అనంతపురం విద్య: సాంకేతిక విద్యలోనూ మిర్రర్ ఇమేజీ పుస్తకాలను అందుబాటులోకి తెస్తున్నారు. ఒకే పుస్తకంలో ఒక పేజీలో ఇంగ్లిష్, మరొక పేజీలో తెలుగు కంటెంట్ ఉంటుంది. ఇవి తెలుగు మీడియం విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉండనున్నాయి. నూతన జాతీయ విద్యావిధానం ప్రకారం సాంకేతిక విద్యా కోర్సులైన ఇంజినీరింగ్, డిప్లొమా పాఠ్య పుస్తకాలను ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకురావాలి. ఈ మేరకు ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) నిర్దేశించింది. ఇంజినీరింగ్, డిప్లొమా పుస్తకాలను తెలుగు భాషలోకి అనువదించే బాధ్యతను జేఎన్‌టీయూ(అనంతపురం)కు అప్పగించింది. దీంతో ఇప్పటికే మొదటి సంవత్సరం డిప్లొమా పుస్తకాలు 11, బీటెక్‌లో తొమ్మిది పుస్తకాలు ఇంగ్లిష్ నుంచి తెలుగులోకి తర్జుమా చేశారు.
తెలుగు మీడియం విద్యార్థులకు ఇబ్బంది లేకుండా..
తెలుగు మీడియం నుంచి ఇంగ్లిష్ మీడియంలోకి వెళ్లే విద్యార్థులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 1 నుంచి 10వ తరగతి వరకు మిర్రర్ ఇమేజీ పుస్తకాలను అందుబాటులోకి తెచ్చింది. ఇదే తరహాలోనే బీటెక్, డిప్లొమాలోనూ మిర్రర్ ఇమేజీ పుస్తకాలకు రూపకల్పన చేశారు. దీనివల్ల తెలుగు మీడియం విద్యార్థులు విషయాన్ని త్వరగా అవగాహన చేసుకునే అవకాశం ఉంటుంది.
ఆత్మన్యూనతా భావం తగ్గించేలా..
తెలుగు మీడియం నుంచి ఇంగ్లిష్ మీడియంలోకి అడుగుపెట్టే విద్యార్థుల్లో ఆత్మన్యూనతా భావం ఎక్కువగా ఉంటోంది. విషయ పరిజ్ఞానంలో ఇంగ్లిష్ మీడియం వారితో పోటీపడలేమని చాలామంది అనుకుంటుంటారు. అలాంటి వారిలో ధైర్యాన్ని నింపేలా మిర్రర్ ఇమేజీ పుస్తకాలు రూపొందించాం. 2022–23 విద్యా సంవత్సరం నుంచి బీటెక్, డిప్లొమా రెండో సంవత్సరం విద్యార్థులకు సైతం తెలుగు భాషలో కంటెంట్ అందుబాటులోకి తెస్తాం.
– డాక్టర్ కె.శేషమహేశ్వరమ్మ, ఏఐసీటీఈ టెక్నికల్ బుక్స్ రైటింగ్ కోఆర్డినేటర్ (రీజినల్ లాంగ్వేజెస్)
(చదవండి: పల్లె జనం.. పట్టణ జపం)
Comments
Please login to add a commentAdd a comment