సాక్షి, న్యూఢిల్లీ : బీ. జయచంద్రన్ 2011 సంవత్సరంలో తమిళనాడు, తంజావూరులోని 'పెరియార్ మణియమ్మై ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ' నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. ఇంజనీరింగ్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కటీ రాలేదు. 2012, 2013 సంవత్సరాల్లో ఏదో ఎల్‌ఐసీ పాలసీలు చేపిస్తూ బతికాడు. ఆ మరుసటి సంవత్సరం తంజావూరులోని ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా చేరాడు. బీటెక్ సందర్భంగా తాను తీసుకున్న విద్యా రణాన్ని చెల్లించేందుకు సరిపడ డబ్బులు కూడా రాకపోవడంతో ఆ ఉద్యోగాన్ని వదిలేశాడు. 2015లో బ్యాంకు ఉద్యోగాల కోసం పరీక్షలు రాయడం మొదలు పెట్టాడు.
జయచంద్రన్ బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నప్పుడు బ్యాంకు నుంచి లక్షన్నర రూపాయల రుణాన్ని తీసుకున్నారు. సకాలంలో దాన్ని తీర్చకపోవడం వల్ల ఇప్పుడు ఆయన బ్యాంకుకు మూడు లక్షల రూపాయల బాకీ పడ్డారు. జయచంద్రన్ తండ్రి రిటైర్డ్ తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగి. రెండేళ్ల క్రితం ఆయన రిటైర్డ్ బెనిఫిట్ల నుంచి బ్యాంక్‌కు 45 వేల రూపాయలను చెల్లించారు. ఇప్పుడు ఆయన తన పింఛను డబ్బుల నుంచి నెల నెలకు బ్యాంకు రుణ వాయిదాలు చెల్లిస్తున్నారు. నేడు భారత దేశంలో ఉద్యోగం దొరక్కా, తీసుకున్న విద్యా రుణాలను చెల్లించలేక సతమతమవుతున్న జయచంద్రన్ లాంటి వాళ్లు లక్షల్లో ఉన్నారు.
దేశంలో ఇంజనీరింగ్ కళాశాలలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవడం, విద్యా ప్రమాణాలు పడిపోవడం, మార్కెట్లో ఉద్యోగావకాశాలు సన్నగిల్లి పోటీ పెరగడం తదితర కారణాల వల్ల జయచంద్రన్ లాంటి వాళ్ల పరిస్థితి దారుణంగా తయారయింది. బ్యాంకుల నుంచి తీసుకున్న విద్యారుణాలను చెల్లించే పరిస్థితుల్లో బీటెక్ పట్టభద్రులు ఉండడంతో ఆ భారం తల్లిదండ్రులపై పడుతోంది. వీటిని తీర్చేందుకు కొందరి తల్లిదండ్రులు నగలు, నట్రా అమ్మి డబ్బులు చెల్లిస్తుండగా, మరి కొందరి తల్లిదండ్రులు ఇంటి స్థలాలు, ఇళ్లు అమ్మి కడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం 2001లో ఈ విద్యా రుణాల స్కీమ్‌ను ప్రారంభించింది. దాన్ని 2006లో ఒకసారి, 2009లో మరోసారి సవరించింది. ఏడాదికి నాలుగున్నర లక్షల రూపాయలకన్నా తక్కువ ఆదాయం వచ్చే కుటుంబాలకు చెందిన విద్యార్థులకు వడ్డీలేని రుణాలను అందజేయడం ఈ స్కీమ్ లక్ష్యం. విద్యార్థుల కోర్సు పూర్తయిన ఏడాది వరకు మాత్రమే ఈ స్కీమ్ కింద ఇచ్చే రుణాలకు వడ్డీ వర్తించదు.ఆ తర్వాత వడ్డీతో కలిపి చెల్లించాల్సిందే.
ఇక 2015లో కేంద్ర ప్రభుత్వం విద్యారుణాల కోసం క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ కింద ఏడున్నర లక్షల రూపాయల వరకు రుణాలు మంజూరు చేస్తారు. వీటికి ప్రత్నామ్నాయ పూచికత్తును సమర్పించాల్సిన అవసరం కూడా లేదు. ఈ సమయంలోనే సాంకేతిక విద్యా సంస్థలు తామర తుంపరగా వందలాది కొత్త కోర్సులను ప్రవేశపెట్టాయి. 2006-2007 సంవత్సరంలో 1600 కోర్సులు అందుబాటులో ఉండగా, 2016-2017 సంవత్సరానికి ఆ కోర్సుల సంఖ్య 3,391కి చేరుకున్నాయి. ఇలాగైతే దేశంలో విద్యా ప్రమాణాలు ఘోరంగా పడిపోతాయని పలు సమావేశాల్లో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఆందోళన వ్యక్తం చేసింది.
విద్యా రుణాలు తీసుకొని డీఫాల్ట్ అయిన కేసులు 2013 నుంచి 2016 మధ్య 142 శాతం పెరిగి 6,336 కోట్ల రుణాలు మొండి బకాయిలుగా మారాయి. 2017, మార్చి నెల నాటికే ఈ మొండి బకాయిల రుణాలు ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ లెక్కల పకారం 5,191 కోట్ల రూపాయలకు చేరుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆగస్టు నెలలో పార్లమెంట్‌కు వెల్లడించింది. డీఫాల్టయిన కేసుల్లో బీటెక్ కోర్సు కోసం తీసుకున్నవే ఎక్కువగా ఉన్నాయని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం తెలియజేశారు. ఇప్పుడు ఆ రుణాల రికవరీని అవుట్ సోర్సింగ్ చేసినట్లు ఆయన తెలిపారు.
తమ వద్దకు వచ్చిన కేసుల్లో కూడా 90 శాతం కేసులు ఇంజనీరింగ్ విద్యార్థులవేనని 2013లో విద్యా రుణాలపై అవగాహన ఉద్యమాన్ని చేపట్టిన మాజీ బ్యాంకర్ ఎం. రాజ్ కుమార్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలలు పుట్టగొడుగుల్లో పెరిగి, విద్యా ప్రమాణాలు పడిపోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని అన్నారు. ఒక్క తమిళనాడు రాష్ట్రంలోనే ప్రస్తుతం 500లకు పైగా ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయని ఆయన తెలిపారు. విద్యారుణాలను తీసుకొని చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న పట్టభద్రులు దేశవ్యాప్తంగా ఉన్నప్పటికీ తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మరీ ఎక్కువగా ఉన్నారు. ఈ రాష్ట్రాల్లో రుణాలు తీసుకున్న వారూ, చెల్లించలేక పోతున్నవారు కూడా ఎక్కువే.
కేరళలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం విద్యార్థుల పరిస్థితిని అర్థం చేసుకొని గత ఆగస్టు నెలలో 'విద్యా రుణాల తిరిగి చెల్లింపు సహాయ పథకం'ను తీసుకొచ్చింది. ఈ పథకం కింద రుణాలను మాఫీ చేయరుగానీ, నెలవారి వాయిదాల్లో కొంత సొమ్మును ప్రభుత్వం చెల్లిస్తుండగా, మిగతా భాగాన్ని విద్యార్థిగానీ, వారి తల్లిదండ్రులుగానీ చెల్లించాలి. దేశంలో మరెక్కడా ఇలాంటి స్కీములు లేవు. ముఖ్యంగా తమిళనాడులో రుణాల వసూళ్ల ఏజెంట్ల ఒత్తిళ్లను తట్టుకోలేక పాతికేళ్ల లోపు ఇంజనీరింగ్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వీటికి ప్రభుత్వాలే బాధ్యత వహించాలని ఇటు విద్యార్థి సంఘాలు, అటు ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment