‘వృత్తి’ కాలేజీలు చాలు | Higher Education Council on Vocational colleges | Sakshi
Sakshi News home page

‘వృత్తి’ కాలేజీలు చాలు

Published Fri, Nov 3 2017 2:49 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM

Higher Education Council on Vocational colleges - Sakshi

‘‘రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 1,26,855 సీట్లున్నాయి. కానీ 2017లో ఇంటర్‌ ఎంపీసీలో పాసైంది 1.21 లక్షల మందే! మరోవైపు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో లోపాల కారణంగా 97,961 సీట్లలోనే ప్రవేశాలకు యూనివ ర్సిటీలు అనుమతులి చ్చాయి. వాటిలోనూ భర్తీ అయింది 68,594 సీట్లే! అంటే 1.26 లక్షల సీట్లలో ఏకంగా 46 శాతం ఖాళీగా ఉండిపోయాయి. అంతకుముందు సంవత్సరాల్లో పరిస్థితి ఇంకా దారుణం...’’– సాక్షి, హైదరాబాద్‌


రాష్ట్రంలో వృత్తి విద్య ప్రక్షాళనకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నత విద్యా మండలి దృష్టి సారించింది. ఇకపై కొత్తగా వృత్తి విద్యా కాలేజీలు అక్కర్లేదని తేల్చేసింది. అంతేకాదు, ‘‘ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ వంటి కొత్త కాలేజీలను మంజూరు చేయొద్దు. ఉన్న కాలేజీల్లోనూ సీట్లను తగ్గించండి. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి కూడా ఈ దిశగా ఆలోచిస్తోంది. సీబీఐటీ వంటి టాప్‌ కాలేజీలతో పాటు పలు సాధారణ కాలేజీల్లోనూ కొన్ని బ్రాంచీల్లో 120కి మించి సీట్లున్నాయి.

వాటిని 120కి పరిమితం చేయండి. సెక్షన్‌కు 60 సీట్లు చాలు. సెకండ్‌ షిఫ్ట్‌ కాలేజీలకూ అనుమతులివ్వొద్దు’’అని ప్రభుత్వానికి నివేదించింది. 2018లో రాష్ట్రంలో సాంకేతిక విద్య ఉండాల్సిన తీరుతెన్నులపై ‘పర్‌స్పెక్టివ్‌ ప్లాన్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌’ పేరుతో రూపొందించిన నివేదికను ఇటీవలే ప్రభుత్వానికి అందజేసింది. దీనిపై ప్రభు త్వం కూడా త్వరలోనే ఏఐసీటీఈకి లేఖ రాయ నుం ది. వచ్చే విద్యా సంవత్సరంలో రాష్ట్రానికి కొత్త కాలే జీలు ఇవ్వవద్దని, ఉన్న సీట్లు తగ్గించాలని కోరనుంది.

అడ్డగోలు పెంపుతో నాణ్యత సున్నా
విద్యార్థుల నుంచి డిమాండ్‌ వల్ల సీఎస్‌ఈ, ఈసీఈ, ఈఈఈ, ఐటీ కోర్సుల్లో కాలేజీల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా సీట్లను పెంచుకున్నాయి. గత పదేళ్లలో ఇష్టారాజ్యంగా పుట్టుకొచ్చిన కాలేజీలు నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలిచ్చాయి. ఇంజనీరింగ్‌ అంటేనే విలువ లేకుండా చేశాయి. ఏ నైపుణ్యాలూ లేని లక్షలాది ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లను తయారు చేశాయి. వారిలో కనాకష్టంగా 20 శాతం మందికి ఉపాధి లభిస్తోంది.

కమ్యూనికేషన్, సాఫ్ట్, సబ్జెక్టు స్కిల్స్‌ లేక మిగతా వారంతా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఇంజనీరింగ్‌ చేసి కూడా హోంగార్డు వంటి కొలువులకు పోటీ పడుతున్నారు! పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దకుండా కాలేజీలు వారిని ఇలా రోడ్డున పడేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో సాంకేతిక విద్యలో సమూల మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సాంకేతిక విద్యలో తేవాల్సిన మార్పులపై మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి నేతృత్వంలో కమిటీ వేసింది. సాంకేతిక విద్య తీరుతెన్నులు, 2018 నుంచి రావాల్సిన మార్పులపై కమిటీ ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ప్రభుత్వానికి అందజేసింది. అందులో ఏం చెప్పిందంటే...

ప్రమాదకర పరిణామం...
రాష్ట్రంలో 215 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఏఐసీటీఈ 1,26,485 సీట్లు మంజూరు చేసింది. అందులో కేవలం ఐటీ, సీసీఈ, ఈసీఈ, ఈఈఈ బ్రాంచీల్లోనే ఏకంగా 83,290 (66 శాతం) సీట్లున్నాయి. మిగతా 15 బ్రాంచీల్లో కలిపి కేవలం 34 శాతం ఉన్నాయి. ఇది మున్ముందు ప్రమాదకరంగా మారుతుంది.

కొత్త పాలిటెక్నిక్‌లు
ఇంజనీరింగ్‌ సీట్లకు అనుగుణంగా కొత్త పాలిటెక్నిక్‌ కాలేజీలు కావాలి. ప్రస్తుతం రాష్ట్రంలోని 205 పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 53,285 సీట్లు ఉన్నాయి. వాటిని పెంచాల్సిన అవసరముంది.

ఆ 14 రంగాల్లో కొత్త కోర్సులు
ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా లైఫ్‌ సైన్సెస్, ఐటీ హార్డ్‌వేర్, డిఫెన్స్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ న్యూట్రిషన్, ఆటోమొబైల్స్, టెక్స్‌టైల్‌ అండ్‌ అపరెల్, పెట్రో కెమికల్స్, ఎఫ్‌ఎంసీజీ, జెమ్స్‌ అండ్‌ జెవెల్లరీ, ట్రాన్స్‌పోర్టేషన్‌ వంటి 14 రంగాలపై ప్రధానంగా దృష్టి సారించాలి. ఫార్మా సిటీ, టెక్స్‌టైల్‌ హబ్, ఫ్యాబ్‌ సిటీ, ఐటీఐఆర్, ఐటీ హబ్‌ వంటివి వచ్చినందున మార్కెట్‌ డిమాండ్‌ దృష్ట్యా ఆయా రంగాలకు ఉపయోగేపడే కోర్సులను ప్రోత్సహించి వాటిలో సీట్లను పెంచాలి.


మూసివేత దిశగా ఇంజనీరింగ్‌ కాలేజీలు
ఇంజనీరింగ్‌ కోర్సుల్లో మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా తక్షణం మార్పులు చేసుకోవాలి. లేదంటే అవి మూతపడే పరిస్థితి తప్పదు. 2016–17తో పోల్చితే 2017–18 నాటికి 14 కాలేజీలు మూత పడ్డాయి. పలు కాలేజీలు మూసివేతకు దరఖాస్తు చేసుకుంటున్నాయి. 2016–17లో 215 కాలేజీల్లో 71,066 సీట్లు భర్తీ కాగా 17,001 సీట్లు మిగిలాయి. 2017–18లో 201 కాలేజీల్లో 66,889 సీట్లు భర్తీ కాగా 16,631 సీట్లు మిగిలాయి. మరో 2, 3 ఏళ్ల దాకా బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ, ఫార్మ్‌–డి, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల అవసరమే లేదు. ఎంటెక్‌లో చేరికలు 40 శాతం తగ్గాయి. 60 కాలేజీల్లో చాలా తక్కువ మంది చేరారు.


2020 నాటికి అధ్యాపకులు కష్టమే...
ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం 2020–21 విద్యా సంవత్సరానికల్లా రాష్ట్రంలో అందుబాటులో ఉన్న సీట్ల ప్రకారం ప్రతి 15 మంది విద్యార్థులకు ఒకరు చొప్పున 33,866 మంది బోధన సిబ్బంది కావాలి. 22,667 మంది ఎంటెక్‌ అర్హత కలిగిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, పీహెచ్‌డీ అర్హతతో 3,778 మంది ప్రొఫెసర్లు, 7,555 అసోసియేట్‌ ప్రొఫెసర్లు కావాలి. కానీ రాష్ట్రంలోని 275 కాలేజీల్లో ఉన్న పీహెచ్‌డీ ప్రొఫెసర్లు 1,500 మందే!


జిల్లాలవారీగా వివిధ రంగాల్లో మున్ముందు నిపుణుల అవసరమున్నవి
పర్యాటకం                          రంగారెడ్డి, నల్లగొండ, కరీంనగర్, వరంగల్‌
బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌         హైదరాబాద్, రంగారెడ్డి
ఐటీ                                 హైదరాబాద్‌
ట్రాన్స్‌పోర్ట్‌                          రంగారెడ్డి, హైదరాబాద్‌
కెమికల్, ఫార్మసీ                  రంగారెడ్డి, మెదక్, నల్లగొండ
ఆటోమొబైల్‌                       రంగారెడ్డి
ఫుడ్‌ ప్రాసెసింగ్‌                   నిజామాబాద్‌
కన్‌స్ట్రక్షన్‌                          హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్‌
టెక్స్‌టైల్‌                           కరీంనగర్, వరంగల్‌
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌                      అన్ని జిల్లాల్లో


కాలేజీల అభివృద్ధి, నాణ్యత ప్రమాణాల పెంపుకు చేసిన మరిన్ని సిఫార్సులు...
పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా 14 రంగాల్లో కొత్త కోర్సులను ప్రవేశ పెట్టడం
  పీజీ స్థాయిలో విద్యార్థులకు చదువుకుంటూ పని చేసుకునే వెసులుబాటు, పార్ట్‌టైమ్‌ ఎడ్యుకేషన్‌కు అవకాశం
ఇంజనీరింగ్‌ టీచర్లకు బీఎడ్‌ వంటి కోర్సులు. బోధన నైపుణ్యాల పెంపుకు చర్యలు
పరిశోధనలకు కావాల్సిన మల్టీ డిసిప్లీనరీ మాస్టర్‌ డిగ్రీ కోర్సులు
ఇంజనీరింగ్‌ కాలేజీల్లో నైపుణ్యాభివృద్ధి పెంపుకు చర్యలు
♦  ప్రభుత్వం నుంచి ఎన్‌వోసీ లేకుండా కొత్త కాలేజీలను ఏఐసీటీఈ ఇవ్వొద్దు, విద్యార్థుల సంఖ్యనూ పెంచొద్దు.


రంగారెడ్డిలోనే 122 కాలేజీలు.. ఆదిలాబాద్‌లో ఒక్కటే!
రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో సరిపడా కాలేజీలే లేవు. ఆదిలాబా ద్‌ వంటి జిల్లాల్లో ఒక్కటే ఇంజనీరింగ్‌ కాలేజీ ఉంటే రంగారెడ్డి వంటి జిల్లాల్లో ఏకంగా 122 ఉన్నాయి! విద్యాపరంగా వెనుకబడిన జిల్లాలకు ఏఐసీటీఈ మినహాయింపు ఇవ్వాలి. కాలేజీల్లేని కొత్త జిల్లాల్లో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారికి నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వ సాంకేతిక విద్యా సంస్థల ఏర్పా టుకు అనుమతివ్వాలి. ప్రారంభ దశలోనే పర్మినెంట్‌ బిల్డింగ్‌ ఉండా లన్న నిబంధన నుంచి ఏఐసీటీఈ మినహాయింపు ఇవ్వాలి. తాత్కా లిక ఏర్పాట్లతో ప్రవేశాలకు ప్రభుత్వం అనుమతివ్వాలి. విద్యాప రంగా వెనకబడ్డ జిల్లాల్లో పాలిటెక్నిక్‌ కాలేజీలకూ అనుమతివ్వాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement