ఒంగోలు వన్‌టౌన్ : ఇంజినీరింగ్, మెడిసిన్ ఇతర ఉన్నత విద్యాకోర్సులు అభ్యసిస్తున్న రైతుల పిల్లలకు పీడీసీసీ బ్యాంకు ద్వారా విద్యారుణాలు అందించాలని బ్యాంకు పాలకవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. గురువారం స్థానిక బ్యాంకు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన పాలకవర్గ సమావేశానికి బ్యాంకు చైర్మన్ ఈదర మోహన్‌బాబు అధ్యక్షత వహించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన విలేకర్లకు వివరించారు.
ఇప్పటి వరకు ఇంజినీరింగ్, మెడిసిన్ ఇతర విద్యాకోర్సులకు జాతీయ బ్యాంకులు మాత్రమే విద్యారుణాలు అందిస్తున్నాయి. రైతుల పిల్లలకు విద్యారుణాల మంజూరులో జాతీయ బ్యాంకుల్లో ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా పీడీసీసీ బ్యాంకు ద్వారా వారికి విద్యారుణాలు అందించాలని నిర్ణయించినట్లు ఈదర మోహన్‌బాబు తెలిపారు. బ్యాంకు పరిధిలోని అన్ని బ్రాంచ్‌లలో ఆస్తి తనఖాపై వ్యాపారులకు ఓవర్‌డ్రాప్టు సౌకర్యం కల్పించాలని సమావేశంలో నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.
సమావేశంలో తీర్మానించిన అంశాలు...
బ్యాంకు ద్వారా పొగాకు, టై-అప్ రుణాలకు సంబంధించి ఒక్కో బ్యారన్‌కు ప్రస్తుతం ఇస్తున్న రూ.3 లక్షల రుణాన్ని రూ.4 లక్షలకు పెంచారు.
బ్యాంకు పరిధిలోని మూడు శాఖల్లో ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం కింద బ్యాంకు శాఖ పరిధిలోని అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటికి బ్యాంకు ఖాతా ఉండేలా చూస్తారు.
బ్యాంకు పాలకవర్గ సభ్యులు తమ సంఘాలను అభివృద్ధి చేసుకునేందుకు వీలుగా కేరళలోని సహకార సంఘాలను సందర్శించేందుకు డిసెంబర్‌లో స్టడీ టూర్‌కు వెళ్లాలని నిర్ణయించారు.
బ్యాంకులో రుణగ్రహీతలకు వ్యక్తిగత గరిష్ట రుణాధికారాన్ని నిలుపుదల చేశారు. కచ్చితమైన నీటిపారుదల సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న రూ.1.50 లక్షల రుణ పరిమితిని రూ.3 లక్షలకు, ఇతర ప్రాంతాలకు ప్రస్తుతం రూ.1.25 లక్షల రుణ పరిమితిని రూ.2.50 లక్షలకు పెంచారు. చెరకుపంట టై-అప్ ఉన్న ప్రాంతాల్లో రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు, విత్తనోత్పత్తి పంటలకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు రుణ పరిమితిని పెంచారు.
బ్యాంకు వైస్ చైర్మన్‌గా మస్తానయ్య...
పీడీసీసీ బ్యాంకు వైస్ చైర్మన్‌గా అద్దంకి నియోజకవర్గ పరిధిలోని బల్లికురవ సొసైటీ అధ్యక్షుడు, బ్యాంకు పాలకవర్గ సభ్యుడు చిడిపోతు మస్తానయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ పదవికి మస్తానయ్య పేరును పాలకవర్గ సభ్యుడు మేణావత్ హనుమానాయక్ ప్రతిపాదించగా, కందిమళ్ల చంద్రమౌలి అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. ఎటువంటి పోటీ లేకపోవడంతో మస్తానయ్యను బ్యాంకు వైస్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో నాబార్డు డీడీఎం జ్యోతిశ్రీనివాస్, బ్యాంకు సీఈవో కె.లోకేశ్వరరావు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
పీడీసీసీబీ ద్వారా విద్యారుణాలు
Published Fri, Nov 28 2014 1:45 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement
Advertisement