Pharma Courses
-
ఇంజనీరింగ్‌లో 1.42 లక్షల సీట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌కు కాలేజీలు, సీట్ల సంఖ్య దాదాపు ఖరారైంది. రాష్ట్రంలో 375 ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లోని 1,50,837 సీట్లు కౌన్సెలింగ్‌కు అందుబాటులో ఉన్నాయి. ఈ సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుమతి ఇచ్చింది. ఈ కాలేజీలను తనిఖీలు చేసి నిర్ణీత ప్రమాణాలు పాటిస్తున్నాయో, లేదో పరిశీలించాక ఆయా యూనివర్సిటీలు వాటికి అఫ్లియేషన్ ఇవ్వనున్నాయి. ఏపీ ఈఏపీసెట్–2022 తొలి విడత అడ్మిషన్ల కౌన్సెలింగ్ ఈ నెల 22 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. 30 వరకు ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపునకు గడువు ఉంది. 31 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కొనసాగనుంది. 28 నుంచి సెప్టెంబర్ 2 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, సెప్టెంబర్ 3న ఆప్షన్లలో మార్పులకు అవకాశం ఇచ్చారు. సెప్టెంబర్ 6న సీట్లు కేటాయించనున్నారు. ఈ ఏడాది మొత్తం 1,94,752 మంది విద్యార్థులు ఏపీఈఏపీ సెట్‌కు హాజరుకాగా 1,73,572 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరు https://sche.ap.gov.in/ APSCHEHome.aspx ద్వారా కౌన్సెలింగ్‌లో పాల్గొనొచ్చు. ఈ నెల 28 నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో ఆలోగా యూనివర్సిటీల అఫ్లియేషన్‌ను పూర్తి చేసేలా సాంకేతిక విద్యాశాఖ చర్యలు చేపట్టింది. 17 వర్సిటీ కాలేజీల్లో 5 వేల ఇంజనీరింగ్ సీట్లు.. కాగా, 2022–23 విద్యా సంవత్సరానికి ఏఐసీటీఈ అనుమతి ఇచ్చిన ప్రకారం.. ఇంజనీరింగ్ విభాగంలో మొత్తం 261 కాలేజీల్లో 1,42,877 సీట్లు ఉన్నాయి. వీటిలో 17 యూనివర్సిటీ కాలేజీల్లో 5 వేల సీట్లు ఉండగా.. 244 ప్రైవేటు కాలేజీల్లో 1,37,877 సీట్లున్నాయి. ► ఫార్మసీలో 71 కాలేజీల్లో 6,670 సీట్లున్నాయి. వీటిలో ఆరు యూనివర్సిటీ కాలేజీల్లో 400 సీట్లు, 65 ప్రైవేటు కాలేజీల్లో 6,270 సీట్లు ఉన్నాయి. ► 43 ప్రైవేటు ఫార్మ్‌డీ కాలేజీల్లో 1,290 సీట్లు ఉన్నాయి. ప్రైవేటు వర్సిటీల్లో ఈసారీ 35% కోటా గతేడాది మాదిరిగానే 2022–23 విద్యా సంవత్సరంలో కూడా ప్రైవేటు వర్సిటీల్లో ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల్లో 35 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో ఈఏపీసెట్‌లో మెరిట్ విద్యార్థులకు కేటాయించనున్నారు. ఈ 35 శాతం కోటా కింద గతేడాది వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఏపీ విట్)లో 1,509 సీట్లు, ఎస్ఆర్ఎం వర్సిటీలో 527 సీట్లు, బెస్ట్ వర్సిటీలో 1,074 సీట్లు, సెంచూరియన్ వర్సిటీలో 504 సీట్లు, క్రియా వర్సిటీలో 146 సీట్లు, సవితా వర్సిటీలో 81 సీట్లు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. ఏపీ ఈఏపీసెట్‌లో ర్యాంకులు పొందిన దాదాపు 3 వేల మంది ఈ వర్సిటీల్లో చేరారు. వీరికి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటుతో చదువుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. తద్వారా ఉన్నత ప్రమాణాలతో కూడిన సంస్థల్లో ఏ భారమూ లేకుండా విద్యార్థులు చదువుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. బీ కేటగిరీ సీట్ల భర్తీపై వెలువడని తుది నిర్ణయం ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్లయిన బీ కేటగిరీ సీట్ల భర్తీపై ఉన్నత విద్యామండలి తర్జనభర్జనలు పడుతోంది. గతంలో ఈ సీట్లు మెరిట్ విద్యార్థులకు దక్కేలా గతేడాది సెప్టెంబర్‌లో ప్రభుత్వం జీవో 48ని జారీ చేసింది. గతంలో బీ కేటగిరీ సీట్ల భర్తీని యాజమాన్యాలే చేపట్టేవి. అయితే ఈ జీవోతో మేనేజ్మెంట్ కోటా సీట్లను కూడా కన్వీనర్ ద్వారా ప్రభుత్వమే భర్తీ చేసేలా చర్యలు తీసుకున్నారు. కన్వీనర్ కోటా (ఏ కేటగిరీ) సీట్ల భర్తీతో పాటు ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా బీ కేటగిరీ సీట్ల భర్తీ చేపట్టారు. అయితే ఏ కేటగిరీ సీట్ల భర్తీ ముందుగా అయిపోతున్నందున బీ కేటగిరీ సీట్లు భర్తీ కావడం లేదని యాజమాన్యాలు చెబుతున్నాయి. అందువల్ల తామే ఆ సీట్లను భర్తీ చేసుకునేందుకు అవకాశమివ్వాలని కోరుతున్నాయి. ఈ తరుణంలో బీ కేటగిరీ సీట్ల భర్తీపై అనుసరించాల్సిన విధానం గురించి ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి నివేదించింది. ప్రభుత్వం నుంచి ఇంకా దీనిపై తుది నిర్ణయం రాలేదు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు బీ కేటగిరీ సీట్ల భర్తీపై ఉన్నత విద్యామండలి ముందుకు వెళ్లనుంది. -
మరో 15% ఫీజులు.. మరింత భారం కానున్న ఇంజనీరింగ్, ఫార్మసీ విద్య
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంజనీరింగ్, ఫార్మసీ విద్య మరింత భారం కానుంది. ఈసారి భారీగా ఫీజులు పెంచేందుకు ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి. అయితే ఏ మేరకు పెంచాలనే దానిపై రాష్ట్ర అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ మరో వారంలో విడుదల చేస్తామని టీఏఎఫ్ఆర్సీ వర్గాలు తెలిపాయి. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు సమర్పించే ఫీజు పెంపు ప్రతి పాదనలపై ఫీజుల నియంత్రణ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. పెరిగే ఫీజులు వచ్చే విద్యా సంవత్సరం (2022–23)నుంచి అమల్లోకి వస్తాయి. అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిబంధనల ప్రకారం మూడేళ్లకోసారి ఫీజు లపై టీఏఎఫ్ఆర్సీ సమీక్షించాల్సి ఉంటుంది. కాలేజీల్లో కల్పించే మౌలికవసతులు, వాటి నిర్వహణ వ్యయం ప్రాతిపదికగా ఫీజుల పెంపును టీఏఎఫ్ఆర్సీ నిర్ధారిస్తుంది. 2019లో జరిగిన ఈ కసరత్తు గడువు ఈ ఏడాదితో ముగుస్తుంది. 15 శాతంపైనే పెంపు?: రాష్ట్రంలో 158 ఇంజనీరింగ్, 112 ఫార్మసీ, 54 ఫార్మా డీ కాలేజీలున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఇంజనీరింగ్ వార్షిక ఫీజు కనిష్టంగా రూ. 44 వేలు ఉండగా గరిష్టంగా రూ. 1.34 లక్షల వరకూ ఉంది. 25 కాలేజీల్లో ఫీజు రూ. లక్షకుపైగా ఉంటే మిగతా కాలేజీల్లో రూ. లక్షలోపు ఉంది. ఈసారి 15 శాతం మేర ఫీజులు పెంచాలని కాలేజీల యాజమాన్యాలు భావిస్తున్నాయి. అందుకు టీఏఎఫ్ఆర్సీ ఆమోదం తెలిపితే ఇంజనీరింగ్‌లో వార్షిక ఫీజు కనిష్టంగా రూ. 50 వేల నుంచి రూ. 1.50 లక్షలకుపైగా ఉండే వీలుంది. అంటే ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేయడానికి రూ. 2 లక్షల నుంచి రూ. 6 లక్షలు ఖర్చయ్యే వీలుంది. కరోనా కాలంలోనూ ఖర్చా?: గత మూడేళ్లలో కాలేజీల నిర్వహణ వ్యయంతోపాటు మౌలిక సదుపాయాల విస్తరణ, విద్యాప్రమాణాల మెరుగుదలకు చేసిన ఖర్చు వివరాలను యాజమాన్యాలు టీఏఎఫ్ఆర్సీకి ఇవ్వాలి. అయితే 2019 తర్వాత కరోనా కారణంగా విద్యాసంస్థలు పెద్దగా కొనసాగలేదు. ఆన్లైన్ బోధనతోనే సరిపెట్టాయి. అలాంటప్పుడు కొత్తగా అయ్యే వ్యయం ఏమిటి? ఎందుకు ఫీజులు పెంచాలనే వాదన అన్ని వర్గాల నుంచి వస్తోంది. కానీ యాజమాన్యాలు మాత్రం కరోనా కాలంలో ఆన్లైన్ బోధన కోసం సాంకేతిక ఏర్పాట్లు చేసుకున్నామని, ఇదంతా తమకు అదనపు వ్యయమేనని పేర్కొంటున్నాయి. ఈ దిశగా ఆడిట్ రిపోర్టులు తయారు చేస్తున్నాయి. అయితే పేరున్న కాలేజీల్లో కొంతమేర ఆన్లైన్ క్లాసులు ప్రమాణాల మేరకే జరిగినా వాటి సంఖ్య 20కు మించదని టీఏఎఫ్ఆర్సీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని కాలేజీలను ఒకేగాటన కట్టడం సరికాదని అభిప్రాయపడుతున్నాయి. కష్టకాలంలో భారం వద్దు... కరోనా కష్టకాలంలో విద్యా వ్యవస్థే అతలాకుతలమైంది. ఆర్థిక భారంతో పేదలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో ఫీజులు పెంచితే సహించేది లేదు. – ప్రవీణ్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నిరసనలు చేపడతాం కాలేజీల యాజమాన్యాల ఫీజుల పెంపు ఆలోచన హేతుబద్ధం కాదు. ఈ ప్రతిపాదన అమలు చేయరాదని టీఏఎఫ్ఆర్సీపై ఒత్తిడి తెస్తాం. నిరసనలు చేపడతాం. – నాగరాజు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి -
క్లినికల్ ఫార్మసిస్ట్‌లుగా.. ఫార్మా–డి అభ్యర్థులు
సాక్షి, అమరావతి: గత కొన్ని సంవత్సరాలుగా తమకు ప్రత్యేక కేడర్ ఇవ్వాలని పోరాటం చేస్తున్న ఫార్మా–డి కోర్సు చేసిన అభ్యర్థుల కల ఫలించింది. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ఫార్మా–డి అభ్యర్థులను క్లినికల్ ఫార్మసిస్ట్‌లుగా గుర్తిస్తూ, వారికి ప్రత్యేక కేడర్‌ను ఇస్తూ ఆదేశాలిచ్చింది. కొన్నేళ్ల కిందట కోర్సును ప్రవేశపెట్టినా దీనికి సంబంధించిన కేడర్ లేకపోవడం, వారికి ఏ ప్రభుత్వ ఉద్యోగాలివ్వాలనే దానిపై స్పష్టత లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి పార్లమెంటులో పలు దఫాలు ప్రత్యేకంగా వీరి గురించి ప్రస్తావించారు. వారికి తగిన న్యాయం చేయాలని, కోర్సులు పూర్తి చేసిన వారు నిరుద్యోగులుగా ఉన్నారని ఆయన పార్లమెంటులో గట్టిగా మాట్లాడారు. దీంతో ఎట్టకేలకు కేంద్రం తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. విధుల నిర్వహణ ఇలా.. వైద్యులకు సురక్షితమైన, సమర్థవంతమైన మందుల వాడకం గురించి వివరించడం, నాణ్యమైన మందుల కోసం పరిశోధనా ప్రాజెక్టులు చేపట్టడం, ఔషధాలకు సంబంధించి వ్యయ విశ్లేషణ చేయడం, మందుల మోతాదుపై స్పష్టత ఇవ్వడం, మందుల వల్ల వచ్చే దుష్ప్రభావాలు, సరైన మందుల గురించి వివరించడం వంటివన్నీ చేయాల్సి ఉంటుంది. పర్యవేక్షణ కోసం క్లినికల్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించాలి. అన్ని రకాల ఫార్మసీ క్లెయిమ్ డేటాను అంచనా వేసి, ప్రత్యేక ప్రొటోకాల్‌ను అనుసరించాల్సి ఉంటుంది. ఎంపీ కృషి వల్లే సాధ్యమైంది దేశవ్యాప్తంగా వేలాదిమంది ఫార్మా–డి చదివిన వారు ఉన్నారు. వీళ్లందరికీ ఉద్యోగాలు లేక ఇబ్బంది పడేవారు. దీనిపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి విన్నవించాం. ఆయన స్పందించి పలు సార్లు పార్లమెంటులో ప్రస్తావించారు. దీనివల్ల ప్రత్యేక కేడర్ (క్లినికల్ ఫార్మసిస్ట్)గుర్తిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. – హేమంత్‌కుమార్, ఉపాధ్యక్షుడు, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అసోసియేషన్ -
అడ్మిషన్లు అదుర్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మా తదితర కోర్సుల్లో సీట్ల భర్తీ ఈ విద్యా సంవత్సరంలో గణనీయంగా పెరిగింది. గత నాలుగైదేళ్లలో లేని విధంగా విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సుల వైపు దృష్టి సారించారు. కోవిడ్ కారణంగా విద్యా సంవత్సరంలో ప్రవేశాలు చాలా ఆలస్యమైనప్పటికీ.. అడ్మిషన్లు గతంలో కన్నా ఈసారి మెరుగ్గా ఉన్నాయి. ఉన్నత విద్యలో, సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రమాణాల మెరుగుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా విద్యార్థులు రాష్ట్ర విద్యాసంస్థల్లో చేరికకే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్ చేయడంతో పాటు జగనన్న వసతి దీవెన కింద వసతి, భోజనాల కోసం రూ.20 వేల వరకు ఏటా నిధులు సమకూరుస్తుండడం కూడా దీనికి కారణం. ఈ నేపథ్యంలోనే ఇంజనీరింగ్, ఫార్మా తదితర కోర్సుల్లోకి విద్యార్థులు ఎక్కువగా చేరుతున్నారు. ఈ ఏడాది కన్వీనర్ కోటా సీట్లు 73 శాతానికి పైగా భర్తీ అవ్వడం దీనికి తార్కాణం. 75,515 సీట్లు భర్తీ ఏపీ ఎంసెట్–2020 ప్రవేశాల ప్రక్రియ కోవిడ్ కారణంగా ఆలస్యమైన సంగతి తెలిసిందే. ఎంసెట్–2020 అడ్మిషన్లలో భాగంగా కౌన్సెలింగ్ ప్రక్రియ గత ఏడాది అక్టోబర్ చివర్లో ఆరంభమైంది. మొదటి విడత సీట్ల కేటాయింపు ఈ ఏడాది జనవరి 3న చేపట్టగా కన్వీనర్ కోటాలోని 1,04,090 సీట్లలో 72,867 సీట్లు భర్తీ అయ్యాయి. ఆదివారం మూడో విడత సీట్ల కేటాయింపు ముగియగా కన్వీనర్ కోటాలో 75,515 సీట్లు భర్తీ అవ్వగా 28,575 సీట్లు ఇంకా మిగిలాయి. ఈ కౌన్సెలింగ్‌లో ప్రభుత్వ వర్సిటీ కాలేజీల్లోని సీట్లు 90 శాతానికి పైగా భర్తీ కాగా ప్రైవేటు కాలేజీల్లోని సీట్లు భారీగా మిగిలాయి. కాలేజీలు తగ్గినా.. ప్రభుత్వం విద్యార్థుల ఉన్నత చదువులకు ఇబ్బంది లేకుండా అనేక పథకాలు అమలు చేస్తుండటంతో విద్యార్థులు రాష్ట్ర కాలేజీల్లో చేరేందుకు మొగ్గు చూపిస్తున్నారని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు ఉన్నత విద్య ప్రమాణాల పెంపుపై ప్రభుత్వం దృష్టిసారించడం కూడా ఇందుకు దోహదపడిందని, అనేక కాలేజీలను కౌన్సెలింగ్ నుంచి తప్పించినప్పటికీ భారీ సంఖ్యలో చేరికలు ఉండటం గమనార్హమని వారు చెబుతున్నారు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ప్రమాణాలు లేని కాలేజీలు వాటిని సర్దుబాటు చేసుకొనేందుకు ప్రభుత్వం కొంత సమయమిచ్చింది. లోపాలు సరిదిద్దుకోని కాలేజీలపై ఈ విద్యాసంవత్సరం నుంచి చర్యలకు ఉపక్రమించింది. చేరికలు సున్నాకు పడిపోయిన 48 ఇంజనీరింగ్ కాలేజీలను ఈసారి కౌన్సెలింగ్ నుంచి తప్పించింది. అలాగే వర్సిటీలకు నిబంధనల మేరకు ఫీజులు చెల్లించని 82 కాలేజీలకు ఫస్టియర్ సీట్ల కేటాయింపును నిలిపివేసింది. బీఫార్మసీ, డీఫార్మాలో కూడా ఇలాంటి కాలేజీలకు అడ్మిషన్లు నిలిపివేసింది. ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యల ఫలితంగా పలు కాలేజీల్లో సదుపాయాలు మెరుగుపడ్డాయి. కాలేజీలు అన్ని విధాలా అర్హతలున్న సిబ్బందిని నియమించుకున్నాయి. ల్యాబ్‌లు, లైబ్రరీలు, ఇతర సదుపాయాలను ఏర్పాటు చేశాయి. -
నియమాలు పాటిస్తేనే ప్రవేశాలు
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యలో ముఖ్యంగా ఇంజనీరింగ్, ఫార్మా తదితర కోర్సుల్లో నాణ్యతను పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందుకు తగ్గట్టుగానే 2020-21 విద్యా సంవత్సరంలో ప్రవేశాల ప్రక్రియ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. నాణ్యమైన విద్యను అందించేలా కాలేజీల్లోని సదుపాయాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయిస్తోంది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ), రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ నియమాలను అనుసరించి సదుపాయాలు ఉన్న కళాశాలలను మాత్రమే కౌన్సెలింగ్‌లో అనుమతించనున్నారు. వర్సిటీల వారీగా తనిఖీలు ఏఐసీటీఈ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న కాలేజీల్లో నిర్ణీత నిబంధనల ప్రకారం సదుపాయాలు ఉన్నాయో లేదో పరిశీలించేందుకు యూనివర్సిటీలు ప్రత్యేక కమిటీల ద్వారా తనిఖీలు చేయిస్తున్నాయి. కాకినాడ జేఎన్టీయూ, అనంతపురం జేఎన్టీయూ ప్రస్తుతం ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నాయి. గతంలో ఇదంతా తూతూమంత్రంగా సాగేది. అయితే, ప్రస్తుత ప్రభుత్వం సంబంధిత కాలేజీల్లో నిర్ణీత నియమాల ప్రకారం అన్ని సదుపాయాలు, బోధన, బోధనేతర సిబ్బంది, ల్యాబ్‌లు, భవనాలు, ఇతరత్రా ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయో లేదో క్షుణ్నంగా తనిఖీలు చేయిస్తోంది. ఉన్నత విద్యారంగంలో సంస్కరణల కోసం ఇప్పటికే ఏర్పాటైన ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ కాలేజీలు సమర్పించిన పత్రాలను అనుసరించి ఫీజులను నిర్ణయిస్తోంది. కొన్ని కాలేజీలను కమిషన్ తనిఖీలు చేయించింది. పలు కాలేజీలు సదుపాయాలు లేకుండానే కొనసాగుతున్నాయని, కొన్నిచోట్ల సరైన సంఖ్యలో అడ్మిషన్లు లేకున్నా కాలేజీలు నడుపుతుండటాన్ని గుర్తించింది. సదుపాయాలు లేకుంటే అనుమతి నిల్ సరైన సదుపాయాలు లేని కాలేజీలను కౌన్సెలింగ్‌లో అనుమతించరాదని ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్కడైనా లోపాలు ఉన్నట్టు తేలితే సంబంధిత పరిశీలన కమిటీలపై చర్యలు తీసుకుంటారన్న సంకేతాలు ఇవ్వడంతో ప్రమాణాలకు అనుగుణంగా సదుపాయాలు ఉన్నాయో లేవోననే దానిపై లోతుగా పరిశీలిస్తున్నారు. ఏఐసీటీఈ అనుమతించిన కాలేజీలు 392 రాష్ట్రంలో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏఐసీటీఈ అనుమతించిన కాలేజీల సంఖ్య గతంతో పోలిస్తే ఈసారి భారీగా తగ్గింది. ఒకప్పుడు రాష్ట్రంలో 467 వరకు ఇంజనీరింగ్, ఫార్మా తదితర కాలేజీలు కౌన్సెలింగ్‌లో పాల్గొనేవి. కానీ ఈసారి వాటి సంఖ్య 392 వరకు మాత్రమే ఉండనుంది. గత ఏడాది వీటి సంఖ్య 445 కాగా ఈసారి 53 వరకు కాలేజీల సంఖ్య తగ్గడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణాల విషయంలో కఠినంగా ఉండటంతో సదుపాయాలు లేని కాలేజీలను యాజమాన్యాలు స్వచ్ఛందంగా మూసివేశాయి. ప్రస్తుతం ఈ కాలేజీల గుర్తింపు (అఫ్లియేషన్) కోసం యూనివర్సిటీల తనిఖీలు కూడా లోతుగా సాగుతుండటంతో కౌన్సెలింగ్‌లోకి ఎన్ని కాలేజీలు వస్తాయో పరిశీలన అనంతరమే తేలనుంది. ప్రమాణాలు పాటిస్తేనే ఫీజు రీయింబర్స్మెంట్ నిర్దేశించిన అన్ని ప్రమాణాలూ పాటించే కాలేజీలకు మాత్రమే ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వనుంది. ఈసారి కాలేజీల సంఖ్య తగ్గినా సీట్ల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వం పలు కొత్త కోర్సులను ప్రవేశపెట్టడంతో సీట్లు పెరుగుతున్నాయి. ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డీప్ లెర్నింగ్, డేటా అనాలసిస్ వంటి కొత్త కోర్సుల్ని దాదాపు 50 శాతం కాలేజీల్లో ప్రారంభిస్తున్నారు. గడచిన నాలుగేళ్లలో కాలేజీలు, మొత్తం సీట్లు, కన్వీనర్ కోటా, భర్తీ అయిన, మిగులు సీట్ల వివరాలు సంవత్సరం కాలేజీల సంఖ్య మొత్తం సీట్లు కన్వీనర్ కోటా భర్తీ అయిన సీట్లు మిగిలిన సీట్లు 2017 467 1,40,358 98,251 66,073 32,178 2018 460 1,36,224 96,857 56,609 37,248 2019 445 1,29,882 1,06,203 60,315 45,888 2020 392 1,53,978 - - - -
సీట్లు ఖాళీగా ఉంటే సర్కారుకెందుకు బాధ?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విధాన నిర్ణయం పేరుతో సాంకేతిక విద్యాసంస్థల్లో కొత్త కోర్సులకు నిరభ్యంతర ధ్రువపత్రం (ఎన్ఓసీ) ఇవ్వకపోవడం సబబు కాదని హైకోర్టు స్పష్టం చేసింది. హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో లక్ష్మీబాయి విద్యాపీఠం నిర్వహిస్తున్న బొజ్జల నర్సింహులు మహిళా ఫార్మసీ కాలేజీలో 2018–19 విద్యాసంవత్సరంలో ఫార్మాడీ కోర్సును ప్రారంభించేందుకు వీలుగా ఎన్ఓసీ మంజూరు చేయాలని జేఎన్టీయూ–హెచ్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు చెప్పింది. ఫార్మా–డీ విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న అంశాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. సీట్లు భర్తీ కాకపోతే సంబంధిత కాలేజీ బాధపడాలే గానీ ఆ బాధను ప్రభుత్వమే తనపై వేసుకుని ఎన్ఓసీ ఇవ్వకపోవడం సబబు కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇంజనీరింగ్ విద్యలో ఉన్న పరిస్థితులను ఫార్మా–డీ కోర్సుకు వర్తింపజేయడం సముచితంగా లేదని పేర్కొంది. ఏఐసీటీఈ, పీసీఐ అనుమతిచ్చినా తమ కాలేజీలో ఫార్మా–డీ కోర్సు ప్రారంభానికి అనుబంధ గుర్తింపు ఇవ్వడం లేదని ఆ కాలేజీ హైకోర్టును ఆశ్రయించింది. ఫార్మా–డీ సీట్లు ఏటా ఖాళీలు ఉన్నాయంటూ సర్కార్‌తోపాటు జేఎన్టీయూ–హెచ్ చేసిన వాదనల్ని ధర్మాసనం తిరస్కరించింది. -
ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు 18 నుంచి కౌన్సెలింగ్
కర్నూలు (కొండారెడ్డి ఫోర్టు) : బయోటెక్నాలజీ, బి.ఫార్మాసీ, ఫార్మడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు ఎస్‌జీపీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నట్లు కో– ఆర్డినేటర్ వై.విజయభాస్కర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంసెట్–2016 బైపీసీ విభాగంలో అర్హత సాధించిన విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరుకావచ్చన్నారు. కళాశాలలకు ఆప్షన్లను 19 నుంచి 21వ తేదీ వరకు ఇచ్చుకోవచ్చని, 23వ తేదీన కళాశాలల కేటాయింపు జరుగుతుందని వివరించారు. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభమవుతుందని,అర్హత ఉన్న అభ్యర్థులు ఎంసెట్ హాల్ టిక్కెట్, ఎంసెట్ ర్యాంకు కార్డు, పది, ఇంటర్ మార్కుల జాబితాలు, కుల, ఆదాయ సర్టిఫికెట్లను ఒరిజినల్‌తోపాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలను తెచ్చుకోవాలన్నారు. కౌనెల్సింగ్ నమోదు ఫీజుగా ఎస్సీ ఎస్టీలు రూ. 500, బీసీలు/ఓసీలు రూ.1000 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎన్సీసీ/పీహెచ్/క్యాప్/స్పోర్ట్స్ కేటగిరి అభ్యర్థులకు విజయవాడలోని బెంజ్ సర్కిల్లో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు సంబంధిత వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చన్నారు.