సాక్షి, అమరావతి: ప్రస్తుత (2021–22) విద్యాసంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) విడుదల చేసింది. ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 188 పనిదినాలు ఉండగా సెలవులు 70 రోజులు ఉన్నాయి. ఇక బేస్‌లైన్ పరీక్షలతోపాటు ఫార్మేటివ్ (నిర్మాణాత్మక) పరీక్షలు 4, సమ్మేటివ్ (సంగ్రహణాత్మక) పరీక్షలు 2తో పాటు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈనెల 16న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం జెడ్పీ స్కూలులో నిర్వహించిన కార్యక్రమంలో ఈ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ అకడమిక్ క్యాలెండర్‌ను, పాఠ్యప్రణాళికను ఎస్సీఈఆర్టీ తీర్చిదిద్దింది. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి సారథ్యంలో వివిధ విభాగాల నిపుణులు 35 మంది దీని రూపకల్పనలో భాగస్వాములయ్యారు. పాలన ప్రణాళిక, యాజమాన్యాల వారీగా రాష్ట్రంలోని పాఠశాలలు, జిల్లా ఉపాధ్యాయ విద్యాశిక్షణ సంస్థలు, ఉపాధ్యాయుల వివరాలను ఈసారి కొత్తగా చేర్చారు. విద్యాహక్కు చట్టం, బాలలహక్కుల చట్టం నియమ నిబంధనలతో పాటు కేంద్రం నూతన విద్యావిధానంలో సూచించిన విధంగా సమ్మిళిత విద్యాంశాలను ఈ విద్యాప్రణాళికలో పొందుపరిచారు.
6 రకాల స్కూళ్ల గురించి..
పాఠశాలల భద్రత, విపత్తు నిర్వహణ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కార్యక్రమాలు, సమగ్రశిక్ష, వయోజన విద్య, ఉపాధ్యాయ శిక్షణ, ఉపాధ్యాయుల సామర్థ్యాలు మెరుగుపర్చడం, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్‌సీసీ, కెరీర్ గైడెన్స్, యూడైస్ చైల్డ్ ఇన్ఫో, దీక్ష వంటి అంశాలను విపులీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, సంస్కరణలలో అమ్మ ఒడి, మనబడి నాడు–నేడు, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్య, కొత్తగా రూపొందించిన వివిధ యాప్‌లు, పాఠ్యప్రణాళికా సంస్కరణలు, గ్రంథాలయాలు, చదవడంపై ఆసక్తి వంటి అంశాలను వివరించారు. భవిష్యత్తు ప్రణాళికలు పొందుపరిచారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న నూతన విద్యావిధానంలోని 6 రకాల స్కూళ్లు, నాడు–నేడు, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, రంగోత్సవం, కళాఉత్సవ్, ద ఇండియా టాయ్ ఫెయిర్ ఏకభారత్ శ్రేష్ఠభారత్, మాసాంతపు వేడుక, కరోనా కాలంలో, కరోనా అనంతరం విద్యాకార్యక్రమాలు, ఆటల పోటీలు, సైన్సు ఫెయిర్‌లు, క్విజ్, వక్తృత్వపోటీలు, క్షేత్ర పర్యటనలు, ఆరోగ్య కార్యక్రమాల గురించి తెలిపారు.
1, 3వ శనివారాలు నోబ్యాగ్ డే
ప్రతి స్కూలులో పాఠ్యబోధనతో స్వీయ పఠనం, పర్యవేక్షక పఠనం, పోటీ పరీక్షలకు సన్నద్ధతతోపాటు నీటిగంట, ఆటలు, పునశ్చరణ, సవరణాత్మక బోధన, గ్రంథాలయ కృత్యాలు నిర్వహించేలా ఈ విద్యాప్రణాళికను రూపొందించారు. ఒకటి, 3వ శనివారాలను నోబ్యాగ్ డేగా నిర్వహించనున్నారు. 9 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు వారానికి ఒకసారి కెరీర్ గైడెన్స్‌పై అవగాహన కల్పించాలని సూచించారు. ఉదయం 8 నుంచి 8.45 గంటల వరకు నిర్వహించే సహపాఠ్య కార్యక్రమాలు విద్యార్థుల ఐచ్ఛికం ప్రకారం జరగాలని నిర్దేశించారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులు తగు జాగ్రత్తలు తీసుకొనేలా చూడడంతోపాటు వాటిపై వారికి అవగాహన కలిగించాలని సూచించారు.
ఫౌండేషన్ స్కూళ్లపై మరింత శ్రద్ధ
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశ పెడుతున్న ఫౌండేషన్ స్కూళ్ల నిర్వహణలో మరింత శ్రద్ధ తీసుకొనేలా విద్యాక్యాలెండర్‌లో అంశాలను పొందుపరిచారు. దీని ప్రకారం.. ఉదయాన్నే గ్రీట్ అండ్ మీట్ కింద ఉపాధ్యాయుడు పిల్లలకు స్వాగతం చెప్పాలి. ప్రతి పిల్లవాడిని పేరుతో పలకరిస్తూ కథలు చెప్పాలి. సామూహిక కృత్యాలు నిర్వహించాలి. తరగతి గదిలోనే బుక్ ఏరియా, డాల్స్ ఏరియా, డిస్కవరీ ఏరియా, బ్లాక్ బిల్డింగ్ ఏరియా, మ్యూజిక్ అండ్ మూవ్‌మెంటు ఏరియాలుగా చేసి పిల్లలు వారికి నచ్చిన ఏరియాలో ఆడుకునేలా చేసి వారి అభీష్టాలను గమనించాలి. వస్తువులను లెక్కించేలా, గుర్తించేలా చేయాలి. వస్తువులను చూడడం, తాకడం, శబ్దాలను వినడం, పదార్థాల వాసన, రుచి చూసి చెప్పడం వంటివి చేయించాలి. భోజన సమయంలో చేతులు కడుక్కోవడం, శుభ్రం చేసుకోవడం నేర్పాలి. భాషా నైపుణ్యాలను అలవర్చాలి. చివరిగా పాఠశాలను వదిలిన సమయంలో పునశ్చరణ, గుడ్‌బై చెప్పడం వంటివి చేయించాలి.
ఈ విద్యాసంవత్సరంలో 188 పనిదినాలు
Published Fri, Aug 20 2021 3:39 AM | Last Updated on Fri, Aug 20 2021 3:41 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment