే ఆయన ఆదిలాబాద్‌ వెళ్లి రిట ర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు.

పెద్దపల్లి లోక్‌సభ స్థానం పరిధిలో కాస్త పర్వాలేదనిపిం చారు. ఇక్కడ ప్రధాన పార్టీల్లో కాంగ్రెస్‌ నుంచి ఏ.చంద్రశేఖర్‌ ఒక్కరే బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. టీఆర్‌ఎస్, బీజేపీలు బుధవారం వరకు అభ్యర్థులను ప్రకటించలేదు. ప్రజాబంధు పార్టీ అభ్యర్థి తాడెం రాజప్రకాశ్, పిరమిడ్‌ పార్టీ అభ్యర్థి ఇరుగురాల భాగ్యలక్ష్మి, స్వతంత్ర అభ్యర్థులుగా కొయ్యడ స్వామి, దుర్గం రాజ్‌కుమార్,అంబాల మహేందర్‌ తదితరులు తమ నామినేషన్లను అందించారు. 
అభ్యర్థుల ప్రకటనే ఆలస్యం..
రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్, కేంద్రంలోని బీజేపీల కంటే ముందుగా కాంగ్రెస్‌ తమ ఎంపీ అభ్యర్థుల పేర్లు తెలిపింది. బరిలో నిలిచే వారి జాబితాను నోటిఫికేషన్‌ సమయానికి ప్రకటించేసింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఎవరనేది స్పష్టత ఉన్నా.. వారి పేర్లను ఆ పార్టీ అధికారంగా ప్రకటించలేదు. గురువారం హోళీ పండుగ రోజు పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రకటిస్తారని చెబుతున్నారు. ఆదిలాబాద్‌ స్థానానికి టీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ ఎంపీ గోడం నగేశ్‌ బరిలో ఉండనున్నారు. ఇప్పటికే ఆయన ఉమ్మడి జిల్లాలోని తన లోక్‌సభ స్థానం పరిధిలో పర్యటిస్తూ.. ప్రచారాన్నీ చేపడుతున్నారు. పెద్దపల్లిలో దాదాపుగా మాజీ ఎంపీ వివేక్‌కే సీటు కేటాయించే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  

కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రావాలన్న తపనతో ఉన్న బీజేపీ కూడా ఇప్పటి వరకు ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించ లేదు. బోథ్‌ నియోజవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌కు చెందిన సోయం బాపురావు ఇటీవల బీజేపీలో చేరారు. ఆదిలాబాద్‌ లోక్‌సభ టికెట్‌ దాదాపుగా ఈయనకే ఇస్తారని బీజేపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పెద్దపల్లిలో సీనియర్‌ నాయకుడు కాసిపేట లింగయ్య, ఎస్‌.కుమార్‌లతో పాటో బెల్లంపల్లికి చెందిన కొయ్యల ఏమాజీ పోటీ పడుతున్నారు. 
స్వతంత్రులు సైలెంట్‌..
ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులూ నామినేషన్ల దాఖలులో స్థబ్ధుగా ఉన్నారు.పెద్దపల్లి స్థానంలో కాస్త పర్వాలేదనిపించేలా పోటీ పడుతున్నా.. ఆదిలాబాద్‌లో ఇప్పటి వరకు ఒక్క స్వతంత్ర అభ్యర్థి కూడా నామినేషన్‌ దాఖలు చేయకపోవడం గమనార్హం. గత 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి స్వతంత్రులుగా నేతావత్‌ రాందాస్, పవార్‌ కృష్ణ, బంక సహదేవ్, మొసలి చిన్నయ్య తదితరులు బరిలో నిలిచారు. ఈసారి ఇప్పటి వరకూ ఈ స్థానం నుంచి ఒక్క స్వతంత్ర అభ్యర్థి కూడా నామినేషన్‌ వేయకపోవడం గమనార్హం. పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి కె.జయరావు, జి.వినయ్‌కుమార్, జి. రమేశ్, జె.రమాదేవి, టి.శ్రీనివాస్, బి.నారాయణ, ఎం. రవీందర్‌లు స్వతంత్రులుగా పోటీ చేశారు. 
ఉన్నది రెండ్రోజులే..
కేంద్ర ఎన్నికల సంఘం నామినేషన్ల ప్రక్రియకు వారం రోజులు గడువిచ్చింది. ఈనెల 18 సోమవారం నుంచి 25 సోమవారం వరకు సమయమిచ్చింది. ఇందులో 21న హోళీ, 23న నాలుగో శనివారం, 24న ఆదివారం సెలవు దినాలు వచ్చాయి. మొదటి మూడు రోజులు అభ్యర్థుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. ఇక గురు, శని, ఆదివారాలు సెలవులు కాగా.. మిగిలింది రెండురోజులే. కేవలం శుక్రవారం, చివరి రోజైన సోమవారం మాత్రమే నామినేషన్లు వేసేందుకు మిగిలాయి.

ఈ రెండు పనిదినాల్లోనూ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3గంటల వరకు మాత్రమే నామినేషన్లను స్వీకరించనున్నారు. పండితుల లెక్క ప్రకారం శుక్రవారం కంటే 25న సోమవారం మంచి ముహూర్తం ఉందని చెబుతున్నారు. ఈనేపథ్యంలో మిగిలిన అభ్యర్థులు చివరిరోజునే దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక 26న స్క్రుటిని, 28న నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉండనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement