ratification
-
వేగంగా ముగిసిన ర్యాటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల ధ్రువీకరణ (ర్యాటిఫికేషన్) ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. కొన్నేళ్ళతో పోలిస్తే ఈ ప్రక్రియను ఇంత వేగంగా ముగించడం ఇదే తొలిసారి. వాస్తవానికి ర్యాటిఫికేషన్ కోసం ఉన్నత విద్యా మండలి అధికారులు ప్రతి ఏటా కుస్తీ పడుతుంటారు. ప్రతి ప్రైవేటు కాలేజీకి కేటాయించిన సీటును నిశితంగా పరిశీలించి, ఎలాంటి అభ్యంతరాలు లేవని మండలి సభ్యులు నిర్ణయించిన తర్వాతే ఆమోదం తెలుపుతారు. ఈ కారణంగా ర్యాటిఫికేషన్ ప్రక్రియ ప్రతి సంవత్సరం మార్చి వరకూ కొనసాగతుంది. మండలి కార్యాలయంలో దీనికి ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటు చేస్తారు. రోజుకు కొన్ని కాలేజీలు చొప్పున పెద్ద ఎత్తున ఫైళ్ళతో వస్తుంటాయి. ఈసారి మాత్రం ఈ హడావుడి ఏమీ కన్పించలేదు. రాష్ట్రంలోని 150కి పైగా ప్రైవేటు కాలేజీల్లో ఉండే 25 వేల మేనేజ్మెంట్ కోటా సీట్లకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన ఇంత వేగంగా ముగించడం, అన్నీ సక్రమమేనంటూ ధ్రువీకరించడంపై పలు విద్యార్థి సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఫిర్యాదులకు ఆధారాల్లేవా? ప్రతి ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీకి కొన్ని సీట్లు కేటాయిస్తారు. ఇందులో 70 శాతం కన్వినర్ కోటా కింద భర్తీ చేస్తారు. మిగిలిన 30 శాతం సీట్లలో 15 శాతం ప్రవాస భారతీయుల పిల్లలు, ఎన్ఆర్ఐలు సిఫారసు చేసిన వారికి కేటాయిస్తారు. మిగిలిన 15 శాతం సీట్లను యాజమాన్య కోటా (బి కేటగిరీ) కింద భర్తీ చేస్తారు. అయితే వీటి విషయంలో కొన్ని షరతులు పాటించాల్సి ఉంటుంది. జేఈఈ ర్యాంకర్లకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. వాళ్ళు లేకుంటే ఎంసెట్ ర్యాంకర్లకు, ఆ తర్వాత ఇంటర్లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వారికి ఇవ్వాలి. సర్టిఫికెట్లు అన్నీ సరిగ్గా ఉండాలి. బి కేటగిరీ కింద కేటాయించిన సీట్లకు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు మాత్రమే తీసుకోవాలి. అయితే కాలేజీలు ఈ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్టుగా ప్రతి ఏటా మండలికి ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ ఏడాది కూడా 34 కాలేజీలపై 42 ఫిర్యాదులు వచ్చి నట్టు మండలి వర్గాలే తెలిపాయి. అయితే వీటిని పరిశీలించేందుకు ఏర్పాటైన కమిటీని ఎలాంటి చర్యలు తీసుకున్నది అధికారులు వెల్లడించడం లేదు. అదే సమయంలో ఆధారాలుంటే తప్ప ఫిర్యాదుల విషయంలో తామేమీ చేయలేమని అంటున్నారు. ప్రైవేటు కాలేజీలు ఖుషీ ర్యాటిఫికేషన్ ప్రక్రియ ఈసారి సజావుగా సాగిపోవడంతో ప్రైవేటు కాలేజీల యా జమాన్యాలు సంతోషంగా ఉన్నాయి. మండలికి అందిన ఫిర్యాదులన్నీ అవాస్తవమని చెబుతున్నాయి. విద్యార్థి సంఘాల పేరుతో సీట్లు డిమాండ్ చేశారని, వాటిని తిరస్కరించడం వల్లే మండలికి ఫిర్యాదు చేశారని ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఇష్టానుసారం సీట్లు అమ్ముకున్నట్టుగా ఆరోపణలున్న కాలేజీల పట్ల అధికారులు సానుకూలంగా వ్యవహరించారంటూ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసేందుకు సంఘాలు సిద్ధమవుతున్నట్టు సమాచారం. -
ఆన్లైన్ విధానం లేదు.. మెరిట్‌కు సీటు రాదు!
సాక్షి, హైదరాబాద్ : అది రాష్ట్రంలోని ఓ టాప్ ఇంజనీరింగ్ కాలేజీ.. మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీలో మెరిట్‌ను ప్రాతిపదికగా తీసుకోలేదు.. అడ్డగోలు ఫీజులు వసూలు చేసి, తక్కువ ర్యాంకు వచ్చిన విద్యార్థులకు సీట్లు ఇచ్చింది.. ఇదేమిటని అధికారులు ప్రశ్నిస్తే... ‘‘మాకు విద్యార్థులను ఇంటర్వ్యూ చేసే అధికారం ఉంది. వారికి ఫీజు చెల్లించే స్తోమత ఉందా లేదా తెలుసుకుని సీట్లను కేటాయించవచ్చు. అదే చేశాం.. తక్కువ ర్యాంకు ఉన్న వారికీ సీట్లు ఇచ్చాం..’’అని కరాఖండీగా చెప్పేసింది.. – మరో టాప్ కాలేజీలోనూ ఇదే పరిస్థితి. ఈ కాలేజీ ముందుగానే అడ్డగోలు రేట్లకు సీట్లను అమ్మేసుకుంది.. బీటెక్ కంప్యూటర్ సైన్స్ సీటుకైతే ఏకంగా రూ. 12 లక్షల నుంచి రూ. 14 లక్షల వరకు వసూలు చేసింది. తక్కువ ర్యాంకులు వచ్చిన ఈ విద్యార్థులకు సీట్లు ఇచ్చింది. దీనిపై అధికారులు ప్రశ్నిస్తే.. మళ్లీ అదే సమాధానం. విచిత్రమేమిటంటే.. యాజమాన్యాలే సీట్లను బ్లాక్ చేయడంతో భారీగా ఫీజులు చెల్లించేవారు లేక చివరలో కొన్ని సీట్లు మిగిలిపోవడం గమనార్హం. ..ఈ రెండు కాలేజీలే కాదు రాష్ట్రంలోని టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో చాలా వరకు ఇదే విధంగా వ్యవహరించాయి. ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ వంటి కాలేజీలు కూడా నిబంధనలను తుంగలో తొక్కి యాజమాన్య కోటా సీట్ల భర్తీలో ఇష్టారాజ్యంగా వ్యవహరించాయి. మేనేజ్మెంట్ కోటా సీట్ల ర్యాటిఫికేషన్ (అధికారులు పరిశీలించి ఆమోదించే ప్రక్రియ)లో ఈ తతంగం బయటపడింది. యాజమాన్యాలు పంపించిన ఫైళ్లలో ‘మెరిట్’కనిపించకపోవడంతో అధికారులు కంగుతిన్నారు. అయితే సీట్లకు పెద్దగా డిమాండ్ లేదని, పైగా కోర్టు ఉత్తర్వుల ప్రకారమే తాము విద్యార్థుల ఆర్థిక పరిస్థితులను చూసి సీట్లను కేటాయించామని యాజమాన్యాలు చెబుతుండటంతో.. ఏం చేయాలో తోచక మిన్నకుండిపోతున్నారు. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఫిర్యాదులు వస్తే తప్ప ఏమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు. మరోవైపు ర్యాటిఫికేషన్ చేపట్టే సిబ్బంది కూడా కాలేజీల యాజమాన్యాలతో కుమ్మక్కై చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలూ వ్యక్తమవుతున్నాయి. నిబంధనలు ఏం చెబుతున్నాయంటే.. ఇంజనీరింగ్‌లో 70 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో, 30 శాతం సీట్లను మేనేజ్మెంట్ కోటా (బీ కేటగిరీ) కింద భర్తీ చేస్తారు. ఇక యాజమాన్య కోటాలోని 15 శాతం సీట్లను జేఈఈ మెయిన్ ర్యాంకు ఆధారంగా.. మరో 15 శాతం సీట్లను ఎ¯న్నారై/ఎన్నారై స్పాన్సర్డ్ కోటాలో విద్యార్థులకు కేటాయించాలి. మొత్తంగా ఏ సీట్లు అయినా ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించి.. ర్యాంకుల మెరిట్ ఆధారంగానే భర్తీ చేయాలి. ఒకవేళ దరఖాస్తు చేసుకున్న మేర జేఈఈ మెయిన్ ర్యాంకుల వారికి సీట్లు కేటాయించగా.. మిగిలితే ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా మెరిట్ ప్రకారం సీట్లను ఇవ్వాలి. ఇలా సీట్లు పొందిన విద్యార్థుల వివరాలు ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలి. కానీ ఈ నిబంధనలను కొన్ని కాలేజీలే పాటిస్తున్నాయి. చాలా కాలేజీలు ఆన్లైన్ విధానాన్ని పాటించడం లేదు. ఈ విషయంలో ఉన్నత విద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. ఉన్నత విద్యా మండలి కూడా యాజమాన్య కోటా సీట్ల కేటాయింపునకు గుడ్డిగా ఆమోదముద్ర (ర్యాటిఫికేషన్) వేసిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పూర్తిగా ‘ఆన్లైన్’సాధ్యంకాదా? యాజమాన్య కోటా సీట్లను పూర్తిగా ఆన్లైన్లో భర్తీ చేసేందుకు చర్యలు చేపడతామని 2017–18 విద్యా సంవత్సరం ప్రారంభంలో అధికారులు ప్రకటించారు. కానీ అమలుపై దృష్టి సారించలేదు. దీంతో యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా సీట్లను అమ్ముకున్నాయి. అసలు మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీని ఆన్లైన్లో చేపట్టడం అసాధ్యమేమీ కాదని.. కోర్టులను ఆశ్రయించి గత తీర్పులపై రివ్యూలకు వెళితే ప్రయోజనం ఉంటుందని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే దీనివల్ల కాలేజీల యాజమాన్యాలకు నష్టం కాబట్టి.. ప్రభుత్వ పెద్దల నుంచి సానుకూలత లభించే పరిస్థితి లేక అధికారులు నోరు మెదపడం లేదని చెబుతున్నారు. యాజమాన్య కోటా సీట్లను పారదర్శకంగా, మెరిట్ విద్యార్థులకు కేటాయించేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు. -
ప్రశాంతంగా ర్యాటిఫికేషన్
జేఎన్టీయూ: జేఎన్టీయూ (అనంతపురం) పాలకభవనంలో అధ్యాపకులకు వర్సిటీ గుర్తింపునకు ఇంట ర్వ్యూలు కొనసాగుతున్నాయి. శనివారం 42 మంది అధ్యాపకులు హాజరయ్యారు. ఇన్చార్జ్ వీసీ కె.రాజగో పాల్,తదితర సభ్యులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. -
ర్యాటిఫికేషన్‌కు 59 మంది హాజరు
జేఎన్టీయూ : జేఎన్టీయూ అనంతపురంలో బుధవారం నిర్వహించిన ర్యాటిఫికేషన్ కు 59 మంది అధ్యాపకులు హాజరైనట్లు ఇన్చార్జ్ వీసీ ఆచార్య కే.రాజగోపాల్ తెలిపారు. ఈసీఈ, ఈఈఈ విభాగాలకు సంబంధించిన అధ్యాపకులు హాజరైనట్లు ఆయనవివరించారు. -
డీఎడ్‌కు ప్రత్యేక కౌన్సెలింగ్
అంగలూరు (గుడ్లవల్లేరు) : డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సుకు మంగళవారం అంగలూరు ప్రభుత్వ జిల్లా ఉపాధ్యాయ శిక్షణ సంస ్థ(డైట్)లో ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను అధ్యాపకులు డి.నగేష్, ఏవీడీఎం ప్రసాద్ పరిశీలించారు. ప్రిన్సిపాల్ జి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బుధవారం కూడా కొనసాగుతుందని తెలిపారు. అభ్యర్థులు అన్ని ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు. సీట్లు పొందిన అభ్యర్థులు గురువారం లోగా తమకు కేటాయించిన సంస్థలో చేరకపోతే ఆ సీట్లు పక్షం రోజుల్లోగా రద్దు అవుతాయన్నారు.