సైబర్, డ్రగ్స్ నేరాలతోపాటు రాజకీయ హింసనూ అరికట్టాలి
పోలీసుల్లో మహిళల సంఖ్య పెరగడం శుభ పరిణామం
కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్‌లో డీజీపీ జితేందర్
మహిళా పోలీసులు రాణీ రుద్రమ స్ఫూర్తితో సాగాలి: మంత్రి సీతక్క
సాక్షి, హైదరాబాద్/ఖిలా వరంగల్: రాష్ట్రంలో ఇటీవలి కాలంలో రాజకీయ ప్రేరేపిత హింస పోలీసులకు సరికొత్త సవాల్‌గా మారిందని డీజీపీ జితేందర్ అన్నారు. సైబర్ నేరాలు, మత్తుపదార్థాల అక్రమ రవాణాతోపాటు రాజకీయ ప్రేరేపిత హింసను కూడా సమర్థంగా ఎదుర్కొనేందుకు పోలీస్ సిబ్బంది సర్వదా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
2024 బ్యాచ్ సివిల్, ఆర్మ్‌డ్ రిజర్వ్ (ఏఆర్), ఐటీ అండ్ కమ్యూనికేషన్, పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ (పీటీఓ) విభాగాలకు చెందిన 8,047 మంది కానిస్టేబుల్ కేడెట్లు 9 నెలల శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని మొత్తం 19 శిక్షణ కేంద్రాల్లో గురువారం పాసింగ్ అవుట్ పరేడ్‌లు నిర్వహించారు.
హైదరాబాద్‌లోని రాజా బహదూర్ వెంకటరామి రెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో 1,211 మంది మహిళా కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి డీజీపీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్‌తో కలిసి కానిస్టేబుళ్ల గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన కేడెట్లకు ట్రోఫీలు, మెమొంటోలు అందించారు. అనంతరం కానిస్టేబుళ్లను ఉద్దేశించి ప్రసంగించారు.
మహిళా పోలీసులు పెరగటం శుభ పరిణామం
రాష్ట్ర పోలీస్‌శాఖలో మహిళా సిబ్బంది సంఖ్య పెరగడం శుభ పరిణామం అని డీజీపీ జితేందర్ అన్నారు. 2024 బ్యాచ్‌లో మొత్తం 2,338 మంది మహిళా పోలీసులు ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారని గుర్తుచేశారు. ఉన్నత విద్యావంతులు కానిస్టేబుల్స్‌గా చేరినందున పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో మరింత నమ్మకం పెంచేలా పనిచేయాలని సూచించారు.
వృత్తిగత జీవితంలోనూ కొత్త అంశాలను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలని కోరారు. విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన యువకులను ఉత్తమ అధికారులుగా తీర్చిదిద్దడంలో తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, ఇతర సిబ్బంది కృషి అభినందనీయమని ప్రశంసించారు. ఉత్తమ శిక్షణ, వసతుల కల్పనకుగాను తెలంగాణ పోలీస్ అకాడమీకి ఎనర్జీ, ఫుడ్ సేఫ్టీ, హెల్త్ సహా ఐదు అంశాల్లో ఐఎస్‌ఓ సరి్టఫికెట్లు దక్కడంపై డీజీపీ సంతోషం వ్యక్తం చేశారు.
కొత్త కానిస్టేబుళ్లతో ప్రమాణం చేయించిన తర్వాత అభిలాష బిస్త్ మాట్లాడుతూ సవాళ్లను అధిగమించి కొత్త సిబ్బందికి అత్యుత్తమ శిక్షణ ఇచ్చామని తెలిపారు. పరేడ్ కమాండర్‌గా ఏఆర్ కానిస్టేబుల్ ఉప్పునూతల సౌమ్య వ్యవహరించారు. కండ్లకోయలోని పోలీసు శిక్షణ కళాశాలలో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఇంటలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డి పాల్గొన్నారు.
నా తల్లిదండ్రుల ఆశయం నెరవేర్చా
మాది హైదరాబాద్. మా నాన్న కారు డ్రైవర్. మా అమ్మానాన్నలకు ముగ్గురం కుమార్తెలమే. మేం పోలీసులం కావాలని మా తల్లిదండ్రుల ఆశయం. వారి కష్టాన్ని చూసి కష్టపడి చదువుకున్నాం. మొదటి ప్రయత్నంలోనే ఒకే కుటుంబం నుంచి ఇద్దరం కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాం. – హరిణి సురేష్, రోషిణి సురేష్
రాణీ రుద్రమ స్ఫూర్తితో ముందుకు సాగండి: మంత్రి సీతక్క
ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలంటే పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. వరంగల్ మామునూరు పోలీస్ శిక్షణ కళాశాలలో శిక్షణ పూర్తిచేసుకొన్న 1,127 మంది కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్‌లో గురువారం ఆమె పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ మహిళా కానిస్టేబుళ్లు రాణీ రుద్రమదేవి స్ఫూర్తితో అంకితభావంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment