దేశాభివృద్ధిలో సాంకేతిక విద్య కీలకం | Technical education is crucial for national development | Sakshi
Sakshi News home page

దేశాభివృద్ధిలో సాంకేతిక విద్య కీలకం

Published Sat, Jul 1 2023 3:24 AM | Last Updated on Sat, Jul 1 2023 3:24 AM

Technical education is crucial for national development - Sakshi

సాక్షి, అమరావతి: దేశాభివృద్ధిలో సాంకేతిక విద్య కీలక భూమిక పోషిస్తోందని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) చైర్మన్‌ టీజీ సీతారామ్‌ అన్నారు. ఈ క్రమంలోనే సాంకేతికతతో కూడిన పరిపాలన అందించడం ద్వారా ప్రజల జీవన శైలిలో సమూల మార్పులు తీసుకు­రావచ్చన్నారు. ప్రైవేటు ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, పాలిటెక్నిక్‌ కళాశాలల యాజమాన్యాల సంఘం(అపెక్మా) సమావేశం శుక్రవారం విజయవాడలో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీతారామ్‌ మాట్లాడుతూ.. 2047 నాటికి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తవుతోందన్నారు.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వచ్చే 25 ఏళ్లను అమృత కాలంగా పరిగణించి కీలక సంస్కరణల దిశగా ప్రణాళిక రూపొందించిందన్నారు. 50 కోట్లకు పైగా యువ శక్తితో భారత్‌ ప్రపంచంలో బలమైన దేశంగా ఉందన్నారు. కళాశాలల యాజమాన్యాలు సాంకేతిక విద్యలో విద్యార్థులకు లెర్నింగ్‌ ఔట్‌కమ్స్‌ను మెరుగుపర్చాలని కోరారు. ఇందుకు నైపుణ్యాభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా సమీకృత, మల్టీడిసిప్లినరీ కోర్సులను కచ్చితంగా ప్రవేశపెట్టాలని సూచించారు.

ఇప్పటికే ఏఐసీటీఈ గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం మాతృభాషలోనూ సాంకేతిక విద్యను అందిస్తోందని గుర్తు చేశారు. కళాశాలల్లో ఇన్‌టేక్, అక్రెడిటేషన్ల జారీల విషయంలో రాధాకృష్ణన్‌ కమిటీ సమగ్ర అధ్యయనం చేస్తోందన్నారు. కళాశాలలకు అను­మతుల ప్రక్రియను సైతం సులభతరం చేస్తు­న్నామని తెలిపారు. ఏటా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌)లో ప్రతి కళాశాల భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

ఏపీలో యువతకు మెండుగా ఉపాధి అవకాశాలు..
సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్‌ కేంద్ర ప్రభుత్వ గతిశక్తి కార్యక్రమంలో కీలకంగా మారనుందని సీతారామ్‌ తెలిపారు. ఇక్కడ లాజిస్టిక్స్, ఫుడ్‌ ప్రాసెసింగ్, ప్రొడక్షన్‌ తదితర రంగాల్లో యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో అత్యధికంగా ఏపీ విద్యార్థులే ఉండటం తెలుగు వారి విద్యా ప్రతిభకు నిదర్శనమన్నారు. కంప్యూటర్‌ సైన్స్‌ ఒక్కటే సాంకేతిక విద్య కాదని తెలిపారు.

అనేక కోర్‌ బ్రాంచ్‌లు, ఇతర రంగాల్లోని అవకాశాల గురించి విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. త్వరలో 1,500కు పైగా కంపెనీలతో కలిసి ప్లేస్‌మెంట్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు సైతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.

ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ.. గత మూడేళ్లలో ఉన్నత విద్యలో ఏపీ ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని గుర్తు చేశారు. విద్యార్థులకు ప్రపంచ స్థాయి కంపెనీల్లో సర్టిఫికేషన్లు అందించడం ద్వారా నైపుణ్య సామర్థ్యాలను పెంపొందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సాంకేతిక విద్య డైరెక్టర్‌ నాగరాణి, అపెక్మా చైర్మన్‌ చొప్పా గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement