సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ ఫీజుల వ్యవహారంపై త్వరలో స్పష్టత వచ్చే వీలుంది. ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) శనివారం భేటీ కానుంది. టీఏఎఫ్‌ఆర్‌సీ చైర్మన్ స్వరూప్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి కరుణ వాకాటి సహా కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇప్పటివరకు పునఃసమీక్షించిన ఆడిట్ నివేదికల ఆధారంగా 2023 నుంచి అమలు చేసే ఫీజులను నిర్ధారించనున్నారు.
కమిటీ నిర్ణయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తారు. అనంతరం ప్రభుత్వం ఫీజులపై జీవో విడుదల చేయాల్సి ఉంటుంది. 2019లో పెంచిన ఫీజులు 2022 వరకూ అమలులో ఉన్నాయి. మూడేళ్ల తర్వాత మరోసారి ఇంజనీరింగ్ ఫీజుల పెంపు అంశంపై కొన్ని నెలలుగా జరుగుతున్న కసరత్తు జూలైలో పూర్తయింది. కాలేజీల నిర్వహణ ఖర్చు ఆధారంగా కొత్త ఫీజులను ఖరారు చేసినా రెండేళ్లుగా కోవిడ్ వల్ల విద్యాసంస్థలు మూతపడ్డ నేపథ్యంలో పాత ఫీజులనే అమలు చేయాలని ఎఫ్‌ఆర్‌సీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో 80 కాలేజీలు ఫీజుల పెంపును నిలిపివేయడంపై హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో గత మూడు రోజలుగా కాలేజీల ఆడిట్ నివేదికలను ఎఫ్‌ఆర్‌సీ పరీశీలించింది.
పొరపాట్లు గుర్తించినందునే..
చాలా కాలేజీల్లో ఫీజులు తగ్గుతాయని ఆడిట్ నివేదికల పరిశీలన అనంతరం టీఏఎఫ్‌ఆర్‌సీ చైర్మన్ స్వరూప్‌రెడ్డి తెలిపారు. నివేదికల సమీక్షను సొంతంగా చేపట్టామని... న్యాయస్థానం లేదా ప్రభుత్వం తమను ఆదేశించలేదని ఆయన చెప్పారు. ఆయన శుక్రవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ తొలిసారి ఆడిట్‌లో కొన్ని పొరపాట్లు దొర్లినట్లు గుర్తించడం వల్లే మరోసారి నివేదికలను పరిశీలించాల్సి వచ్చిందన్నారు. లోతుగా పరిశీలించిన తర్వాత వాస్తవ ఫీజులను నిర్ధారిస్తున్నామన్నారు.
ఈ లెక్కన జూలైలో నిర్ణయించిన వాటికన్నా చాలా కాలేజీల్లో ఇప్పుడు ఫీజులు తగ్గుతాయని చెప్పారు. ఇప్పుడున్న కనీస ఫీజు రూ. 35 నుంచి 45 వేలకు పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. పెద్ద కాలేజీల ఫీజులు కూడా భారీగానే తగ్గుతా యని చెప్పారు. తుది ఫీజులను నిర్ణయించే అధికారం ఎఫ్‌ఆర్‌సీకి ఉందని, కాలేజీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించినా అవసరమైన వివరణ ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నామని ఓ ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.
సీబీఐటీ ఫీజు రూ.1.12 లక్షలు!
గరిష్ట వార్షిక ఫీజు నిర్ధారణ అయిన సీబీఐటీ కాలేజీ ఫీజును ఆడిట్ నివేదికల పరిశీలన తర్వాత రూ. 1.12 లక్షలుగా టీఎఫ్‌ఆర్‌సీ నిర్ధారించినట్టు తెలిసింది. వాస్తవానికి ఈ కాలేజీ ఫీజును జూలైలో రూ. 1.73 లక్షలుగా నిర్ణయించారు. తాజా పరిశీలనలో కాలేజీ ఖాతాల్లో రూ. 14 కోట్ల నిల్వ ఉన్నట్టు గుర్తించారు. వాటికి సంబంధించి సమగ్ర వివరాలు అందించలేదని ఎఫ్‌ఆర్‌సీ భావించింది. ఆడిట్ నివేదికలు పూర్తయిన తర్వాత యాజమాన్యం నిల్వకు సంబంధించిన వివరాలు ఎఫ్‌ఆర్‌సీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేసినా, దానిని పరిగణనలోకి తీసుకోలేదని తెలిసింది.
మరో ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీ అయిన ఎంజీఐటీ... ‘నాలా’చట్టం కింద మున్సిపల్ ట్యాక్స్ రూ. 3 కోట్ల వరకూ చెల్లిస్తున్నట్లు పేర్కొంది. దీన్ని ఖర్చు కింద పరిగణించడంతో ఈ కాలేజీ ఫీజును రూ. 1.60 లక్షలుగా నిర్ణయించినట్లు సమాచారం. ఆడిట్ నివేదికకు ముందు దాదాపు 25 కాలేజీల్లో రూ. లక్షకుపైగా వార్షిక ఫీజు ఉంటే... పరిశీలన తర్వాత కేవలం 12 కాలేజీల్లో రూ. లక్షకుపైగా వార్షిక ఫీజు ఉండే వీలుందని తెలియవచ్చింది. నాలుగైదు కాలేజీలు మినహా దాదాపు అన్ని కాలేజీల్లోనూ ఫీజులు తగ్గే వీలుందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment