
జనాభాకు అనుగుణంగా లేని పోలీసు సిబ్బంది
రాష్ట్రంలో మహిళల జనాభా 1,87,47,391..
మహిళా పోలీసులు 4,782 మంది
మహిళా పోలీసుల సంఖ్య పెంచాలంటున్న సంఘాలు
సాక్షిప్రతినిధి, వరంగల్: తెలంగాణలో జనాభాకు అనుగుణంగా పోలీసుల సంఖ్య పెరగడం లేదు. ప్రధానంగా మహిళా పోలీసులు, అధికారులు అరకొరగా ఉన్నారని గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఏటా నేరాల సంఖ్య పెరుగుతుండగా, అందుకు అనుగుణంగా తగినంత మంది పోలీసు సిబ్బంది నియామకాలు లేకపోవడంతో ఉన్నవారితోనే సరిపెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా మహిళాల పోలీసుల కొరత పోలీసు విభాగాన్ని వేధిస్తోంది.
1.87 కోట్ల మహిళలకు 4,782 మంది మహిళా పోలీసులు
ప్రభుత్వం వెల్లడించిన ‘తెలంగాణ ఎట్‌ఎ గ్లాన్స్–2021’నివేదిక ప్రకారం రాష్ట్ర జనాభా 3,77,25,803. ఇందులో పురుషులు 1,89,78,412 కాగా, మహిళలు 1,87,47,391 మంది ఉన్నారు. తెలంగాణ క్రైం రికార్డు బ్యూరో ప్రకారం రాష్ట్రంలో 9 పోలీసు కమిషనరేట్‌లు, 20 జిల్లాలు, ఒక రైల్వే యూనిట్‌లలో 58,504 మంది సివిల్, ఏఆర్, టీఎస్‌ఎస్‌పీ విభాగాలకు చెందిన పోలీసులు (పోలీసు కానిస్టేబుల్ నుంచి డీజీ వరకు) ఉన్నారు. అలాగే 763 శాంతి భద్రతల స్టేషన్లు, 18 మహిళా పోలీసుస్టేషన్‌లు ఉండగా, ప్రతి లక్ష మంది జనాభాకు 141 మంది పోలీసులు ఉన్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది.
కాగా 2024 జనవరి 1 నాటికి తెలంగాణ మొత్తం పోలీసుల సంఖ్య 76,292 మందికి చేరినట్లు సమాచార హక్కు చట్టం కింద వివరాలు వెల్లడించిన డీజీ కార్యాలయం.. మహిళా పోలీసులు 4,782 మంది ఉన్నట్లు తెలిపింది. దీనిని బట్టి తెలంగాణలో మహిళల జనాభాకు అనుగుణంగా మహిళా పోలీసుల సంఖ్య లేదని వెల్లడవుతోంది.
ఇంటా, బయటా జరుగుతున్న వేధింపుల గురించి చాలామంది యువతులు, మహిళలు పురుష పోలీసుల దగ్గర చెప్పుకోలేని పరిస్థితి ఉంది. మహిళలపై ఏదైనా సంఘటన జరిగినప్పుడు వారికి మహిళా పోలీసులే ధైర్యం చెబుతూ, అండగా నిలబడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జనాభాకు అనుగుణంగా మహిళా పోలీసులను నియమించాలని వివిధ మహిళా సంఘాలు కోరుతున్నాయి.
నియోజకవర్గస్థాయిలో మహిళా స్టేషన్‌లు ఉండాలి..
జిల్లా కేంద్రాల్లోనే కాకుండా నియోజకవర్గస్థాయిలో కూడా మహిళా పోలీ స్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి. హక్కుల కో సం ఆందోళనలు చేపడుతున్న మహిళలను అరెస్ట్ చేసే సమయంలో మహిళా పోలీసు అధికారులు మాత్రమే ఉండేలా చూడాలి. – రాజేంద్ర పల్నాటి, ఫౌండర్, యూత్ ఫర్ యాంటీ కరప్షన్
మహిళా పోలీస్‌స్టేషన్ల సంఖ్య పెంచాలి..
మహిళలపై రోజురోజుకూ హింస పెరిగిపోతోంది. అత్యాచారాలు, హత్యలు, యాసిడ్ ఘటనలు, గృహహింస దాడులు.. ఇలా అనేకం జరుగుతున్నాయి. రాష్ట్రంలో మహిళా పోలీస్‌స్టేషన్లు తక్కువగా ఉన్నాయి. మహిళల భద్రత కోసం ప్రతీ మండలంలో ఒక మహిళా పోలీస్ స్టేషన్, జనాభా ప్రాతిపదికన మహిళా ఎస్సై, కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్ జరగాలి. – ఇర్రి అహల్య, జిల్లా అధ్యక్షురాలు, ఐద్వా, జనగామ
Comments
Please login to add a commentAdd a comment