రాయితీ తాయిలాలు తల్లిదండ్రులతో బేరాలు! | Telangana Private Engineering Colleges Management Quota Seats | Sakshi
Sakshi News home page

రాయితీ తాయిలాలు తల్లిదండ్రులతో బేరాలు!

Published Tue, Aug 23 2022 2:45 AM | Last Updated on Tue, Aug 23 2022 2:59 AM

Telangana Private Engineering Colleges Management Quota Seats - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలు మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల బేరం జోరుగా సాగిస్తున్నాయి. తక్కువ ర్యాంకు ఉన్న వాళ్ళను గుర్తించి వారి నుంచి రూ.లక్షల్లో వసూలు చేస్తున్నాయి. ముఖ్యంగా కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సు పేరుతో అడ్డూ అదుపు లేకుండా పిండేస్తున్నాయి. కేవలం మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల అమ్మకం కోసం దాదాపు అన్ని కాలేజీలు ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేసుకున్నాయి. ఎంక్వైరీ కోసం వచ్చే వారికి, తల్లిదండ్రులకు ఫోన్లు చేసి.. సీట్లు అయిపోతున్నాయని చెబుతూ వల వేస్తున్నాయి. ముందే బుక్‌ చేసుకుంటే రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు రాయితీ ఇస్తామంటూ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. 

రాష్ట్రంలో 35 వేల మేనేజ్‌మెంట్‌ సీట్లు 
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో మేనేజ్‌మెంట్‌ సీట్లు 35 వేల వరకు ఉన్నాయి. ఈ ఏడాది వందకు పైగా కాలేజీలు మెకానికల్, సివిల్‌ విభాగాల్లో సీట్లు తగ్గించుకుని, కంప్యూటర్‌ సైన్స్, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్, సైబర్‌ సెక్యూరిటీ, డేటా సైన్స్‌ కోర్సుల సీట్లు పెంచుకున్నాయి. ఆ సీట్లకున్న డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. తమ పిల్లలతో ఎలాగైనా కంప్యూటర్‌ సైన్స్‌ సంబంధిత కోర్సు చేయించాలని ఆశిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు, టాప్‌ కాలేజీల యాజమాన్యాల వద్ద సీట్ల కోసం క్యూ కడుతున్నారు. 

తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తూ.. 
ఎంసెట్‌ ఫలితాలు వెల్లడైన మరుక్షణం నుంచే కొన్ని కాలేజీలు ప్రత్యేకంగా ప్రజా సంబంధాల అధికారులను (పీఆర్వోలు), ఏజెంట్లను, కన్సల్టెన్సీలను ఏర్పాటు చేసుకున్నాయి. వాళ్ళు 40 వేల ర్యాంకు పైన వచ్చిన విద్యార్థుల ఫోన్‌ నంబర్లు సంపాదించి, సీటు కోసం ఎర వేస్తున్నారు. నగర శివార్లలోని ఓ కాలేజీ ఏకంగా ఆరుగురు పీఆర్‌వోలను ఇందుకోసం తాత్కాలికంగా నియమించుకుంది.

ప్రతి సీటుకు రూ.75 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు కన్సల్టెన్సీలకు ఇచ్చేందుకు బేరం కుదుర్చుకుంది. దీంతో ఏజెంట్లు.. విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి, సీట్లు అయిపోతున్నాయంటూ, ఇప్పుడే బుక్‌ చేసుకోవాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. సీటు మాట్లాడేందుకు రమ్మని కాలేజీ యాజమాన్యం వద్దకు తీసుకెళ్ళి, రాయితీ ఇస్తున్నట్టుగా చూపించి అక్కడే అడ్వాన్సుగా రూ.25 వేలు కట్టిస్తున్నారు.  

రూ.లక్షల్లో బేరం 
వాస్తవానికి మేనేజ్‌మెంట్‌ కోటాలో 15% ఎన్‌ఆర్‌ఐ కోటా, 15% స్థానిక మేనేజ్‌మెంట్‌ కోటా కింద సీట్లు భర్తీ చేయాలి. దీనికి ప్రత్యేకంగా నోటిఫికేషన్‌ ఇవ్వాలి. దీనికి ఎలాంటి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఉండదు కాబట్టి, ఎఫ్‌ఆర్‌సీ నిర్ధారించిన ఫీజు మాత్రమే వసూలు చేయాలి. ముందుగా జేఈఈ ర్యాంకు ఉన్నవారికి ఇవ్వాలి. ఇంకా మిగిలితే ఎంసెట్‌ ర్యాంకర్లకు, ఆ తర్వాత ఇంటర్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఇవ్వాలి. యాజమాన్యాలు మాత్రం ఇవేవీ పాటించడం లేదు. ముందే సీట్లు అమ్మేస్తున్నాయి. ప్రముఖ కాలేజీల్లో సీఎస్‌ఈ సీటు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు పలుకుతోంది.

ఓ మోస్తరు కాలేజీల్లోనూ రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన వార్షిక ఫీజుకు ఈ డొనేషన్‌ అదనం అన్నమాట. ఈ మొత్తం నాలుగేళ్లకు రూ.14 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు అవుతుంది. ఇది ఒకేసారి కడితే రాయితీ ఇస్తామంటున్నారు. ఇక ఎన్‌ఆర్‌ఐ కోటా కింద అవసరమైన అన్ని పత్రాలు కాలేజీలే సమకూర్చే ఏర్పాట్లు చేస్తున్నాయి. నిబంధనల ప్రకారం ఏటా 5 వేల యూఎస్‌ డాలర్లు తీసుకోవాలి. అంటే రూ.4 లక్షలు... నాలుగేళ్ళకు రూ.16 లక్షలు ఉంటుంది. ఇది కాకుండా ఇంకో రూ.5 లక్షలు అదనంగా బాదుతున్నారు.  

విద్యార్థులే దరఖాస్తు చేశారంటూ.. 
ఇలాముందే మాట్లాడుకున్న విద్యార్థుల పేర్లను ఉన్నత విద్యామండలికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. మెరిట్‌ ప్రకారమే ఇచ్చామని, వాళ్ళే తమకు సీటుకోసం దరఖాస్తు చేశారని చెబుతున్నారు. ఆన్‌లైన్‌ విధానం లేకపోవడంతో ఎవరు దరఖాస్తు చేశారు? మెరిట్‌ పాటించారా? అనేది తెలియకుండా పోతోంది. దీంతో మేనేజ్‌మెంట్లు ఇష్టానుసారంగా దండుకుంటున్నాయి.

మెరిట్‌ ఉన్నా మేనేజ్‌మెంట్‌ కోటా సీటు ఇవ్వలేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల కమిటీ చైర్మన్‌ స్వరూప్‌రెడ్డి గతంలో పేర్కొన్నారు. కాలేజీ యాజమాన్యాలు నేరుగా తమకు దరఖాస్తు చేసినా వాటిని కాలేజీలకు పంపుతామని చెప్పింది. గత ఏడాది ఇలాంటి ఫిర్యాదులు 50 వరకు వ­చ్చాయి. వాళ్ళు మళ్ళీ ఏం జరిగిందనేది చెప్పలేదని ఎఫ్‌ఆర్‌సీ వర్గాలు పేర్కొంటున్నాయి. 

కౌన్సెలింగ్‌ ద్వారానే భర్తీ చేయాలి 
కన్వీనర్‌ కోటా మాదిరిగానే మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లను కూడా వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారానే భర్తీ చేయాలి. ఈ మేరకు మేం అనేకసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ విధంగా యాజమాన్యాలు అడ్డగోలుగా దోచుకునేందుకు అధికారులే అవకాశం కల్పిస్తున్నారు. దీనివల్ల ప్రతిభ ఉన్న వారికి సీట్లు రావడం లేదు.  
– ప్రవీణ్‌రెడ్డి, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి

నియంత్రించాల్సిందే 
మేనేజ్‌మెంట్‌ కోటా పేరిట దోపిడీ పేదవాడికి శాపంగా మారింది. అసలు కాలేజీల్లో తనిఖీలు చేయకుండా, కాలేజీల్లో మౌలిక వసతులు ఉన్నాయా? లేదా? చూడకుండా, బి కేటగిరీ సీట్లు అమ్ముకునే అధికారం ఎవరిచ్చారు? బహిరంగంగా సాగుతున్న ఈ అక్రమాలను నియంత్రించాల్సిన అవసరం ఉంది. 
– అయినేని సంతోష్‌కుమార్, ప్రైవేటు సాంకేతిక కాలేజీల సిబ్బంది సంఘం రాష్ట్ర అధ్యక్షుడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement