చదువులకీ..ఆర్ధిక ఆసరా | arrears (NPA) are in education loans | Sakshi
Sakshi News home page

చదువులకీ..ఆర్ధిక ఆసరా

Published Sun, Jun 1 2014 12:13 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

చదువులకీ..ఆర్ధిక ఆసరా - Sakshi

చదువులకీ..ఆర్ధిక ఆసరా

కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అవుతోంది. దీంతో పాటే ఏటా విద్యా వ్యయం  బాగా పెరిగిపోతోంది. నర్సరీ ఫీజులే లక్షలను తాకుతుంటే... ఇక ఉన్నత విద్య అయితే చెప్పలేని స్థాయికి చేరుకున్నాయి. గత పదేళ్లలో దేశీయ విద్యావ్యయం రెండు రెట్లు పెరిగినట్లు తాజాగా ఒక సర్వే పేర్కొంది. ప్రస్తుతం ఇంజనీరింగ్, మెడికల్, ఫ్యాషన్ డిజైనింగ్ వంటి కోర్సులకు ఏడు లక్షల నుంచి 15 లక్షల వరకు ఖర్చవుతుంటే, ఎంబీఏకు కాలేజీని బట్టి రూ. 5 నుంచి 10 లక్షల వరకు అవుతోంది. ఇక విదేశీ విద్య అయితే దీనికి నాలుగు రెట్లు ఎక్కువే. ఇలా ఉన్నత విద్య సామాన్యునికి అందుబాటులో లేకపోవడంతో.. వీరంతా విద్యారుణాలను ఆశ్రయించాల్సి వస్తోంది.  విద్యారుణాలు పొందడంపై అవగాహన పెంచేదే ఈ వారం ప్రాఫిట్ ముఖ్య కథనం.
 
గడచిన ఐదేళ్ల నుంచి ఆర్థిక వృద్ధిరేటు మందగించి ఉపాధి అవకాశాలు తగ్గడంతో విద్యారుణాల్లో మొండి బకాయిలు (ఎన్‌పీఏలు) పెరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఈ ఏడాది విద్యారుణాల మంజూరులో కొద్దిగా ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. అధిక మార్కులు వచ్చి, ఉపాధి హామీ ఉన్న కోర్సులకే మొదటి ప్రాధాన్యతను ఇస్తున్నాయి. రుణం మంజూరు అనేది మీకొచ్చిన మార్కులు, ఎంచుకున్న కోర్సు, మీరు ఎంపిక చేసుకున్న కాలేజీ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అర్హత పరీక్షలో 65 శాతం మించి మార్కులు పొందిన వారికి రుణం చాలా సులభంగా లభిస్తోంది.
 
అంతేకాకుండా బ్యాంకు గుర్తించిన విద్యా సంస్థలో చేరేవారికే రుణాలను ఇస్తున్నాయి. అదే మేనేజ్‌మెంట్ కోటాలో సీటు వస్తే తీసుకునే రుణ మొత్తంపైన 150 శాతం వరకు ష్యూరిటీని బ్యాంకులు అడుగుతున్నాయి. ఏయే కోర్సులకు రుణాలను ఇస్తున్నాయి, బ్యాంకులు గుర్తించిన విద్యాసంస్థల వివరాలు వంటి సమాచారాన్ని బ్యాంకులు అందుబాటులో ఉంచాయి. ఆయా బ్యాంకుల వెబ్‌సైట్లు సందర్శించడం లేదా బ్రాంచ్‌కు వెళ్లడం ద్వారా ఈ సమాచారం పొందవచ్చు. కానీ ప్రభుత్వ నిబంధనలు ఏం చెపుతున్నాయంటే.. 16 నుంచి 35 సంవత్సరాల లోపువారు ఉన్నత చదువుల కోసం రూ.4లక్షల లోపు మొత్తానికి ఎటువంటి సెక్యూరిటీ లేకుండానే విద్యారుణాలను పొందవచ్చు. నాలుగు లక్షలు దాటి రూ.7.5 లక్షల లోపు రుణాలకు థర్డ్ పార్టీ సెక్యూరిటీ చూపించాలి. అంతకుమించిన రుణాలకు పూర్తి ష్యూరిటీ చూపించాలి. అదే విదేశీ రుణాల విషయానికి వస్తే రుణమొత్తంతో సంబంధం లేకుండానే  ష్యూరిటీ ఇవ్వాలి.
 
 ఉపాధి ఉంటేనే..

 ఇంటర్మీడియెట్ తర్వాత  చదివే అన్ని ఉపాధి హామీ కోర్సులకు బ్యాంకులు రుణాలను అందిస్తాయి. యూజీసీ, ఏఐసీటీఈ, ఐసీఎంఆర్, ప్రభుత్వ గుర్తింపు ఉన్న డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్, వృత్తి విద్యా కోర్సులు, ఐసీడబ్ల్యూఏ, సీఏ వంటి కోర్సులకు, ఉపాధి హామీ ఉన్న డిప్లొమా కోర్సులు, నర్సింగ్, పారా మెడికల్ వంటి కోర్సులకు, ఐఐఎం వంటి మేనేజ్‌మెంట్ కోర్సులకు కూడా ఇస్తున్నాయి. ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులు చేసేవారే ఎక్కువగా రుణాలు తీసుకుంటున్నట్లు బ్యాంకింగ్ అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు బ్యాంకులతో పాటు కొన్ని ప్రైవేటు  సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశించాయి. హెచ్‌డీఎఫ్‌సీకి చెందిన క్రెడిలా, దీవాన్ హౌసింగ్‌కు చెందిన అవాన్స్ వంటి సంస్థలు ఉపాధి హామీ ఉన్న  సంగీతం, ఫ్యాషన్ డిజైనింగ్ వంటి కోర్సులకు కూడా రుణాలను ఇస్తున్నాయి.
 
 రుణ లెక్కింపు ఇలా....
 కాలేజీ/స్కూల్/హాస్టల్‌కు చెల్లించే ఫీజులు, ఎగ్జామినేషన్స్/ లైబ్రరీ/లేబొరేటరీ ఫీజులు, పుస్తకాలు/యూనిఫాం/ఇతర పరికరాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని బ్యాంకులు రుణమొత్తాన్ని నిర్ణయిస్తాయి. విదేశీ విద్యకైతే ప్రయాణ వ్యయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటాయి. చేసే కోర్సుకు కంప్యూటర్ కొనుగోలు తప్పనిసరి అయితే ఆ వ్యయాన్ని కూడా లెక్కిస్తారు. వీటితో పాటు స్టడీ స్టూర్లు, ప్రాజెక్టు వర్కులు, ద్విచక్ర వాహనం కొనుగోలుకు కూడా రుణం లభిస్తుంది. దేశంలోని కోర్సులకు ఏడు నుంచి పది లక్షల వరకు, అదే విదేశీ విద్యకు గరిష్టంగా 20 లక్షల వరకు రుణాలను అందించడానికి బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. అయితే ఈ రుణం మీ చేతికి రాదు. మీరు అడ్మిషన్ పొందిన కాలేజీ పేరు మీద చెక్‌లను బ్యాంకులు జారీ చేస్తాయి.
 
 ఎడ్యుకేషన్ లోన్ మంజూరు కావడానికి అత్యంత ముఖ్యమైనది ఆ కోర్సులో చేరినట్లుగా అడ్మిషన్‌కు సంబంధించిన కాగితాలు. ఇవి ఇస్తే కానీ లోన్ ప్రాసెస్ మొదలు కాదు. దీంతో పాటు తాజాగా ఉత్తీర్ణత సాధించిన సర్టిఫికెట్, నివాస ధ్రువపత్రం, గుర్తింపు కార్డు, వయసు ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ కాపీలతో పాటు పాస్‌పోర్ట్ ఫొటోలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీ రుణానికి గ్యారంటీ అవసరమైతే వాటికి సంబంధించిన పత్రాలు కూడా అందచేయాలి.                        
 - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం
 
వడ్డీ ఎంత?

ఎడ్యుకేషన్ లోన్స్‌పై వడ్డీ అనేది రుణ మొత్తం, కాలపరిమితి, కోర్సు తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా వడ్డీరేటు బ్యాంకుల బేస్ రేటు కంటే రెండు, మూడు శాతం అధికంగా ఉంటుంది. టాప్ 100 లోపు ర్యాంకులు వచ్చిన వారికి, మహిళలకు ఒక శాతం నుంచి అర శాతం వరకు వడ్డీరేట్లలో డిస్కౌంట్‌ను బ్యాంకులు ఆఫర్ చేస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో 50వ ర్యాంకు లోపు వచ్చిన వారికి, జాతీయ స్థాయిలో 100లోపు ర్యాంకులు వచ్చిన వారికి డిస్కౌంటు లభిస్తోంది. కొన్ని బ్యాంకులు వివిధ విద్యాసంస్థలతో ప్రత్యేకంగా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. అటువంటి సంస్థల్లో చేరితే వడ్డీరేట్లలో మరికొంత డిస్కౌంట్ లభిస్తుంది. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం నాలుగు లక్షల లోపు ఉంటే కేంద్ర ప్రభుత్వం ఒక శాతం వడ్డీ రాయితీని అదనంగా అందిస్తోంది.
 
 మిగిలిన రుణాల మాదిరిగా ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకున్న మరుసటి నెల నుంచే చెల్లించాల్సిన అవసరం లేదు. కోర్సు పూర్తి అయిన తర్వాత కూడా తగినంత సమయం ఉంటుంది. ఇందుకోసం చాలా బ్యాంకులు అనుసరిస్తున్న విధానం- చదువు పూర్తయిన తర్వాత కనీసం ఒక సంవత్సరం లేదా ఉద్యోగం పొందిన ఆరు నెలల తర్వాత ఈ రెండింటిలో ఏది ముందైతే అప్పటి నుంచి రుణం చెల్లించడం మొదలు పెట్టాలి. కోర్సు చేస్తున్న కాలంలో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వడ్డీ చెల్లిస్తే భారం కొంత మేర తగ్గుతుంది. అలా కాకుండా కోర్సు పూర్తయిన తర్వాతనే వడ్డీ కూడా చెల్లిస్తానంటే వడ్డీని అసలుకి కలిపి ఈఎంఐని లెక్కిస్తారు. ఈ రుణాన్ని గరిష్టంగా ఎనిమిది సంవత్సరాల్లో చెల్లించడానికి బ్యాంకులు అనుమతిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement