కొత్త కళాశాలలకు మరో రెండేళ్లపాటు నో | AICTE Comments On New Private Engineering Colleges | Sakshi
Sakshi News home page

కొత్త కళాశాలలకు మరో రెండేళ్లపాటు నో

Published Sat, Feb 22 2020 2:24 AM | Last Updated on Sat, Feb 22 2020 2:24 AM

AICTE Comments On New Private Engineering Colleges - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దేశ వ్యాప్తంగా ఇంజనీరింగ్‌ 40 శాతానికి పైగా సీట్లు భర్తీ కావడం లేదని, అందుకే వచ్చే రెండేళ్లు కొత్తగా ఇంజనీరింగ్‌ కాలేజీలకు ప్రైవేటు రంగంలో అనుమతి ఇచ్చేది లేదని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి స్పష్టం చేసింది. 2020–21 విద్యా సంవత్సరంతోపాటు 2021–22, 2022–23 విద్యా సంవత్సరం వరకు కొత్త కాలేజీల లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ (ఎల్‌వోఐ) కూడా ఇవ్వబోమని తెలిపింది. గతంలో ఎల్‌వోఐ ఇచ్చిన వారికి మాత్రం లెటర్‌ ఆఫ్‌ అప్రూవల్‌ (ఎల్‌వోఏ) ఇస్తామంది. మరోవైపు ప్రభుత్వ రంగంలో కొత్త కళాశాలల ఏర్పాటుకు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ప్రభుత్వంతోపాటు ప్రైవేటు రంగంలో నూ కొత్త కాలేజీల ఏర్పాటుకు ఎల్‌వోఐ ఇస్తామని, మిగతా వాటికి ఇవ్వబోమని తేల్చేసింది.

2020–21 విద్యా సంవత్సరం కోసం జారీ చేసిన సాంకేతిక విద్యా సంస్థల అప్రూవల్‌ హ్యాండ్‌బుక్‌లో మార్పులు చేర్పులపై ఇటీవల ఢిల్లీ, చెన్నైలో జరిగిన కన్సల్టేషన్‌ సమావేశాల్లో ఈ నిర్ణయాలు తీసుకుంది. కొత్త ఫార్మసీ కాలేజీలకు కూడా వచ్చే రెండేళ్లు అనుమతి ఇవ్వమని చెప్పిం ది. 2019–20 విద్యా ఏడాదిలో దేశంలోని విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్‌ సీట్లు 27 లక్షలు ఉంటే అందులో 14 సీట్లు మిగిలిపోయాయని, 13 లక్షల సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయని పేర్కొంది. రాష్ట్రంలోనూ 217 కాలేజీల్లో 1,12,090 సీట్లకు ఏఐసీటీఈ ఆమోదం తెలుపగా, రాష్ట్రంలోని వర్సిటీలు 187 కాలేజీల్లో 93,790 సీట్ల భర్తీకి అనుబంధ గుర్తింపు ఇచ్చాయి. అందులో 62,744 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే 55.97% సీట్లు భర్తీకాగా 44.03% సీట్లు ఖాళీగానే ఉండిపోయాయి. ఫార్మసీలోనూ ఇలాంటి పరిస్థి తే నెలకొంది. మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే స్థితి ఉండటంతో ఇంజనీరింగ్, ఫార్మసీలో వచ్చే రెండేళ్లపాటు కొత్తగా ప్రైవేటు కాలేజీలకు అనుమతించబోమని స్పష్టం చేసింది. 

డిమాండ్‌ ఉండే కోర్సులకు ఓకే...
మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న కొత్త కోర్సులను మాత్రం ప్రస్తుతం ఉన్న కాలేజీల్లో ప్రారంభించేందుకు అనుమతి ఇస్తామని (అదనపు ఇంటేక్‌) వెల్లడించింది. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభించే, మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, డాటా సైన్స్, మిషన్‌ లెర్నింగ్, బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ, త్రీడీ ప్రింటింగ్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, సైబర్‌ సెక్యూరిటీ వంటి కోర్సులను ప్రారంభించేందుకు అదనపు ఇంటేక్‌ను మంజూరు చేస్తామని చెప్పింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement