ఫీజులతో లింకు లేదు! | Admissions to be started without linking fees | Sakshi
Sakshi News home page

ఫీజులతో లింకు లేదు!

Published Wed, Aug 13 2014 12:50 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

ఫీజులతో లింకు లేదు! - Sakshi

ఫీజులతో లింకు లేదు!

* ప్రవేశాల తర్వాతే ‘ఫాస్ట్’కు దరఖాస్తులు
* మూడు రోజుల్లో మార్గదర్శకాల జారీ?
* కాలేజీల యాజమాన్యాలతో ఫాస్ట్ కమిటీ భేటీ
* 31లోగా బకాయిలు చెల్లించాలని యాజమాన్యాల విజ్ఞప్తి

 
సాక్షి, హైదరాబాద్: ఫీజులతో సంబంధం లేకుండానే ఇంజనీరింగ్ తదితర వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టేందుకు రాష్ర్ట విద్యా శాఖ సిద్ధమైంది. తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయం(ఫాస్ట్) పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా జారీ కానందున అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పాత పద్ధతిలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను చేపట్టి వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. దీంతో విద్యార్థులు కాలేజీల్లో చేరిన తర్వాతే ఫాస్ట్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం నాటికి ఫాస్ట్ మార్గదర్శకాలు జారీ అవుతాయని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఫాస్ట్ కమిటీకి తెలియజేయాలని విద్యా శాఖ అధికారులు భావిస్తున్నారు. అప్పుడే ఆర్థిక సాయం విషయంలో విద్యార్థులకు స్పష్టత వస్తుందని చెబుతున్నారు.
 
 విద్యార్థులకు వచ్చిన ర్యాంకును బట్టి ‘ఫాస్ట్’కు వారు అర్హులేనా కాదా అన్నది తేల్చుకుంటారని, అలాగే ఏ కాలేజీలో చేరితే ఎంత ఆర్థిక సాయం లభిస్తుందన్న అవగాహన కూడా ఏర్పడుతుందని పేర్కొంటున్నారు. అప్షన్ల నాటికి పాస్ట్ మార్గదర్శకాలు వెలువడకపోతే విద్యార్థులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే ఆ పరిస్థితి తలెత్తకుండా రాష్ర్ట ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందనే అధికారులు విశ్వసిస్తున్నారు. ఫాస్ట్ మార్గదర్శకాల ప్రకారం విద్యార్థులు స్థానికత సర్టిఫికెట్లను తెచ్చుకొని కాలేజీల్లో సమర్పించవచ్చని, ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. గతంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో విద్యార్థికి సీటు కేటాయింపు లేఖలోనే ప్రభుత్వమే ఫీజు చెల్లిస్తుందని స్పష్టం చేసే విధానం ఉంది. ఇకపై అలా కాకుండా కాలేజీలో చేరిన తర్వాతే ఫాస్ట్ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
 
  మరోవైపు త్వరలోనే మార్గదర్శకాలను జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కళాశాలల యాజమాన్యాలకు ఫాస్ట్ కమిటీ తెలియజేసింది. మరో మూడు రోజుల్లోనే విడుదల చేసే అవకాశముందని పేర్కొన్నట్లు తెలిసింది. ఫీజు బకాయిలు, ఫాస్ట్ పథకంపై చర్చించేందుకు ఫాస్ట్ కమిటీ సభ్యులైన ఉన్నతాధికారులు రేమండ్ పీటర్, వికాస్ రాజ్, రాధా తదితరులు మంగళవారం కాలేజీల యాజమాన్యాలతో సమావేశమయ్యారు. యాజమాన్యాల పరిస్థితులను కూడా అడిగి తెలుసుకున్నారు. తమకు రూ. 1,350 కోట్ల మేర ఫీజు బకాయిలు రావాల్సి ఉందని, వాటిని ఈ నెల 31లోగా చెల్లించాలని యాజమాన్యాలు తేల్చి చెప్పినట్లు తెలిసింది. ప్రస్తుత ప్రవేశాల్లోనూ విద్యార్థి కాలేజీలో చేరిన రోజే ఫీజు చెల్లించేలా చర్యలు చేపట్టాలని కోరినట్లు సమాచారం. అయితే అధికారులు మాత్రం ఫాస్ట్ మార్గదర్శకాల మేరకు ప్రవేశాలు చేపట్టాలని సూచించినట్లు తెలిసింది. బ కాయిల చెల్లింపుతో పాటు, ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు పాత ఫీజుల విధానమే కొనసాగించాలన్న అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని అధికారులు చెప్పినట్లు తెలిసింది.
 
 రెండు రోజుల్లో కాలేజీలకు అనుమతులు
 తెలంగాణలో ఎంసెట్ కౌన్సెలింగ్ మొదలవుతున్న నేపథ్యంలో మరో రెండు మూడు రోజుల్లోనే కళాశాలల అనుమతులకు సంబంధించిన ఉత్తర్వులు జారీ కానున్నాయి. మేనే జ్‌మెంట్ కోటాతో పాటు, ఎన్‌ఆర్‌ఐ కోటా భర్తీకి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసేందుకు తెలంగాణ విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. ఎన్‌ఆర్‌ఐ కోటాను 5 శాతం నుంచి 15 శాతానికి పెంచే అవకాశముంది. అలాగే ఇంజనీరింగ్‌తోపాటు ఇతర వృత్తి విద్యా కాలేజీల్లో సీట్ల భర్తీకి కూడా చర్యలు చేపట్టేందుకు విద్యా శాఖ సిద్ధమవుతోంది. మొత్తానికి వెబ్ ఆప్షన్ల నాటికి కాాలేజీల అనుమతుల ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది. ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలు కల్పించే ఈసెట్, పాలిసెట్, ఐసెట్ ప్రవేశాలను త్వరలోనే చేపట్టనుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement