సాక్షి, హైదరాబాద్ :
అది రాష్ట్రంలోని ఓ టాప్ ఇంజనీరింగ్ కాలేజీ.. మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీలో మెరిట్‌ను ప్రాతిపదికగా తీసుకోలేదు.. అడ్డగోలు ఫీజులు వసూలు చేసి, తక్కువ ర్యాంకు వచ్చిన విద్యార్థులకు సీట్లు ఇచ్చింది.. ఇదేమిటని అధికారులు ప్రశ్నిస్తే... ‘‘మాకు విద్యార్థులను ఇంటర్వ్యూ చేసే అధికారం ఉంది. వారికి ఫీజు చెల్లించే స్తోమత ఉందా లేదా తెలుసుకుని సీట్లను కేటాయించవచ్చు. అదే చేశాం.. తక్కువ ర్యాంకు ఉన్న వారికీ సీట్లు ఇచ్చాం..’’అని కరాఖండీగా చెప్పేసింది..
– మరో టాప్ కాలేజీలోనూ ఇదే పరిస్థితి. ఈ కాలేజీ ముందుగానే అడ్డగోలు రేట్లకు సీట్లను అమ్మేసుకుంది.. బీటెక్ కంప్యూటర్ సైన్స్ సీటుకైతే ఏకంగా రూ. 12 లక్షల నుంచి రూ. 14 లక్షల వరకు వసూలు చేసింది. తక్కువ ర్యాంకులు వచ్చిన ఈ విద్యార్థులకు సీట్లు ఇచ్చింది. దీనిపై అధికారులు ప్రశ్నిస్తే.. మళ్లీ అదే సమాధానం. విచిత్రమేమిటంటే.. యాజమాన్యాలే సీట్లను బ్లాక్ చేయడంతో భారీగా ఫీజులు చెల్లించేవారు లేక చివరలో కొన్ని సీట్లు మిగిలిపోవడం గమనార్హం.
..ఈ రెండు కాలేజీలే కాదు రాష్ట్రంలోని టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో చాలా వరకు ఇదే విధంగా వ్యవహరించాయి. ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ వంటి కాలేజీలు కూడా నిబంధనలను తుంగలో తొక్కి యాజమాన్య కోటా సీట్ల భర్తీలో ఇష్టారాజ్యంగా వ్యవహరించాయి. మేనేజ్‌మెంట్ కోటా సీట్ల ర్యాటిఫికేషన్ (అధికారులు పరిశీలించి ఆమోదించే ప్రక్రియ)లో ఈ తతంగం బయటపడింది. యాజమాన్యాలు పంపించిన ఫైళ్లలో ‘మెరిట్’కనిపించకపోవడంతో అధికారులు కంగుతిన్నారు. అయితే సీట్లకు పెద్దగా డిమాండ్ లేదని, పైగా కోర్టు ఉత్తర్వుల ప్రకారమే తాము విద్యార్థుల ఆర్థిక పరిస్థితులను చూసి సీట్లను కేటాయించామని యాజమాన్యాలు చెబుతుండటంతో.. ఏం చేయాలో తోచక మిన్నకుండిపోతున్నారు. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఫిర్యాదులు వస్తే తప్ప ఏమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు. మరోవైపు ర్యాటిఫికేషన్ చేపట్టే సిబ్బంది కూడా కాలేజీల యాజమాన్యాలతో కుమ్మక్కై చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలూ వ్యక్తమవుతున్నాయి.
నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..
ఇంజనీరింగ్‌లో 70 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో, 30 శాతం సీట్లను మేనేజ్‌మెంట్ కోటా (బీ కేటగిరీ) కింద భర్తీ చేస్తారు. ఇక యాజమాన్య కోటాలోని 15 శాతం సీట్లను జేఈఈ మెయిన్ ర్యాంకు ఆధారంగా.. మరో 15 శాతం సీట్లను ఎ¯న్నారై/ఎన్నారై స్పాన్సర్డ్ కోటాలో విద్యార్థులకు కేటాయించాలి. మొత్తంగా ఏ సీట్లు అయినా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించి.. ర్యాంకుల మెరిట్ ఆధారంగానే భర్తీ చేయాలి. ఒకవేళ దరఖాస్తు చేసుకున్న మేర జేఈఈ మెయిన్ ర్యాంకుల వారికి సీట్లు కేటాయించగా.. మిగిలితే ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా మెరిట్ ప్రకారం సీట్లను ఇవ్వాలి. ఇలా సీట్లు పొందిన విద్యార్థుల వివరాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలి. కానీ ఈ నిబంధనలను కొన్ని కాలేజీలే పాటిస్తున్నాయి. చాలా కాలేజీలు ఆన్‌లైన్ విధానాన్ని పాటించడం లేదు. ఈ విషయంలో ఉన్నత విద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. ఉన్నత విద్యా మండలి కూడా యాజమాన్య కోటా సీట్ల కేటాయింపునకు గుడ్డిగా ఆమోదముద్ర (ర్యాటిఫికేషన్) వేసిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పూర్తిగా ‘ఆన్‌లైన్’సాధ్యంకాదా?
యాజమాన్య కోటా సీట్లను పూర్తిగా ఆన్‌లైన్‌లో భర్తీ చేసేందుకు చర్యలు చేపడతామని 2017–18 విద్యా సంవత్సరం ప్రారంభంలో అధికారులు ప్రకటించారు. కానీ అమలుపై దృష్టి సారించలేదు. దీంతో యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా సీట్లను అమ్ముకున్నాయి. అసలు మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీని ఆన్‌లైన్‌లో చేపట్టడం అసాధ్యమేమీ కాదని.. కోర్టులను ఆశ్రయించి గత తీర్పులపై రివ్యూలకు వెళితే ప్రయోజనం ఉంటుందని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే దీనివల్ల కాలేజీల యాజమాన్యాలకు నష్టం కాబట్టి.. ప్రభుత్వ పెద్దల నుంచి సానుకూలత లభించే పరిస్థితి లేక అధికారులు నోరు మెదపడం లేదని చెబుతున్నారు. యాజమాన్య కోటా సీట్లను పారదర్శకంగా, మెరిట్ విద్యార్థులకు కేటాయించేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment