
సామాజికవర్గాల వారీగా కూడికలు.. తీసివేతలతో కసరత్తు
బీసీలకు రెండు కేబినెట్ బెర్తులు కావాలంటున్న టీపీసీసీ చీఫ్
రెడ్లకూ రెండు మంత్రి పదవులు అవసరమంటున్న మరో ముఖ్యనేత
మాల, మాదిగ వర్గాలను నొప్పించకుండా పదవుల కూర్పు
కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ల వరకు అన్ని పదవులూ భర్తీ చేసే యోచనలో ఏఐసీసీ.. ఈ నెల 10లోపు అన్ని ఖరారయ్యే చాన్స్.. నేడు కీలక భేటీ
మాలకు మంత్రిగా అవకాశమిస్తే..మాదిగకు వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ, సలహాదారు పదవులు
లంబాడకు మంత్రివర్గంలో స్థానం లేనట్టే... డిప్యూటీ స్పీకర్‌తోపాటు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీకి కులాల కోణంలోనే కసరత్తు జరుగుతోంది. ముందుగా కేబినెట్ బెర్తుల్లో రెడ్లు, బీసీలకు రెండేసీ పదవులు ఇవ్వాలా అనే విషయంలో పోటీ ఏర్పడుతోందని సమాచారం. ఇద్దరు బీసీలకు మంత్రి పదవులు కావాలని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ గట్టిగా అడుగుతుండగా, రెడ్డి నాయకులకు కచ్చితంగా రెండు కేబినెట్ బెర్తులు అవసరమే అని మరో ముఖ్యనేత పట్టుపడుతున్నట్టు తెలిసింది.
ఎస్సీల్లో మాల, మాదిగలు, బీసీల్లో ప్రధాన ఐదు కులాలతోపాటు ఎంబీసీలు, ఎస్టీల్లో లంబాడ సామాజికవర్గాన్ని నొప్పించకుండా పదవులు భర్తీ చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారిని ప్రత్యేక ప్రతి«నిధులుగా, ప్రభుత్వ సలహాదారులుగా నియమించే అవకాశాలున్నాయి. ఈనెల 10వ తేదీ కల్లా పదవుల కసరత్తు పూర్తి చేసేలా..7న కీలక భేటీ జరగనుంది.
భర్తీ చేసే పదవులు ఇవే..
ఆరు కేబినెట్ బెర్తులు, ఒక డిప్యూటీ స్పీకర్, ఒక చీఫ్ విప్, ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి, రెండు లేదా మూడు ప్రభుత్వ సలహాదారులు, నాలుగు ఎమ్మెల్సీలు, నలుగురు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఇద్దరు ఏఐసీసీ కార్యదర్శులు, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ, క్రమశిక్షణ కమిటీ, టీపీసీసీ కోశాధికారి, 20 మంది వరకు ఉపాధ్యక్షులు, 25–30 మంది ప్రధాన కార్యదర్శులు, 20 వరకు కార్పొరేషన్ చైర్మన్లు, అన్ని కార్పొరేషన్లకు డైరెక్టర్లు పోస్టులను భర్తీ చేయనున్నారు.
మూడు సూత్రాల ఆధారంగా...
మంత్రివర్గ విస్తరణ విషయంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొందరు నేతలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, రాష్ట్రంలో పదవుల పంచాయితీలు ఉండొద్దని, సామాజిక న్యాయం జరగాలని, బీసీలు, మాదిగలకు ప్రాధాన్యం తగ్గొద్దని ఏఐసీసీ సూత్రీకరించింది. అక్కడి నుంచి సంకేతాల మేరకు వివిధ పదవుల భర్తీకి టీపీసీసీ మల్లగుల్లాలు పడుతోంది.
రెండింటికీ లింకు పెట్టి....
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులకు.. కేబినెట్ భర్తీకి లింకు పెట్టి కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి కేబినెట్‌లో ఎస్టీ (లంబాడ)లకు అవకాశం ఇవ్వలేని నేపథ్యంలో ఆ సామాజికవర్గానికి చెందిన నేతను ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తారు. అందులో భాగంగానే అటు లంబాడ, ఇటు మహిళ కోటాలో ఖమ్మం జిల్లాకు చెందిన విజయాబాయి పేరు తెరపైకి వచ్చింది. దీంతోపాటు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా లంబాడ వర్గానికే చెందిన బాలూనాయక్‌ను నియమించనున్నారు. ఎంపీ బలరాంనాయక్, కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్‌లలో ఒకరికి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అవకాశం ఇస్తారని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మాలలకు కేబినెట్‌లో అవకాశమిస్తే మాదిగసామాజిక వర్గానికి చెందిన దొమ్మాట సాంబయ్య, రాచమళ్ల సిద్దేశ్వర్‌లలో ఒకరికి ఎమ్మెల్సీగా అవకాశమిస్తారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఏఐసీసీ కార్యదర్శి ఎస్.సంపత్‌కుమార్‌ను ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా పంపనున్నారు. ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్న మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్‌ను ఏఐసీసీ కార్యదర్శిగా పంపే అవకాశాలున్నాయి. మల్లురవి, మధుయాష్కీలలో ఒకరికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా అవకాశమిచ్చే యోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక, ఓసీ కోటాలో వేం నరేందర్‌రెడ్డి, టి. జీవన్‌రెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. ఓసీలకు కాదంటే జీవన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించే చాన్స్ ఉంది.
బీసీ కోటాలో ఈసారి ఎమ్మెల్సీగా యాదవసామాజిక వర్గానికి చెందిన నేతను నియమించొచ్చు. మున్నూరుకాపు, ముదిరాజ్, పద్మశాలి, గౌడ్‌లకు కేబినెట్‌లో ప్రాతినిధ్యం లభిస్తే.. కచి్చతంగా ఎమ్మెల్సీగా యాదవ వర్గానికి అవకాశం దక్కుతుంది. ఈ కోటాలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్‌కౌశిక్ యాదవ్ పేరు వినిపిస్తోంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీ అంశం పూర్తి గా సామాజిక కోటాలోనే జరుగుతుండడం గమనార్హం.
మంత్రి పదవులు ఐదా.. ఆరా?
రాష్ట్ర కేబినెట్ 18 మంత్రి పదవులు భర్తీ చేసే అవకాశముంది. ప్రస్తుతం సీఎంతో కలిపి 12 మంది మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
» ఆరుగురికి మంత్రి పదవులు ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది. రెండు రెడ్లకు, రెండు బీసీ (ముది రాజ్, మున్నూరుకాపు), ఒకటి ఎస్సీ (మాల), ఒకటి మైనార్టీ వర్గానికి ఇవ్వనున్నారు. ఒకవేళ ఐదింటిని మాత్రమే భర్తీ చేయాలనుకుంటే మైనార్టీ లేదంటే రెడ్లలో ఒకటి తగ్గించొచ్చు.
» అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏఐసీసీ మాట ఇచ్చిన విధంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, గడ్డం వివేక్‌లకు బెర్తులు ఖాయమైనట్టే.
» బీసీల కోటాలో వాకిటి శ్రీహరి, ఆది శ్రీనివాస్‌లకూ దాదాపు ఓకే అయినట్టే. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పి.సుదర్శన్‌రెడ్డి (నిజామాబాద్)కి కూడా మంత్రి పదవి ఖరారైనట్టే.
» మైనార్టీ కోటాలో షబ్బీర్‌అలీ లేదంటే ఆమేర్ అలీ ఖాన్‌ల పేర్లు వినిపిస్తున్నాయి.
» ఐదింటిని మాత్రమే భర్తీ చేయాలనుకుంటే సుదర్శన్‌రెడ్డిని ఆపేసి షబ్బీర్‌అలీని మంత్రిని చేసే అవకా శాలున్నాయి. లేదంటే మైనార్టీ కోటాను ప్రస్తుతానికి పెండింగ్‌లో పెట్టి ఇద్దరు రెడ్డి, ఇద్దరు బీసీ, ఒక ఎస్సీ నేతతో మంత్రివర్గ విస్తరణ చేసే అవకాశాలున్నాయి.
» మంత్రివర్గ విస్తరణ కసరత్తులో రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం లభించే అవకాశం లేనందున, ఆ జిల్లా కు చెందిన మల్‌రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్‌రెడ్డిల లో ఒకరిని అసెంబ్లీలో చీఫ్‌విప్‌గా నియమించే అవకాశాలున్నాయి. ఎంబీసీ వర్గాలకు చెందిన మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్‌ను విప్‌గా అవకాశమిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment