మరో 15% ఫీజులు.. మరింత భారం కానున్న ఇంజనీరింగ్, ఫార్మసీ విద్య | Telangana: Engineering Colleges Preparing To Raise Fees | Sakshi
Sakshi News home page

మరో 15% ఫీజులు.. మరింత భారం కానున్న ఇంజనీరింగ్, ఫార్మసీ విద్య

Published Wed, Dec 15 2021 3:41 AM | Last Updated on Wed, Dec 15 2021 12:37 PM

Telangana: Engineering Colleges Preparing To Raise Fees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఇంజనీరింగ్, ఫార్మసీ విద్య మరింత భారం కానుంది. ఈసారి భారీగా ఫీజులు పెంచేందుకు ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి. అయితే ఏ మేరకు పెంచాలనే దానిపై రాష్ట్ర అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్‌ మరో వారంలో విడుదల చేస్తామని టీఏఎఫ్‌ఆర్‌సీ వర్గాలు తెలిపాయి. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు సమర్పించే ఫీజు పెంపు ప్రతి పాదనలపై ఫీజుల నియంత్రణ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది.

పెరిగే ఫీజులు వచ్చే విద్యా సంవత్సరం (2022–23)నుంచి అమల్లోకి వస్తాయి. అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిబంధనల ప్రకారం మూడేళ్లకోసారి ఫీజు లపై టీఏఎఫ్‌ఆర్‌సీ సమీక్షించాల్సి ఉంటుంది. కాలేజీల్లో కల్పించే మౌలికవసతులు, వాటి నిర్వహణ వ్యయం ప్రాతిపదికగా ఫీజుల పెంపును టీఏఎఫ్‌ఆర్‌సీ నిర్ధారిస్తుంది. 2019లో జరిగిన ఈ కసరత్తు గడువు ఈ ఏడాదితో ముగుస్తుంది.

15 శాతంపైనే పెంపు?:
రాష్ట్రంలో 158 ఇంజనీరింగ్, 112 ఫార్మసీ, 54 ఫార్మా డీ కాలేజీలున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఇంజనీరింగ్‌ వార్షిక ఫీజు కనిష్టంగా రూ. 44 వేలు ఉండగా గరిష్టంగా రూ. 1.34 లక్షల వరకూ ఉంది. 25 కాలేజీల్లో ఫీజు రూ. లక్షకుపైగా ఉంటే మిగతా కాలేజీల్లో రూ. లక్షలోపు ఉంది.

ఈసారి 15 శాతం మేర ఫీజులు పెంచాలని కాలేజీల యాజమాన్యాలు భావిస్తున్నాయి. అందుకు టీఏఎఫ్‌ఆర్‌సీ ఆమోదం తెలిపితే ఇంజనీరింగ్‌లో వార్షిక ఫీజు కనిష్టంగా రూ. 50 వేల నుంచి రూ. 1.50 లక్షలకుపైగా ఉండే వీలుంది. అంటే ఇంజనీరింగ్‌ కోర్సు పూర్తి చేయడానికి రూ. 2 లక్షల నుంచి రూ. 6 లక్షలు ఖర్చయ్యే వీలుంది.

కరోనా కాలంలోనూ ఖర్చా?:
గత మూడేళ్లలో కాలేజీల నిర్వహణ వ్యయంతోపాటు మౌలిక సదుపాయాల విస్తరణ, విద్యాప్రమాణాల మెరుగుదలకు చేసిన ఖర్చు వివరాలను యాజమాన్యాలు టీఏఎఫ్‌ఆర్‌సీకి ఇవ్వాలి. అయితే 2019 తర్వాత కరోనా కారణంగా విద్యాసంస్థలు పెద్దగా కొనసాగలేదు. ఆన్‌లైన్‌ బోధనతోనే సరిపెట్టాయి. అలాంటప్పుడు కొత్తగా అయ్యే వ్యయం ఏమిటి? ఎందుకు ఫీజులు పెంచాలనే వాదన అన్ని వర్గాల నుంచి వస్తోంది.

కానీ యాజమాన్యాలు మాత్రం కరోనా కాలంలో ఆన్‌లైన్‌ బోధన కోసం సాంకేతిక ఏర్పాట్లు చేసుకున్నామని, ఇదంతా తమకు అదనపు వ్యయమేనని పేర్కొంటున్నాయి. ఈ దిశగా ఆడిట్‌ రిపోర్టులు తయారు చేస్తున్నాయి. అయితే పేరున్న కాలేజీల్లో కొంతమేర ఆన్‌లైన్‌ క్లాసులు ప్రమాణాల మేరకే జరిగినా వాటి సంఖ్య 20కు మించదని టీఏఎఫ్‌ఆర్‌సీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని కాలేజీలను ఒకేగాటన కట్టడం సరికాదని అభిప్రాయపడుతున్నాయి.

కష్టకాలంలో భారం వద్దు...
కరోనా కష్టకాలంలో విద్యా వ్యవస్థే అతలాకుతలమైంది. ఆర్థిక భారంతో పేదలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో ఫీజులు పెంచితే సహించేది లేదు.
– ప్రవీణ్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి

నిరసనలు చేపడతాం
కాలేజీల యాజమాన్యాల ఫీజుల పెంపు ఆలోచన హేతుబద్ధం కాదు. ఈ ప్రతిపాదన అమలు చేయరాదని టీఏఎఫ్‌ఆర్‌సీపై ఒత్తిడి తెస్తాం. నిరసనలు చేపడతాం.
– నాగరాజు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement