ఫీజు బకాయిలు చెల్లించాకే తనిఖీలు చేసుకోండి
నేడు చలో జేఎన్‌టీయూహెచ్, చలో విద్యాశాఖ మంత్రి
కోర్టునూ ఆశ్రయించనున్న ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు
హైదరాబాద్: ఇంజనీరింగ్ తదితర వృత్తి విద్యా కోర్సులను నిర్వహించే ప్రైవేటు కాలేజీలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాకే కాలేజీల్లో ఇన్‌స్పెక్షన్లు చేసుకోవాలని కాలేజీ యాజమాన్యాల సంఘం స్పష్టం చేసింది. ఫీజులు ఇవ్వకుండా ఇన్‌స్పెక్షన ్ల పేరుతో కాలేజీలకు రావద్దని తెలిపింది. ఫీజు బకాయిలు ఇవ్వాలంటూ శనివారం చలో జేఎన్‌టీయూహెచ్, చలో విద్యాశాఖ మంత్రి కార్యక్రమం కూడా నిర్వహించాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లో శుక్రవారం ఈ మేరకు కాలేజీ యాజమాన్యాల సంఘం కార్యవర్గ సమావేశం పలు తీర్మానాలు చేసింది. ఉదయం జేఎన్‌టీయూహెచ్ వైస్ చాన్స్‌లర్‌ను, మధ్యాహ్నం విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని కలిసి ఫీజు బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేయనుంది.
ఫీజు బ కాయిల కోసం శనివారమే కోర్టును కూడా ఆశ్రయించాలని సంఘం నిర్ణయించింది. రెండు నెలల కిందటే తనిఖీలు పూర్తి చేసిన కాలేజీలను మళ్లీ తనిఖీలు చేయడమేమిటని ప్రశ్నించింది. అయినా ప్రభుత్వ నిర్ణయాన్ని తాము ఒప్పుకుంటామని, కానీ బకాయిలు చెల్లించాకే తనిఖీలు చేసుకోవచ్చని వెల్లడించింది. బకాయిల కోసం అవసరమైతే ఆందోళన చేపడతామని, విద్యాశాఖ మంత్రిని కలిశాక తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని సంఘం ప్రతినిధులు వెల్లడించారు.