వృత్తి విద్యతో మంచి భవిష్యత్తు
నిజామాబాద్ నాగారం : వృత్తి విద్య కోర్సులతో మంచి భవిష్యత్తు ఉంటుందని విద్య శాఖ అసిస్టెంట్ కమిషనర్ నాగేశ్వర్‌రావు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వృత్తి విద్య కోర్సులపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కోటగల్లి ప్రభుత్వ బాలికల పాఠశాలలో టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ సర్టిఫికెట్ కోర్సు ముగింపు సమావేశం నిర్వహించారు. 42 రోజుల పాటు శిక్షణ కొనసాగింది. ముఖ్య అథితిగా నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ తదితర అంశాల్లో ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేట్ రంగంలోనూ మంచి అవకాశాలు లభిస్తాయన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగంలో సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయని, ఆర్వీఎం ద్వారా వృత్తి విద్య టీచర్‌ల నియామకం జరుగుతున్నప్పటీకీ, విద్యాశాఖ టెక్నికల్ టీచర్‌ల నియామాకం చేపట్టే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీల్లో శిక్షణ పూర్తి చేసిన వారిని ప్రత్యేకంగా అభినందించారు. అగస్టు చివరి వారంలో శిక్షణకు సంబంధించిన పరీక్ష ఉంటుందన్నారు. అనంతరం శిక్షణ పొందిన విద్యార్థులు వేసిన చిత్రపటాలను, వర్క్‌సారీస్‌ను, కుట్లు, అల్లికలను ప్రదర్శించారు. కార్యక్రమంలో కోర్సు డెరైక్టర్ కృష్ణారావును సన్మానించారు. డీసీఈబీ సెక్రటరీ చంద్రశేఖర్, ఎంఈఓ లింగమూర్తి, కోర్సు కోఆర్డినేటర్ సోహైల్, టైలరింగ్ శిక్షకులు స్వరూప, డ్రాయింగ్ శిక్షకులు కేశవ్‌కుమార్, శ్రీనివాస్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.