‘నీట్‌’లా ఇంజనీరింగ్‌కూ ఒకే ఎంట్రన్స్‌! | A single entrance to engineering like NEET | Sakshi
Sakshi News home page

‘నీట్‌’లా ఇంజనీరింగ్‌కూ ఒకే ఎంట్రన్స్‌!

Published Wed, May 17 2023 2:26 AM | Last Updated on Fri, May 19 2023 2:08 PM

A single entrance to engineering like NEET - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భవిష్యత్‌లో ఇక రాష్ట్రాల పరిధిలో ఎంసెట్‌ల నిర్వహణ ఉండే అవకాశం కనిపించడం లేదు.  దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీకి ‘నీట్‌’ను నిర్వహిస్తున్న మాదిరిగానే అన్ని రాష్ట్రాల్లో ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీకి జాతీయ స్థాయిలో ఒకే ప్రవేశపరీక్ష నిర్వహించే దిశగా కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ముసా­యిదా ప్రతిని కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాలకూ పంపింది. మెజారిటీ రాష్ట్రాలు ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు తెలిసింది. దీంతో ఈ అంశంపై అవగాహనకు కేంద్రం సెమినార్లు నిర్వహిస్తోంది.

కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఉన్న డిగ్రీ, పీజీ సీట్ల భర్తీకి కూడా కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (సీయూఈటీ) ప్రయోగం విజయవంతమైంది. దీంతో జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్‌ ఉమ్మడి ప్రవేశపరీక్షపై కేంద్రం దృష్టి పెట్టింది. గత కొన్నేళ్లుగా దేశంలోని ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలతోపాటు కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యాసంస్థల్లోని ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు కేంద్రం జేఈఈ మెయిన్‌ పరీక్ష నిర్వహిస్తోంది.

జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు ఐఐటీల్లో ప్రవేశాల కోసం జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష చేపడుతోంది. ఇదే మాదిరిగా రాష్ట్రాల ఇంజనీరింగ్‌ కాలేజీలనూ కలుపుకొని ఉమ్మడి ప్రవేశ పరీక్ష, కౌన్సెలింగ్‌ చేపట్టాలని 2016లోనే ఆలోచన చేసింది. కానీ వివిధ కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. 

కొనసాగుతున్న చర్చలు 
గత నెల 18న భువనేశ్వర్‌లో అఖిల భారత సాంకేతి­క విద్యామండలి (ఏఐసీటీఈ), యూజీసీ, ఐఐటీ­ల డైరెక్టర్లు, గవర్నింగ్‌ బాడీ చైర్మన్లతో కేంద్ర విద్యా­శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇంజనీరింగ్‌ ఉమ్మడి ప్రవేశపరీక్షపై చర్చించారు.

అయితే ఇందుకు సంబంధించి అనుసరించాల్సిన విధివిధానాలు, పొందుపరచాల్సిన నిబంధనలపై వివిధ వాదనలు వినిపించాయి. దీంతో అన్ని కోణాల్లోనూ పరిశీలించి, మార్పుచేర్పులతో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఐఐటీ గవరి్నంగ్‌ బాడీ చైర్మన్లను కేంద్ర మంత్రి ఆదేశించారు. దీంతో వారు అన్ని రాష్ట్రాలతో భేటీ అవుతూ అభిప్రాయసేకరణ చేపడుతున్నారు. 2025­–­26 నాటికి ఈ ప్రయోగాన్ని అమల్లోకి తేవాలనే ఆలోచనలో ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.

విధానపరమైన నిర్ణయం తీసుకున్నాక ప్రస్తుతం రాష్ట్రాల పరిధిలో ఉన్న కాలేజీలకు రెండేళ్ల సమయం ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. అయితే ఐఐటీల నాణ్యతను ఏమాత్రం తగ్గించకుండా చూడాలని సమావేశంలో పాల్గొన్న విద్యావేత్తలు సూచించారు. నీట్, జేఈఈ మెయిన్‌ పరీక్షలతోపాటు కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (సీయూఈటీ)లో విలీనం చేసే యోచన ఉందని యూజీసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ జగదీశ్‌కుమార్‌ కూడా గతంలో అనేక సందర్భాల్లో తెలిపారు. 

నిబంధనలు పాటిస్తేనే అనుబంధ గుర్తింపు..
ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీ జాతీయ స్థాయిలోకి వెళ్తే పూర్తిగా వెబ్‌ ఆధారితంగానే ఉంటుందని అధికారులు అంటున్నారు. యాజమాన్య కోటా కూడా కౌన్సెలింగ్‌ ద్వారానే భర్తీ చేస్తారు. అనుబంధ గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీలన్నీ ఏఐసీటీఈ నిబంధనలు విధిగా పాటించాల్సి ఉంటుంది. మౌలిక వసతులు, నాణ్యమైన ఫ్యాకల్టి, కంప్యూటర్‌ ఆధారిత కోర్సుల్లో బోధన ప్రణాళిక మొత్తం కేంద్ర పరిధిలోకి వెళ్తుంది.

ఫలితంగా కొన్ని ప్రైవేటు కాలేజీలు అనేక మార్పులు చేసుకోక తప్పదని ఓ అధికారి పేర్కొన్నారు. ఇప్పటివరకు యూనివర్సిటీ అధికారులే తనిఖీలు చేసేవాళ్లు. ఇకపై జాతీయ స్థాయిలోనూ ప్రత్యేక బృందాలు తనిఖీలు చేసి అనుమతిస్తేనే ఇంజనీరింగ్‌ కాలేజీలకు అనుబంధ గుర్తింపు లభిస్తుందని తెలుస్తోంది. ఈ విధానంతో యాజమాన్య కోటా సీట్ల బేరసారాలకు బ్రేక్‌ పడుతుందని అధికార వర్గాలు అంటున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement