సాక్షి, అమరావతి: ఈ ఏడాది బోధనాభ్యసన కార్యక్రమాలు, పరీక్షల విషయంలో విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా ఉండేలా పాఠశాల విద్యా శాఖ చర్యలు చేపట్టింది. ఈ ఏడాది పాఠశాల విద్యతో పాటు ఇంటర్మీడియెట్‌లోనూ విద్యార్థులపై భారం లేకుండా అకడమిక్ క్యాలెండర్‌ను రూపొందించింది. ముఖ్యంగా టెన్త్ పబ్లిక్ పరీక్షలపై విద్యార్థులు ఆందోళనకు గురికాకుండా ఏ మేరకు అభ్యసనం సాగించాలి, వారి సామర్థ్యాలను ఏ మేరకు పరిశీలన చేసి ఉత్తీర్ణతను నిర్ణయించాలి అనే వాటిపైనా ముందుగానే ప్రణాళిక రూపొందించింది. రాష్ట్రంలో అవుట్ కమ్ బేస్డ్ (అభ్యసన ఫలితాల ఆధారిత) సిలబస్‌ను రూపొందించినందున దానికి అనుగుణంగానే తరగతి గదిలో విద్యార్థులు నేర్చుకొనే అంశాలు, ఇంటి దగ్గర అభ్యసనం చేయగలిగే అంశాలను వేరు చేసింది. తరగతి గదిలో బోధించే అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ముఖ్యంగా టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో ప్రశ్నలను దీని ఆధారంగానే రూపొందించాలని ఎస్సెస్సీ బోర్డుకు సూచించింది. ‘ఇంటి దగ్గర విద్యార్థులు తమంతట తాము అభ్యసించగలిగే అంశాలు కేవలం వారి సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడానికి మాత్రమే. తరగతి గదిలోని బోధనాంశాలపై మాత్రమే వారికి పరీక్షల్లో ప్రశ్నలు ఉంటాయి’ అని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. (చదవండి: నియమాలు పాటిస్తేనే ప్రవేశాలు)
180 పని దినాలు... 143 బోధనా దినాలు
రాష్ట్రంలో సోమవారం నుంచి స్కూళ్లు ప్రారంభమై ఏప్రిల్ 30తో ముగిసేలా పాఠశాల విద్యాశాఖ క్యాలెండర్‌ను రూపొందించింది. మొత్తం 180 రోజుల పని దినాల్లో 143 రోజులు పాఠశాల బోధనా దినాలుగా, 37 రోజులు ఇంటివద్ద నేర్చుకునే పని దినాలుగా నిర్ణయించింది. పాఠశాలలు దాదాపు ఏడు నెలలపాటు మూతపడినందున 2020-21 విద్యా సంవత్సరానికి పని దినాల సర్దుబాటులో భాగంగా పలు సెలవులను కుదించారు. సంక్రాంతి సెలవులు, వేసవి సెలవుల్లో కొన్ని రోజులను పాఠశాల, ఇంటి పని దినాలుగా నిర్ణయించారు. ముఖ్యమైన పండుగలు, జాతీయ సెలవుల్లో మినహాయించి తక్కిన సెలవు రోజుల్లో పాఠ్యబోధన కొనసాగనుంది. టీచర్ల సెలవుల విషయంలోనూ నియంత్రణ పెట్టారు. (చదవండి: ఒకవైపు ఆంగ్లం.. మరోవైపు తెలుగు)
పరీక్షల కుదింపు
విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ విద్యా సంవత్సరంలో పరీక్షల సంఖ్యను కూడా పాఠశాల విద్యా శాఖ కుదించింది. ఏటా నిర్వహించే నాలుగు ఫార్మేటివ్ పరీక్షలను రెండుకు, 2 సమ్మేటివ్ పరీక్షలను ఒకటికి కుదించారు. బేస్‌లైన్ పరీక్షలను నవంబర్ మొదటి వారంలో, ప్రాజెక్టు ఆధారిత పరీక్షలను నవంబర్ చివరి వారంలో, ఫార్మెటివ్-1 పరీక్షలను డిసెంబర్ చివరి వారంలో, ఫార్మేటివ్-2 పరీక్షలను ఫిబ్రవరి చివరి వారంలో, సమ్మేటివ్ పరీక్షలను ఏప్రిల్ చివరి వారంలో నిర్వహిస్తారు.
నెలవారీగా పని దినాలు, పాఠశాల, ఇంటి పని దినాల విభజన ఇలా..
నెల మొత్తం పని దినాలు పాఠశాల పని దినాలు ఇంటివద్ద పని దినాలు
నవంబర్ 29 25 4
డిసెంబర్ 31 25 6
జనవరి 31 23 8
ఫిబ్రవరి 28 24 4
మార్చి 31 25 6
ఏప్రిల్ 30 21 9
మొత్తం 180 143 37
Comments
Please login to add a commentAdd a comment