వృత్తి విద్యా ఫీజుల ఖరారుకు నోటిఫికేషన్‌  | Notification for professional education fees | Sakshi
Sakshi News home page

వృత్తి విద్యా ఫీజుల ఖరారుకు నోటిఫికేషన్‌ 

Published Tue, Jan 22 2019 2:45 AM | Last Updated on Tue, Jan 22 2019 2:45 AM

Notification for professional education fees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వృత్తి విద్యా కాలేజీల్లో ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర కోర్సులకు వచ్చే మూడేళ్లపాటు (2019–20, 2020–21, 2021–22 విద్యాసంవత్సరాల్లో) వసూలు చేయనున్న ఫీజులను ఖరారు చేసేందుకు తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. కాలేజీల గడిచిన రెండేళ్ల ఆదాయ వ్యయాల ఆధారంగా ఫీజుల ఖరారు ఉం టుందని పేర్కొంది. యాజమాన్యాలు కోర్సుల వారీగా తమ ఆదాయ వ్యయాల వివరాలు, ఫీజుల ప్రతిపాదనలను ఈ నెల 25 నుంచి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించింది. వాటిని ఆన్‌లైన్‌లో సబ్మిట్‌ చేసేందుకు వచ్చే నెల 21 వరకు గడువును ఇస్తున్నట్లు తెలిపింది. మరిన్ని వివరాలను ఈ నెల 25న తమ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచుతామని వివరించింది.

ఈసారి 10 శాతానికి పైగా ఫీజులు పెరిగే అవకాశంఉంది. ప్రస్తుతం కాలేజీ యాజమాన్యాలు తమ ఫ్యాకల్టీకి యూజీసీ వేతనాలను అమలు చేయా లని ప్రభుత్వం స్పష్టం చేస్తున్న నేపథ్యంలో వేతనాల వివరాలనూ తీసుకోవాలని భావిస్తోంది. దీంతో కొన్ని యాజమాన్యాలు యూజీసీ నిర్దేశిత వేత నాలను చెల్లించకపోయినా, చెల్లిస్తున్నట్లుగా లెక్కలు చూపే అవకాశముంది. కొన్ని యాజమాన్యాలు ఫ్యాకల్టీ ఖాతాల్లో నిబంధనల ప్రకారం జమ చేస్తూ వెనక్కి తీసుకుంటున్నవి ఉన్నట్లు అధికారులు గతంలో గుర్తించారు. ఈ నేపథ్యంలో తాము చెల్లిస్తున్న వేతనాల వివరాలను చూపించే అవకాశం ఉంది. దీంతో ఈసారి ఫీజులు 10 శాతానికి పైగా పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.  

రెండేళ్ల ఫీజు వివరాలే ఎందుకంటే.. 
సాధారణంగా గత మూడేళ్ల ఆదాయ వ్యయాలను పరిగణనలోకి తీసుకొని వచ్చే మూడేళ్ల ఫీజులను టీఏఎఫ్‌ఆర్‌సీ ఖరారు చేస్తోంది. మూడేళ్ల ఆదాయ వ్యయాలు ఇచ్చే క్రమంలో కొన్ని తప్పిదాలు దొర్లుతున్నాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం 2019–20, 2020–21, 2021–22ల్లో వసూలు చేసే ఫీజుల ఖరారుకు 2016–17, 2017–18, 2018–19ల్లో కాలేజీలకు వచ్చిన ఆదాయం, వారు ఖర్చు చేసిన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. గతంలో ఫీజులను నిర్ణయించినప్పుడు చివరి ఏడాది ఆడిట్‌ నివేదికలు అందకపోవడంతో కాలేజీలు ధ్రువీకరించిన లేఖలతోనే ఆ  ఏడాది ఫీజులను పరిగణనలోకి తీసుకునేవారు. దీంతో లెక్కల్లో తప్పులు దొర్లుతున్నాయన్న విషయాన్ని గుర్తించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వసూలు చేసే ఫీజులను నిర్ణయించే క్రమంలోనూ 2018–19 విద్యా సంవత్సరపు ఆడిట్‌ నివేదికలతో కూడిన లెక్కలు ఇప్పుడే వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి రెండేళ్ల (2016–17, 2017–18 విద్యా సంవత్సరా లు) లెక్కల మేరకే ఫీజులు నిర్ణయించేందుకు చర్య లు చేపట్టింది. కాలేజీల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించేలా నేషనల్‌ ఇన్ఫర్మాటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) చర్యలు చేపట్టేందుకు అంగీకరించింది. ఈ నెల 25 నుంచి వెబ్‌సైట్‌ అందుబాటులోకి రానుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement