క్యాంపస్ నియామకాల్లో ట్రెండ్ మారిందంటున్న నిపుణులు
పెద్ద కంపెనీల కోసం ఆరాట పడక్కర్లే
వాటితో మిడిల్ రేంజ్ కంపెనీల పోటీ..
ఆ సంస్థల్లోనే వేతనాలు అధికం
వృత్తిలో దూసుకెళ్లే చాన్స్ అక్కడే
ఎక్స్‌ఫెనో అధ్యయనంలో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: కాలేజీలో క్యాంపస్ నియామకాలున్నాయా? ఏయే కంపెనీలు వస్తాయి? వార్షిక ప్యాకేజీలు ఎలా ఉంటాయి? ఇంజనీరింగ్‌లో చేరే ప్రతీ విద్యార్థి ముందుగా వాకబు చేసే అంశాలివి. పెద్ద కంపెనీలు క్యాంపస్ నియామకాలు చేపడతాయంటే ఆ కాలేజీకి ఎగబడతారు. కానీ ఐటీ కంపెనీల వల్ల ఇప్పుడు ట్రెండ్ మారిందంటున్నారు నిపుణులు. పెద్ద పెద్ద ఐటీ కంపెనీల కన్నా... చిన్న మధ్య తరహా ఐటీ కంపెనీలే ఎక్కువ వేతనాలు ఇస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే నైపుణ్యం ఉన్న వారికి పెద్ద సంస్థల కన్నా భారీగా జీతాలు చెల్లిస్తున్నాయి. కోవిడ్ తర్వాత ఈ మార్పు స్పష్టంగా కన్పిస్తోందని స్పెషలిస్ట్ స్టాఫింగ్ కంపెనీ ‘ఎక్స్‌ఫెనో’ అధ్యయనంలో వెల్లడైంది.
దూసుకెళ్లే అవకాశాలు
దేశంలో ఐటీ సేవలు అందించే ఆరు కంపెనీల్లో దాదాపు 20 వేల మంది వేతనాలను పరిశీలించింది. వీళ్లంతా ఇంజనీరింగ్ పూర్తి చేసి, కొత్తగా ఐటీ ఉద్యోగాల్లో చేరినవాళ్ళే. వీళ్ళల్లో 74 శాతం మందికి ఏడాదికి రూ. 2.5 నుంచి రూ. 5 లక్షల వేతనం ఇస్తున్నారు. 12 శాతం మందికి రూ. 5.75 నుంచి రూ. 7 లక్షల వార్షిక వేతనం ఇస్తున్నారు. కేవలం 7 శాతం మంది మాత్రమే రూ. 7.5 లక్షల కన్నా ఎక్కువ వేతనం పొందుతున్నారు
⇒ మధ్యస్థంగా ఉండే 10 ఐటీ సర్వీస్ కంపెనీల్లో 5 వేల మంది వేతనాలపై అధ్యయనం చేశారు. 57 శాతం మందికి రూ. 2.5–5 లక్షల వార్షిక ప్యాకేజీ ఇస్తున్నారు. 30 శాతం మందికి రూ.5.75 లక్షల ప్రారంభ వేతనం ఇస్తున్నాయి. 7 శాతం మందికి పెద్ద సంస్థలకన్నా ఎక్కువ వేతనం చెల్లిస్తున్నాయి.
⇒ ఆరు పెద్ద కంపెనీల్లో రెండేళ్ల తర్వాతే పదోన్నతులు లభిస్తున్నాయి. వేతనంలో హైక్ నిమిత్తం మధ్యస్థ కంపెనీలు ప్రతీ ఆరు నెలలకూ వృత్తి నైపుణ్య అంచనా వేస్తున్నాయి. 58 శాతం ఫ్రెషర్స్‌కు స్కిల్‌ను బట్టి ప్రమోషన్లు ఇచ్చారు.
కోతకు చాన్స్ తక్కువే
గడచిన ఐదేళ్లుగా టైర్–1 ఐటీ కంపెనీలు భారీగా ఉద్యోగులను తగ్గించుకున్నాయి. ఆరు కంపెనీల్లో 15 శాతం మేర కోత పెట్టాయి. హై స్కిల్ ఉండి, మధ్యస్థ వేతనం ఉన్న వాళ్ళనే కొనసాగించేందుకు ఇష్టపడుతున్నాయి. ఫ్రెషర్స్ విషయంలో పరిస్థితి దయనీయంగా ఉంటోంది. మార్కెట్ పరిస్థితులు, అంతర్జాతీయంగా వచ్చే పరిస్థితులను పెద్ద కంపెనీలు ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. చిన్న, మధ్యస్థ ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల, స్కిల్స్ ఉంటే అంత తొందరగా తీసేసే అవకాశం ఉండదు. కాబట్టి వేగంగా ప్రమాదం ముంచుకొస్తుందన్న భయం ఉండదని ఉద్యోగులు భావిస్తున్నారు. పెద్ద కంపెనీల ఉద్యోగుల్లో అనుక్షణం భయం వెంటాడుతోంది.
ట్రెండ్‌ను కాలేజీలూ పట్టుకోవాలి
ప్రతీ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా క్యాంపస్ నియామకాలకు సంబంధించిన విభాగం ఉంటుంది. మొదటి సంవత్సరం నుంచే విద్యార్థులకు స్కిల్స్‌పై శిక్షణ ఇస్తున్నాయి. అయితే, పెద్ద కంపెనీల మనోభావాలనే ఈ శిక్షణలో భాగస్వామ్యం చేస్తున్నాయి. దీంతో పాటు చిన్న, మధ్యస్థ ఐటీ సంస్థల అవసరాలు, అవి ఆఫర్ చేస్తున్న జాబ్ మార్కెట్‌పైనా అవగాహన కల్పించాలని హైదరాబాద్ లోని ఓ మల్టీ నేషనల్ కంపెనీ సీనియర్ కన్సల్టెంట్ విశేష్ తెలిపారు. క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్‌లో ఫ్రెషర్స్‌కు పెద్ద కంపెనీలకన్నా, చిన్న కంపెనీలే అత్యధిక వేతనాలు ఇస్తున్నాయి. ఈ దిశగా శిక్షణ ఇస్తే విద్యార్థుల ఉపాధి అవకాశాల్లో మార్పులుండే వీలుంది.
వేతనాల్లో పెద్ద వాటితో పోటీ..
ఉద్యోగి నిర్వహించే పాత్ర, అతని అనుభవాన్ని బట్టి కంపెనీల్లో వేతనాలుంటున్నాయి. ఈ విషయంలో పెద్ద కంపెనీలతో చిన్న కంపెనీలు ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఇది ఈ మధ్య కన్పిస్తున్న కొత్త ట్రెండ్. - రోహన్ సిల్వెస్టర్ (టాలెంట్ స్ట్రాటజీ అడ్వైజర్,
ఇన్‌డీడ్ ఇండియా)
నిలబడేందుకు పోరాటం
చిన్న, మధ్యస్థ కంపెనీలు తమ ఉనికిని నిలబెట్టుకునేందుకు ఓ రకంగా పోరాటం చేస్తున్నాయి. మార్కెట్లో నిలబడాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ కారణంగా నైపుణ్యం ఉన్న ఫ్రెషర్స్‌కు పెద్ద కంపెనీల కన్నా 30 నుంచి 50 శాతం వేతనాలు ఎక్కువ ఇచ్చి చేర్చుకుంటున్నాయి. పదేళ్ళ నికర వృద్ధిలో ఇవి కూడా అత్యుత్తమ ప్రమాణాలకు చేరుకోవడం ఇక్కడ గమనించాల్సిన అంశం. - నీలమ్‌కౌర్ (ఐటీ ప్రొఫెషనల్, ముంబై)
చిక్కులు తెస్తున్న ఆర్థికాంశాలు
ఆర్థిక మాంద్యం పెద్ద కంపెనీ ఉద్యోగుల స్థితి గతులను మారుస్తోంది. ఈ ప్రభావం చిన్న, మధ్యస్థ కంపెనీల్లో తక్కువగా ఉంటోంది. కొన్ని అంతర్జాతీయ కంపెనీలు కూడా ఐటీ సేవల్లో ఈ సంస్థలకే ప్రాధాన్యమిచ్చే ధోరణి కన్పిస్తోంది. కాబట్టి స్కిల్స్ ఉన్న వాళ్ళకు చిన్న కంపెనీల్లోనూ ఢోకా ఉండదు. ఎంఎస్ ప్రసాద్ (టైర్–1 కంపెనీలో వర్క్‌ఫోర్స్ హెడ్)
Comments
Please login to add a commentAdd a comment