వాసవి, శ్రీనిధి కాలేజీల్లో ఫీజు పెంపు
సాక్షి, హైదరాబాద్: వాసవి, శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీల్లో వార్షిక ఫీజు పెరిగింది. గత జూలైలో వాసవి కాలేజీ వార్షిక ఫీజును రూ.86 వేలుగా నిర్ణయిం చగా, ప్రస్తుతం రూ.97 వేలు.. శ్రీనిధి కాలేజీ ఫీజు గతంలో రూ.91 వేలుండగా, తాజాగా రూ.97 వేలకు పెంచినట్లు తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ ఆర్‌సీ) ప్రకటించింది. వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో (ఘట్‌కేసర్) ఒక్కో విద్యార్థిపై రూ.11 వేలు, శ్రీనిధి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో (ఘట్‌కేసర్) రూ.6 వేలు ఫీజు పెరిగింది.
రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో మూడేళ్లపాటు (2016–17, 2017–18, 2018–19 విద్యా సంవత్సరాల్లో) అమలు చేయాల్సిన వార్షిక ఫీజును టీఏఎఫ్‌ఆర్‌సీ గత జూలైలో నిర్ణయించింది. అయితే టీఏఎఫ్‌ఆర్‌సీ నిర్ణయించిన ఫీజు హేతుబద్ధంగా లేదని, తాము వెచ్చిస్తున్న ఖర్చులను పరిగణనలోకి తీసుకోలేదని, తమకు అన్యాయం జరిగిందని వాసవి, శ్రీనిధి కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. కేసును విచారించిన హైకోర్టు.. ఆయా కాలేజీల ఆదాయ వ్యయాలను మరో సారి పరిశీలించి, ఫీజులను నిర్ధారించాలని ఆదేశించింది. దీంతో ఈ నెల 6న టీఏఎఫ్‌ఆర్‌సీ కాలేజీ యాజమా న్యాలతో చర్చించి, ఆదాయ వ్యయాలను పరిశీలించి తాజా పెంపును టీఏఎఫ్‌ఆర్‌సీ ఖరారు చేసింది.