సాక్షి, హైదరాబాద్: వృత్తి విద్యాకోర్సుల ఫీజుల ఖరారు ప్రక్రియలో నకిలీ అధ్యాపకులను చూపించే యాజమాన్యాలకు తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) అడ్డుకట్ట వేసింది. ఇకపై అధ్యాపకుల పాన్ కార్డు, ఆధార్ వివరాలు సమర్పించి.. వాటిని తప్పనిసరిగా ఆన్‌లైన్ వెరిఫికేషన్ చేయించుకోవాలని నూతన నిబంధనను తీసుకొచ్చింది. యాజమాన్యాలు తమ కాలేజీల్లో తక్కువ మంది అధ్యాపకులు ఉన్నా, ఎక్కువమంది అధ్యాపకులు పనిచేస్తున్నట్లుగా చూపించేవారు. వారికి భారీగా వేతనాలు చెల్లిస్తున్నట్లు ఖర్చు చూపించి.. కోర్సుల ఫీజు ఖరారులో భారీగా లబ్ధి పొందేవారు. అధ్యాపకుల పాన్, ఆధార్ వివరాలనూ సమర్పించేవారు కాదు. పైగా ఒక కాలేజీ చూపించిన అధ్యాపకులను మరో కాలేజీ కూడా చూపించేది.
బీటెక్ కోర్సులకు బోధించే ఫ్యాకల్టీని ఎంటెక్ కోర్సుల్లోనూ బోధిస్తున్నట్లుగా చూపించేవారు. వీటిని దృష్టిలో పెట్టుకు న్న కమిటీ.. యాజమాన్యాల ఆటలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ నిబంధనలను తీసుకొచ్చింది. దీని ప్రకారం యాజమాన్యాలు తమ వద్ద పనిచేస్తున్న అధ్యాపకుల పాన్ కార్డు, ఆధార్ నంబర్లు ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. వాటిని ప్రాసెస్ చేసేది నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్(ఎన్‌ఐసీ) అయినందునా, ఆధార్, పాన్ వివరాలు కూడా వారి వద్దే ఉండనున్నాయి. బీటెక్ బోధించేవారు ఎంటెక్ బోధించడానికి వీల్లేదన్న నిబంధనను విధించింది. ఒక కాలేజీలో పనిచేసే అధ్యాపకుడు మరో కాలేజీలో పనిచేస్తున్నట్లు చూపిస్తే ఆన్‌లైన్‌లోనే గుర్తించి కోత పెట్టేలా చర్యలు చేపట్టింది.
ఆదాయ వ్యయాలు ఆన్‌లైన్‌లోనే..
బీటెక్, ఎంటెక్, బీఫార్మసీ, ఎం.ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్, డీఎడ్ తదితర వృత్తి విద్యా కోర్సుల ఫీజుల ఖరారు కోసం ఇటీవల టీఏఎఫ్‌ఆర్‌సీ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 24వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తోంది. గతంలో ఆడిట్ డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తే వాటిని పరిశీలించి ఆదాయ వ్యయాలను లెక్కించే వారు. కానీ ఈసారి అలా కాకుండా మొత్తంగా ఆన్‌లైన్ చేసింది. డాక్యుమెంట్లను ఈమెయిల్ పంపించేలా చర్యలు చేపట్టడమే కాకుండా ఆదాయ వ్యయాల వివరాలను ఆన్‌లైన్‌లోనే డ్యాష్‌బోర్డులో నమోదు చేసేలా చర్యలు చేపట్టింది. దీంతో తాము కోరుకున్నట్లుగా రిపోర్టును జనరేట్ చేసుకునే వీలు ఏర్పడనుంది. కాలేజీలు నో ప్రాఫిట్, నో లాస్ విధానంలో నడవాల్సి ఉంది. దీంతో కాలేజీల ఖర్చులతో పోల్చితే ఆదాయం 15 శాతానికి మించి ఉండకూడదన్న నిబంధనను విధించింది. 2019–20, 2020–21, 2021–22 విద్యా సంవత్సరాల్లో వసూలు చేయాల్సిన ఫీజులను ఖరారు చేసేందుకు 2016–17, 2017–18 విద్యా సంవత్సరాల ఆదాయ వ్యయాలు మాత్రమే అందజేయాలని స్పష్టం చేసింది. 2018–19 విద్యా సంవ త్సరం పూర్తి కానందున గత రెండేళ్ల వివరాలనే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది.
ప్రాసెసింగ్ ఫీజు భారీ పెంపు..
ఈసారి ప్రాసెసింగ్ ఫీజును భారీగా పెంచింది. గతంలో బీఈ/బీటెక్, బీఫార్మసీ, ఫార్మా–డీ, బీఆర్క్, బీ ప్లానింగ్, ఎంఈ/ఎంటెక్, ఎం.ఆర్క్, ఎం.ప్లానింగ్, ఎం.ఫార్మసీ, ఫార్మా–డీ (పీబీ), బీఎఫ్‌ఏ (ఐదేళ్ల కోర్సు) కోర్సుల ఫీజుల ఖరారు ప్రాసెసింగ్ ఫీజు ఒక్కో కోర్సుకు రూ.11,475 ఉండగా, దానిని రూ.18 వేలకు పెంచింది. ఇక ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, ఎల్‌పీటీ (తెలుగు, ఉర్దూ, హిందీ), ఎంఈడీ, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, బీఎఫ్‌ఏ (మూడేళ్ల కోర్సు), బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల ప్రాసెసింగ్ ఫీజు ఒక్కో కోర్సుకు గతంలో రూ.5,750 ఉండగా, దానిని రూ.9 వేలకు పెంచింది.
Comments
Please login to add a commentAdd a comment