సాక్షి, అమరావతి: ఉన్నత విద్యలో ముఖ్యంగా ఇంజనీరింగ్, ఫార్మా తదితర కోర్సుల్లో నాణ్యతను పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందుకు తగ్గట్టుగానే 2020-21 విద్యా సంవత్సరంలో ప్రవేశాల ప్రక్రియ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. నాణ్యమైన విద్యను అందించేలా కాలేజీల్లోని సదుపాయాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయిస్తోంది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ), రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ నియమాలను అనుసరించి సదుపాయాలు ఉన్న కళాశాలలను మాత్రమే కౌన్సెలింగ్‌లో అనుమతించనున్నారు.
వర్సిటీల వారీగా తనిఖీలు
ఏఐసీటీఈ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న కాలేజీల్లో నిర్ణీత నిబంధనల ప్రకారం సదుపాయాలు ఉన్నాయో లేదో పరిశీలించేందుకు యూనివర్సిటీలు ప్రత్యేక కమిటీల ద్వారా తనిఖీలు చేయిస్తున్నాయి. కాకినాడ జేఎన్‌టీయూ, అనంతపురం జేఎన్‌టీయూ ప్రస్తుతం ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నాయి. గతంలో ఇదంతా తూతూమంత్రంగా సాగేది. అయితే, ప్రస్తుత ప్రభుత్వం సంబంధిత కాలేజీల్లో నిర్ణీత నియమాల ప్రకారం అన్ని సదుపాయాలు, బోధన, బోధనేతర సిబ్బంది, ల్యాబ్‌లు, భవనాలు, ఇతరత్రా ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయో లేదో క్షుణ్నంగా తనిఖీలు చేయిస్తోంది. ఉన్నత విద్యారంగంలో సంస్కరణల కోసం ఇప్పటికే ఏర్పాటైన ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ కాలేజీలు సమర్పించిన పత్రాలను అనుసరించి ఫీజులను నిర్ణయిస్తోంది. కొన్ని కాలేజీలను కమిషన్ తనిఖీలు చేయించింది. పలు కాలేజీలు సదుపాయాలు లేకుండానే కొనసాగుతున్నాయని, కొన్నిచోట్ల సరైన సంఖ్యలో అడ్మిషన్లు లేకున్నా కాలేజీలు నడుపుతుండటాన్ని గుర్తించింది.
సదుపాయాలు లేకుంటే అనుమతి నిల్
సరైన సదుపాయాలు లేని కాలేజీలను కౌన్సెలింగ్‌లో అనుమతించరాదని ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్కడైనా లోపాలు ఉన్నట్టు తేలితే సంబంధిత పరిశీలన కమిటీలపై చర్యలు తీసుకుంటారన్న సంకేతాలు ఇవ్వడంతో ప్రమాణాలకు అనుగుణంగా సదుపాయాలు ఉన్నాయో లేవోననే దానిపై లోతుగా పరిశీలిస్తున్నారు.
ఏఐసీటీఈ అనుమతించిన కాలేజీలు 392
రాష్ట్రంలో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏఐసీటీఈ అనుమతించిన కాలేజీల సంఖ్య గతంతో పోలిస్తే ఈసారి భారీగా తగ్గింది. ఒకప్పుడు రాష్ట్రంలో 467 వరకు ఇంజనీరింగ్, ఫార్మా తదితర కాలేజీలు కౌన్సెలింగ్‌లో పాల్గొనేవి. కానీ ఈసారి వాటి సంఖ్య 392 వరకు మాత్రమే ఉండనుంది. గత ఏడాది వీటి సంఖ్య 445 కాగా ఈసారి 53 వరకు కాలేజీల సంఖ్య తగ్గడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణాల విషయంలో కఠినంగా ఉండటంతో సదుపాయాలు లేని కాలేజీలను యాజమాన్యాలు స్వచ్ఛందంగా మూసివేశాయి. ప్రస్తుతం ఈ కాలేజీల గుర్తింపు (అఫ్లియేషన్) కోసం యూనివర్సిటీల తనిఖీలు కూడా లోతుగా సాగుతుండటంతో కౌన్సెలింగ్‌లోకి ఎన్ని కాలేజీలు వస్తాయో పరిశీలన అనంతరమే తేలనుంది.
ప్రమాణాలు పాటిస్తేనే ఫీజు రీయింబర్స్‌మెంట్
నిర్దేశించిన అన్ని ప్రమాణాలూ పాటించే కాలేజీలకు మాత్రమే ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వనుంది. ఈసారి కాలేజీల సంఖ్య తగ్గినా సీట్ల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వం పలు కొత్త కోర్సులను ప్రవేశపెట్టడంతో సీట్లు పెరుగుతున్నాయి. ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డీప్ లెర్నింగ్, డేటా అనాలసిస్ వంటి కొత్త కోర్సుల్ని దాదాపు 50 శాతం కాలేజీల్లో ప్రారంభిస్తున్నారు.
గడచిన నాలుగేళ్లలో కాలేజీలు, మొత్తం సీట్లు, కన్వీనర్ కోటా, భర్తీ అయిన, మిగులు సీట్ల వివరాలు
సంవత్సరం | కాలేజీల సంఖ్య | మొత్తం సీట్లు | కన్వీనర్ కోటా | భర్తీ అయిన సీట్లు | మిగిలిన సీట్లు |
2017 | 467 | 1,40,358 | 98,251 | 66,073 | 32,178 |
2018 | 460 | 1,36,224 | 96,857 | 56,609 | 37,248 |
2019 | 445 | 1,29,882 | 1,06,203 | 60,315 | 45,888 |
2020 | 392 | 1,53,978 | - | - | - |
Comments
Please login to add a commentAdd a comment