సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల ధ్రువీకరణ (ర్యాటిఫికేషన్) ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. కొన్నేళ్ళతో పోలిస్తే ఈ ప్రక్రియను ఇంత వేగంగా ముగించడం ఇదే తొలిసారి. వాస్తవానికి ర్యాటిఫికేషన్ కోసం ఉన్నత విద్యా మండలి అధికారులు ప్రతి ఏటా కుస్తీ పడుతుంటారు. ప్రతి ప్రైవేటు కాలేజీకి కేటాయించిన సీటును నిశితంగా పరిశీలించి, ఎలాంటి అభ్యంతరాలు లేవని మండలి సభ్యులు నిర్ణయించిన తర్వాతే ఆమోదం తెలుపుతారు.
ఈ కారణంగా ర్యాటిఫికేషన్ ప్రక్రియ ప్రతి సంవత్సరం మార్చి వరకూ కొనసాగతుంది. మండలి కార్యాలయంలో దీనికి ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటు చేస్తారు. రోజుకు కొన్ని కాలేజీలు చొప్పున పెద్ద ఎత్తున ఫైళ్ళతో వస్తుంటాయి. ఈసారి మాత్రం ఈ హడావుడి ఏమీ కన్పించలేదు. రాష్ట్రంలోని 150కి పైగా ప్రైవేటు కాలేజీల్లో ఉండే 25 వేల మేనేజ్‌మెంట్ కోటా సీట్లకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన ఇంత వేగంగా ముగించడం, అన్నీ సక్రమమేనంటూ ధ్రువీకరించడంపై పలు విద్యార్థి సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
ఫిర్యాదులకు ఆధారాల్లేవా?
ప్రతి ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీకి కొన్ని సీట్లు కేటాయిస్తారు. ఇందులో 70 శాతం కన్వినర్ కోటా కింద భర్తీ చేస్తారు. మిగిలిన 30 శాతం సీట్లలో 15 శాతం ప్రవాస భారతీయుల పిల్లలు, ఎన్‌ఆర్‌ఐలు సిఫారసు చేసిన వారికి కేటాయిస్తారు. మిగిలిన 15 శాతం సీట్లను యాజమాన్య కోటా (బి కేటగిరీ) కింద భర్తీ చేస్తారు. అయితే వీటి విషయంలో కొన్ని షరతులు పాటించాల్సి ఉంటుంది.
జేఈఈ ర్యాంకర్లకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. వాళ్ళు లేకుంటే ఎంసెట్ ర్యాంకర్లకు, ఆ తర్వాత ఇంటర్‌లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వారికి ఇవ్వాలి. సర్టిఫికెట్లు అన్నీ సరిగ్గా ఉండాలి. బి కేటగిరీ కింద కేటాయించిన సీట్లకు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు మాత్రమే తీసుకోవాలి. అయితే కాలేజీలు ఈ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్టుగా ప్రతి ఏటా మండలికి ఫిర్యాదులు అందుతున్నాయి.
ఈ ఏడాది కూడా 34 కాలేజీలపై 42 ఫిర్యాదులు వచ్చి నట్టు మండలి వర్గాలే తెలిపాయి. అయితే వీటిని పరిశీలించేందుకు ఏర్పాటైన కమిటీని ఎలాంటి చర్యలు తీసుకున్నది అధికారులు వెల్లడించడం లేదు. అదే సమయంలో ఆధారాలుంటే తప్ప ఫిర్యాదుల విషయంలో తామేమీ చేయలేమని అంటున్నారు.
ప్రైవేటు కాలేజీలు ఖుషీ
ర్యాటిఫికేషన్ ప్రక్రియ ఈసారి సజావుగా సాగిపోవడంతో ప్రైవేటు కాలేజీల యా జమాన్యాలు సంతోషంగా ఉన్నాయి. మండలికి అందిన ఫిర్యాదులన్నీ అవాస్తవమని చెబుతున్నాయి. విద్యార్థి సంఘాల పేరుతో సీట్లు డిమాండ్ చేశారని, వాటిని తిరస్కరించడం వల్లే మండలికి ఫిర్యాదు చేశారని ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఇష్టానుసారం సీట్లు అమ్ముకున్నట్టుగా ఆరోపణలున్న కాలేజీల పట్ల అధికారులు సానుకూలంగా వ్యవహరించారంటూ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసేందుకు సంఘాలు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment