సీటు.. మహా రేటు! | - | Sakshi
Sakshi News home page

సీటు.. మహా రేటు!

Published Tue, May 30 2023 7:22 AM | Last Updated on Tue, May 30 2023 8:26 AM

- - Sakshi

జేఎన్టీయూ పరిధిలోనే 149 కాలేజీలుండగా ప్రైవేటు కాలేజీల్లో 70 శాతం సీట్లు కన్వీనర్‌ కోటా (‘ఎ’ కేటగిరీ) ద్వారా.. మిగిలిన 30 శాతం సీట్లు మేనేజ్‌మెంట్‌ కోటా (‘బి’ కేటగిరీ)లో ద్వారా భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. కన్వీనర్‌ కోటా పూర్తయిన తర్వాత మేనేజ్‌మెంట్‌ కోటాను భర్తీ చేయాలి.. కానీ కన్వీనర్‌ కోటా ప్రక్రియ కంటే ముందే.. మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల అమ్మకాలపై యాజమాన్యాలు దృష్టి సారించాయి. మేనేజ్‌మెంట్ల సీట్ల భర్తీలో 15 శాతం సీట్లను ఎన్నారై/ఎన్నారై స్పాన్సర్డ్‌ కోటాలో కేటాయించాలి. మరో 15 శాతం సీట్ల భర్తీలో జేఈఈ మెయిన్‌ ర్యాంకర్లకు మొదటి ప్రాధాన్యం, ఎంసెట్‌ ర్యాంకర్లకు రెండో ప్రాధాన్యం ఇవ్వాలి. ఎవరూ లేకుంటే ఇంటర్మీడియట్‌ మార్కుల ఆధారంగా సీట్లను కేటాయించాలి. కానీ ఇవేవీ అమలు లేకుండా ఇష్టానుసారం ప్రవేశాలకు తెరలేచింది.

సాక్షి, సిటీబ్యూరో: కౌన్సెలింగ్‌ కంటే ముందే ఇంజినీరింగ్‌ కాలేజీల సీట్ల దందా జోరందుకుంది. ప్రైవేటు ఎడ్యుకేషన్‌ కన్సల్టెన్సీల మధ్యవర్తిత్వంతో సీట్ల రిజర్వేషన్‌్‌ ప్రక్రియకు తెరలేచింది. కన్వీనర్‌ కోటా కటాఫ్‌ కంటే అధిక ర్యాంకులు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సీట్ల టెన్షన్‌ పట్టుకుంది. ఇదే అంశం ఇంజినీరింగ్‌ కాలేజీలకు కాసులు కురిపిస్తోంది. కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కాక ముందే పేరొందిన ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలు నిబంధనలు గాలికొదిలి సీట్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టాయి.

దీంతో కన్వీనర్‌ కోటా వర్తించని విద్యార్థుల తల్లిదండ్రులకు కన్సల్టెన్సీల ఫోన్ల తాకిడి అధికమైంది. టాప్‌టెన్‌ కాలేజీల్లో సీట్లు ఇప్పిస్తామని గాలం వేస్తున్నాయి. ఏకంగా కాలేజీలకు తీసుకెళ్లి సీట్లు రిజర్వ్‌ చేయించడం బహిరంగ రహస్యంగా తయారైంది. కోర్సుల ఆధారంగా సగటున ఒక్కో సీటుకు రూ.12 లక్షల రూ.25 లక్షల వరకు పలుకుతోంది. కొన్ని కాలేజీలు డొనేషన్ల పేరుతో భారీగా వసూలు సైతం దిగాయి. సీటు రిజర్వేషన్‌ చేసుకొని మరో 20 రోజుల్లో మొదటి సంవత్సరం ఫీజు చెల్లిస్తే సీటు ఇస్తామని స్పష్టం చేస్తుండగా, ఇంకొన్ని కాలేజీలు మాత్రం మొత్తం ఒకేసారి నగదు రూపంలో చెల్లిస్తేనే సీటు, విడతల వారీగా చెల్లిస్తే ఆ డొనేషనన్‌ పెరుగుతుందని తేల్చి చెబుతున్నాయి.

అందులో సైతం కేవలం నగదు రూపంలోనే చెల్లించాలని, ఆన్‌లైన్‌ చెల్లింపులను నిరాకరిస్తున్నాయి. సీటు అంశం మాట్లాడేటప్పుడు మాత్రం యాజమాన్యాలు జాగ్రత్తపడుతున్నాయి. సదరు పేరెంట్స్‌ మొబైల్‌ ఫోన్లను సెక్యూరిటీలో పెట్టి లోపలికి వచ్చేవిధంగా చర్యలు తీసుకుంటున్నాయి. బేరసారాలు ముగియగానే తక్షణమే రూ.50 వేలు చెల్లించి రిజర్వేషన్‌ చేసుకునే విధంగా ఒత్తిళ్లు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

మూడు విడతలుగా కౌన్సెలింగ్‌
ఇంజినీరింగ్‌ ప్రవేశాల కోసం జూనన్‌ 26 నుంచి ఆగస్టు 9 వరకు మూడు విడతల్లో కౌన్సెలింగ్‌ జరగనున్నది. తొలి విడత కౌన్సెలింగ్‌ జూన్‌ 26 నుంచి, రెండో విడత జూలై 21 నుంచి, తుది విడత కౌన్సెలింగ్‌ ఆగస్టు 2 నుంచి ప్రారంభం కానున్నది. మూడు విడతల్లో సీట్లు పొందిన వారు ఆగస్టు 8, 9 తేదీల్లో కాలేజీల్లో రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 8న ప్రైవేట్‌ కాలేజీల్లో స్పాట్‌ అడ్మిషన్ల మార్గదర్శకాలను విడుదలవుతాయి. ఇంజినీరింగ్‌ సీట్లు మిగలకుండా ఐఐటీలు, ‘ఎ’ ఐటీల్లో ప్రవేశాలకు కల్పించే జోసా కౌన్సెలింగ్‌కు సమాంతరంగా ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ను నిర్వహించేలా షెడ్యూల్‌ ఖరారైంది.

గతంలోనూ..
ఇంజినీరింగ్‌ కాలేజీల్లో మెరిట్‌కు పాతర వేస్తుండగా.. సీట్లు అంగడి సరుకుగా మారాయి. వేలం మాదిరి రోజురోజుకూ డిమాండ్‌ పెంచి మరీ డొనేషన్లు వసూలు చేస్తున్నాయి. బ్రాంచీని బట్టి సొమ్ము చేసుకుంటున్నాయి. గతంలో సైతం మెరిట్‌ కాదు కదా.. అసలు జేఈఈ ర్యాంకు, ఎంసెట్‌ రాయనివారికి కూడా సీట్ల లభించాయి. ప్రస్తుతం సైతం అదే పునరావృతం కాబోతోంది. టాప్‌ కాలేజీల్లోనే ఈ అడ్డగోలు దందా ఉండగా మిగతా కాలేజీల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

పెరిగిన డిమాండ్‌
ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీలు మెకానికల్‌, సివిల్‌ విభాగాల్లో సీట్లు తగ్గించుకుని, కంప్యూటర్‌ సైన్స్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్‌న్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, డేటా సైన్స్‌ కోర్సుల సీట్లు పెంచుకున్నాయి. ఆ సీట్లకున్న డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. తమ పిల్లలతో ఎలాగైనా కంప్యూటర్‌ సైన్స్‌ సంబంధిత కోర్సు చేయించాలని తల్లిదండ్రుల ఆశలు కాలేజీలకు కాసుల పంట పండిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement