మెరిట్‌ ఉన్నోళ్లకే మేనేజ్‌మెంట్‌ సీటు | Changes in the engineering admission process | Sakshi
Sakshi News home page

మెరిట్‌ ఉన్నోళ్లకే మేనేజ్‌మెంట్‌ సీటు

Published Thu, Nov 21 2024 4:32 AM | Last Updated on Thu, Nov 21 2024 4:32 AM

Changes in the engineering admission process

ఇంజనీరింగ్‌ ప్రవేశాల ప్రక్రియలో మార్పులు 

బీ కేటగిరీ సీట్లు ఆన్‌లైన్‌ విధానంలో భర్తీ.. కసరత్తు షురూ 

బేరసారాలకు చెక్‌ పెట్టేందుకు ఉన్నత విద్యామండలి యోచన 

త్వరలో ప్రభుత్వానికి నివేదిక

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ సీట్ల బేరసారాలకు చెక్‌ పెట్టేందుకు ఉన్నత విద్యామండ లి కార్యాచరణ సిద్ధం చేస్తోంది. యాజమాన్య కోటా సీట్లను కూడా ఆన్‌లైన్‌ విధానంలోనే భర్తీ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం కన్వినర్‌ కోటా సీట్లను ఈ తరహాలో కేటాయిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియను సమూలంగా మార్చాలని అధికారులు నిర్ణయించారు. దీనిపై ఇప్పటికే ఉన్నత స్థాయిలో చర్చలు జరిగాయి. 

కొన్ని కాలేజీల మేనేజ్‌మెంట్ల అభిప్రాయాలను అధికారులు సేకరిస్తున్నారు. కొంతమంది ఆన్‌లైన్‌ విధానాన్ని సమర్థిస్తున్నట్టు కౌన్సిల్‌ వర్గాలు తెలిపాయి. ఆన్‌లైన్‌ సీట్ల భర్తీ వ్యవహారంపై త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు మండలి అధికారులు తెలి పారు. ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ వచ్చిన వెంట నే విధివిధానాలను రూపొందిస్తామన్నా రు. ప్రభుత్వం కూడా ఆన్‌లైన్‌ సీట్ల భర్తీపై పట్టుదలగా ఉందని మండలి ఉన్నతాధికారులు చెప్పారు.

ఏటా రూ. కోట్ల వ్యాపారం 
రాష్ట్రంలో దాదాపు 1.16 లక్షల ఇంజనీరింగ్‌ సీట్లున్నాయి. ప్రస్తుతం 70 శాతం సీట్లను కన్వినర్‌ కోటా కింద భర్తీ చేస్తున్నారు. దాదాపు 38 వేల సీట్లను యాజమాన్య కోటా కింద కాలేజీలే నింపుకుంటున్నాయి. నిబంధనల ప్రకారం 15% బీ కేటగిరీ కింద భర్తీ చేయాలి. ప్రభుత్వం నిర్ణ యించిన మేరకే ఈ కేటగిరీకి ఫీజులు వసూలు చేయాలి. 

వీరికి ఎలాంటి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించదు. అయితే, జేఈఈ, ఈఏపీసెట్, ఇంటర్‌ మార్కుల మెరిట్‌ను పరిగణలోనికి తీసుకోవాలి. కాలేజీలు మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదు. కౌన్సెలింగ్‌ తేదీలకు ముందే ఒక్కో సీటును రూ.7 నుంచి 18 లక్షల వరకూ అమ్ముకుంటున్నాయనే ఫిర్యాదులున్నాయి. 

ఏటా ఈ తరహా సీట్ల అమ్మకంతో రూ.వందల కోట్ల వ్యాపారం జరుగుతోందనే ఆరోపణలున్నాయి. ప్రతీ సంవత్సరం ఉన్నత విద్యామండలికి వందల కొద్దీ ఫిర్యాదులు వస్తున్నాయి. యాజమాన్య కోటా సీట్లను ఆన్‌లైన్‌ ద్వారా భర్తీ చేయా లని విద్యార్థి సంఘాలతోపాటు విద్యావేత్తలు డిమాండ్‌ చేస్తున్నారు. గత ఏడాదే దీనిపై ఆలోచన చేసినా, కాలేజీ యాజమాన్యాలు అడ్డుకున్నట్టు తెలిసింది.

ఎన్‌ఆర్‌ఐలకే సీ’కేటగిరీ
యాజమాన్య కోటాలో 15% ప్రవాస భారతీయులకు కేటాయిస్తారు. ఈ కోటాలో సీటు పొందే వాళ్లు ఏడాదికి 5 వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఎన్‌ఆర్‌ఐలు సిఫార్సు చేసిన వాళ్లకు సీట్లు ఇవ్వడం ఇప్పటి వరకూ ఉంది. ఇక నుంచి నేరుగా ఎన్‌ఆర్‌ఐ పిల్లలకు మాత్రమే ఈ కేటగిరీ కింద సీట్లు ఇవ్వాలనే నిబంధనను తేవాలని మండలి భావిస్తోంది. 

ఒకవేళ ఎన్‌ఆర్‌ఐలు లేక సీట్లు మిగిలితే... ఆ సీట్లను బీ కేటగిరీ కిందకు మార్చాలని భావిస్తున్నారు. ఏటా ఇంజనీరింగ్‌ సీట్ల కోసం అనేక రకాలుగా సిఫార్సులు వస్తున్నాయి. కొన్ని కాలేజీలు వీటిని తప్పించుకోవడానికి ఆన్‌లైన్‌ విధానం సరైందిగా భావిస్తున్నాయి. ఆన్‌లైన్‌ సీట్ల భర్తీని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలులోకి తెచి్చంది. దీనిపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు.  

కచ్చితంగా అమలు చేస్తాం..
ఇంజనీరింగ్‌ యాజమాన్య కోటా సీట్లను వచ్చే విద్యా సంవత్సరం నుంచిఅమలు చేస్తాం. సీట్ల అమ్మకానికి తెరవేయాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లయినా మెరిట్‌ ఉన్నవాళ్లకే కేటాయించేలా చేస్తాం.  – వి.బాలకిష్టారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement