ప్రైవేటు కాలేజీల తీరుపై హైకోర్టు విస్మయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో తాజాగా బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులే లెక్చరర్లుగా పాఠాలు బోధిస్తున్నట్లు తెలుసుకున్న హైకోర్టు తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది, ఇలా విద్యా ప్రమాణాల విషయంలో రాజీ పడితే విద్యార్థుల పరిస్థితి ఏమిటని కాలేజీలను ప్రశ్నించింది. తగిన బోధనా సిబ్బందిని, కనీస మౌలిక సదుపాయాలను కల్పించడం చేతకానప్పుడు కాలేజీలను ఎందుకు ఏర్పాటు చేశారంటూ నిలదీసింది.
మౌలిక సదుపాయాలు కల్పించకపోతే కాలేజీల నిర్వహణకు అనుమతినిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. తగిన అర్హతలు కలిగిన బోధనా సిబ్బంది, ల్యాబ్‌లలో సౌకర్యాలు లేని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ల్యాబ్‌లలో సౌకర్యాలను ఆరు వారాల్లో సమకూర్చుకోవాలని, అర్హులైన బోధనా సిబ్బందిని మూడు నెలల్లో నియమించుకోవాలని ఆదేశించింది, ఈ విషయాలు తనిఖీ చేసేందుకు జేఎన్‌టీయూహెచ్ ఏర్పాటు చేసే కమిటీలో హైకోర్టు సహాయ రిజిస్ట్రార్ సభ్యునిగా ఉంటారని హైకోర్టు తెలిపింది.
ఈ కమిటీ ఆయా కాలేజీల్లో తనిఖీలు చేసి నివేదిక సమర్పించాలంది. ఏఐసీటీఈ అనుమతి ఉండి, జేఎన్‌టీయూ అఫిలియేషన్ లేని కాలేజీలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయన్న ధర్మాసనం, ల్యాబ్‌లలో సౌకర్యాలు, బోధనా సిబ్బందిని ఏర్పాటు చేసుకుంటామని ఈ కాలేజీలు రాతపూర్వక హామీ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
తదుపరి విచారణను ఆరు నెలలకు వాయిదా వేసింది. ఏఐసీటీఈ అప్రూవల్ ఉండి, జేఎన్‌టీయూహెచ్ అఫిలియేషన్ లేని కాలేజీలకు తాత్కాలిక అఫిలియేషన్లు ఇవ్వాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ జేఎన్‌టీయూహెచ్, ధర్మాసనం ముందు అప్పీలు దాఖలు చేసింది. ఈ అప్పీలుపై ధర్మాసనం సుదీర్ఘ విచారణ నిర్వహించింది.
బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు లెక్చరర్లా!
Published Thu, Sep 24 2015 12:41 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement
Advertisement