సీట్లు రానివారికా... అందరికా | Confusion over engineering counselling | Sakshi
Sakshi News home page

సీట్లు రానివారికా... అందరికా

Published Wed, Sep 11 2024 2:44 AM | Last Updated on Wed, Sep 11 2024 2:44 AM

Confusion over engineering counselling

పెరిగిన ఇంజనీరింగ్‌ సీట్లపై అస్పష్టత

ప్రభుత్వ ఆదేశాల్లేవంటున్న అధికారులు.. 

కోర్టుకెళ్లే అవకాశాలపై ఉన్నత స్థాయి చర్చ

కోర్టు తీర్పుతో ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌పై అయోమయం

ఇంజనీరింగ్‌ కాలేజీల్లో పెరిగిన సీట్లు ఎవరికి దక్కుతాయి? కౌన్సెలింగ్‌ ఎలా  నిర్వహిస్తారు? అనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వారు చెబుతున్నారు. మొదట్లో డిమాండ్‌ లేని కోర్సులు రద్దు చేసుకున్న ప్రైవేట్‌ కాలేజీలకు కంప్యూటర్‌ సైన్స్‌ బ్రాంచ్‌లలో సీట్లు పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించలేదు.  

దీనిపై కాలేజీ యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించడం, తాజాగా సీట్ల పెంపునకు అనుకూలంగా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం  తెలిసిందే. మాప్‌ఆప్‌ కౌన్సెలింగ్‌ ద్వారా ప్రవేశాలు కల్పించాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో పెరిగిన సీట్లపై విద్యార్థులు ఆశలు పెట్టుకున్నారు.– సాక్షి, హైదరాబాద్‌

కౌన్సెలింగ్‌ ఎలా ?
ష్ట్రవ్యాప్తంగా కన్వీనర్‌ కోటాకింద 86 వేల ఇంజనీరింగ్‌ సీట్లు ఉండగా, ఇందులో ఈ ఏడాది 79 వేల సీట్లు భర్తీ అయ్యాయి. మూడు దశలతోపాటు, ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించారు. అంతిమంగా స్పాట్‌ అడ్మిషన్లు కూడా పూర్త­య్యాయి. సీట్లు వచ్చిన విద్యార్థులు సంబంధిత కా­లేజీల్లోనూ రిపోర్టు చేసి, సర్టిఫికెట్లు కూడా ఇచ్చా­రు. 

సీట్లు రానివారు ఇతర రాష్ట్రాల్లోని కాలేజీల్లో, దోస్త్‌ ద్వారా డిగ్రీలోనూ చేరారు. ఈ దశలో కౌన్సెలింగ్‌ నిర్వ­హించడం కష్టమని అధికారులు భావి­స్తున్నారు. కేవలం మిగిలిపో­యిన విద్యార్థు­లకు మాత్రమే కౌన్సెలింగ్‌ చేపట్టాలా? మొత్తం అభ్యర్థులకూ ఆప్షన్లు ఇచ్చే అవకాశం ఇవ్వాలా? అనే దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. ఎక్కడా సీటు రాని వారు మాత్రమే ప్రస్తుతం మిగిలిపోయారు. 

వీరి­కన్నా ఎక్కువ ర్యాంకు వచ్చిన వారు కంప్యూటర్‌ సైన్స్‌ బ్రాంచ్‌కు ప్రయ­త్నించినా, ఆఖరుకు సివిల్, మెకానికల్, ఈఈఈలో చేరారు. ఇప్పుడు 3 వేల సీట్లు పెరిగితే, అందులో 2,100 కన్వీనర్‌ కోటా కింద ఉంటాయి. కేవలం సీట్లు రాని వారికే వీటిని కేటాయిస్తే, అంతకన్నా ఎక్కువ ర్యాంకు వచ్చిన వారికి అన్యాయం జరుగుతుందని అధికారులు అంటున్నారు.

యూటర్న్‌ కష్టమే
ఇప్పటికే 79 వేల మంది విద్యార్థులు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో చేరారు. పెరిగిన సీట్లకు వీరు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇస్తే కౌన్సెలింగ్‌ ప్రక్రియ మళ్లీ మొదటికొస్తుంది. వివిధ కాలేజీల్లో పలు గ్రూపుల్లో చేరిన వారు కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులో చేరేందుకు ప్రయత్నిస్తారు. దీనివల్ల ఇప్పటికే చేరిన కాలేజీల్లో మళ్లీ సీట్లు ఖాళీ అవుతాయి. 

వీటికి మరో దఫా కౌన్సెలింగ్‌ చేపట్టాలి. మొత్తం మీద కౌన్సెలింగ్‌ ప్రక్రియ మళ్లీ మొదటి నుంచి చేపట్టడమే అవుతుందని సాంకేతిక విద్య విభాగం చెబుతోంది. ఇదే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే, ప్రైవేట్‌ కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్ల భర్తీ పూర్తయింది. 

ఉన్నత విద్యామండలి ర్యాటిఫికేషన్‌ చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. కోర్టు తీర్పు ద్వారా పెరిగిన సీట్లకు కౌన్సెలింగ్‌ చేపడితే ర్యాటిఫికేషన్‌ ప్రక్రియ వాయిదా వేయాల్సి ఉంటుంది. పరిస్థితి అంతా గందరగోళంగానే ఉందని సాంకేతిక విద్యకు చెందిన ఓ ఉన్నతాధికారి అన్నారు. ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వాలని అధికారులు, విద్యార్థులు కోరుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement