engineering college fee
-
సీటు.. మహా రేటు!
జేఎన్టీయూ పరిధిలోనే 149 కాలేజీలుండగా ప్రైవేటు కాలేజీల్లో 70 శాతం సీట్లు కన్వీనర్ కోటా (‘ఎ’ కేటగిరీ) ద్వారా.. మిగిలిన 30 శాతం సీట్లు మేనేజ్మెంట్ కోటా (‘బి’ కేటగిరీ)లో ద్వారా భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. కన్వీనర్ కోటా పూర్తయిన తర్వాత మేనేజ్మెంట్ కోటాను భర్తీ చేయాలి.. కానీ కన్వీనర్ కోటా ప్రక్రియ కంటే ముందే.. మేనేజ్మెంట్ కోటా సీట్ల అమ్మకాలపై యాజమాన్యాలు దృష్టి సారించాయి. మేనేజ్మెంట్ల సీట్ల భర్తీలో 15 శాతం సీట్లను ఎన్నారై/ఎన్నారై స్పాన్సర్డ్ కోటాలో కేటాయించాలి. మరో 15 శాతం సీట్ల భర్తీలో జేఈఈ మెయిన్ ర్యాంకర్లకు మొదటి ప్రాధాన్యం, ఎంసెట్ ర్యాంకర్లకు రెండో ప్రాధాన్యం ఇవ్వాలి. ఎవరూ లేకుంటే ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా సీట్లను కేటాయించాలి. కానీ ఇవేవీ అమలు లేకుండా ఇష్టానుసారం ప్రవేశాలకు తెరలేచింది. సాక్షి, సిటీబ్యూరో: కౌన్సెలింగ్ కంటే ముందే ఇంజినీరింగ్ కాలేజీల సీట్ల దందా జోరందుకుంది. ప్రైవేటు ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీల మధ్యవర్తిత్వంతో సీట్ల రిజర్వేషన్్ ప్రక్రియకు తెరలేచింది. కన్వీనర్ కోటా కటాఫ్ కంటే అధిక ర్యాంకులు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సీట్ల టెన్షన్ పట్టుకుంది. ఇదే అంశం ఇంజినీరింగ్ కాలేజీలకు కాసులు కురిపిస్తోంది. కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కాక ముందే పేరొందిన ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు నిబంధనలు గాలికొదిలి సీట్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టాయి. దీంతో కన్వీనర్ కోటా వర్తించని విద్యార్థుల తల్లిదండ్రులకు కన్సల్టెన్సీల ఫోన్ల తాకిడి అధికమైంది. టాప్‌టెన్ కాలేజీల్లో సీట్లు ఇప్పిస్తామని గాలం వేస్తున్నాయి. ఏకంగా కాలేజీలకు తీసుకెళ్లి సీట్లు రిజర్వ్ చేయించడం బహిరంగ రహస్యంగా తయారైంది. కోర్సుల ఆధారంగా సగటున ఒక్కో సీటుకు రూ.12 లక్షల రూ.25 లక్షల వరకు పలుకుతోంది. కొన్ని కాలేజీలు డొనేషన్ల పేరుతో భారీగా వసూలు సైతం దిగాయి. సీటు రిజర్వేషన్ చేసుకొని మరో 20 రోజుల్లో మొదటి సంవత్సరం ఫీజు చెల్లిస్తే సీటు ఇస్తామని స్పష్టం చేస్తుండగా, ఇంకొన్ని కాలేజీలు మాత్రం మొత్తం ఒకేసారి నగదు రూపంలో చెల్లిస్తేనే సీటు, విడతల వారీగా చెల్లిస్తే ఆ డొనేషనన్ పెరుగుతుందని తేల్చి చెబుతున్నాయి. అందులో సైతం కేవలం నగదు రూపంలోనే చెల్లించాలని, ఆన్లైన్ చెల్లింపులను నిరాకరిస్తున్నాయి. సీటు అంశం మాట్లాడేటప్పుడు మాత్రం యాజమాన్యాలు జాగ్రత్తపడుతున్నాయి. సదరు పేరెంట్స్ మొబైల్ ఫోన్లను సెక్యూరిటీలో పెట్టి లోపలికి వచ్చేవిధంగా చర్యలు తీసుకుంటున్నాయి. బేరసారాలు ముగియగానే తక్షణమే రూ.50 వేలు చెల్లించి రిజర్వేషన్ చేసుకునే విధంగా ఒత్తిళ్లు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. మూడు విడతలుగా కౌన్సెలింగ్ ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం జూనన్ 26 నుంచి ఆగస్టు 9 వరకు మూడు విడతల్లో కౌన్సెలింగ్ జరగనున్నది. తొలి విడత కౌన్సెలింగ్ జూన్ 26 నుంచి, రెండో విడత జూలై 21 నుంచి, తుది విడత కౌన్సెలింగ్ ఆగస్టు 2 నుంచి ప్రారంభం కానున్నది. మూడు విడతల్లో సీట్లు పొందిన వారు ఆగస్టు 8, 9 తేదీల్లో కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 8న ప్రైవేట్ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలను విడుదలవుతాయి. ఇంజినీరింగ్ సీట్లు మిగలకుండా ఐఐటీలు, ‘ఎ’ ఐటీల్లో ప్రవేశాలకు కల్పించే జోసా కౌన్సెలింగ్‌కు సమాంతరంగా ఎంసెట్ కౌన్సెలింగ్‌ను నిర్వహించేలా షెడ్యూల్ ఖరారైంది. గతంలోనూ.. ఇంజినీరింగ్ కాలేజీల్లో మెరిట్‌కు పాతర వేస్తుండగా.. సీట్లు అంగడి సరుకుగా మారాయి. వేలం మాదిరి రోజురోజుకూ డిమాండ్ పెంచి మరీ డొనేషన్లు వసూలు చేస్తున్నాయి. బ్రాంచీని బట్టి సొమ్ము చేసుకుంటున్నాయి. గతంలో సైతం మెరిట్ కాదు కదా.. అసలు జేఈఈ ర్యాంకు, ఎంసెట్ రాయనివారికి కూడా సీట్ల లభించాయి. ప్రస్తుతం సైతం అదే పునరావృతం కాబోతోంది. టాప్ కాలేజీల్లోనే ఈ అడ్డగోలు దందా ఉండగా మిగతా కాలేజీల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పెరిగిన డిమాండ్ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు మెకానికల్, సివిల్ విభాగాల్లో సీట్లు తగ్గించుకుని, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్‌న్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ కోర్సుల సీట్లు పెంచుకున్నాయి. ఆ సీట్లకున్న డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. తమ పిల్లలతో ఎలాగైనా కంప్యూటర్ సైన్స్ సంబంధిత కోర్సు చేయించాలని తల్లిదండ్రుల ఆశలు కాలేజీలకు కాసుల పంట పండిస్తోంది. -
ఫీ'జులుం'పై ఫైన్.. ఒక్కో సీటుపై రూ.2 లక్షల జరిమానా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు ఇంజనీరింగ్ కాలేజీలు, ఇతర వృత్తి విద్యా కళాశాలలు యాజమాన్య కోటా సీట్లకు విచ్చల విడిగా ఫీజులు నిర్ణయించి వసూలు చేయడంపై రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. బీ కేటగిరీ సీట్ల భర్తీలోనూ నిబంధనలకు పాతరేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరుపై మండిపడింది. ఈ విధంగా చేపట్టిన ఒక్కో అడ్మిషన్‌పై రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు జరిమానాలు విధించేందుకు సిద్ధమైంది. అదేవిధంగా అక్రమంగా వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి విద్యార్థులకు అప్పజెప్పనుంది. ఇష్టారాజ్యంగా వసూళ్లు రాష్ట్రంలో 159 ఇంజనీరింగ్ కాలేజీలు బీటెక్, బీఈ కోర్సులు నిర్వహిస్తుండగా... వీటిలో 76 కాలేజీలు ఇంజనీరింగ్ పోస్టు గ్రాడ్యుయేషన్ (ఎం.టెక్, ఎం.ఈ.) కోర్సులు కూడా నిర్వహిస్తున్నాయి. మరోవైపు 238 కాలేజీలు పీజీ వృత్తి విద్యా కోర్సుల్లో భాగమైన ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సులు నిర్వహిస్తున్నాయి. ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో కన్వీనర్ కోటా మినహాయించి మిగతా సీట్లకు బీ కేటగిరీ, యాజమాన్య కోటా కింద అడ్మిషన్లు కల్పిస్తారు. కన్వీనర్ కోటా ప్రవేశాలు, కేటగిరీ బీ అడ్మిషన్లు, యాజమాన్య కోటాలో ప్రవేశాలకు సంబంధించి ఏఎఫ్ఆర్సీ ఫీజులు సిఫారసు చేసింది. కాలేజీల్లో వసతులు, సౌకర్యాలు తదితర అంశాలను పూర్తిగా పరిశీలించిన అనంతరం ఏయే కోర్సుకు ఫీజులు ఎలా ఉండాలన్న అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చింది. ఈ క్రమంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కాలేజీల వారీగా ఫీజులు ఖరారు చేసింది. అయితే కొన్ని కాలేజీలు ఆదాయార్జన కోసం కేటగిరీ బీ, యాజమాన్యా కోటా ప్రవేశాల్లో జిమ్మిక్కులు చేస్తున్నాయి. టీఏఎఫ్ఆర్సీ సిఫారసులకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కాకుండా.. డొనేషన్లు, ఇతర పద్ధతుల్లో దండుకుంటున్నాయి. ప్రవేశ పరీక్షల్లో మెరిట్, ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను పక్కకు నెడుతూ అత్యధిక ఫీజులు చెల్లించే వారికి ప్రవేశాలు కల్పిస్తున్నాయి. నిబంధనలకు తూట్లు వాస్తవానికి బీ కేటగిరీ అడ్మిషన్ల విషయంలో ఏఎఫ్ఆర్సీ సూచనలు కాలేజీలు తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. అదే విధంగా కన్వీనర్ కోటాలో చివరిర్యాంకు ఆధారంగా అడ్మిషన్లు కల్పించాలి. బీ కేటగిరీలో ఫలానా ప్రమాణాలకు అనుగుణంగా అడ్మిషన్లు ఇవ్వాలని ప్రభుత్వం సూచిస్తే తప్పకుండా నడుచుకోవాలి. అదేవిధంగా యాజమాన్యా కోటా ప్రవేశాల విషయంలోనూ ఉత్తమ ర్యాంకు అభ్యర్థులకు అవకాశం కల్పించాలి. ఆ మేరకు నిబంధనలు అనుసరించాలి. కానీ మెరిట్, బెస్ట్ ర్యాంకు తదితరాలను పట్టించుకోని కొన్ని కాలేజీలు.. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుతో పాటు డొనేషన్లు, ఇతర పద్ధతుల్లో విద్యార్థుల నుంచి రూ.లక్షలు వసూలు చేస్తున్నాయి. ఈ మేరకు ఏఎఫ్ఆర్సీకి పలు ఫిర్యాదులు అందాయి. వీటిపై స్పందించిన కమిటీ అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలపై చర్యలకు ఉపక్రమించింది. అక్రమాలకు పాల్పడుతున్న కాలేజీలపై జరిమానాలు విధించి ముక్కుపిండి వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. నిబంధనలు పాటించకుండా అధిక ఫీజులు వసూలు చేసి కేటాయించిన ఒక్కో సీటుపై కనిష్టంగా రూ.2 లక్షల చొప్పున జరిమానా విధించనుంది. మెరిట్ లేకుండా సీట్లు కేటాయించినా.. ఇక బీ కేటగిరీ అడ్మిషన్లలో ర్యాంకులు పరిగణించకుండా ఎన్ని సీట్లు కేటాయిస్తే అన్ని సీట్లపై.. ఒక్కో సీటుకు రూ.10 లక్షల లెక్కన జరిమానా విధిస్తామని ఏఎఫ్ఆర్సీ స్పష్టం చేసింది. ఈ రెండు రకాల జరిమానాల వసూలుకు గాను కన్వీనర్ దగ్గర జమ చేసిన కాలేజీ నిధికి కోత పెట్టనున్నట్లు వెల్లడించింది. ఆయా కాలేజీల్లో ఎంతమంది నుంచి ఈ విధంగా వసూళ్లకు పాల్పడ్డారో గుర్తించేందుకు సిద్ధమవుతోంది. జరిమానాల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేసిన కమిటీ.. క్షేత్రస్థాయిలో అడ్డగోలు ఫీజు వసూళ్లపై ఫిర్యాదులు కూడా స్వీకరించనుంది. సరైన ఆధారాలను సమర్పిస్తే తక్షణమే స్పందించి చర్యలు తీసుకోనుంది. చదవండి: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. హైకోర్టు తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం -
మరో 15% ఫీజులు.. మరింత భారం కానున్న ఇంజనీరింగ్, ఫార్మసీ విద్య
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంజనీరింగ్, ఫార్మసీ విద్య మరింత భారం కానుంది. ఈసారి భారీగా ఫీజులు పెంచేందుకు ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి. అయితే ఏ మేరకు పెంచాలనే దానిపై రాష్ట్ర అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ మరో వారంలో విడుదల చేస్తామని టీఏఎఫ్ఆర్సీ వర్గాలు తెలిపాయి. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు సమర్పించే ఫీజు పెంపు ప్రతి పాదనలపై ఫీజుల నియంత్రణ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. పెరిగే ఫీజులు వచ్చే విద్యా సంవత్సరం (2022–23)నుంచి అమల్లోకి వస్తాయి. అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిబంధనల ప్రకారం మూడేళ్లకోసారి ఫీజు లపై టీఏఎఫ్ఆర్సీ సమీక్షించాల్సి ఉంటుంది. కాలేజీల్లో కల్పించే మౌలికవసతులు, వాటి నిర్వహణ వ్యయం ప్రాతిపదికగా ఫీజుల పెంపును టీఏఎఫ్ఆర్సీ నిర్ధారిస్తుంది. 2019లో జరిగిన ఈ కసరత్తు గడువు ఈ ఏడాదితో ముగుస్తుంది. 15 శాతంపైనే పెంపు?: రాష్ట్రంలో 158 ఇంజనీరింగ్, 112 ఫార్మసీ, 54 ఫార్మా డీ కాలేజీలున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఇంజనీరింగ్ వార్షిక ఫీజు కనిష్టంగా రూ. 44 వేలు ఉండగా గరిష్టంగా రూ. 1.34 లక్షల వరకూ ఉంది. 25 కాలేజీల్లో ఫీజు రూ. లక్షకుపైగా ఉంటే మిగతా కాలేజీల్లో రూ. లక్షలోపు ఉంది. ఈసారి 15 శాతం మేర ఫీజులు పెంచాలని కాలేజీల యాజమాన్యాలు భావిస్తున్నాయి. అందుకు టీఏఎఫ్ఆర్సీ ఆమోదం తెలిపితే ఇంజనీరింగ్‌లో వార్షిక ఫీజు కనిష్టంగా రూ. 50 వేల నుంచి రూ. 1.50 లక్షలకుపైగా ఉండే వీలుంది. అంటే ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేయడానికి రూ. 2 లక్షల నుంచి రూ. 6 లక్షలు ఖర్చయ్యే వీలుంది. కరోనా కాలంలోనూ ఖర్చా?: గత మూడేళ్లలో కాలేజీల నిర్వహణ వ్యయంతోపాటు మౌలిక సదుపాయాల విస్తరణ, విద్యాప్రమాణాల మెరుగుదలకు చేసిన ఖర్చు వివరాలను యాజమాన్యాలు టీఏఎఫ్ఆర్సీకి ఇవ్వాలి. అయితే 2019 తర్వాత కరోనా కారణంగా విద్యాసంస్థలు పెద్దగా కొనసాగలేదు. ఆన్లైన్ బోధనతోనే సరిపెట్టాయి. అలాంటప్పుడు కొత్తగా అయ్యే వ్యయం ఏమిటి? ఎందుకు ఫీజులు పెంచాలనే వాదన అన్ని వర్గాల నుంచి వస్తోంది. కానీ యాజమాన్యాలు మాత్రం కరోనా కాలంలో ఆన్లైన్ బోధన కోసం సాంకేతిక ఏర్పాట్లు చేసుకున్నామని, ఇదంతా తమకు అదనపు వ్యయమేనని పేర్కొంటున్నాయి. ఈ దిశగా ఆడిట్ రిపోర్టులు తయారు చేస్తున్నాయి. అయితే పేరున్న కాలేజీల్లో కొంతమేర ఆన్లైన్ క్లాసులు ప్రమాణాల మేరకే జరిగినా వాటి సంఖ్య 20కు మించదని టీఏఎఫ్ఆర్సీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని కాలేజీలను ఒకేగాటన కట్టడం సరికాదని అభిప్రాయపడుతున్నాయి. కష్టకాలంలో భారం వద్దు... కరోనా కష్టకాలంలో విద్యా వ్యవస్థే అతలాకుతలమైంది. ఆర్థిక భారంతో పేదలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో ఫీజులు పెంచితే సహించేది లేదు. – ప్రవీణ్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నిరసనలు చేపడతాం కాలేజీల యాజమాన్యాల ఫీజుల పెంపు ఆలోచన హేతుబద్ధం కాదు. ఈ ప్రతిపాదన అమలు చేయరాదని టీఏఎఫ్ఆర్సీపై ఒత్తిడి తెస్తాం. నిరసనలు చేపడతాం. – నాగరాజు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి -
ఇంజనీరింగ్ కన్వీనర్ కోటా ఫీజు... ఎందుకు పెరిగిందట?
రాష్ట్రంలోని ఇంజనీరింగ్ సహా వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ఎనిమిదేళ్ల కిందట తక్కువ ఫీజులు ఉంటే ఇప్పుడు అవి భారీగా పెరిగిపోయాయి. కాస్త పేరున్న కాలేజీలు మొదలు టాప్ కాలేజీల వరకు చూసుకుంటే ఈ ఫీజులు ఎనిమిదేళ్లలో రెండు, మూడింతలయ్యాయి. 2011లో కన్వీనర్ కోటా ఫీజు రూ. 31 వేలుగా ఉంటే మేనేజ్మెంట్ కోటా ఫీజు రూ. 95 వేలుగా ఉండేది. 30% సీట్లు ఉండే మేనేజ్మెంట్ కోటాతో పోటీగా.. 70% సీట్లుండే కన్వీనర్ కోటాలో ఫీజులు పెంచాలంటూ ప్రభుత్వం ముందు యాజమాన్యాలు డిమాండ్ పెట్టాయి. మేనేజ్మెంట్ కోటా, కన్వీనర్ కోటాలో రెండింటిలోనూ ఒకే రకమైన ఫీజులను అమలు చేసేలా కామన్ ఫీజు విధానం కోసం పట్టుబట్టాయి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి దాన్ని సాధించుకున్న యాజమాన్యాలు.. కన్వీనర్ కోటాలో ఇంజనీరింగ్‌లో చేరే పేద విద్యార్థులపై ఫీజుల భారానికి కారణమయ్యాయి. ఏ స్థాయిలోనూ ప్రశ్నించలేని విధంగా ఆదాయ, వ్యయాలనుబట్టి ఫీజులను పెంచుకుంటామని కోరినా.. ప్రభుత్వాలు ఓకే చెప్పాయి. ఇంత చేసున్నా కామన్‌ఫీజు విధానాన్ని మేనేజ్మెంట్ కోటాలో అమలు చేయట్లేదు. కన్వీనర్ కోటాలో ఫీజులను పెంచుకొని.. యాజమాన్య కోటాలో ఆ ఫీజులను అమలు చేయకుండా, కొన్ని కాలేజీలు అడ్డగోలుగా డొనేషన్లు దండుకుంటున్నాయి. పారదర్శకత లేని ప్రవేశాలు, పట్టించుకోని అధికారులు, ఉన్నత విద్యామండలి వైఖరి కారణంగా ఈ దోపిడీకి అడ్డులేకుండా పోయింది. ర్యాటిఫికేషన్లలోనూ చూసీచూడని మండలి తీరుతో యాజమాన్య కోటా ప్రవేశాల్లో అక్రమాలు పెరిగిపోయాయి. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ సహా వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ఫీజులు భారీగా పెరిగిపోయాయి. 8 ఏళ్ల క్రితంతో పోలిస్తే.. ఇవి రెండు, మూడింతలయ్యాయి. మేనేజ్మెంట్ కోటాతోపాటు.. కన్వీనర్ కోటాలోనూ అదే స్థాయిలో ఫీజుల పెంపుకోసం కామన్ ఫీజు విధానానికి కాలేజీల యాజమాన్యాలు పట్టుబట్టాయి. తద్వారా కన్వీనర్ కోటాలోనూ ఇంజనీరింగ్‌లో చేరే పేద విద్యార్థులపై అడ్డగోలుగా ఫీజుల భారం మోపుతున్నాయి. కొద్ది పేరున్న కాలేజీల నుంచి టాప్ కాలేజీలుగా పేరున్న విద్యాసంస్థల వరకు అడ్డగోలుగా డొనేషన్లు దండుకుంటున్నాయి. మేనేజ్మెంట్ కోటాలో కామన్ ఫీజు నిబంధనలకు నీళ్లొదిలాయి. పారదర్శకత లేని ప్రవేశాలు, పట్టింపులేని ప్రభుత్వాధికారులు, ఉన్నత విద్యామండలి వైఖరి కారణంగా యాజమాన్యాలకు కాసుల పంట పండుతోంది. కోటాను పెంచుకున్న యాజమాన్యాలు రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర వృత్తి విద్యా కోర్సుల్లో ఒకప్పుడు కన్వీనర్ కోటా సీట్లు 85%. యాజమాన్య కోటా 15% మాత్రమే. క్రమంగా యాజమాన్యాలు ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి ఎన్ఆర్ఐ/ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ పేరుతో యాజమాన్య కోటాను 30% పెంచుకున్నాయి. అంటే ఆ 30% సీట్లను యాజమాన్యాలే భర్తీ చేసుకుంటున్నాయి. అప్పట్లో కన్వీనర్ కోటా ఫీజు చాలా తక్కువ. అదే యాజమాన్య కోటా ఫీజు దాదాపు రూ.1 లక్షకు దగ్గర్లో ఉండేది. ఇవి సరిపోవడం లేదంటూ.. మరో 15% సీట్లను యాజమాన్య కోటాలోకి తెచ్చుకొని 30% తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకున్నాయి. 2006–07 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ కన్వీనర్ కోటా ఫీజు రూ.26 వేలు ఉంటే, యాజమాన్య కోటా ఫీజు రూ.79 వేలుగా ఉంది. ఆ ఫీజులు 2011–12కు వచ్చేసరికి కన్వీనర్ కోటా ఫీజు రూ.31 వేలు కాగా, యాజమాన్య కోటా ఫీజు రూ.95 వేలకు పెరిగింది. అయినా కొన్ని టాప్ కాలేజీలు అప్పట్లోనే యాజమాన్య కోటా సీట్లను ఒక్కోదానిని రూ. 4 లక్షల వరకు అమ్ముకున్నాయి. కామన్ ఫీజు కోసం పట్టు యాజమాన్యాలు మేనేజ్మెంట్ కోటాలో సీట్లను అమ్ముకుంటున్నప్పటికీ.. డబ్బు యావ తీరలేదు. అదనపు ఆదాయ మార్గాల అన్వేషణలో పడిన యాజమాన్యాల దృష్టి కన్వీనర్ కోటాపై పడింది. కన్వీనర్ కోటాలో 70% సీట్లను ప్రభుత్వమే భర్తీ చేస్తున్నందున.. అందులో ఒక్కో విద్యార్థి నుంచి వచ్చే రూ.31 వేలు తమకు ఏ మూలకు సరిపోవడం లేదని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి. పైగా యాజమాన్య కోటా సీట్లు అమ్ముకుంటున్నారని తమపై అభాండాలు వేస్తున్నారని, కామన్ ఫీజు విధానం (కన్వీనర్ కోటా, యాజమాన్య కోటాకు ఒక రకమైన ఫీజు) అమలు చేయాలని డిమాండ్ చేశాయి. దీంతో ప్రభుత్వం 2012లో కామన్ ఫీజు డిమాండుకు ఓకే చెప్పింది. ఆదాయ వ్యయాలను బట్టి ఫీజు కోసం కామన్ ఫీజు విధానం తీసుకొచ్చినా.. కొన్ని ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు సంతృప్తి చెందలేదు. మరిన్ని డబ్బులు సంపాదించేందుకు కొత్త మార్గాలను అన్వేషించాయి. సాధారణ కాలేజీకి, తమ టాప్ కాలేజీకి చాలా తేడా ఉందని.. విద్యార్థులపై చేసే ఖర్చులోనూ భారీ వ్యత్యాసం ఉంటోందని పేర్కొన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. కాలేజీని బట్టి ఫీజులను నిర్ణయించాల్సిందేనని పట్టుబట్టాయి. కొన్ని యాజమాన్యాలు కోర్టుకు వెళ్లాయి. దీంతో ప్రభుత్వం ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) నేతృత్వంలో.. కాలేజీల ఆదాయ వ్యయాలను బట్టి ఫీజులను నిర్ణయించే విధానానికి శ్రీకారం చుట్టింది. 2012–13 విద్యాసంవత్సరంలో ఒక్క ఏడాదికే.. కాలేజీలను బట్టి ఏఎఫ్ఆర్సీ ఆధ్వర్యంలో ఫీజులను నిర్ణయించిన ప్రభుత్వం.. 2013–14 విద్యా సంవత్సరం నుంచి ప్రతి మూడేళ్లకోసారి కాలేజీల ఆదాయ వ్యయాలను ఆధారంగా ఏఎఫ్ఆర్సీ ఆధ్వర్యంలో.. ఫీజులను నిర్ణయిస్తోంది. దీంతో కన్వీనర్ కోటాలోనూ చేరే వేల మంది విద్యార్థులపై ఫీజుల భారం అమాంతంగా పెరిగిపోయింది. పాత ఫీజు విధానం ఉంటే కన్వీనర్ కోటాలో చేరే విద్యార్థులపై ప్రస్తుతం ఉన్న స్థాయిలో ఫీజులు ఉండేవి కావని ఉన్నత విద్యామండలి వర్గాలే పేర్కొంటున్నాయి. తీరని మేనేజ్మెంట్ల ధనదాహం ఇంత చేసినా కొన్ని యాజమాన్యాల ధనదాహం తీరలేదు. తమ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో చేరే 70% విద్యార్థులపైనా ఫీజు భారం మోపాయి. కన్వీనర్ కోటాలో చేరే అనేక మంది పేద విద్యార్థులను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టాయి. 2011–12 విద్యా సంవత్సరం వరకు కన్వీనర్ కోటాలో కేవలం రూ.31 వేల ఫీజు మాత్రమే ఉండగా ఆ తరువాత భారీగా పెరిగిపోయింది. ఇపుడు అత్యధికంగా కన్వీనర్ కోటాలోనూ ఫీజు రూ.1.63 లక్షల వరకు పెరిగిపోయింది. రాష్ట్రంలో 212 వరకు ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే దాదాపు 80 కాలేజీల్లో వార్షిక ఫీజు రూ.90 వేలకు పైనే ఉంది. మరో 40 కాలేజీల్లో రూ.65 వేల నుంచి రూ.80 వేల వరకు ఉంది. కొన్ని సాధారణ కాలేజీలు మాత్రమే రూ.35 వేల కనీస ఫీజును అమలు చేస్తున్నాయి. అవి మినహా కొద్దిగా పేరున్న ప్రతి కాలేజీ.. భారీగానే ఫీజులు వసూలు చేస్తోంది. ఒక్కోసారి ఒక్కో కారణంతో ఫీజులను పెంచుకున్నాయి. ప్రభుత్వం పెంచితే సరే.. లేదంటే కోర్టును ఆశ్రయించి తమ కాలేజీల్లో ఫీజులను పెంచుకోవడం యాజమాన్యాలకు పరిపాటిగా మారింది. ఫీజులను పెంచుకుంటున్న యాజమాన్యాలు మేనేజ్మెంట్ కోటాలో మాత్రం కామన్ ఫీజును అమలు చేయడం లేదు. కొన్ని కాలేజీలైతే అడ్డగోలుగా ఒక్కో సీటును రూ.6 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. -
శ్రీనిధి కాలేజీ ఫీజు విషయంలో కోర్టుకు ఏఎఫ్ఆర్సీ
సాక్షి, హైదరాబాద్: శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీ ఫీజు విషయం లో హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ధర్మాసనాన్ని ఆశ్రయించాలని రాష్ట్ర ప్రవేశాలు, ఫీజు నియంత్రణ కమిటీ(టీఏఎఫ్ఆర్సీ) నిర్ణయించింది. గతంలో టీఏఎఫ్ ఆర్సీ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కళాశాల యాజ మాన్యం హైకోర్టు ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. కళాశాల అడుగుతున్న రూ.1.54 లక్షల ఫీజులో టీఏఎఫ్ఆర్సీ రూ.91వేలు ఖరారు చేయగా.. మిగతా రూ.63వేలను విద్యార్థుల తల్లిదండ్రులు హైకోర్టు రిజిస్ట్రార్ పేరిట డీడీలు తీసి సమర్పించాలని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల మేరకు డీడీలు సమర్పించాలని, లేకుంటే కోర్టు దిక్కరణకు పాల్పడినట్లు అవుతుందని కళాశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు నోటీసులు జారీ చేసింది. దీంతో టీఏఎఫ్ఆర్సీకి పలువురు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో సింగిల్ జడ్జి తీర్పుపై ధర్మాసనాన్ని ఆశ్రయించాలని టీఏఎఫ్ఆర్సీ నిర్ణయం తీసుకుంది.