Vocational colleges
-
వృత్తి విద్యా ఫీజుల ఖరారుకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వృత్తి విద్యా కాలేజీల్లో ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర కోర్సులకు వచ్చే మూడేళ్లపాటు (2019–20, 2020–21, 2021–22 విద్యాసంవత్సరాల్లో) వసూలు చేయనున్న ఫీజులను ఖరారు చేసేందుకు తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. కాలేజీల గడిచిన రెండేళ్ల ఆదాయ వ్యయాల ఆధారంగా ఫీజుల ఖరారు ఉం టుందని పేర్కొంది. యాజమాన్యాలు కోర్సుల వారీగా తమ ఆదాయ వ్యయాల వివరాలు, ఫీజుల ప్రతిపాదనలను ఈ నెల 25 నుంచి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించింది. వాటిని ఆన్లైన్లో సబ్మిట్ చేసేందుకు వచ్చే నెల 21 వరకు గడువును ఇస్తున్నట్లు తెలిపింది. మరిన్ని వివరాలను ఈ నెల 25న తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని వివరించింది. ఈసారి 10 శాతానికి పైగా ఫీజులు పెరిగే అవకాశంఉంది. ప్రస్తుతం కాలేజీ యాజమాన్యాలు తమ ఫ్యాకల్టీకి యూజీసీ వేతనాలను అమలు చేయా లని ప్రభుత్వం స్పష్టం చేస్తున్న నేపథ్యంలో వేతనాల వివరాలనూ తీసుకోవాలని భావిస్తోంది. దీంతో కొన్ని యాజమాన్యాలు యూజీసీ నిర్దేశిత వేత నాలను చెల్లించకపోయినా, చెల్లిస్తున్నట్లుగా లెక్కలు చూపే అవకాశముంది. కొన్ని యాజమాన్యాలు ఫ్యాకల్టీ ఖాతాల్లో నిబంధనల ప్రకారం జమ చేస్తూ వెనక్కి తీసుకుంటున్నవి ఉన్నట్లు అధికారులు గతంలో గుర్తించారు. ఈ నేపథ్యంలో తాము చెల్లిస్తున్న వేతనాల వివరాలను చూపించే అవకాశం ఉంది. దీంతో ఈసారి ఫీజులు 10 శాతానికి పైగా పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. రెండేళ్ల ఫీజు వివరాలే ఎందుకంటే.. సాధారణంగా గత మూడేళ్ల ఆదాయ వ్యయాలను పరిగణనలోకి తీసుకొని వచ్చే మూడేళ్ల ఫీజులను టీఏఎఫ్ఆర్సీ ఖరారు చేస్తోంది. మూడేళ్ల ఆదాయ వ్యయాలు ఇచ్చే క్రమంలో కొన్ని తప్పిదాలు దొర్లుతున్నాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం 2019–20, 2020–21, 2021–22ల్లో వసూలు చేసే ఫీజుల ఖరారుకు 2016–17, 2017–18, 2018–19ల్లో కాలేజీలకు వచ్చిన ఆదాయం, వారు ఖర్చు చేసిన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. గతంలో ఫీజులను నిర్ణయించినప్పుడు చివరి ఏడాది ఆడిట్ నివేదికలు అందకపోవడంతో కాలేజీలు ధ్రువీకరించిన లేఖలతోనే ఆ ఏడాది ఫీజులను పరిగణనలోకి తీసుకునేవారు. దీంతో లెక్కల్లో తప్పులు దొర్లుతున్నాయన్న విషయాన్ని గుర్తించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వసూలు చేసే ఫీజులను నిర్ణయించే క్రమంలోనూ 2018–19 విద్యా సంవత్సరపు ఆడిట్ నివేదికలతో కూడిన లెక్కలు ఇప్పుడే వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి రెండేళ్ల (2016–17, 2017–18 విద్యా సంవత్సరా లు) లెక్కల మేరకే ఫీజులు నిర్ణయించేందుకు చర్య లు చేపట్టింది. కాలేజీల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించేలా నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) చర్యలు చేపట్టేందుకు అంగీకరించింది. ఈ నెల 25 నుంచి వెబ్సైట్ అందుబాటులోకి రానుంది. -
ప్రతి కళాశాల ప్రమాణాలు పాటించాల్సిందే
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, వృత్తి విద్యా కాలేజీలు నిబంధనలకు అనుగుణంగా ప్రమాణాలు పాటించాల్సిందేనని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ వేణుగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం జేఎన్టీయూహెచ్ ఆడిటోరియంలో కళాశాల యాజమాన్యాలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి కాలేజీలో బయోమెట్రిక్ హాజరు విధానం తప్పనిసరిగా అమలు చేయాలని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి అనుబంధ గుర్తింపు పొందాలంటే గత మూడేళ్లుగా 25 శాతానికి పైగా అడ్మిషన్లు ఉండాలని, ఉత్తీర్ణత శాతం కూడా మెరుగైన రీతిలో ఉండాలని స్పష్టం చేశారు. కళాశాలల్లో కనీస వసతులు ఉంటేనే అనుబంధ గుర్తింపు ఇస్తామని పేర్కొన్నారు. అయితే అనుబంధ గుర్తింపునకు గత మూడేళ్ల ప్రవేశాలకు బదులుగా ఇప్పటినుంచి మూడేళ్ల ప్రవేశాల తీరును పరిగణలోకి తీసుకోవాలని పలు కాలేజీల యాజమాన్యాలు సూచించినట్లు తెలిసింది. అనుబంధ గుర్తింపునకు, ఉత్తీర్ణతకు ముడిపెట్టొదని యాజమాన్యాలు కోరినట్లు సమాచారం. -
‘వృత్తి’ కాలేజీలు చాలు
‘‘రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,26,855 సీట్లున్నాయి. కానీ 2017లో ఇంటర్ ఎంపీసీలో పాసైంది 1.21 లక్షల మందే! మరోవైపు ఇంజనీరింగ్ కాలేజీల్లో లోపాల కారణంగా 97,961 సీట్లలోనే ప్రవేశాలకు యూనివ ర్సిటీలు అనుమతులి చ్చాయి. వాటిలోనూ భర్తీ అయింది 68,594 సీట్లే! అంటే 1.26 లక్షల సీట్లలో ఏకంగా 46 శాతం ఖాళీగా ఉండిపోయాయి. అంతకుముందు సంవత్సరాల్లో పరిస్థితి ఇంకా దారుణం...’’– సాక్షి, హైదరాబాద్ రాష్ట్రంలో వృత్తి విద్య ప్రక్షాళనకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నత విద్యా మండలి దృష్టి సారించింది. ఇకపై కొత్తగా వృత్తి విద్యా కాలేజీలు అక్కర్లేదని తేల్చేసింది. అంతేకాదు, ‘‘ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ వంటి కొత్త కాలేజీలను మంజూరు చేయొద్దు. ఉన్న కాలేజీల్లోనూ సీట్లను తగ్గించండి. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి కూడా ఈ దిశగా ఆలోచిస్తోంది. సీబీఐటీ వంటి టాప్ కాలేజీలతో పాటు పలు సాధారణ కాలేజీల్లోనూ కొన్ని బ్రాంచీల్లో 120కి మించి సీట్లున్నాయి. వాటిని 120కి పరిమితం చేయండి. సెక్షన్‌కు 60 సీట్లు చాలు. సెకండ్ షిఫ్ట్ కాలేజీలకూ అనుమతులివ్వొద్దు’’అని ప్రభుత్వానికి నివేదించింది. 2018లో రాష్ట్రంలో సాంకేతిక విద్య ఉండాల్సిన తీరుతెన్నులపై ‘పర్స్పెక్టివ్ ప్లాన్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్’ పేరుతో రూపొందించిన నివేదికను ఇటీవలే ప్రభుత్వానికి అందజేసింది. దీనిపై ప్రభు త్వం కూడా త్వరలోనే ఏఐసీటీఈకి లేఖ రాయ నుం ది. వచ్చే విద్యా సంవత్సరంలో రాష్ట్రానికి కొత్త కాలే జీలు ఇవ్వవద్దని, ఉన్న సీట్లు తగ్గించాలని కోరనుంది. అడ్డగోలు పెంపుతో నాణ్యత సున్నా విద్యార్థుల నుంచి డిమాండ్ వల్ల సీఎస్ఈ, ఈసీఈ, ఈఈఈ, ఐటీ కోర్సుల్లో కాలేజీల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా సీట్లను పెంచుకున్నాయి. గత పదేళ్లలో ఇష్టారాజ్యంగా పుట్టుకొచ్చిన కాలేజీలు నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలిచ్చాయి. ఇంజనీరింగ్ అంటేనే విలువ లేకుండా చేశాయి. ఏ నైపుణ్యాలూ లేని లక్షలాది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను తయారు చేశాయి. వారిలో కనాకష్టంగా 20 శాతం మందికి ఉపాధి లభిస్తోంది. కమ్యూనికేషన్, సాఫ్ట్, సబ్జెక్టు స్కిల్స్ లేక మిగతా వారంతా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఇంజనీరింగ్ చేసి కూడా హోంగార్డు వంటి కొలువులకు పోటీ పడుతున్నారు! పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దకుండా కాలేజీలు వారిని ఇలా రోడ్డున పడేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో సాంకేతిక విద్యలో సమూల మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సాంకేతిక విద్యలో తేవాల్సిన మార్పులపై మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి నేతృత్వంలో కమిటీ వేసింది. సాంకేతిక విద్య తీరుతెన్నులు, 2018 నుంచి రావాల్సిన మార్పులపై కమిటీ ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ప్రభుత్వానికి అందజేసింది. అందులో ఏం చెప్పిందంటే... ప్రమాదకర పరిణామం... రాష్ట్రంలో 215 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏఐసీటీఈ 1,26,485 సీట్లు మంజూరు చేసింది. అందులో కేవలం ఐటీ, సీసీఈ, ఈసీఈ, ఈఈఈ బ్రాంచీల్లోనే ఏకంగా 83,290 (66 శాతం) సీట్లున్నాయి. మిగతా 15 బ్రాంచీల్లో కలిపి కేవలం 34 శాతం ఉన్నాయి. ఇది మున్ముందు ప్రమాదకరంగా మారుతుంది. కొత్త పాలిటెక్నిక్‌లు ఇంజనీరింగ్ సీట్లకు అనుగుణంగా కొత్త పాలిటెక్నిక్ కాలేజీలు కావాలి. ప్రస్తుతం రాష్ట్రంలోని 205 పాలిటెక్నిక్ కాలేజీల్లో 53,285 సీట్లు ఉన్నాయి. వాటిని పెంచాల్సిన అవసరముంది. ఆ 14 రంగాల్లో కొత్త కోర్సులు ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా లైఫ్ సైన్సెస్, ఐటీ హార్డ్‌వేర్, డిఫెన్స్, ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ న్యూట్రిషన్, ఆటోమొబైల్స్, టెక్స్టైల్ అండ్ అపరెల్, పెట్రో కెమికల్స్, ఎఫ్ఎంసీజీ, జెమ్స్ అండ్ జెవెల్లరీ, ట్రాన్స్‌పోర్టేషన్ వంటి 14 రంగాలపై ప్రధానంగా దృష్టి సారించాలి. ఫార్మా సిటీ, టెక్స్టైల్ హబ్, ఫ్యాబ్ సిటీ, ఐటీఐఆర్, ఐటీ హబ్ వంటివి వచ్చినందున మార్కెట్ డిమాండ్ దృష్ట్యా ఆయా రంగాలకు ఉపయోగేపడే కోర్సులను ప్రోత్సహించి వాటిలో సీట్లను పెంచాలి. మూసివేత దిశగా ఇంజనీరింగ్ కాలేజీలు ఇంజనీరింగ్ కోర్సుల్లో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తక్షణం మార్పులు చేసుకోవాలి. లేదంటే అవి మూతపడే పరిస్థితి తప్పదు. 2016–17తో పోల్చితే 2017–18 నాటికి 14 కాలేజీలు మూత పడ్డాయి. పలు కాలేజీలు మూసివేతకు దరఖాస్తు చేసుకుంటున్నాయి. 2016–17లో 215 కాలేజీల్లో 71,066 సీట్లు భర్తీ కాగా 17,001 సీట్లు మిగిలాయి. 2017–18లో 201 కాలేజీల్లో 66,889 సీట్లు భర్తీ కాగా 16,631 సీట్లు మిగిలాయి. మరో 2, 3 ఏళ్ల దాకా బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ, ఫార్మ్–డి, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల అవసరమే లేదు. ఎంటెక్‌లో చేరికలు 40 శాతం తగ్గాయి. 60 కాలేజీల్లో చాలా తక్కువ మంది చేరారు. 2020 నాటికి అధ్యాపకులు కష్టమే... ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం 2020–21 విద్యా సంవత్సరానికల్లా రాష్ట్రంలో అందుబాటులో ఉన్న సీట్ల ప్రకారం ప్రతి 15 మంది విద్యార్థులకు ఒకరు చొప్పున 33,866 మంది బోధన సిబ్బంది కావాలి. 22,667 మంది ఎంటెక్ అర్హత కలిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీహెచ్డీ అర్హతతో 3,778 మంది ప్రొఫెసర్లు, 7,555 అసోసియేట్ ప్రొఫెసర్లు కావాలి. కానీ రాష్ట్రంలోని 275 కాలేజీల్లో ఉన్న పీహెచ్డీ ప్రొఫెసర్లు 1,500 మందే! జిల్లాలవారీగా వివిధ రంగాల్లో మున్ముందు నిపుణుల అవసరమున్నవి పర్యాటకం రంగారెడ్డి, నల్లగొండ, కరీంనగర్, వరంగల్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ హైదరాబాద్, రంగారెడ్డి ఐటీ హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ రంగారెడ్డి, హైదరాబాద్ కెమికల్, ఫార్మసీ రంగారెడ్డి, మెదక్, నల్లగొండ ఆటోమొబైల్ రంగారెడ్డి ఫుడ్ ప్రాసెసింగ్ నిజామాబాద్ కన్స్ట్రక్షన్ హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ టెక్స్టైల్ కరీంనగర్, వరంగల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని జిల్లాల్లో కాలేజీల అభివృద్ధి, నాణ్యత ప్రమాణాల పెంపుకు చేసిన మరిన్ని సిఫార్సులు... ♦ పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా 14 రంగాల్లో కొత్త కోర్సులను ప్రవేశ పెట్టడం ♦ పీజీ స్థాయిలో విద్యార్థులకు చదువుకుంటూ పని చేసుకునే వెసులుబాటు, పార్ట్‌టైమ్ ఎడ్యుకేషన్‌కు అవకాశం ♦ ఇంజనీరింగ్ టీచర్లకు బీఎడ్ వంటి కోర్సులు. బోధన నైపుణ్యాల పెంపుకు చర్యలు ♦ పరిశోధనలకు కావాల్సిన మల్టీ డిసిప్లీనరీ మాస్టర్ డిగ్రీ కోర్సులు ♦ ఇంజనీరింగ్ కాలేజీల్లో నైపుణ్యాభివృద్ధి పెంపుకు చర్యలు ♦ ప్రభుత్వం నుంచి ఎన్వోసీ లేకుండా కొత్త కాలేజీలను ఏఐసీటీఈ ఇవ్వొద్దు, విద్యార్థుల సంఖ్యనూ పెంచొద్దు. రంగారెడ్డిలోనే 122 కాలేజీలు.. ఆదిలాబాద్‌లో ఒక్కటే! రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో సరిపడా కాలేజీలే లేవు. ఆదిలాబా ద్ వంటి జిల్లాల్లో ఒక్కటే ఇంజనీరింగ్ కాలేజీ ఉంటే రంగారెడ్డి వంటి జిల్లాల్లో ఏకంగా 122 ఉన్నాయి! విద్యాపరంగా వెనుకబడిన జిల్లాలకు ఏఐసీటీఈ మినహాయింపు ఇవ్వాలి. కాలేజీల్లేని కొత్త జిల్లాల్లో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారికి నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వ సాంకేతిక విద్యా సంస్థల ఏర్పా టుకు అనుమతివ్వాలి. ప్రారంభ దశలోనే పర్మినెంట్ బిల్డింగ్ ఉండా లన్న నిబంధన నుంచి ఏఐసీటీఈ మినహాయింపు ఇవ్వాలి. తాత్కా లిక ఏర్పాట్లతో ప్రవేశాలకు ప్రభుత్వం అనుమతివ్వాలి. విద్యాప రంగా వెనకబడ్డ జిల్లాల్లో పాలిటెక్నిక్ కాలేజీలకూ అనుమతివ్వాలి. -
ఫీజు చెల్లిస్తారా.. జరిమానా కడతారా?
వార్షిక పరీక్షలు పూర్తి కాకుండానే తర్వాతి ఏడాది ఫీజుల వసూళ్లు - తల్లిదండ్రులకు ఇంజనీరింగ్ కాలేజీల నోటీసులు - గడువులోగా కట్టకపోతే రోజుకు రూ.50 చొప్పున జరిమానాలు - ముందే ఎందుకు ఇస్తామంటున్న తల్లిదండ్రులు - పైగా జరిమానా విధించడమేమిటని ఆందోళన - వృత్తి విద్యా కాలేజీల్లో యాజమాన్యాల ఇష్టారాజ్యం ‘‘మీ అబ్బాయి వచ్చే ఏడాది ఫీజు రూ.99,500.. వెంటనే చెల్లించండి. లేదంటే ఏప్రిల్ 8వ తేదీ నుంచి రోజుకు రూ.50 చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుంది’’... ఓ విద్యార్థి తండ్రికి ఒక టాప్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం పంపిన నోటీసు ‘‘2017–18 విద్యా సంవత్సరానికి సంబంధించి మీ అమ్మాయి కాలేజీ ఫీజు రూ.85 వేలు. మీరు సకాలంలో ఫీజు చెల్లించలేదు. కాబట్టి రోజుకు రూ.50 చొప్పున ఫైన్‌తో వెంటనే ఫీజు కట్టండి’’... మరో విద్యార్థి తండ్రికి ఇంకో ఇంజనీరింగ్ కాలేజీ నోటీసు సాక్షి, హైదరాబాద్: ఇలా ఇంజనీరింగ్ కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు హడలెత్తిపోతున్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజులు ఇప్పుడే చెల్లించాలని ఒత్తిడి తేవడమే కాదు. గడువులోగా ఫీజు చెల్లించకపోతే జరిమానాలు కూడా కట్టాల్సి ఉంటుందని కాలేజీల యాజమాన్యాలు బెదిరింపులకు పాల్పడుతున్నాయి. వాస్తవానికి 2016–17 విద్యా సంవత్సరపు వార్షిక పరీక్షలే ప్రారంభం కాలేదు. వాటికి ఇంకా సమయం ఉంది. కానీ యాజమాన్యాలు అప్పుడే 2017–18 విద్యా సంవత్సరపు వార్షిక ఫీజు చెల్లించాలని నోటీసులు పంపిస్తుండటంతో కన్వీనర్ కోటాలో కాలేజీల్లో చేరిన సాధారణ విద్యార్థులు (ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించనివారు) తీవ్ర ఆందోళనలో పడ్డారు. అటు యాజమాన్య కోటాలో చేరిన విద్యార్థులదీ ఇదే పరిస్థితి. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ముందుగా వేసుకున్న అంచనాల ప్రకారం మే చివర్లోనో, జూన్‌లోనో వచ్చే విద్యా సంవత్సరపు ఫీజు చెల్లించేలా ఏర్పాట్లు చేసుకున్నామని.. ఇప్పుడే చెల్లించాలంటే ఎలాగని పేర్కొంటున్నారు. మరో నెల వరకు పరీక్షలే.. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈనెల 13వ తేదీ నుంచి వార్షిక పరీక్షలు ప్రారం భమై మే నెలాఖరు వరకు జరుగనున్నాయి. వాటి ఫలితాలను వెల్లడించాక జూన్‌లో 2017–18 విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. కానీ కాలేజీల యాజమాన్యాలు మాత్రం 2017–18 విద్యా సంవత్సరపు ఫీజులను వెంటనే చెల్లించాలంటూ తల్లిదండ్రులకు హుకుం జారీ చేస్తున్నాయి. ఫీజులు చెల్లించాలంటూ మార్చి మొదటి వారం నుంచే నోటీసులను పంపడం మొదలుపెట్టాయి. లక్ష మందిపై ప్రభావం కాలేజీ యాజమాన్యాల తీరుపై పలువురు తల్లిదండ్రులు ఉన్నత విద్యా శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని వారు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 200కు పైగా ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సర కోర్సులు పూర్తి చేసుకోబోతున్న విద్యార్థులు దాదాపు 3 లక్షల మంది ఉన్నారు. అందులో ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించని ఉద్యోగుల పిల్లలు, మేనేజ్మెంట్ కోటాలో చేరిన వారు లక్ష మందికి పైగా ఉన్నట్లు అంచనా. ఇప్పుడు వారి తల్లిదండ్రులంతా ఆవేదనలో పడ్డారు. యాజమాన్యాల తీరుతో అప్పులు చేసి ఫీజులు కట్టాల్సిన పరిస్థితి వస్తోందని వాపోతున్నారు. -
ఆ అధికారాలను మాకు ఇవ్వండి
యూజీసీకి రాష్ట్ర ఉన్నత విద్యామండలి లేఖ ఏఐసీటీఈ అధికారాలను సుప్రీంకోర్టు కొట్టివేసిన ఫలితం యూజీసీలో సలహా విభాగంగా కొనసాగనున్న ఏఐసీటీఈ రాష్ట్రంలో వృత్తివిద్యా కాలేజీలపై అధికారం ఎవరిదనే చర్చ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వృత్తి విద్యా కాలేజీల పర్యవేక్షణ, కొత్త కాలేజీలకు అనుమతులు, అదనపు సీట్ల మంజూరు వంటి బాధ్యతలను ఇన్నాళ్లుగా నిర్వర్తించిన అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అధికారాలన్నింటిని తమకు అప్పగించాలని రాష్ట్ర ఉన్న త విద్యా మండలి తాజాగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)కి లేఖ రాసింది. వృత్తి విద్యా కాలేజీల పర్యవేక్షణ, అనుమతుల వంటి వ్యవహారాలపై ఏఐసీటీఈకి అధికారం లేదని, అది కేవలం సలహా విభాగం మాత్రమేనని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. ఈ మేరకు ఆ అధికారాలను తనకు అప్పగించాలంటూ యూజీసీని ఉన్నత విద్యా మండలి కోరింది. దీనిపై యూజీసీ నుంచి నిర్ణయం త్వరలోనే వస్తుందని విద్యా మం డలి వర్గాలు భావిస్తున్నాయి. అలాగే.. గతంలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (దూరవిద్యా మండలి) ఉండగా.. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ దానిని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బోర్డు పేరుతో యూజీసీలో ఒక విభాగంగా చేర్చింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఏఐసీటీఈని కూడా యూజీసీలో ఒక సలహా విభాగంగానే కొనసాగించాలని యూజీసీ వర్గాలు భావిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి వర్గాలకు సమాచారం అందింది. ఈ పరిస్థితుల్లో వృత్తి విద్యా కాలేజీల వ్యవహారాలను ఇకపై యూనివర్సిటీలకు అప్పగిస్తారా? లేదా? అనే అంశంపైనా చర్చ జరుగుతోంది. అయితే స్థానికంగా యూనివర్సిటీలు ఉన్నా.. అవి పర్యవేక్షక విభాగాలుగా కొనసాగుతాయని, ఆ అధికారాలను తనకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఉన్నత విద్యా మండలి కోరింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వమే అనుమతుల వ్యవహారాలను చూస్తే.. అవి ఉన్నత విద్యా మండలి నేతృత్వంలోనే కొనసాగుతాయని అధికారులు భావిస్తున్నారు. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ నుంచి దీనిపై తుది నిర్ణయం రావాల్సి ఉంది.