TAFRC
-
త్వరలో ‘వైద్య’ ఫీజుల పెంపు!
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ మెడికల్ తదితర వైద్య కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఫీజుల పెంపునకు రంగం సిద్ధమైంది. ఈ అంశానికి సంబంధించి తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) కసరత్తు పూర్తి చేసింది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఫీజులను సవరించనుంది. ఎంబీబీఎస్, పీజీ మెడికల్ సహా ఇతర కోర్సుల ఫీజులను మూడేళ్లకోసారి సవరించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. గతంలో ఏడాదికోసారి 5 శాతం చొప్పున సవరించాలన్న నిర్ణయాన్ని మార్పు చేశారు. ఆ ప్రకారం ఈ సారి తప్పనిసరిగా ఫీజుల సవరణ జరుగుతుందని హెల్త్ వర్సిటీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ప్రైవేటు కాలేజీ ల్లో మెడికల్ కోర్సుల ఫీజులు రూ. లక్షల్లో ఉండగా త్వర లో అంతకు మించి పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక్కో మెడికల్ కాలేజీకి ఒక్కో ఫీజు... ఇప్పటివరకు రాష్ట్రంలో మెడికల్ కోర్సుల ఫీజులు ఒకే రీతిన ఉన్నాయి. ఇకపై ఒక్కో కాలేజీలో ఒక్కో రకమైన ఫీజు ఉండనుంది. ఆ ప్రకారమే ఎంబీబీఎస్, పీజీ మెడికల్ సహా ఇతర వైద్య కోర్సుల ఫీజులుంటాయి. అందుకు అనుగుణంగానే కాలేజీలవారీగా ఆడిట్ రిపోర్టులను టీఏఎఫ్ఆర్సీ తీసుకుంది. వాటి ఆధారంగానే ఫీజుల సవరణ చేయనుంది. ఇందులో కాలేజీల నిర్వహణ ఖర్చులు మొదలు, బోధన, బోధనేతర సిబ్బంది వేతనాలు, ల్యాబ్‌ల నిర్వహణ తదితర పూర్తిస్థాయి సమాచారం సేకరించారు. ఈ ఖర్చులు గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో ఒక రకంగా ఉంటే పట్టణ ప్రాంతాల్లోని కాలేజీల్లో మరో రకంగా ఉంటాయి. ఈ దిశగా కాలేజీవారీగా ఆడిట్ నివేదికలు పరిశీలించిన టీఏఎఫ్ఆర్సీ ఫీజుల సవరణపై ఒక అంచనాకు వచ్చింది. కాలేజీలవారీగా ఫీజుల పెంపు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి సమరి్పంచినట్లు తెలిసింది. దీంతో ఫీజుల పెంపు వ్యవహారంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. కొన్ని కాలేజీల్లో 20 శాతం వరకు పెరిగే అవకాశం.. ప్రస్తుతమున్న ఫీజులను కొన్ని కాలేజీలు 20 శాతం వరకు పెంచాలని కోరగా మరికొన్ని 10 శాతం, కొన్ని 5 శాతం, ఇంకొన్ని యథాతథంగా ఉంచాలని కోరినట్లు సమాచారం. ప్రైవేటు కాలేజీల్లో ప్రస్తుతం ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించి ఏ–కేటగిరీ (కన్వినర్) ఫీజు రూ. 60 వేలు ఉండగా బీ–కేటగిరీ ఫీజు రూ. 11.55 లక్షలుగా ఉంది. ఇక సీ–కేటగిరీ (ఎన్ఆర్ఐ) అడ్మిషన్ ఫీజు బీ–కేటగిరీకి రెట్టింపు అంటే రూ. 23.10 లక్షల వరకు వసూలు చేసుకొనే వీలుంది. ఇక పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏ–కేటగిరీ ఫీజు రూ. 7.5 లక్షలు, బీ–కేటగిరీ రూ. 28 లక్షల నుంచి రూ. 30 లక్షల చొప్పున ఉన్నాయి. బీడీఎస్ కోర్సులకు సంబంధించి ఏ–కేటగిరీ ఫీజు రూ. 45 వేలు ఉండగా బీ–కేటగిరీ ఫీజు రూ. 4.2 లక్షలు, ఇక సీ–కేటగిరీ ఫీజు బీ–కేటగిరీ కంటే రెట్టింపు వసూలు చేసుకోవచ్చు. వాటితోపాటు బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, హోమియోపతి, పారామెడికల్ కోర్సులకు సంబంధించిన ఫీజులు కూడా కాలేజీలవారీగా భిన్నంగా ఉన్నాయి. -
ఇంజనీరింగ్ ఫీజులు తగ్గుతాయ్!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ ఫీజుల వ్యవహారంపై త్వరలో స్పష్టత వచ్చే వీలుంది. ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) శనివారం భేటీ కానుంది. టీఏఎఫ్ఆర్సీ చైర్మన్ స్వరూప్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి కరుణ వాకాటి సహా కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇప్పటివరకు పునఃసమీక్షించిన ఆడిట్ నివేదికల ఆధారంగా 2023 నుంచి అమలు చేసే ఫీజులను నిర్ధారించనున్నారు. కమిటీ నిర్ణయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తారు. అనంతరం ప్రభుత్వం ఫీజులపై జీవో విడుదల చేయాల్సి ఉంటుంది. 2019లో పెంచిన ఫీజులు 2022 వరకూ అమలులో ఉన్నాయి. మూడేళ్ల తర్వాత మరోసారి ఇంజనీరింగ్ ఫీజుల పెంపు అంశంపై కొన్ని నెలలుగా జరుగుతున్న కసరత్తు జూలైలో పూర్తయింది. కాలేజీల నిర్వహణ ఖర్చు ఆధారంగా కొత్త ఫీజులను ఖరారు చేసినా రెండేళ్లుగా కోవిడ్ వల్ల విద్యాసంస్థలు మూతపడ్డ నేపథ్యంలో పాత ఫీజులనే అమలు చేయాలని ఎఫ్ఆర్సీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో 80 కాలేజీలు ఫీజుల పెంపును నిలిపివేయడంపై హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో గత మూడు రోజలుగా కాలేజీల ఆడిట్ నివేదికలను ఎఫ్ఆర్సీ పరీశీలించింది. పొరపాట్లు గుర్తించినందునే.. చాలా కాలేజీల్లో ఫీజులు తగ్గుతాయని ఆడిట్ నివేదికల పరిశీలన అనంతరం టీఏఎఫ్ఆర్సీ చైర్మన్ స్వరూప్‌రెడ్డి తెలిపారు. నివేదికల సమీక్షను సొంతంగా చేపట్టామని... న్యాయస్థానం లేదా ప్రభుత్వం తమను ఆదేశించలేదని ఆయన చెప్పారు. ఆయన శుక్రవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ తొలిసారి ఆడిట్లో కొన్ని పొరపాట్లు దొర్లినట్లు గుర్తించడం వల్లే మరోసారి నివేదికలను పరిశీలించాల్సి వచ్చిందన్నారు. లోతుగా పరిశీలించిన తర్వాత వాస్తవ ఫీజులను నిర్ధారిస్తున్నామన్నారు. ఈ లెక్కన జూలైలో నిర్ణయించిన వాటికన్నా చాలా కాలేజీల్లో ఇప్పుడు ఫీజులు తగ్గుతాయని చెప్పారు. ఇప్పుడున్న కనీస ఫీజు రూ. 35 నుంచి 45 వేలకు పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. పెద్ద కాలేజీల ఫీజులు కూడా భారీగానే తగ్గుతా యని చెప్పారు. తుది ఫీజులను నిర్ణయించే అధికారం ఎఫ్ఆర్సీకి ఉందని, కాలేజీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించినా అవసరమైన వివరణ ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నామని ఓ ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. సీబీఐటీ ఫీజు రూ.1.12 లక్షలు! గరిష్ట వార్షిక ఫీజు నిర్ధారణ అయిన సీబీఐటీ కాలేజీ ఫీజును ఆడిట్ నివేదికల పరిశీలన తర్వాత రూ. 1.12 లక్షలుగా టీఎఫ్ఆర్సీ నిర్ధారించినట్టు తెలిసింది. వాస్తవానికి ఈ కాలేజీ ఫీజును జూలైలో రూ. 1.73 లక్షలుగా నిర్ణయించారు. తాజా పరిశీలనలో కాలేజీ ఖాతాల్లో రూ. 14 కోట్ల నిల్వ ఉన్నట్టు గుర్తించారు. వాటికి సంబంధించి సమగ్ర వివరాలు అందించలేదని ఎఫ్ఆర్సీ భావించింది. ఆడిట్ నివేదికలు పూర్తయిన తర్వాత యాజమాన్యం నిల్వకు సంబంధించిన వివరాలు ఎఫ్ఆర్సీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేసినా, దానిని పరిగణనలోకి తీసుకోలేదని తెలిసింది. మరో ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీ అయిన ఎంజీఐటీ... ‘నాలా’చట్టం కింద మున్సిపల్ ట్యాక్స్ రూ. 3 కోట్ల వరకూ చెల్లిస్తున్నట్లు పేర్కొంది. దీన్ని ఖర్చు కింద పరిగణించడంతో ఈ కాలేజీ ఫీజును రూ. 1.60 లక్షలుగా నిర్ణయించినట్లు సమాచారం. ఆడిట్ నివేదికకు ముందు దాదాపు 25 కాలేజీల్లో రూ. లక్షకుపైగా వార్షిక ఫీజు ఉంటే... పరిశీలన తర్వాత కేవలం 12 కాలేజీల్లో రూ. లక్షకుపైగా వార్షిక ఫీజు ఉండే వీలుందని తెలియవచ్చింది. నాలుగైదు కాలేజీలు మినహా దాదాపు అన్ని కాలేజీల్లోనూ ఫీజులు తగ్గే వీలుందని తెలుస్తోంది. -
మరో 15% ఫీజులు.. మరింత భారం కానున్న ఇంజనీరింగ్, ఫార్మసీ విద్య
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంజనీరింగ్, ఫార్మసీ విద్య మరింత భారం కానుంది. ఈసారి భారీగా ఫీజులు పెంచేందుకు ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి. అయితే ఏ మేరకు పెంచాలనే దానిపై రాష్ట్ర అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ మరో వారంలో విడుదల చేస్తామని టీఏఎఫ్ఆర్సీ వర్గాలు తెలిపాయి. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు సమర్పించే ఫీజు పెంపు ప్రతి పాదనలపై ఫీజుల నియంత్రణ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. పెరిగే ఫీజులు వచ్చే విద్యా సంవత్సరం (2022–23)నుంచి అమల్లోకి వస్తాయి. అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిబంధనల ప్రకారం మూడేళ్లకోసారి ఫీజు లపై టీఏఎఫ్ఆర్సీ సమీక్షించాల్సి ఉంటుంది. కాలేజీల్లో కల్పించే మౌలికవసతులు, వాటి నిర్వహణ వ్యయం ప్రాతిపదికగా ఫీజుల పెంపును టీఏఎఫ్ఆర్సీ నిర్ధారిస్తుంది. 2019లో జరిగిన ఈ కసరత్తు గడువు ఈ ఏడాదితో ముగుస్తుంది. 15 శాతంపైనే పెంపు?: రాష్ట్రంలో 158 ఇంజనీరింగ్, 112 ఫార్మసీ, 54 ఫార్మా డీ కాలేజీలున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఇంజనీరింగ్ వార్షిక ఫీజు కనిష్టంగా రూ. 44 వేలు ఉండగా గరిష్టంగా రూ. 1.34 లక్షల వరకూ ఉంది. 25 కాలేజీల్లో ఫీజు రూ. లక్షకుపైగా ఉంటే మిగతా కాలేజీల్లో రూ. లక్షలోపు ఉంది. ఈసారి 15 శాతం మేర ఫీజులు పెంచాలని కాలేజీల యాజమాన్యాలు భావిస్తున్నాయి. అందుకు టీఏఎఫ్ఆర్సీ ఆమోదం తెలిపితే ఇంజనీరింగ్‌లో వార్షిక ఫీజు కనిష్టంగా రూ. 50 వేల నుంచి రూ. 1.50 లక్షలకుపైగా ఉండే వీలుంది. అంటే ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేయడానికి రూ. 2 లక్షల నుంచి రూ. 6 లక్షలు ఖర్చయ్యే వీలుంది. కరోనా కాలంలోనూ ఖర్చా?: గత మూడేళ్లలో కాలేజీల నిర్వహణ వ్యయంతోపాటు మౌలిక సదుపాయాల విస్తరణ, విద్యాప్రమాణాల మెరుగుదలకు చేసిన ఖర్చు వివరాలను యాజమాన్యాలు టీఏఎఫ్ఆర్సీకి ఇవ్వాలి. అయితే 2019 తర్వాత కరోనా కారణంగా విద్యాసంస్థలు పెద్దగా కొనసాగలేదు. ఆన్లైన్ బోధనతోనే సరిపెట్టాయి. అలాంటప్పుడు కొత్తగా అయ్యే వ్యయం ఏమిటి? ఎందుకు ఫీజులు పెంచాలనే వాదన అన్ని వర్గాల నుంచి వస్తోంది. కానీ యాజమాన్యాలు మాత్రం కరోనా కాలంలో ఆన్లైన్ బోధన కోసం సాంకేతిక ఏర్పాట్లు చేసుకున్నామని, ఇదంతా తమకు అదనపు వ్యయమేనని పేర్కొంటున్నాయి. ఈ దిశగా ఆడిట్ రిపోర్టులు తయారు చేస్తున్నాయి. అయితే పేరున్న కాలేజీల్లో కొంతమేర ఆన్లైన్ క్లాసులు ప్రమాణాల మేరకే జరిగినా వాటి సంఖ్య 20కు మించదని టీఏఎఫ్ఆర్సీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని కాలేజీలను ఒకేగాటన కట్టడం సరికాదని అభిప్రాయపడుతున్నాయి. కష్టకాలంలో భారం వద్దు... కరోనా కష్టకాలంలో విద్యా వ్యవస్థే అతలాకుతలమైంది. ఆర్థిక భారంతో పేదలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో ఫీజులు పెంచితే సహించేది లేదు. – ప్రవీణ్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నిరసనలు చేపడతాం కాలేజీల యాజమాన్యాల ఫీజుల పెంపు ఆలోచన హేతుబద్ధం కాదు. ఈ ప్రతిపాదన అమలు చేయరాదని టీఏఎఫ్ఆర్సీపై ఒత్తిడి తెస్తాం. నిరసనలు చేపడతాం. – నాగరాజు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి -
ఒకేసారి ఫీజు చెల్లించాలని ఒత్తిడి చేయొద్దు
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు ఒకేసారి మొత్తం ఫీజు చెల్లించాలని ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు ఒత్తిడి చేయొద్దని రాష్ట్ర ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ఆదేశించింది. రుసుముల విషయంలో ఏఐసీటీఈ నిబంధనలు అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రిన్స్‌స్టన్ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిని లావణ్య ఆత్మహత్యపై టీఏఎఫ్ఆర్సీకి ఏబీవీపీ ఫిర్యాదు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదా పద్ధతుల్లో ట్యూషన్ ఫీజు చెల్లించడానికి ఏఐసీటీఈ ఆదేశాలున్నప్పటికీ, ఒకే విడతలో ట్యూషన్ ఫీజు చెల్లించాలని కాలేజీలు బలవంతం చేస్తున్నాయంది. దీనిపై చర్యలు చేపట్టాలని ఏబీవీపీ కోరింది. -
నాలుగున్నరేళ్ల కోర్సు.. 5 ఏళ్లకు ఫీజా?
సాక్షి, హైదరాబాద్: మెడికల్ ఫీజుల వసూలు విధానాన్ని తప్పుపడుతూ హైకోర్టు తీర్పు చెప్పింది. ఇష్టానుసారంగా ఫీజు వసూళ్లు చేయడానికి వీల్లేదని, వైద్య కోర్సుల కాలానికి తగ్గట్టుగానే ఫీజులు ఉండాలని తేల్చిచెప్పింది. ఫీజుల విషయంలో తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) కాలేజీ యాజమాన్యాలకు అనుకూలంగా అఫిడవిట్లను దాఖలు చేయడాన్ని హైకోర్టు ఆక్షేపించింది. వైద్య (ఎంబీబీఎస్) కోర్సు నాలుగున్నరేళ్లయితే ఐదేళ్లకు ఫీజులెలా వసూలు చేస్తారని ప్రశ్నించింది. ప్రభుత్వం జీవో నం.120, ఏపీ ప్రభుత్వం జీవో నం.30లను జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ వరంగల్‌కు చెందిన మైనర్ డి.పద్మతేజ 2018లో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావు, జస్టిస్ కె.లక్ష్మణ్‌ల ధర్మాసనం ఇటీవల తీర్పు చెప్పింది. తెలంగాణ జీవో వరకే: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో వరకే తీర్పు వెలువరిస్తున్నామని, ఏపీ ప్రభుత్వ జీవో చట్టబద్ధత జోలికి వెళ్లడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషనర్ లేవనెత్తిన ఫీజుల అంశానికి మాత్రమే తీర్పు పరిమితం చేస్తున్నామని, ఇతర అంశాల్లోకి వెళ్లడం లేదని వివరించింది. ఫీజుల నిర్ణయం చేసేప్పుడు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సంఘాలను ప్రభుత్వం/టీఏఎఫ్‌ఆర్‌సీలు పట్టించుకోలేదని ఆక్షేపించింది. వైద్య కోర్సు నాలుగున్నరేళ్లకే ఫీజు వసూలు చేయాలని ఆదేశించింది. నాలుగున్నరేళ్లకే ఫీజు వసూలు చేయాలని 2017లో ఇచ్చిన జీవో నం.120 ప్రకారమే ఫీజుల వసూళ్లు ఉండాలని, అయితే తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ మెడికల్ అండ్ డెంటల్ కాలేజీ యాజమాన్యాల సంఘంలోని కాలేజీలు ఐదేళ్ల ఫీజులు వసూలు చేస్తే ఏపీ విద్యా సంస్థల చట్టం కింద చర్యలు తీసుకోవచ్చునని స్పష్టం చేసింది. ప్రైవేటు మెడికల్ డెంటల్ కాలేజీలకు 5 సంవత్సరాలకు ఫీజు వసూలుకు అనుమతివ్వడం చెల్లదని తేల్చింది. -
200 శాతం పెరగనున్న ఇంజనీరింగ్ ఫీజు!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని కొన్ని ప్రధాన ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల మోత మోగనుంది. ఏకంగా 200 శాతానికి మించి ఫీజు పెంపును కాలేజీల యాజమాన్యాలు ప్రతిపాదించాయి. టాప్ కాలేజీల్లో ఒకటైన చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(సీబీఐటీ) ఏకంగా రూ.3 లక్షల వార్షిక ఫీజును ప్రతిపాదించింది. మిగతా 75 ప్రధాన కాలేజీలు కూడా ఫీజుల పెంపు ప్రతిపాదనలను తెలంగాణ ఫీజులు, ప్రవేశాల నియంత్రణ కమిటీకి (టీఏఎఫ్ఆర్సీ) అందజేశాయి. ఫీజుల పెంపు కోసం ఇప్పటికే 6 కాలేజీలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం టీఏఎఫ్ఆర్సీకి చైర్మన్‌ను నియమించి, కాలేజీలవారీగా ఫీజులను ఖరారు చేసే వరకు యాజమాన్యాలు ప్రతిపాదించిన ఫీజును అమలు చేయాలని, ఫీజులు ఖరారయ్యాక మిగతా మొత్తాన్ని సర్దుబాటు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు ఉన్నత విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ప్రభుత్వవర్గాలు పడ్డాయి. ఫీజు ఖరారు గడువు ముగిసింది 2016లో ఖరారు చేసిన ఫీజుల గడువు 2018–19 విద్యా సంవత్సరంతో ముగిసింది. దీంతో 2019–20 విద్యా సంవత్సరం నుంచి వచ్చే మూడేళ్లపాటు ఫీజులను ఖరారు చేయాల్సి ఉంటుంది. హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని ఫీజుల కమిటీ ఖరారు చేస్తేనే వాటికి చట్టబద్ధత ఉంటుంది. వరుస ఎన్నికల కారణంగా టీఏఎఫ్ఆర్సీకి చైర్మన్ నియామకం అంశం మరుగున పడిపోయింది. చైర్మన్ నియామకం జరిగేలోగా టీఏఎఫ్ఆర్సీ సభ్య కార్యదర్శి హోదాలో విద్యాశాఖ కార్యదర్శి ఫీజుల ప్రతిపాదనల స్వీకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు. యాజమాన్య ప్రతిపాదిత ఫీజులను అమలు చేస్తే తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో ఆ ఉత్తర్వులపై అప్పీల్‌కు వెళ్లాలని ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చింది. అయితే ఇంకా కోర్టు ఆర్డర్ కాపీ అందలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. 27 నుంచి ఆప్షన్లు ప్రారంభమయ్యేనా? ఆయా కాలేజీలన్నింటిలోనూ యాజమాన్య ప్రతిపాదిత ఫీజును అమలు చేయాల్సిన పరిస్థితి వస్తే సాధారణ కాలేజీల్లోనూ భారీగా ఫీజుల పెంపును అమలు చేయాల్సి వస్తుంది. టీఏఎఫ్ఆర్సీకి చైర్మన్ నియామకం తరువాత కొత్త ఫీజులను ఖరారు చేశాక మిగులు ఫీజులను సర్దుబాటు చేయాలని పేర్కొన్నప్పటికీ ముందుగా ప్రతిపాదిత ఫీజును చూసి విద్యార్థులు తీవ్ర ఆందోళనలో పడే ప్రమాదం నెలకొంది. ఇప్పటికే ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ప్రవేశాల కమిటీ ప్రారంభించింది. రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించింది. ఈ నెల 27వ తేదీ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్లను ప్రారంభించాలని నిర్ణయించింది. కోర్టు ఉత్తర్వులు కాపీ అందనప్పుడు, అప్పీల్‌కు వెళ్లనపుడు 27వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లను ప్రారంభిస్తారా? లేదా? అనేది గందరగోళంగా మారింది. వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇస్తే మాత్రం కచ్చితంగా కాలేజీల వారీగా ఫీజులను వెబ్సైట్లో అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. 27వ తేదీలోగా కోర్టు ఉత్తర్వులు అందితే అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉంది. లేదంటే వెబ్ ఆప్షన్ల ప్రక్రియను వాయిదా వేసి, కోర్టు ఉత్తర్వుల కాపీ అందాకే అప్పీల్‌కు వెళ్లాలని, ఆ తరువాతే వెబ్ ఆప్షన్లను ప్రారంభించాలని భావిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి అధికారులు పేర్కొంటున్నారు. -
నకిలీ అధ్యాపకుల ఆటకట్టు
సాక్షి, హైదరాబాద్: వృత్తి విద్యాకోర్సుల ఫీజుల ఖరారు ప్రక్రియలో నకిలీ అధ్యాపకులను చూపించే యాజమాన్యాలకు తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) అడ్డుకట్ట వేసింది. ఇకపై అధ్యాపకుల పాన్ కార్డు, ఆధార్ వివరాలు సమర్పించి.. వాటిని తప్పనిసరిగా ఆన్లైన్ వెరిఫికేషన్ చేయించుకోవాలని నూతన నిబంధనను తీసుకొచ్చింది. యాజమాన్యాలు తమ కాలేజీల్లో తక్కువ మంది అధ్యాపకులు ఉన్నా, ఎక్కువమంది అధ్యాపకులు పనిచేస్తున్నట్లుగా చూపించేవారు. వారికి భారీగా వేతనాలు చెల్లిస్తున్నట్లు ఖర్చు చూపించి.. కోర్సుల ఫీజు ఖరారులో భారీగా లబ్ధి పొందేవారు. అధ్యాపకుల పాన్, ఆధార్ వివరాలనూ సమర్పించేవారు కాదు. పైగా ఒక కాలేజీ చూపించిన అధ్యాపకులను మరో కాలేజీ కూడా చూపించేది. బీటెక్ కోర్సులకు బోధించే ఫ్యాకల్టీని ఎంటెక్ కోర్సుల్లోనూ బోధిస్తున్నట్లుగా చూపించేవారు. వీటిని దృష్టిలో పెట్టుకు న్న కమిటీ.. యాజమాన్యాల ఆటలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ నిబంధనలను తీసుకొచ్చింది. దీని ప్రకారం యాజమాన్యాలు తమ వద్ద పనిచేస్తున్న అధ్యాపకుల పాన్ కార్డు, ఆధార్ నంబర్లు ఆన్లైన్లో నమోదు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. వాటిని ప్రాసెస్ చేసేది నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్(ఎన్ఐసీ) అయినందునా, ఆధార్, పాన్ వివరాలు కూడా వారి వద్దే ఉండనున్నాయి. బీటెక్ బోధించేవారు ఎంటెక్ బోధించడానికి వీల్లేదన్న నిబంధనను విధించింది. ఒక కాలేజీలో పనిచేసే అధ్యాపకుడు మరో కాలేజీలో పనిచేస్తున్నట్లు చూపిస్తే ఆన్లైన్లోనే గుర్తించి కోత పెట్టేలా చర్యలు చేపట్టింది. ఆదాయ వ్యయాలు ఆన్లైన్లోనే.. బీటెక్, ఎంటెక్, బీఫార్మసీ, ఎం.ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్, డీఎడ్ తదితర వృత్తి విద్యా కోర్సుల ఫీజుల ఖరారు కోసం ఇటీవల టీఏఎఫ్ఆర్సీ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 24వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తోంది. గతంలో ఆడిట్ డాక్యుమెంట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే వాటిని పరిశీలించి ఆదాయ వ్యయాలను లెక్కించే వారు. కానీ ఈసారి అలా కాకుండా మొత్తంగా ఆన్లైన్ చేసింది. డాక్యుమెంట్లను ఈమెయిల్ పంపించేలా చర్యలు చేపట్టడమే కాకుండా ఆదాయ వ్యయాల వివరాలను ఆన్లైన్లోనే డ్యాష్‌బోర్డులో నమోదు చేసేలా చర్యలు చేపట్టింది. దీంతో తాము కోరుకున్నట్లుగా రిపోర్టును జనరేట్ చేసుకునే వీలు ఏర్పడనుంది. కాలేజీలు నో ప్రాఫిట్, నో లాస్ విధానంలో నడవాల్సి ఉంది. దీంతో కాలేజీల ఖర్చులతో పోల్చితే ఆదాయం 15 శాతానికి మించి ఉండకూడదన్న నిబంధనను విధించింది. 2019–20, 2020–21, 2021–22 విద్యా సంవత్సరాల్లో వసూలు చేయాల్సిన ఫీజులను ఖరారు చేసేందుకు 2016–17, 2017–18 విద్యా సంవత్సరాల ఆదాయ వ్యయాలు మాత్రమే అందజేయాలని స్పష్టం చేసింది. 2018–19 విద్యా సంవ త్సరం పూర్తి కానందున గత రెండేళ్ల వివరాలనే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. ప్రాసెసింగ్ ఫీజు భారీ పెంపు.. ఈసారి ప్రాసెసింగ్ ఫీజును భారీగా పెంచింది. గతంలో బీఈ/బీటెక్, బీఫార్మసీ, ఫార్మా–డీ, బీఆర్క్, బీ ప్లానింగ్, ఎంఈ/ఎంటెక్, ఎం.ఆర్క్, ఎం.ప్లానింగ్, ఎం.ఫార్మసీ, ఫార్మా–డీ (పీబీ), బీఎఫ్ఏ (ఐదేళ్ల కోర్సు) కోర్సుల ఫీజుల ఖరారు ప్రాసెసింగ్ ఫీజు ఒక్కో కోర్సుకు రూ.11,475 ఉండగా, దానిని రూ.18 వేలకు పెంచింది. ఇక ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, ఎల్పీటీ (తెలుగు, ఉర్దూ, హిందీ), ఎంఈడీ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, బీఎఫ్ఏ (మూడేళ్ల కోర్సు), బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల ప్రాసెసింగ్ ఫీజు ఒక్కో కోర్సుకు గతంలో రూ.5,750 ఉండగా, దానిని రూ.9 వేలకు పెంచింది. -
వృత్తి విద్యా ఫీజుల ఖరారుకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వృత్తి విద్యా కాలేజీల్లో ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర కోర్సులకు వచ్చే మూడేళ్లపాటు (2019–20, 2020–21, 2021–22 విద్యాసంవత్సరాల్లో) వసూలు చేయనున్న ఫీజులను ఖరారు చేసేందుకు తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. కాలేజీల గడిచిన రెండేళ్ల ఆదాయ వ్యయాల ఆధారంగా ఫీజుల ఖరారు ఉం టుందని పేర్కొంది. యాజమాన్యాలు కోర్సుల వారీగా తమ ఆదాయ వ్యయాల వివరాలు, ఫీజుల ప్రతిపాదనలను ఈ నెల 25 నుంచి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించింది. వాటిని ఆన్లైన్లో సబ్మిట్ చేసేందుకు వచ్చే నెల 21 వరకు గడువును ఇస్తున్నట్లు తెలిపింది. మరిన్ని వివరాలను ఈ నెల 25న తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని వివరించింది. ఈసారి 10 శాతానికి పైగా ఫీజులు పెరిగే అవకాశంఉంది. ప్రస్తుతం కాలేజీ యాజమాన్యాలు తమ ఫ్యాకల్టీకి యూజీసీ వేతనాలను అమలు చేయా లని ప్రభుత్వం స్పష్టం చేస్తున్న నేపథ్యంలో వేతనాల వివరాలనూ తీసుకోవాలని భావిస్తోంది. దీంతో కొన్ని యాజమాన్యాలు యూజీసీ నిర్దేశిత వేత నాలను చెల్లించకపోయినా, చెల్లిస్తున్నట్లుగా లెక్కలు చూపే అవకాశముంది. కొన్ని యాజమాన్యాలు ఫ్యాకల్టీ ఖాతాల్లో నిబంధనల ప్రకారం జమ చేస్తూ వెనక్కి తీసుకుంటున్నవి ఉన్నట్లు అధికారులు గతంలో గుర్తించారు. ఈ నేపథ్యంలో తాము చెల్లిస్తున్న వేతనాల వివరాలను చూపించే అవకాశం ఉంది. దీంతో ఈసారి ఫీజులు 10 శాతానికి పైగా పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. రెండేళ్ల ఫీజు వివరాలే ఎందుకంటే.. సాధారణంగా గత మూడేళ్ల ఆదాయ వ్యయాలను పరిగణనలోకి తీసుకొని వచ్చే మూడేళ్ల ఫీజులను టీఏఎఫ్ఆర్సీ ఖరారు చేస్తోంది. మూడేళ్ల ఆదాయ వ్యయాలు ఇచ్చే క్రమంలో కొన్ని తప్పిదాలు దొర్లుతున్నాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం 2019–20, 2020–21, 2021–22ల్లో వసూలు చేసే ఫీజుల ఖరారుకు 2016–17, 2017–18, 2018–19ల్లో కాలేజీలకు వచ్చిన ఆదాయం, వారు ఖర్చు చేసిన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. గతంలో ఫీజులను నిర్ణయించినప్పుడు చివరి ఏడాది ఆడిట్ నివేదికలు అందకపోవడంతో కాలేజీలు ధ్రువీకరించిన లేఖలతోనే ఆ ఏడాది ఫీజులను పరిగణనలోకి తీసుకునేవారు. దీంతో లెక్కల్లో తప్పులు దొర్లుతున్నాయన్న విషయాన్ని గుర్తించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వసూలు చేసే ఫీజులను నిర్ణయించే క్రమంలోనూ 2018–19 విద్యా సంవత్సరపు ఆడిట్ నివేదికలతో కూడిన లెక్కలు ఇప్పుడే వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి రెండేళ్ల (2016–17, 2017–18 విద్యా సంవత్సరా లు) లెక్కల మేరకే ఫీజులు నిర్ణయించేందుకు చర్య లు చేపట్టింది. కాలేజీల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించేలా నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) చర్యలు చేపట్టేందుకు అంగీకరించింది. ఈ నెల 25 నుంచి వెబ్సైట్ అందుబాటులోకి రానుంది. -
వాసవి, శ్రీనిధి కాలేజీల్లో ఫీజు పెంపు
సాక్షి, హైదరాబాద్: వాసవి, శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీల్లో వార్షిక ఫీజు పెరిగింది. గత జూలైలో వాసవి కాలేజీ వార్షిక ఫీజును రూ.86 వేలుగా నిర్ణయిం చగా, ప్రస్తుతం రూ.97 వేలు.. శ్రీనిధి కాలేజీ ఫీజు గతంలో రూ.91 వేలుండగా, తాజాగా రూ.97 వేలకు పెంచినట్లు తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ ఆర్సీ) ప్రకటించింది. వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో (ఘట్కేసర్) ఒక్కో విద్యార్థిపై రూ.11 వేలు, శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో (ఘట్కేసర్) రూ.6 వేలు ఫీజు పెరిగింది. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో మూడేళ్లపాటు (2016–17, 2017–18, 2018–19 విద్యా సంవత్సరాల్లో) అమలు చేయాల్సిన వార్షిక ఫీజును టీఏఎఫ్ఆర్సీ గత జూలైలో నిర్ణయించింది. అయితే టీఏఎఫ్ఆర్సీ నిర్ణయించిన ఫీజు హేతుబద్ధంగా లేదని, తాము వెచ్చిస్తున్న ఖర్చులను పరిగణనలోకి తీసుకోలేదని, తమకు అన్యాయం జరిగిందని వాసవి, శ్రీనిధి కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. కేసును విచారించిన హైకోర్టు.. ఆయా కాలేజీల ఆదాయ వ్యయాలను మరో సారి పరిశీలించి, ఫీజులను నిర్ధారించాలని ఆదేశించింది. దీంతో ఈ నెల 6న టీఏఎఫ్ఆర్సీ కాలేజీ యాజమా న్యాలతో చర్చించి, ఆదాయ వ్యయాలను పరిశీలించి తాజా పెంపును టీఏఎఫ్ఆర్సీ ఖరారు చేసింది. -
‘శ్రీనిధి’ వ్యయాలను మళ్లీ పరిశీలించండి
టీఏఎఫ్ఆర్సీకి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో 2016-17 నుంచి 2018-19 విద్యా సంవత్సరాల ఇంజనీరింగ్ కోర్సుకు తెలంగాణ ప్రవేశాలు, ఫీజు నియంత్రణ కమిషన్ (టీఏఎఫ్ఆర్సీ) నిర్ణయించిన రూ. 91 వేల ఫీజును హైకోర్టు ప్రాథమికంగా తప్పుపట్టింది. శ్రీనిధి కాలేజీ సమర్పించిన వ్యయాల రికార్డులను మరోసారి పరిశీలన చేసి ఫీజును నిర్ణయించాలని టీఎఎఫ్‌ఆర్‌సీని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ఇటీవల తీర్పు వెలువరించారు. తమ వ్యయాల ఆధారంగా ఇంజనీరింగ్ కోర్సుకు రూ.1.54 లక్షలను ఫీజు నిర్ణరుుంచాలని కోరితే, టీఏఎఫ్ఆర్సీ మాత్రం రూ. 91 వేలనే ఫీజును నిర్ణయించిందంటూ హైకోర్టును శ్రీనిధి కాలేజీ యాజమాన్యం ఆశ్రయించింది. తమ వ్యయాల రికార్డులను పూర్తిస్థారుులో పరిశీలన చేయకుండానే టీఏఎఫ్ఆర్సీ ఫీజును ఖరారు చేసిందని ఆ కాలేజీ యాజమాన్యం హైకోర్టుకు నివేదించింది. విచారణ జరిపిన జస్టిస్ రామచంద్రరావు ఆ కాలేజీ వ్యయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఫీజు ఖరారుపై తగిన నిర్ణయం తీసుకోవాలని టీఏఎఫ్ఆర్సీని ఆదేశించింది. టీఏఎఫ్ఆర్సీ ఫీజును ఖరారు చేసిన నాటి నుంచి రెండు వారాల్లో దానిని నోటిఫై చేయాలని ప్రభుత్వానికి న్యాయమూర్తి స్పష్టం చేశారు.