సాక్షి, నల్లగొండ: తెలంగాణను అన్ని రంగాల్లో నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. అలాగే, కాంగ్రెస్ పెడుతున్నది తెలంగాణ తల్లి విగ్రహం కాదు.. కాంగ్రెస్ మాతా విగ్రహమని ఘాటు విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా కేసీఆర్ నామస్మరణే చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
నల్లగొండ బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘అది తెలంగాణ తల్లి విగ్రహం కాదు. కాంగ్రెస్ మాతా విగ్రహం. కాంగ్రెస్ మాత విగ్రహాన్ని సచివాలయంలో పెట్టొద్దు. గాంధీ భవన్‌లో పెట్టుకోండి. కేసీఆర్ నామస్మరణ చేస్తోందే రేవంత్ రెడ్డి. కేసీఆర్ నా కలలోకి వస్తున్నాడని రేవంత్ ఒప్పుకున్నాడు. కేసీఆర్ ప్రజల హృదయం నిండా ఉన్నాడు. కేసీఆర్ నరసింహస్వామిలా బయటకు వస్తాడేమో అని రేవంత్‌కు భయం పట్టుకుంది. మేం ట్రయల్ రన్ చేసిన ప్రాజెక్టును ప్రారంభించారు.
కేసీఆర్ ఇచ్చిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు కానీ ఒక రూపాయి నిధులు ఇవ్వలేదు. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఉన్నా జిల్లాకు ఒరిగిందేమీ లేదు. ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి కూడా శంకుస్థాపన చేయలేదు. 4000 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఇచ్చినందుకు కేసీఆర్‌కు ధన్యవాదాలు. కాంగ్రెస్ చేతకానితనం వల్లనే కరువు, ఫ్లోరైడ్ వచ్చింది. కాంగ్రెస్ నిర్లక్ష్యం కారణంగానే జిల్లా నాశనం అయింది. ఫ్లోరైడ్‌ను లేకుండా చేసేందుకు మిషన్ భగీరథ నల్లగొండ జిల్లాలోనే ప్రారంభించాడు. వైటీపీఎస్‌ని ఆపేస్తా అని ఆనాడు కోమటిరెడ్డి అన్నాడు. అనేక కుట్రలు చేశాడు. నిన్న మంత్రులు మాట్లాడుతుండగానే జనాలు వెళ్లిపోయారు.
రేవంత్ చేసిందేమీ లేదు.. బూతులు మాట్లాడటం తప్ప. కాంగ్రెస్ ఇచ్చిన ఉద్యోగాలు 12000 మాత్రమే. మిగతా 50వేలు కేసీఆర్ ఇచ్చినవే. మూసీ మురికి వదిలించేందుకు ప్రక్షాళన మొదలు పెట్టిందే మేము. మూసీ ప్రక్షాళన చేసి తీరాల్సిందే. తెలంగాణను అన్ని రంగాల్లో నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ నాయకత్వంలో ప్రపంచంలో తక్కువ కాలంలోనే అభివృద్ధి చెందిన ప్రాంతం తెలంగాణ. గోదావరి జలాలను ఉమ్మడి నల్లగొండ జిల్లాకు తీసుకొచ్చిందే కేసీఆర్. మంత్రులు అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. కాళేశ్వరంతో సంబంధం లేకుండా పంట పండాయి అనడం దారుణం. అభివృద్ధి చేయకపోతే మీ భరతం పడతా. మంత్రులు ప్రజలను ఏవిధంగా లూటీ చేశారో అన్ని ఆధారాలు ఉన్నాయి. మీ బాధిత సంఘాలు కూడా ప్రారంభం అయ్యాయి’ అంటూ హెచ్చరికలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment