ఫీజు చెల్లిస్తారా.. జరిమానా కడతారా? | Huge fee taking in the vocational colleges..notices to the parents | Sakshi
Sakshi News home page

ఫీజు చెల్లిస్తారా.. జరిమానా కడతారా?

Published Sat, Apr 8 2017 2:39 AM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM

ఫీజు చెల్లిస్తారా.. జరిమానా కడతారా? - Sakshi

ఫీజు చెల్లిస్తారా.. జరిమానా కడతారా?

వార్షిక పరీక్షలు పూర్తి కాకుండానే తర్వాతి ఏడాది ఫీజుల వసూళ్లు
- తల్లిదండ్రులకు ఇంజనీరింగ్‌ కాలేజీల నోటీసులు
- గడువులోగా కట్టకపోతే రోజుకు రూ.50 చొప్పున జరిమానాలు
- ముందే ఎందుకు ఇస్తామంటున్న తల్లిదండ్రులు
- పైగా జరిమానా విధించడమేమిటని ఆందోళన
- వృత్తి విద్యా కాలేజీల్లో యాజమాన్యాల ఇష్టారాజ్యం


‘‘మీ అబ్బాయి వచ్చే ఏడాది ఫీజు రూ.99,500.. వెంటనే చెల్లించండి. లేదంటే ఏప్రిల్‌ 8వ తేదీ నుంచి రోజుకు రూ.50 చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుంది’’... ఓ విద్యార్థి తండ్రికి ఒక టాప్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ యాజమాన్యం పంపిన నోటీసు

‘‘2017–18 విద్యా సంవత్సరానికి సంబంధించి మీ అమ్మాయి కాలేజీ ఫీజు రూ.85 వేలు. మీరు సకాలంలో ఫీజు చెల్లించలేదు. కాబట్టి రోజుకు రూ.50 చొప్పున ఫైన్‌తో వెంటనే ఫీజు కట్టండి’’... మరో విద్యార్థి తండ్రికి ఇంకో ఇంజనీరింగ్‌ కాలేజీ నోటీసు

సాక్షి, హైదరాబాద్‌: ఇలా ఇంజనీరింగ్‌ కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు హడలెత్తిపోతున్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజులు ఇప్పుడే చెల్లించాలని ఒత్తిడి తేవడమే కాదు. గడువులోగా ఫీజు చెల్లించకపోతే జరిమానాలు కూడా కట్టాల్సి ఉంటుందని కాలేజీల యాజమాన్యాలు బెదిరింపులకు పాల్పడుతున్నాయి. వాస్తవానికి 2016–17 విద్యా సంవత్సరపు వార్షిక పరీక్షలే ప్రారంభం కాలేదు. వాటికి ఇంకా సమయం ఉంది.

కానీ యాజమాన్యాలు అప్పుడే 2017–18 విద్యా సంవత్సరపు వార్షిక ఫీజు చెల్లించాలని నోటీసులు పంపిస్తుండటంతో కన్వీనర్‌ కోటాలో కాలేజీల్లో చేరిన సాధారణ విద్యార్థులు (ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించనివారు) తీవ్ర ఆందోళనలో పడ్డారు. అటు యాజమాన్య కోటాలో చేరిన విద్యార్థులదీ ఇదే పరిస్థితి. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ముందుగా వేసుకున్న అంచనాల ప్రకారం మే చివర్లోనో, జూన్‌లోనో వచ్చే విద్యా సంవత్సరపు ఫీజు చెల్లించేలా ఏర్పాట్లు చేసుకున్నామని.. ఇప్పుడే చెల్లించాలంటే ఎలాగని పేర్కొంటున్నారు.

మరో నెల వరకు పరీక్షలే..
రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఈనెల 13వ తేదీ నుంచి వార్షిక పరీక్షలు ప్రారం భమై మే నెలాఖరు వరకు జరుగనున్నాయి. వాటి ఫలితాలను వెల్లడించాక జూన్‌లో 2017–18 విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. కానీ కాలేజీల యాజమాన్యాలు మాత్రం 2017–18 విద్యా సంవత్సరపు ఫీజులను వెంటనే చెల్లించాలంటూ తల్లిదండ్రులకు హుకుం జారీ చేస్తున్నాయి. ఫీజులు చెల్లించాలంటూ మార్చి మొదటి వారం నుంచే నోటీసులను పంపడం మొదలుపెట్టాయి.

లక్ష మందిపై ప్రభావం
కాలేజీ యాజమాన్యాల తీరుపై పలువురు తల్లిదండ్రులు ఉన్నత విద్యా శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని వారు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 200కు పైగా ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సర కోర్సులు పూర్తి చేసుకోబోతున్న విద్యార్థులు దాదాపు 3 లక్షల మంది ఉన్నారు. అందులో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించని ఉద్యోగుల పిల్లలు, మేనేజ్‌మెంట్‌ కోటాలో చేరిన వారు లక్ష మందికి పైగా ఉన్నట్లు అంచనా. ఇప్పుడు వారి తల్లిదండ్రులంతా ఆవేదనలో పడ్డారు. యాజమాన్యాల తీరుతో అప్పులు చేసి ఫీజులు కట్టాల్సిన పరిస్థితి వస్తోందని వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement