Professional Education Course
-
నకిలీ అధ్యాపకుల ఆటకట్టు
సాక్షి, హైదరాబాద్: వృత్తి విద్యాకోర్సుల ఫీజుల ఖరారు ప్రక్రియలో నకిలీ అధ్యాపకులను చూపించే యాజమాన్యాలకు తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) అడ్డుకట్ట వేసింది. ఇకపై అధ్యాపకుల పాన్ కార్డు, ఆధార్ వివరాలు సమర్పించి.. వాటిని తప్పనిసరిగా ఆన్లైన్ వెరిఫికేషన్ చేయించుకోవాలని నూతన నిబంధనను తీసుకొచ్చింది. యాజమాన్యాలు తమ కాలేజీల్లో తక్కువ మంది అధ్యాపకులు ఉన్నా, ఎక్కువమంది అధ్యాపకులు పనిచేస్తున్నట్లుగా చూపించేవారు. వారికి భారీగా వేతనాలు చెల్లిస్తున్నట్లు ఖర్చు చూపించి.. కోర్సుల ఫీజు ఖరారులో భారీగా లబ్ధి పొందేవారు. అధ్యాపకుల పాన్, ఆధార్ వివరాలనూ సమర్పించేవారు కాదు. పైగా ఒక కాలేజీ చూపించిన అధ్యాపకులను మరో కాలేజీ కూడా చూపించేది. బీటెక్ కోర్సులకు బోధించే ఫ్యాకల్టీని ఎంటెక్ కోర్సుల్లోనూ బోధిస్తున్నట్లుగా చూపించేవారు. వీటిని దృష్టిలో పెట్టుకు న్న కమిటీ.. యాజమాన్యాల ఆటలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ నిబంధనలను తీసుకొచ్చింది. దీని ప్రకారం యాజమాన్యాలు తమ వద్ద పనిచేస్తున్న అధ్యాపకుల పాన్ కార్డు, ఆధార్ నంబర్లు ఆన్లైన్లో నమోదు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. వాటిని ప్రాసెస్ చేసేది నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్(ఎన్ఐసీ) అయినందునా, ఆధార్, పాన్ వివరాలు కూడా వారి వద్దే ఉండనున్నాయి. బీటెక్ బోధించేవారు ఎంటెక్ బోధించడానికి వీల్లేదన్న నిబంధనను విధించింది. ఒక కాలేజీలో పనిచేసే అధ్యాపకుడు మరో కాలేజీలో పనిచేస్తున్నట్లు చూపిస్తే ఆన్లైన్లోనే గుర్తించి కోత పెట్టేలా చర్యలు చేపట్టింది. ఆదాయ వ్యయాలు ఆన్లైన్లోనే.. బీటెక్, ఎంటెక్, బీఫార్మసీ, ఎం.ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్, డీఎడ్ తదితర వృత్తి విద్యా కోర్సుల ఫీజుల ఖరారు కోసం ఇటీవల టీఏఎఫ్ఆర్సీ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 24వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తోంది. గతంలో ఆడిట్ డాక్యుమెంట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే వాటిని పరిశీలించి ఆదాయ వ్యయాలను లెక్కించే వారు. కానీ ఈసారి అలా కాకుండా మొత్తంగా ఆన్లైన్ చేసింది. డాక్యుమెంట్లను ఈమెయిల్ పంపించేలా చర్యలు చేపట్టడమే కాకుండా ఆదాయ వ్యయాల వివరాలను ఆన్లైన్లోనే డ్యాష్‌బోర్డులో నమోదు చేసేలా చర్యలు చేపట్టింది. దీంతో తాము కోరుకున్నట్లుగా రిపోర్టును జనరేట్ చేసుకునే వీలు ఏర్పడనుంది. కాలేజీలు నో ప్రాఫిట్, నో లాస్ విధానంలో నడవాల్సి ఉంది. దీంతో కాలేజీల ఖర్చులతో పోల్చితే ఆదాయం 15 శాతానికి మించి ఉండకూడదన్న నిబంధనను విధించింది. 2019–20, 2020–21, 2021–22 విద్యా సంవత్సరాల్లో వసూలు చేయాల్సిన ఫీజులను ఖరారు చేసేందుకు 2016–17, 2017–18 విద్యా సంవత్సరాల ఆదాయ వ్యయాలు మాత్రమే అందజేయాలని స్పష్టం చేసింది. 2018–19 విద్యా సంవ త్సరం పూర్తి కానందున గత రెండేళ్ల వివరాలనే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. ప్రాసెసింగ్ ఫీజు భారీ పెంపు.. ఈసారి ప్రాసెసింగ్ ఫీజును భారీగా పెంచింది. గతంలో బీఈ/బీటెక్, బీఫార్మసీ, ఫార్మా–డీ, బీఆర్క్, బీ ప్లానింగ్, ఎంఈ/ఎంటెక్, ఎం.ఆర్క్, ఎం.ప్లానింగ్, ఎం.ఫార్మసీ, ఫార్మా–డీ (పీబీ), బీఎఫ్ఏ (ఐదేళ్ల కోర్సు) కోర్సుల ఫీజుల ఖరారు ప్రాసెసింగ్ ఫీజు ఒక్కో కోర్సుకు రూ.11,475 ఉండగా, దానిని రూ.18 వేలకు పెంచింది. ఇక ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, ఎల్పీటీ (తెలుగు, ఉర్దూ, హిందీ), ఎంఈడీ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, బీఎఫ్ఏ (మూడేళ్ల కోర్సు), బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల ప్రాసెసింగ్ ఫీజు ఒక్కో కోర్సుకు గతంలో రూ.5,750 ఉండగా, దానిని రూ.9 వేలకు పెంచింది. -
త్వరలోనే రాష్ట్ర సెట్స్ తేదీలు
♦ ఒకటీ రెండు రోజుల్లో ఏపీ సెట్ల తేదీల ప్రకటన! ♦ వాటికి 2–3 రోజుల వ్యవధి ఉండేలా తెలంగాణ ప్రవేశ పరీక్షలు ♦ కసరత్తు చేస్తున్న ఉన్నత విద్యా మండలి.. 12న ప్రకటించే అవకాశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే విద్యా సంవ త్సరం (2017–18) వివిధ వృత్తి విద్యా కోర్సు ల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) తేదీలను ఖరారు చేసేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. ఎంసెట్, ఐసెట్, ఈసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీజీఈసెట్ తదితర ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీలను సోమవారం ఖరారు చేయాలని తొలుత భావించినా.. సాధ్యం కాలేదు. విభజన చట్టం ప్రకారం ఏపీ విద్యార్థులు కూడా తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు హాజరై, ఇక్కడి విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందేలా అవకాశం కల్పించాల్సి ఉన్నందున... ఏపీ ప్రభుత్వం ఖరా రు చేసే తేదీలను బట్టి తెలంగాణ సెట్స్ తేదీ లను ఖరారు చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వద్ద జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో దీనిపై చర్చించారు. ఏపీ ఒకటి రెండు రోజుల్లో తమ సెట్స్ తేదీలను ఖరారు చేయనున్న నేపథ్యంలో.. ఆ తేదీలకు రెండు మూడు రోజుల వ్యవధిలో రాష్ట్ర సెట్స్ తేదీలను ఖరారు చేయనున్నారు. మరో వైపు ఏయే వర్సిటీ ఆధ్వర్యంలో ఏయే పరీక్షల ను నిర్వహించాలి, నిర్వహణ బాధ్యతలను ఎవ రికి అప్పగించాలనే అంశాలతోపాటు కన్వీనర్ల నియామకంపై స్పష్టత వచ్చాక ప్రవేశపరీక్షల తేదీలను ఖరారు చేయనున్నారు. ఈ నెల 12 నాటికి ఈ ప్రకియను పూర్తి చేసి, అదే రోజు తేదీలను ప్రకటించాలని భావిస్తున్నారు. ఈ మేరకు షెడ్యూల్ రూపకల్పనపై ఉన్నత విద్యా మండలి దృష్టి సారించింది. అందులో భాగంగా మంగళ వారం (నేడు) వివిధ వర్సిటీల వీసీలతో సమావేశం నిర్వహించేందుకు సిద్ధమైంది. -
నేటి నుంచి ఎంబీఏ, ఎంసీఏ వెబ్ ఆప్షన్లు
10న మార్పులు.. 12న సీట్ల కేటాయింపు సాక్షి, హైదరాబాద్: వృత్తి విద్య కోర్సుల ఫీజులను ప్రభుత్వం ఖరారు చేయడంతో ఆయా కోర్సుల్లో ప్రవేశాలను చేపట్టేందుకు ప్రవేశాల కమిటీలు చ ర్యలు చేపట్టాయి. ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్ తదితర కోర్సుల్లో వెబ్ ఆప్షన్ల షెడ్యూల్‌ను మంగళవారం ప్రకటించాయి. కాలేజీల వారీగా సీట్లు, ఫీజుల వివరాలను సంబంధిత వెబ్సైట్లలో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించాయి. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైన వారు మాత్రమే వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అర్హులని స్పష్టం చేశాయి. ఇక ఎంటెక్, ఎం.ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు మంగళవారమే వెబ్ ఆప్షన్లు ప్రారంభించగా... న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ తేదీలను వారంలో ప్రకటించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 10 వరకు ఐసెట్ వెబ్ ఆప్షన్లు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని ప్రవేశాల కన్వీనర్ ఎంవీ రెడ్డి తెలిపారు. 10వ తేదీన ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చని.. 12వ తేదీ రాత్రి 8 గంటల తరువాత సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు. కేటాయింపు వివరాలను ్టటజీఛ్ఛ్టి.జీఛి.జీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామన్నారు. ఒకటో ర్యాంకు నుంచి 30 వేల ర్యాంకు వారు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు మంగళవారమే వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు లాగిన్ ఐడీలను పంపించామని.. మిగతా వారికి బుధవారం పంపిస్తామని వెల్లడించారు. ఇక 284 ఎంబీఏ కాలేజీల్లో 21,898 సీట్లు.. 38 ఎంసీఏ కాలేజీల్లో 1,909 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 12 వరకు పీజీఈసెట్... ఎంటెక్, ఎం.ఫార్మసీ, ఫార్మ్-డి కోర్సుల్లో ప్రవేశాలకు వెబ్ ఆప్షన్లు మంగళవారమే ప్రారంభమైనట్లు పీజీఈసెట్ కో-కన్వీనర్ రమేశ్ తెలిపారు. 12వ తేదీ వరకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని.. 14న సీట్లు కేటాయించి, 19వ తేదీ నుంచి తరగతులను ప్రారంభిస్తామని చెప్పారు. కాగా 156 ఎంటెక్ కాలేజీల్లో 9,414 సీట్లు అందుబాటులో ఉండగా.. 83 ఎంఫార్మసీ కాలేజీల్లో 3,689 సీట్లు అందుబాటులో ఉన్నాయి. నెలాఖరులోగా లా ప్రవేశాలు మూడేళ్లు, ఐదేళ్ల న్యాయ విద్యలో (లా) ప్రవేశాల కౌన్సెలింగ్, ప్రవేశాలను ఈనెలాఖరులోగా పూర్తి చేస్తామని లాసెట్ కన్వీనర్ ఎంవీ రంగారావు తెలిపారు. కాలేజీలు, సీట్లకు సంబంధించి బార్ కౌన్సిల్ నుంచి కొన్ని అనుమతులు రావాల్సి ఉందన్నారు. 15న జరిగే సమావేశంలో స్పష్టత వస్తుందని.. తర్వాత షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పారు. రాష్ట్రంలో మొత్తంగా 18 న్యాయ కళాశాలలు ఉండగా వాటిలో సుమారు 3 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. రేపటి నుంచి ఎడ్‌సెట్... బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సులో ప్రవేశాల కోసం ఈనెల 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తున్నట్లు ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రసాద్ వెల్లడించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైన విద్యార్థులంతా కొత్తగా ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని.. గతంలో ఇచ్చిన ఆప్షన్లను మార్పుకోవచ్చని తెలిపారు. గతంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకానివారు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి వీల్లేదని వెల్లడించారు. 15వ తేదీన సీట్లు కేటాయిస్తామన్నారు. కాగా రాష్ట్రంలోని 184 బీఎడ్ కాలేజీల్లో 15,500 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అందులో కన్వీనర్ కోటాలో 12,400 సీట్లు, మేనేజ్మెంట్ కోటాలో 3,100 సీట్లు ఉన్నాయి. -
ఫీజులతో లింకు లేదు!
* ప్రవేశాల తర్వాతే ‘ఫాస్ట్’కు దరఖాస్తులు * మూడు రోజుల్లో మార్గదర్శకాల జారీ? * కాలేజీల యాజమాన్యాలతో ఫాస్ట్ కమిటీ భేటీ * 31లోగా బకాయిలు చెల్లించాలని యాజమాన్యాల విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: ఫీజులతో సంబంధం లేకుండానే ఇంజనీరింగ్ తదితర వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టేందుకు రాష్ర్ట విద్యా శాఖ సిద్ధమైంది. తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయం(ఫాస్ట్) పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా జారీ కానందున అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పాత పద్ధతిలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను చేపట్టి వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. దీంతో విద్యార్థులు కాలేజీల్లో చేరిన తర్వాతే ఫాస్ట్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం నాటికి ఫాస్ట్ మార్గదర్శకాలు జారీ అవుతాయని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఫాస్ట్ కమిటీకి తెలియజేయాలని విద్యా శాఖ అధికారులు భావిస్తున్నారు. అప్పుడే ఆర్థిక సాయం విషయంలో విద్యార్థులకు స్పష్టత వస్తుందని చెబుతున్నారు. విద్యార్థులకు వచ్చిన ర్యాంకును బట్టి ‘ఫాస్ట్’కు వారు అర్హులేనా కాదా అన్నది తేల్చుకుంటారని, అలాగే ఏ కాలేజీలో చేరితే ఎంత ఆర్థిక సాయం లభిస్తుందన్న అవగాహన కూడా ఏర్పడుతుందని పేర్కొంటున్నారు. అప్షన్ల నాటికి పాస్ట్ మార్గదర్శకాలు వెలువడకపోతే విద్యార్థులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే ఆ పరిస్థితి తలెత్తకుండా రాష్ర్ట ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందనే అధికారులు విశ్వసిస్తున్నారు. ఫాస్ట్ మార్గదర్శకాల ప్రకారం విద్యార్థులు స్థానికత సర్టిఫికెట్లను తెచ్చుకొని కాలేజీల్లో సమర్పించవచ్చని, ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. గతంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో విద్యార్థికి సీటు కేటాయింపు లేఖలోనే ప్రభుత్వమే ఫీజు చెల్లిస్తుందని స్పష్టం చేసే విధానం ఉంది. ఇకపై అలా కాకుండా కాలేజీలో చేరిన తర్వాతే ఫాస్ట్ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు త్వరలోనే మార్గదర్శకాలను జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కళాశాలల యాజమాన్యాలకు ఫాస్ట్ కమిటీ తెలియజేసింది. మరో మూడు రోజుల్లోనే విడుదల చేసే అవకాశముందని పేర్కొన్నట్లు తెలిసింది. ఫీజు బకాయిలు, ఫాస్ట్ పథకంపై చర్చించేందుకు ఫాస్ట్ కమిటీ సభ్యులైన ఉన్నతాధికారులు రేమండ్ పీటర్, వికాస్ రాజ్, రాధా తదితరులు మంగళవారం కాలేజీల యాజమాన్యాలతో సమావేశమయ్యారు. యాజమాన్యాల పరిస్థితులను కూడా అడిగి తెలుసుకున్నారు. తమకు రూ. 1,350 కోట్ల మేర ఫీజు బకాయిలు రావాల్సి ఉందని, వాటిని ఈ నెల 31లోగా చెల్లించాలని యాజమాన్యాలు తేల్చి చెప్పినట్లు తెలిసింది. ప్రస్తుత ప్రవేశాల్లోనూ విద్యార్థి కాలేజీలో చేరిన రోజే ఫీజు చెల్లించేలా చర్యలు చేపట్టాలని కోరినట్లు సమాచారం. అయితే అధికారులు మాత్రం ఫాస్ట్ మార్గదర్శకాల మేరకు ప్రవేశాలు చేపట్టాలని సూచించినట్లు తెలిసింది. బ కాయిల చెల్లింపుతో పాటు, ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు పాత ఫీజుల విధానమే కొనసాగించాలన్న అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని అధికారులు చెప్పినట్లు తెలిసింది. రెండు రోజుల్లో కాలేజీలకు అనుమతులు తెలంగాణలో ఎంసెట్ కౌన్సెలింగ్ మొదలవుతున్న నేపథ్యంలో మరో రెండు మూడు రోజుల్లోనే కళాశాలల అనుమతులకు సంబంధించిన ఉత్తర్వులు జారీ కానున్నాయి. మేనే జ్మెంట్ కోటాతో పాటు, ఎన్ఆర్ఐ కోటా భర్తీకి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసేందుకు తెలంగాణ విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. ఎన్ఆర్ఐ కోటాను 5 శాతం నుంచి 15 శాతానికి పెంచే అవకాశముంది. అలాగే ఇంజనీరింగ్‌తోపాటు ఇతర వృత్తి విద్యా కాలేజీల్లో సీట్ల భర్తీకి కూడా చర్యలు చేపట్టేందుకు విద్యా శాఖ సిద్ధమవుతోంది. మొత్తానికి వెబ్ ఆప్షన్ల నాటికి కాాలేజీల అనుమతుల ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది. ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలు కల్పించే ఈసెట్, పాలిసెట్, ఐసెట్ ప్రవేశాలను త్వరలోనే చేపట్టనుంది. -
ఫీజు బకాయిలు చెల్లించాకే తనిఖీలు చేసుకోండి
నేడు చలో జేఎన్టీయూహెచ్, చలో విద్యాశాఖ మంత్రి కోర్టునూ ఆశ్రయించనున్న ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు హైదరాబాద్: ఇంజనీరింగ్ తదితర వృత్తి విద్యా కోర్సులను నిర్వహించే ప్రైవేటు కాలేజీలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాకే కాలేజీల్లో ఇన్స్పెక్షన్లు చేసుకోవాలని కాలేజీ యాజమాన్యాల సంఘం స్పష్టం చేసింది. ఫీజులు ఇవ్వకుండా ఇన్స్పెక్షన ్ల పేరుతో కాలేజీలకు రావద్దని తెలిపింది. ఫీజు బకాయిలు ఇవ్వాలంటూ శనివారం చలో జేఎన్టీయూహెచ్, చలో విద్యాశాఖ మంత్రి కార్యక్రమం కూడా నిర్వహించాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లో శుక్రవారం ఈ మేరకు కాలేజీ యాజమాన్యాల సంఘం కార్యవర్గ సమావేశం పలు తీర్మానాలు చేసింది. ఉదయం జేఎన్టీయూహెచ్ వైస్ చాన్స్‌లర్‌ను, మధ్యాహ్నం విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని కలిసి ఫీజు బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేయనుంది. ఫీజు బ కాయిల కోసం శనివారమే కోర్టును కూడా ఆశ్రయించాలని సంఘం నిర్ణయించింది. రెండు నెలల కిందటే తనిఖీలు పూర్తి చేసిన కాలేజీలను మళ్లీ తనిఖీలు చేయడమేమిటని ప్రశ్నించింది. అయినా ప్రభుత్వ నిర్ణయాన్ని తాము ఒప్పుకుంటామని, కానీ బకాయిలు చెల్లించాకే తనిఖీలు చేసుకోవచ్చని వెల్లడించింది. బకాయిల కోసం అవసరమైతే ఆందోళన చేపడతామని, విద్యాశాఖ మంత్రిని కలిశాక తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని సంఘం ప్రతినిధులు వెల్లడించారు. -
వృత్తి విద్యతో మంచి భవిష్యత్తు
నిజామాబాద్ నాగారం : వృత్తి విద్య కోర్సులతో మంచి భవిష్యత్తు ఉంటుందని విద్య శాఖ అసిస్టెంట్ కమిషనర్ నాగేశ్వర్రావు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వృత్తి విద్య కోర్సులపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కోటగల్లి ప్రభుత్వ బాలికల పాఠశాలలో టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ సర్టిఫికెట్ కోర్సు ముగింపు సమావేశం నిర్వహించారు. 42 రోజుల పాటు శిక్షణ కొనసాగింది. ముఖ్య అథితిగా నాగేశ్వర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ తదితర అంశాల్లో ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేట్ రంగంలోనూ మంచి అవకాశాలు లభిస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగంలో సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయని, ఆర్వీఎం ద్వారా వృత్తి విద్య టీచర్ల నియామకం జరుగుతున్నప్పటీకీ, విద్యాశాఖ టెక్నికల్ టీచర్ల నియామాకం చేపట్టే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీల్లో శిక్షణ పూర్తి చేసిన వారిని ప్రత్యేకంగా అభినందించారు. అగస్టు చివరి వారంలో శిక్షణకు సంబంధించిన పరీక్ష ఉంటుందన్నారు. అనంతరం శిక్షణ పొందిన విద్యార్థులు వేసిన చిత్రపటాలను, వర్క్సారీస్ను, కుట్లు, అల్లికలను ప్రదర్శించారు. కార్యక్రమంలో కోర్సు డెరైక్టర్ కృష్ణారావును సన్మానించారు. డీసీఈబీ సెక్రటరీ చంద్రశేఖర్, ఎంఈఓ లింగమూర్తి, కోర్సు కోఆర్డినేటర్ సోహైల్, టైలరింగ్ శిక్షకులు స్వరూప, డ్రాయింగ్ శిక్షకులు కేశవ్‌కుమార్, శ్రీనివాస్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.