70 ఇంజనీరింగ్ కాలేజీల్లో తగ్గనున్న ఫీజులు!
♦ కొన్నింటిలో కనీస ఫీజు రూ. 25 వేలకు పడిపోయే అవకాశం
♦ పూర్తి కావచ్చిన ఫీజుల ఖరారు..
♦ టాప్ కాలే జీల్లో భారీగా ఫీజులపెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో వచ్చే మూడేళ్లపాటు (2016-17, 2017-18, 2018-19 విద్యా సంవత్సరాల్లో) వసూలు చేయాల్సిన ఫీజుల ఖరారు పూర్తి కావచ్చింది. రాష్ట్రంలో 340కి పైగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల ఖరారుకు చర్యలు చేపట్టిన తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) 300కు పైగా కాలేజీల్లో ఫీజులను ఇప్పటికే ఖరారు చేసింది. ఇక మరో 30 వరకు టాప్ కాలేజీల్లో ఫీజులను ఖరారు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఆయా కాలేజీలు అందజేసిన ఆదాయ వ్యయాలను పరిశీలించిన టీఏఎఫ్‌ఆర్‌సీ కాలేజీల యాజమాన్యాలతో సమావేశాలు (హియరింగ్) నిర్వహిస్తోంది.
త్వరలోనే టాప్ కాలేజీల్లోనూ ఫీజులను ఖరారు చేయనుంది. ఇప్పటివరకు ఫీజులను ఖరారు చేసిన కాలేజీల్లో 2015-16 విద్యా సంవత్సరంలో అఫిలియేషన్ లభించని దాదాపు 70 కాలేజీల్లో ఫీజులు తగ్గినట్లు తెలిసింది. ఒక్కో కాలేజీలో 5 వేల నుంచి రూ. 10 వేలకు ఫీజులు తగ్గినట్లు సమాచారం. కొన్ని కాలేజీల్లో గతంలో కనీస ఫీజు రూ. 35 వేలు ఉండగా, అది ఈసారి రూ. 30 వేలకు, మరికొన్నింటిలో రూ. 25 వేలకు పడిపోయినట్లు తెలిసింది. ఇక వార్షిక ఫీజు రూ. 45-55 వేల వరకు ఉన్న కాలేజీల్లో కూడా తగ్గినట్లు సమాచారం.
ఆదాయ, వ్యయాల ఆధారంగా ఫీజుల ఖరారు
గతేడాది మొదటి దశలో అనుబంధ గుర్తింపు లభించని కాలేజీల్లో ప్రవేశాలు జర గలేదు. ఆ తరువాత కోర్టుకు వెళ్లి అనుమతులు తెచ్చుకున్నా విద్యార్థులు చేరలేదు. దీంతో ఆయా కాలేజీల ఆదాయం తగ్గింది. ప్రస్తుతం ఆదాయ వ్యయాల ఆధారంగానే టీఏఎఫ్‌ఆర్‌సీ ఫీజుల్ని ఖరారు చేస్తోంది. దీంతో ఆయా కాలేజీల్లో ఫీజులు తగ్గినట్లు తెలిసింది. టీఏఎఫ్‌ఆర్‌సీ ద్రవ్యోల్బణాన్ని బట్టి 15% ఫీజుల పెంపు, 10% కాలేజీల నిర్వహణ, ఇతర అవసరాల కింద పెంపును సిఫారసు చేస్తున్నా.. వాటిల్లో ఫీజులు తగ్గడం గమనార్హం. మరోవైపు ఎక్కువ మంది విద్యార్థులు చేరే కాలేజీల్లో ఫీజులు పెరిగాయి. విద్యార్థుల సంఖ్య ఎక్కువ కాబట్టి ఆదాయంతో పాటు ఖర్చులూ ఎక్కువై ఫీజులు పెరిగినట్లు తెలిసింది. ఇక టాప్ 30 కాలేజీల్లోనూ ఫీజులు భారీగా పెరిగే అవకాశం ఉంది. వాటిలో ఫీజుల ఖరారుకు టీఏఎఫ్‌ఆర్‌సీ చర్యలు ప్రారంభించింది.