పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకు రావాలి
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పిలుపు
టైర్–2, టైర్–3 పట్టణాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని వెల్లడి
రాయదుర్గం: తెలంగాణ రాష్ట్రంలోని టైర్–2, టైర్–3 పట్టణాలలో ఐటీ సంస్థల ఏర్పాటుకు కంపెనీలు ముందుకురావాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. ఆదివారం నానక్‌రాంగూడలోని వంశీరామ్ సువర్ణదుర్గా టెక్ పార్కులో గ్లోబల్ ఐటీ, ఇంజనీరింగ్ సొల్యూషన్స్ సంస్థ ‘టెక్‌వేవ్ ఏర్పాటుచేసిన మొదటి ఏఐ ఇంజనీరింగ్ హబ్‌ను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలలో మంచి ప్రతిభ కలిగిన విద్యార్థులు ఉన్నారని, వారి కోసం ట్రిపుల్ ఐటీలను కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. టైర్–2, టైర్–3 పట్టణాలలో రోడ్డు, విద్యుత్ సరఫరా, ఇతర మౌలిక వసతుల కల్పనకు అన్ని చర్యలను తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ పట్టణాలలో ఐటీ సంస్థలను ఏర్పాటు చేసేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పట్టణాల అభివృద్ధికి అన్ని చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్‌కు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్రాధాన్యత ఉందని తెలిపారు.
నిబద్ధత ఉంటే ఏదైనా సాధ్యమే..
నిబద్ధత, చిత్తశుద్ధి, ప్రతిభ ఉన్న నాయకత్వం ఉంటే ఎలాంటి సంస్థలకైనా ప్రగతి సాధించేందుకు అవకాశం ఉంటుందని, అందుకు టెక్‌వేవ్ సంస్థనే ఉదాహరణ అని శ్రీధర్‌బాబు తెలిపారు. పది దేశాలలో 3,500 మంది ఉద్యోగులు కలిగి, 20 ఏళ్లు పూర్తి చేసుకొన్న టెక్‌వేవ్ సంస్థ యాజమాన్యాన్ని మంత్రి అభినందించారు.
కార్యకలాపాలను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాలని ఈ సంస్థ ప్రతినిధులను కోరారు. ఈ కార్యక్రమంలో టెక్‌వేవ్ సంస్థ చైర్మన్ దామోదరరావు గుమ్మడపు, సీఈఓ రాజ్ గుమ్మడపు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment