సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు ఇంజనీరింగ్ కాలేజీలు, ఇతర వృత్తి విద్యా కళాశాలలు యాజమాన్య కోటా సీట్లకు విచ్చల విడిగా ఫీజులు నిర్ణయించి వసూలు చేయడంపై రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. బీ కేటగిరీ సీట్ల భర్తీలోనూ నిబంధనలకు పాతరేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరుపై మండిపడింది. ఈ విధంగా చేపట్టిన ఒక్కో అడ్మిషన్‌పై రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు జరిమానాలు విధించేందుకు సిద్ధమైంది. అదేవిధంగా అక్రమంగా వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి విద్యార్థులకు అప్పజెప్పనుంది.
ఇష్టారాజ్యంగా వసూళ్లు
రాష్ట్రంలో 159 ఇంజనీరింగ్ కాలేజీలు బీటెక్, బీఈ కోర్సులు నిర్వహిస్తుండగా... వీటిలో 76 కాలేజీలు ఇంజనీరింగ్ పోస్టు గ్రాడ్యుయేషన్ (ఎం.టెక్, ఎం.ఈ.) కోర్సులు కూడా నిర్వహిస్తున్నాయి. మరోవైపు 238 కాలేజీలు పీజీ వృత్తి విద్యా కోర్సుల్లో భాగమైన ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సులు నిర్వహిస్తున్నాయి. ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో కన్వీనర్ కోటా మినహాయించి మిగతా సీట్లకు బీ కేటగిరీ, యాజమాన్య కోటా కింద అడ్మిషన్లు కల్పిస్తారు. కన్వీనర్ కోటా ప్రవేశాలు, కేటగిరీ బీ అడ్మిషన్లు, యాజమాన్య కోటాలో ప్రవేశాలకు సంబంధించి ఏఎఫ్‌ఆర్‌సీ ఫీజులు సిఫారసు చేసింది. కాలేజీల్లో వసతులు, సౌకర్యాలు తదితర అంశాలను పూర్తిగా పరిశీలించిన అనంతరం ఏయే కోర్సుకు ఫీజులు ఎలా ఉండాలన్న అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చింది.
ఈ క్రమంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కాలేజీల వారీగా ఫీజులు ఖరారు చేసింది. అయితే కొన్ని కాలేజీలు ఆదాయార్జన కోసం కేటగిరీ బీ, యాజమాన్యా కోటా ప్రవేశాల్లో జిమ్మిక్కులు చేస్తున్నాయి. టీఏఎఫ్‌ఆర్‌సీ సిఫారసులకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కాకుండా.. డొనేషన్లు, ఇతర పద్ధతుల్లో దండుకుంటున్నాయి. ప్రవేశ పరీక్షల్లో మెరిట్, ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను పక్కకు నెడుతూ అత్యధిక ఫీజులు చెల్లించే వారికి ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
నిబంధనలకు తూట్లు
వాస్తవానికి బీ కేటగిరీ అడ్మిషన్ల విషయంలో ఏఎఫ్‌ఆర్‌సీ సూచనలు కాలేజీలు తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. అదే విధంగా కన్వీనర్ కోటాలో చివరిర్యాంకు ఆధారంగా అడ్మిషన్లు కల్పించాలి. బీ కేటగిరీలో ఫలానా ప్రమాణాలకు అనుగుణంగా అడ్మిషన్లు ఇవ్వాలని ప్రభుత్వం సూచిస్తే తప్పకుండా నడుచుకోవాలి. అదేవిధంగా యాజమాన్యా కోటా ప్రవేశాల విషయంలోనూ ఉత్తమ ర్యాంకు అభ్యర్థులకు అవకాశం కల్పించాలి. ఆ మేరకు నిబంధనలు అనుసరించాలి.
కానీ మెరిట్, బెస్ట్ ర్యాంకు తదితరాలను పట్టించుకోని కొన్ని కాలేజీలు.. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుతో పాటు డొనేషన్లు, ఇతర పద్ధతుల్లో విద్యార్థుల నుంచి రూ.లక్షలు వసూలు చేస్తున్నాయి. ఈ మేరకు ఏఎఫ్‌ఆర్‌సీకి పలు ఫిర్యాదులు అందాయి. వీటిపై స్పందించిన కమిటీ అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలపై చర్యలకు ఉపక్రమించింది. అక్రమాలకు పాల్పడుతున్న కాలేజీలపై జరిమానాలు విధించి ముక్కుపిండి వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. నిబంధనలు పాటించకుండా అధిక ఫీజులు వసూలు చేసి కేటాయించిన ఒక్కో సీటుపై కనిష్టంగా రూ.2 లక్షల చొప్పున జరిమానా విధించనుంది.
మెరిట్ లేకుండా సీట్లు కేటాయించినా..
ఇక బీ కేటగిరీ అడ్మిషన్లలో ర్యాంకులు పరిగణించకుండా ఎన్ని సీట్లు కేటాయిస్తే అన్ని సీట్లపై.. ఒక్కో సీటుకు రూ.10 లక్షల లెక్కన జరిమానా విధిస్తామని ఏఎఫ్‌ఆర్‌సీ స్పష్టం చేసింది. ఈ రెండు రకాల జరిమానాల వసూలుకు గాను కన్వీనర్ దగ్గర జమ చేసిన కాలేజీ నిధికి కోత పెట్టనున్నట్లు వెల్లడించింది. ఆయా కాలేజీల్లో ఎంతమంది నుంచి ఈ విధంగా వసూళ్లకు పాల్పడ్డారో గుర్తించేందుకు సిద్ధమవుతోంది. జరిమానాల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేసిన కమిటీ.. క్షేత్రస్థాయిలో అడ్డగోలు ఫీజు వసూళ్లపై ఫిర్యాదులు కూడా స్వీకరించనుంది. సరైన ఆధారాలను సమర్పిస్తే తక్షణమే స్పందించి చర్యలు తీసుకోనుంది.
చదవండి: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. హైకోర్టు తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment